
సాక్షి, అమరావతి: ఆధార్ నమోదు వ్యవహారం ప్రహసనంలా మారింది. ఈకేవైసీ నమోదులో భాగంగా ఆధార్ నమోదు కేంద్రాలపై ఒత్తిడి పెరగ్గా అందుకు తగ్గ కేంద్రాలు లేకపోవడం... ఉన్నవి కాస్తా మూతపడటం... వాటిని పునరుద్ధరించేందుకు ఉడాయ్ స్పందించకపోవడం ఈ సమస్యకు కారణ మైంది. ఇప్పుడు ఆధార్ నమోదుకోసం జనం కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. పరిస్థితిని గమనించిన అధికారులు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ఈకేవైసీ నమోదుకు గడువు లేదని స్పష్టం చేస్తూ విద్యార్థులకు పాఠశాలల్లోనే నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈకేవైసీ నమోదు చేసుకోకుంటే రేషన్ సరుకులు ఇవ్వరన్నది వాస్తవం కాదని, నమోదు చేయించుకోకున్నా రేషన్ ఇస్తామని సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15ఏళ్ల వరకు ఉన్న వారికి పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు, అప్‌డేట్ చేయించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తర్వాత రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవచ్చని చెప్పారు. వీరంతా ఆధార్ నమోదు కేంద్రానికి రావాల్సిన అవసరం లేదన్నారు. ఈకేవైసీ చేయించుకునేందుకు ఎలాంటి గడువు లేదని, ఎప్పుడైనా చేయించుకోవచ్చనీ స్పష్టం చేశారు. 15సంవత్సరాలు దాటిన వారు ఆధార్ కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, రేషన్ డీలరే ఈకేవైసీ చేస్తారనీ, ప్రజలు ఈవిషయాన్ని గమనించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment