మంచిర్యాలలో సర్వే చేస్తున్న బీఎల్‌వోలు
మంచిర్యాలటౌన్: ఓటరు జాబితాలో తప్పొప్పుల సవరణ, మృతుల పేర్ల తొలగింపు, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా, పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకంగా జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం జిల్లాలో ఇంటింటా ఓటరు సర్వే నిర్వహించింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాలోని వివరాలు పరిశీలించి, పొరపాట్లను సరిదిద్దడంతోపాటు, మృతుల, బోగస్ ఓట్లను తొలగించారు. శుక్రవారంతో ఇంటింటి సర్వే పూర్తి కాగా, తొలగించిన వివరాలను జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించారు.
ప్రతీ ఓటరు ఇంటి నంబరును కచ్చితంగా వేయడంతోపాటు ఒకే ఇంటి నంబరు ఇస్తే వారు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా జాబితా సిద్ధం చేస్తున్నారు. ఓటర్ల సవరణలు, కొత్త పేర్ల నమోదు, మృతుల పేర్ల తొలగింపు, ఇళ్లు మారిన వారి చిరునామాలను మార్పు చేయడం వంటివి చేసి, అక్టోబర్ 5న ఓటర్ల తుది జాబితా ప్రకటించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది.
పూర్తి పారదర్శకంగా ఉండేలా...
బోగస్, డబుల్ ఓట్ల తొలగింపునకు ఎన్నికల సంఘం పలు చర్యలు చేపడుతోంది. ఆధార్ అనుసంధానంతో డబుల్ ఓట్లను గుర్తించడం వంటి కార్యక్రమాలను చేపట్టినా, మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పులు లేని ఓటరు జాబితా రూపకలపనకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతో గత కొద్ది రోజులుగా ఇంటి నంబర్ల ఆధారంగా ఓటరు జాబితాను సర్వే చేశారు. ఓటర్ల జాబితాను అనుసరించి ప్రతీ పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు మించకుండా ఉండేలా జూలై 27వరకు పోలింగ్ కేంద్రాలను క్రమబద్ధీకరించడం, జూలై 31వరకు ఓటరు జాబితాకు సంబంధించిన సప్లిమెంట్స్ ప్రక్రియ చేపట్టనున్నారు. సర్వే సమయంలోనే ఓటర్ల జాబితాలో పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఎంత మంది ఉన్నారనే వివరాలన్నీ క్రోడికరించారు.
మంచిర్యాల నియోజకవర్గంలో 152 మంది సవరణలు, 267 మంది మృతి, 62 మంది ఇతర చోటుకు వెళ్లినట్లుగా గుర్తించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 521 మంది సవరణలు, 560 మంది మృతులు, 464 మంది ఇతర చోటుకు వెళ్లిపోయిన వారిని గుర్తించారు. చెన్నూరు నియోజకవర్గంలో 152 మంది సవరణలు చేయగా, 267 మంది మృతి, 62 మంది ఇతర చోటుకు వెళ్లిపోయిన వారిని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment