Voter card linked to Aadhaar
-
ముగిసిన ఓటరు సర్వే
మంచిర్యాలటౌన్: ఓటరు జాబితాలో తప్పొప్పుల సవరణ, మృతుల పేర్ల తొలగింపు, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా, పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకంగా జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం జిల్లాలో ఇంటింటా ఓటరు సర్వే నిర్వహించింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాలోని వివరాలు పరిశీలించి, పొరపాట్లను సరిదిద్దడంతోపాటు, మృతుల, బోగస్ ఓట్లను తొలగించారు. శుక్రవారంతో ఇంటింటి సర్వే పూర్తి కాగా, తొలగించిన వివరాలను జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించారు. ప్రతీ ఓటరు ఇంటి నంబరును కచ్చితంగా వేయడంతోపాటు ఒకే ఇంటి నంబరు ఇస్తే వారు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా జాబితా సిద్ధం చేస్తున్నారు. ఓటర్ల సవరణలు, కొత్త పేర్ల నమోదు, మృతుల పేర్ల తొలగింపు, ఇళ్లు మారిన వారి చిరునామాలను మార్పు చేయడం వంటివి చేసి, అక్టోబర్ 5న ఓటర్ల తుది జాబితా ప్రకటించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. పూర్తి పారదర్శకంగా ఉండేలా... బోగస్, డబుల్ ఓట్ల తొలగింపునకు ఎన్నికల సంఘం పలు చర్యలు చేపడుతోంది. ఆధార్ అనుసంధానంతో డబుల్ ఓట్లను గుర్తించడం వంటి కార్యక్రమాలను చేపట్టినా, మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పులు లేని ఓటరు జాబితా రూపకలపనకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతో గత కొద్ది రోజులుగా ఇంటి నంబర్ల ఆధారంగా ఓటరు జాబితాను సర్వే చేశారు. ఓటర్ల జాబితాను అనుసరించి ప్రతీ పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు మించకుండా ఉండేలా జూలై 27వరకు పోలింగ్ కేంద్రాలను క్రమబద్ధీకరించడం, జూలై 31వరకు ఓటరు జాబితాకు సంబంధించిన సప్లిమెంట్స్ ప్రక్రియ చేపట్టనున్నారు. సర్వే సమయంలోనే ఓటర్ల జాబితాలో పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఎంత మంది ఉన్నారనే వివరాలన్నీ క్రోడికరించారు. మంచిర్యాల నియోజకవర్గంలో 152 మంది సవరణలు, 267 మంది మృతి, 62 మంది ఇతర చోటుకు వెళ్లినట్లుగా గుర్తించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 521 మంది సవరణలు, 560 మంది మృతులు, 464 మంది ఇతర చోటుకు వెళ్లిపోయిన వారిని గుర్తించారు. చెన్నూరు నియోజకవర్గంలో 152 మంది సవరణలు చేయగా, 267 మంది మృతి, 62 మంది ఇతర చోటుకు వెళ్లిపోయిన వారిని గుర్తించారు. -
ఓటర్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానించొద్దు: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానించే ప్రక్రియను నిలిపివేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు టి.నిరంజన్ డిమాండ్ చేశారు. అనుసంధానం కోసం ఎన్నికల కమిషన్ ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ ద్వారా ఓటర్ల సమాచారాన్ని కుల, మత, ప్రాంతాల వారీగా విభజించే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఇంతవరకు సేకరించిన ఆధార్ సమాచారాన్ని కూడా ఉపయోగించకుండా వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: చార్మినార్‌లో గెలిచి చూపిస్తా: రఘునందన్‌రావు -
‘ఆధార్–ఓటర్ ఐడీ లింక్’పై హైకోర్టుకు వెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్– ఓటరుకార్డు అనుసంధానంపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాకు సుప్రీంకోర్టు సూచించింది. గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంలో వివాదాస్పద అంశాలున్నాయంటూ సూర్జేవాలా దాఖలు చేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. ఆధార్‌తో ఓటర్ గుర్తింపు కార్డు అనుసంధానంతో పౌరులు కాని వారికి కూడా ఓటు వేసే హక్కు ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ధర్మాసనం..‘మీరు ఢిల్లీ హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?’ అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. వచ్చే 6 నెలల్లో మూడు రాష్ట్రాల్లో కీలకమైన ఎన్నికలు జరగనున్నందున తమ పిటిషన్ ఎంతో ముఖ్యమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. పలు హైకోర్టుల్లో ప్రొసీడింగ్స్ ఉంటే కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వాటన్నింటినీ కలిపి ఒకే హైకోర్టుకు బదిలీ చేసే ఆస్కారం ఉందని ధర్మాసనం పేర్కొంది. ‘ఎన్నికల సవరణచట్టం–2021లోని సెక్షన్లు 4, 5ల చెల్లుబాటును పిటిషనర్ సవాల్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో దీనికి సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని పేర్కొన్న ధర్మాసనం, హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇస్తున్నామని పేర్కొంది. -
ఓటర్ల జాబితా–ఆధార్ లింక్‌పై అభ్యంతరం లేదు
చెన్నై: బోగస్ ఓట్లను ఏరివేసేందుకు వీలుగా ఓటర్‌కార్డుతో పాటు ఓటర్ల జాబితాను ఆధార్‌తో అనుసంధానించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్(ఈసీ) మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. ఇటీవల ఆధార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. అలాగే ఆధార్–ఓటర్ కార్డు అనుసంధానం వల్లే పెరిగే వ్యయాలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని జస్టిస్ ఎస్.మణికుమార్, జస్టిస్ పి.టి.ఆశాల ధర్మాసనానికి విన్నవించింది. బోగస్ ఓట్లను ఏరివేసేందుకు ఓటర్‌కార్డు–ఆధార్ అనుసంధానం చేపట్టాలని ఎం.ఎల్.రవి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని శుక్రవారం విచారించిన ధర్మాసనం.. స్వయంగా యూఐడీఏఐ, కేంద్ర న్యాయ, హోంమంత్రిత్వ శాఖలను ఈ కేసులో ఇంప్లీడ్ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
ఆధార్ అనుసంధానంపై దృష్టి సారించండి
రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అనంతపురం అర్బన్ : ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి ఆయన మంగళవారం అన్ని జిల్లాల డీఆర్ఓలు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. కలెక ్టరేట్‌లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని ఏప్రిల్ డెడ్‌లైన్ ఇచ్చామన్నారు. ఇప్పటి వరకూ 40 నుండి 50 శాతం మాత్రమే పూర్తి చేశారన్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని చురకంటించారు. ఆధార్ అనుసంధానానికి మీకు ఉన్న సమస్యలు ఏంటని ప్రశ్నించారు. బూత్ స్థాయి అధికారులతో పనిచేయించడంలో విఫలమవుతున్నారన్నారు. ఇప్పటికైనా ఈ ప్రక్రియను వేగవంతం చేసి విధించిన గడువు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. బీఎల్ఓలను అప్రమత్తం చేసి ఆధార్ అనుంసధానం ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.వేగవంతం చేయండి :ఓటరు కార్డు ఆధార్ అనుసంధానంపై డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్ మంగళవారం సాయంత్రం జిల్లాలోని తహశీల్దార్, ఎన్నికల అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలన్నారు.