
బదలాయింపు చేయరాదన్న నిబంధనతోనే అసైన్ చేసినట్లు ఆధారాలు చూపాలి
లేదంటే షరతు లేనట్లే.. అసైన్డ్ భూమి బదలాయింపుపై ఉన్న నిషేధం వర్తించదు
కానూరులోని 0.66 సెంట్ల అసైన్డ్ భూమి విషయంలో హైకోర్టు కీలక తీర్పు
పెనమలూరు తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు
భూమి అమ్మకానికి సమర్పించే డాక్యుమెంట్లను రిజిష్టర్ చేయాలని పటమట సబ్ రిజిస్ట్రార్‌కు ఆదేశం
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో అధికారుల తీరును రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. 18.6.1954కి ముందు నిరుపేదలకు.. ‘‘ఎవరికీ బదలాయింపు (అన్యాక్రాంతం) చేయరాదన్న’’ షరతుతోనే భూములను అసైన్డ్ చేసినట్లు నిరూపించాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆధారాలను సమర్పించలేకపోతే, అసైన్డ్ భూమి విషయంలో అలాంటి షరతు ఏదీ లేదనే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ఉన్న నిషేధం ఆ భూములకు వర్తించదని పునరుద్ఘాటించింది. 18.6.1954కి ముందు అసైన్డ్ చేసిన భూముల విక్రయానికి సమర్పించే డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ అధికారులు స్వీకరించి తీరాల్సిందేనని, ఇందుకు సంబంధించి రావి సతీష్ కేసులో హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును రెవెన్యూ అధికారులందరూ పాటించాలని తేల్చి చెప్పింది.
భూముల రిజిస్ట్రేషన్‌కు నిరభ్యంతర పత్రంను (ఎన్‌వోసీ) తప్పనిసరి చేయడానికి వీల్లేదని కూడా ధర్మాసనం అప్పట్లోనే స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామం సర్వే నంబరు 177/ఏలోని 0.66 సెంట్ల భూమిని ప్రభుత్వానిదిగా పేర్కొంటూ 2008లో పెనమలూరు తహసీల్దార్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది.
ఇందులోని 0.66 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్‌ను నిరాకరించడాన్ని తప్పుబట్టింది. ఈ భూమి విక్రయానికి సంబంధించిన డాక్యుమెంట్లను రిజిష్టర్ చేయాలని పటమట సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ తీర్పు వెలువరించారు.
రిజిస్ట్రేషన్‌కు ఎన్‌వోసీ తేవాలన్న అధికారులు
కానూరులోని సర్వే నం.177/ఏలోని 1.64 ఎకరాల భూమిని 1942లో నల్లూరు వెంకటస్వామి అనే వ్యక్తికి అసైన్డ్ కింద కేటాయించారు. ఇందులో 0.66 సెంట్లను ఆయన వారసులైన సత్యానందం, రత్నమ్మ నుంచి 1966లో ఉప్పలపాటి రాజారత్నం అనే మహిళ కొన్నారు. తర్వాత ఆమె కుమారుడు బలరాంకు వారసత్వంగా వచ్చింది. అతడు భూమిని అమ్మేందుకు సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించగా నిరభ్యంతర పత్రం తేవాలని కోరారు. బలరాం పెనమలూరు తహసీల్దార్ వద్దకు వెళ్లగా ఆ భూమి ప్రభుత్వానిది అని, ఎవరికీ అమ్మడానికి వీల్లేదని 2008లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ బలరాం 2009లో హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ వ్యాజ్యంపై జస్టిస్ చల్లా గుణరంజన్ ఇటీవల తుది విచారణ చేపట్టారు. బలరాం తరఫు న్యాయవాది పి.రాయ్‌రెడ్డి వాదిస్తూ.. వెంకటస్వామికి ఇచ్చిన భూమిలో 0.66 సెంట్లను అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం రాక ముందే రాజారత్నం కొన్నారని పేర్కొన్నారు. అసైన్‌మెంట్ ఉత్తర్వుల్లోనూ.. అన్యాక్రాంతం చేయరాదన్న షరతు లేదన్నారు. అధికారులు ఏకపక్షంగా ప్రభుత్వ భూమి అంటున్నారని వివరించారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది శ్రావణి వాదనలు వినిపిస్తూ, వెంకటస్వామికి 1942లో భూమిని అసైన్ చేసినట్లు పిటిషనర్ ఆధారాలు చూపడం లేదన్నారు.
కాబట్టి 18.6.1954కి ముందు అసైన్ చేసినట్లు భావించడానికి వీల్లేదని తెలిపారు. భూమిని అన్యాక్రాంతం చేయవచ్చన్న షరతు లేదని చెప్పలేమన్నారు. 1966లో వెంకటస్వామి వారసుల నుంచి కొన్నప్పటికీ, 1977లో తీసుకొచ్చిన అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిషేధ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ తీర్పునిస్తూ.. అసైన్‌మెంట్ కింద 18.6.1954కి ముందు ఇచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడానికి వీల్లేదని హైకోర్టు ధర్మాసనం గతంలోనే తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.
ప్రస్తుత కేసులో వెంకటస్వామికి అసైన్‌మెంట్ కింద భూమి ఇవ్వడాన్ని, దానిని రాజారత్నం కొనడాన్ని అధికారులు తోసిపుచ్చడం లేదన్నారు. అయితే, 1966కి ముందు మాత్రమే భూమిని అసైన్ చేసినట్లు చెబుతున్నారని తెలిపారు. అన్యాక్రాంతం చేయరాదన్న షరతుతోనే అసైన్ చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు చూపడం లేదన్నారు.
పిటిషనర్ మాత్రం వెంకటస్వామికి 1942లో అసైన్ చేసినట్లు ఆధారాలు చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ భూమి.. అసైన్ భూమి అన్యాక్రాంత నిషేధ చట్టం పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. తహసీల్దార్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. బలరాం సమర్పించిన డాక్యుమెంట్‌ను రిజిష్టర్ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment