voter survey
-
అమెరికాలో భారతీయం
అమెరికా మొత్తం ఓటర్లు 16.1 కోట్ల పై చిలుకు. అందులో భారతీయ అమెరికన్ల సంఖ్య మహా అయితే 21 లక్షలు. కానీ ఆ దేశ రాజకీయాల్లో మనవాళ్లు నానాటికీ ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇప్పుడు వారి రాజకీయ శక్తిని ఏ మాత్రమూ విస్మరించే పరిస్థితి లేదు. అందులోనూ భారత మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈసారి ఏకంగా డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. దాంతో భారతీయ అమెరికన్ల ఉత్సాహానికి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. భారతీయ అమెరికన్లలో అత్యధికులు విద్యాధికులే. కేవలం ఓటర్లుగానే గాక అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధుల సేకర్తలుగా కొన్నేళ్లుగా వారి హవా బహుముఖంగా విస్తరిస్తోంది. దాంతో సహజంగానే అధికార సాధనలో వారి మద్దతు నానాటికీ కీలకంగా మారుతోంది.స్వింగ్ స్టేట్లలోనూ హవాఅధ్యక్ష ఎన్నికల్లో విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారే మిషిగన్, జార్జియా వంటి స్వింగ్ స్టేట్లలో భారతీయుల జనాభా చాలా ఎక్కువ. దాంతో వారి ఓట్లు, మద్దతు రెండు పార్టీలకూ మరింత కీలకంగా మారాయి. 2020లో బైడెన్ విజయంలో జార్జియా ఫలితమే నిర్ణాయకంగా మారడం తెలిసిందే. అక్కడ భారతీయ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. గత రెండు మూడు అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హారిస్, ట్రంప్ భాగ్యరేఖలు స్వింగ్ స్టేట్లలోని ఇండియన్ ఓటర్ల మనోగతంపై గట్టిగానే ఆధారపడ్డాయంటే అతిశయోక్తి కాదంటారు డాక్టర్ మిశ్రా.→ స్వింగ్ స్టేట్లుగా పేరుబడ్డ 10 రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లే మెజారిటీ.→ స్వింగ్ స్టేట్లలో పెన్సిల్వేనియాను అత్యంత కీలకమైనదిగా చెప్తారు. అలాంటి రాష్ట్రంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో బక్స్ కౌంటీది నిర్ణయాక పాత్ర. అక్కడ ఆధిపత్యం పూర్తిగా ఇండియన్లదే!→ దక్షిణాసియాకు చెందిన 48 లక్షల మంది పై చిలుకు యువ ఓటర్లను ప్రభావితం చేయడంలో భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు మిశ్రా వివరించారు.→ గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేశారు. 2020లో 71 శాతం మంది ఓటేశారు. తాజా ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వేలో ఏకంగా 91 శాతానికి పైగా ఈసారి ఓటేస్తామని చెప్పారు!పార్టీలకు నిధుల వెల్లువభారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం 1.45 లక్షల డాలర్లు. అమెరికన్లతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. కొన్నేళ్లుగా ప్రధాన పార్టీలకు వారినుంచి నిధులు పోటెత్తుతున్నట్టు డెమొక్రటిక్ పార్టీ నేషనల్ ఫైనాన్స్ కమిటీ (డీఎన్ఎఫ్సీ) సభ్యుడు అజయ్ భుటోరియా చెబుతున్నారు. ‘‘నేను 20 ఏళ్లకు పైగా నిధుల సేకర్తగా వ్యవహరిస్తున్నా. మనవాళ్లు ఈ స్థాయిలో రాజకీయ విరాళా లివ్వడం గతంలో ఎన్నడూ లేదు’’ అంటూ విస్మయం వెలిబుచ్చారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. డీఎన్ఎఫ్సీలో 5 శాతానికి పైగా భారతీయులే ఉండటం విశేషం. భూరి విరాళాలిస్తున్న వారితో పాటు పార్టీలకు, వాటి ఎన్నికల ప్రచార కార్యకలాపాలకు చిన్న మొత్తాలు అందజేస్తున్న అమెరికన్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోందని ఆసియన్ అమెరికన్ డయాస్పొరాలో అతి పెద్దదైన రాజకీయ కార్యాచరణ కమిటీ ఏఏపీఐ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ చెప్పుకొచ్చారు. 2012 నుంచీ ఇండియన్ అమెరికన్లలో ఈ ధోరణి బాగా పెరుగుతోందని డ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంగయ్ మిశ్రా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష పీఠానికి దారి సిలికాన్ వ్యాలీ గుండా వెళ్తుందన్నది నానుడి. కీలకమైన ఆ టెక్ రాజధానిలో భారతీయులదే హవా. హారిస్‌కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే ఏకంగా 5.5 కోట్ల డాలర్ల విరాళాలు పోగయ్యాయి! వాటిలో మనవారి నుంచి వసూలైనవే ఎక్కువ. డెమొక్రాట్ పార్టీకి భారీ విరాళాలిచ్చిన జాబితాలో 60 మందికి పైగా ఇండియన్ అమెరికన్లు న్నారు. వీరిలో పారిశ్రామిక దిగ్గజం ఇంద్రా నూయీ మొదలుకుని ఏఐ ఇన్వెస్టర్ వినోద్ ఖోస్లా దాకా పలువురి పేర్లున్నాయి.రిపబ్లికన్లకూ...రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సంపత్ శివాంగి, హోటల్ పరిశ్రమ దిగ్గజం డానీ గైక్వాడ్ వంటి పలువురు ఎన్నారైలు ట్రంప్ ప్రచార కార్యకలాపాలకు భారీ విరాళాలిస్తున్నారు. అయితే 2020 నుంచీ ఇండియన్ అమెరికన్లు, ముఖ్యంగా హిందువులు రిపబ్లికన్ పార్టీకి క్రమంగా దూరమవుతున్న వైనం స్పష్టంగా కన్పిస్తోంది.అధికార పదవుల్లోనూ...అమెరికాలో అన్ని స్థాయిల్లోనూ అధికార పదవుల్లో కూడా భారతీయుల హవా సాగుతోంది. సెనేట్, ప్రతినిధుల సభతో పాటు రాష్ట్రాల సెనేట్లు, అసెంబ్లీలు మొదలుకుని సిటీ కౌన్సిళ్లు, స్కూలు బోర్డుల దాకా, జిల్లా అటార్నీలుగా నియమితులవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.→ యూఎస్ కాంగ్రెస్‌లో ఐదుగురు భారతీయ అమెరికన్లున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది ఏడుకు పెరుగుతుందని భావిస్తున్నారు.→ అమెరికా యువజనుల్లో భారతీయులు కేవలం 0.6 శాతమే. కానీ 4.4 శాతం మంది ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.→ బైడెన్–హారిస్ పాలన యంత్రాంగంలో 150 మందికి పైగా భారతీయ అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారు.→ హారిస్ అధ్యక్షురాలిగా నెగ్గితే ఈ సంఖ్య 200 దాటుతుందని అంచనా.→ అమెరికా జనాభాలో యూదులు 2 శాతమే అయినా కాంగ్రెస్‌లో వారి సంఖ్య 10 శాతం. కొన్నేళ్లలో భారతీయులు అమెరికా సమాజంపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారన్నది ఒక అంచనా.సగానికి పైగా డెమొక్రాట్లే!→ తాజా సర్వే ప్రకారం భారతీయ అమెరికన్లలో ఏకంగా 55 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులమని ప్రకటించుకున్నారు.→ 25 శాతం మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నారు.→ స్వతంత్రులు, తటస్థులు 15 శాతం మందిగా లెక్క తేలారు. మిగతావాళ్లు తమ రాజకీయ మొగ్గుదలపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ముగిసిన ఓటరు సర్వే
మంచిర్యాలటౌన్: ఓటరు జాబితాలో తప్పొప్పుల సవరణ, మృతుల పేర్ల తొలగింపు, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా, పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకంగా జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం జిల్లాలో ఇంటింటా ఓటరు సర్వే నిర్వహించింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాలోని వివరాలు పరిశీలించి, పొరపాట్లను సరిదిద్దడంతోపాటు, మృతుల, బోగస్ ఓట్లను తొలగించారు. శుక్రవారంతో ఇంటింటి సర్వే పూర్తి కాగా, తొలగించిన వివరాలను జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించారు. ప్రతీ ఓటరు ఇంటి నంబరును కచ్చితంగా వేయడంతోపాటు ఒకే ఇంటి నంబరు ఇస్తే వారు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా జాబితా సిద్ధం చేస్తున్నారు. ఓటర్ల సవరణలు, కొత్త పేర్ల నమోదు, మృతుల పేర్ల తొలగింపు, ఇళ్లు మారిన వారి చిరునామాలను మార్పు చేయడం వంటివి చేసి, అక్టోబర్ 5న ఓటర్ల తుది జాబితా ప్రకటించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. పూర్తి పారదర్శకంగా ఉండేలా... బోగస్, డబుల్ ఓట్ల తొలగింపునకు ఎన్నికల సంఘం పలు చర్యలు చేపడుతోంది. ఆధార్ అనుసంధానంతో డబుల్ ఓట్లను గుర్తించడం వంటి కార్యక్రమాలను చేపట్టినా, మరికొద్ది నెలల్లోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పులు లేని ఓటరు జాబితా రూపకలపనకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతో గత కొద్ది రోజులుగా ఇంటి నంబర్ల ఆధారంగా ఓటరు జాబితాను సర్వే చేశారు. ఓటర్ల జాబితాను అనుసరించి ప్రతీ పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు మించకుండా ఉండేలా జూలై 27వరకు పోలింగ్ కేంద్రాలను క్రమబద్ధీకరించడం, జూలై 31వరకు ఓటరు జాబితాకు సంబంధించిన సప్లిమెంట్స్ ప్రక్రియ చేపట్టనున్నారు. సర్వే సమయంలోనే ఓటర్ల జాబితాలో పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఎంత మంది ఉన్నారనే వివరాలన్నీ క్రోడికరించారు. మంచిర్యాల నియోజకవర్గంలో 152 మంది సవరణలు, 267 మంది మృతి, 62 మంది ఇతర చోటుకు వెళ్లినట్లుగా గుర్తించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 521 మంది సవరణలు, 560 మంది మృతులు, 464 మంది ఇతర చోటుకు వెళ్లిపోయిన వారిని గుర్తించారు. చెన్నూరు నియోజకవర్గంలో 152 మంది సవరణలు చేయగా, 267 మంది మృతి, 62 మంది ఇతర చోటుకు వెళ్లిపోయిన వారిని గుర్తించారు. -
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఆగని సర్వేలు
సాక్షి, చిత్తూరు : ఎన్నికలు కోడ్ అమల్లోకి వచ్చిన రాష్ట్రంలో దొంగ సర్వేలు కొనసాగుతునే ఉన్నాయి. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లిలో సర్వే పేరుతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న యువకులను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామంలోకి వచ్చిన యువకులు సర్వే పేరుతో ఇంటింటికి తిరుగుతూ ఏ పార్టీకి ఓటు వేస్తారని, ఇతర వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనుమానం వచ్చిన స్థానికులు ఆ యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా వారిని విచారించకుండానే పోలీసులు వదిలిపెట్టడం గమనార్హం. కృష్ణాజిల్లాలోని పామర్రులో సర్వేల పేరులో ఓట్ల తొలగింపుకు శ్రీకారం చుట్టారు కొంతమంది యువకులు. స్వాట్ డిజిటల్ అనే కంపనీ పేరుతో ఇంటింటికి సర్వే చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. అనుమానం వచ్చిన వైఎస్సార్సీపీ నేతలు వారిని పట్టుకొని నిలదీశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. -
మీడియా ప్రతినిధులమంటూ దొంగ సర్వేలు
సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లాలో మరోసారి దొంగ సర్వేల ముఠా బయటపడింది. సర్వే పేరుతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న ఇద్దరు యువతులను వైఎస్సార్సీపీ నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్లలో సర్వే పేరుతో ఇద్దరు యువతులు ఇంటింటికి తిరుగుతూ మీరు ఎవరికి ఓటు వేస్తారో చెప్పాలంటూ ప్రజలను ఆరా తీస్తున్నారు. అనుమానం వచ్చిన వైఎస్సార్సీసీ నేతలు ఆ యువతులను నిలదీశారు. భయపడిపోయిన యువతులు మొదట తాము మీడియా ప్రతినిధులమని చెప్పి తర్వాత నీళ్లు నమిలారు. దీంతో ఆ యువతులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సూచనతో పోలీసులకు అప్పగించారు. అప్పగించిన కొద్దిసేపటికే యువతులను పోలీసులు విడిచిపెట్టడం గమనార్హం. -
అనుమానాస్పద ఓట్ల సర్వేపై ఫిర్యాదు
గుంటూరు(లక్ష్మీపురం): స్థానిక గుజ్జనగుండ్ల, స్తంభాల గరువు, కళ్యాణి నగర్ ప్రాంతాలలో అనుమానాస్పదంగా ఓటరు సర్వే చేస్తున్న ఆరుగురు విద్యార్థులను స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. విద్యార్థులు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి ఓటు వేస్తున్నారా. లేదా ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు వీరిని నిలదీయడంతో పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లేళ్ళఅప్పిరెడ్డి, స్థానిక నాయకులతో కలిసి పట్టాభిపురం సీఐ వెంకటేశ్వరరావును కలిశారు. తెలుగు దేశం పార్టీ నాయకులు వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని, విచారణ చేయాలని కోరారు. ప్రజలు కూడా సర్వేలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్వేలకు వచ్చే సంస్థల గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. విద్యార్థులు డిగ్రీ చదువుతున్నట్లు తెలిపారు. రోజుకు రూ.600 ప్రాతిపదికన స్మార్ట్ సిస్టమ్యాటిక్ మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ ట్రూత్ సంస్థ ద్వారా సర్వే చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. -
బీఎల్ఓలకు బీజేపీ శ్రేణులు సహకరించాలి
విజయనగరం: తప్పులు లేని ఓటర్ నమోదు కోసం బూత్ లెవెల్ ఆఫీసర్ల(బీఎల్ఓ)కు బీజేపీ శ్రేణులు సహకరించాలని బీజేపీ మాజీ అధ్యక్షుడు భవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత నెల 25వ తేదీ నుంచి ఇంటింట చేపడుతున్న సర్వే ఈ నెల 20వ తేదీ ముగుస్తుందన్నారు. ఓటరు గుర్తింపుకార్డులేని, ఓటరు పేరులేని, ఇంటిపేరులోని తప్పులు సరిచేయడం వంటి కార్యక్రమంలో క్షేత్రస్థాయి శ్రేణలు సహకరించాలని కోరారు. ఓటరు లిస్టులో తప్పులున్న కారణంగా సగానికిపైగా ఓటు హక్కు వినియోగించుకోలేక పోవడం వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పి.అశోక్, లక్ష్మీనరింహం, కుసుమంచి సుబ్బారావు, అచ్చిరెడ్డి, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మంత్రిప్రగడ విద్యాస్వరూప్ పాల్గొన్నారు.