Assigned land
-
పోలీసుల అదుపులో ముగ్గురు తహసీల్దార్లు!
నల్లగొండ క్రైం/నిడమనూరు: అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే అభియోగంతో నల్లగొండ జిల్లాలో ము గ్గురు తహసీల్దార్లు, ఒక వీఆర్వోను టాస్‌్కఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిడమనూరు మండలం తుమ్మడం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములను మార్తివారిగూడేనికి చెందిన మార్తి సురేందర్‌రెడ్డి, అతని కుటుంబసభ్యులు అక్రమ మార్గాల్లో పట్టా చేయించుకున్నారని, అదే గ్రామానికి చెందిన మార్తి వెంకట్‌రెడ్డి 2022లో విజిలెన్స్ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని సురేందర్‌రెడ్డితోపాటు ఆయన భార్య, తల్లిపేరుతో పట్టా చేశారని, అంతేగాక వీఆర్వో వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి కూడా తన పేరుతోపాటు భార్య, తండ్రి పేరుతో ఏడు ఎకరాలు పట్టా చేయించుకున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ ఫిర్యాదుపై అప్పుడే రంగంలోకి దిగిన పోలీసులు, అధికార పార్టీ నేతల హస్తం ఉండడంతో విచారణ ముందుకు సాగించలేకపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమంగా పట్టా చేసుకున్న వారిలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఒక తహసీల్దార్ ఫైల్ పె ట్టగా, మరొక తహసీల్దార్ ప్రభుత్వానికి, అసైన్డ్ కమిటీకి ఫా ర్వర్డ్ చేయగా, ఇంకో తహసీల్దార్ పట్టా జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయంపై హైకోర్టులో కేసు వేయగా, కోర్టు ఆదేశాలను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కేసు వేసిన వ్యక్తు లు మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ధిక్కరణ కింద అధికారులు, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో పోలీసులు బుధవారం ఆయా రెవెన్యూ అధికారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. -
అసైన్డ్ భూమిని ఎలా కొట్టేయాలనుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల అసైన్డ్ భూమిని కాజేసిన వ్యవహారంలో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి బుధవారం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసుల ఎదుట హాజరయ్యారు. అధికారులు శివానందరెడ్డిని దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. ఆయన నుంచి కొంత సమాచారం సేకరించిన పోలీసులు వచ్చే వారం మరోసారి సీసీఎస్‌లో హాజరుకావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివానందరెడ్డి భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్్క, ప్రశాంత్రెడ్డినీ సీసీఎస్ పోలీసులు గత వారం ప్రశ్నించిన విషయం విదితమే. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అసైనీల నుంచి భూమిని చేజిక్కించుకోవాలని తొలుత ప్రయత్నించిన రియల్టర్లు టీజే ప్రకా‹Ù, గాం«దీ, రామారావు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్ 2021లో మిమ్మల్ని ఎందుకు సంప్రదించారంటూ పోలీసులు శివానందరెడ్డిని ప్రశ్నించారు. బుద్వేల్లోని ఆ భూమికి సంబంధించిన పూర్వాపరాలు తెలిసినప్పటికీ పోలీసు అధికారిగా ఉన్న పరిచయాలు, పలుకుబడి వినియోగించి అసైన్డ్ ల్యాండ్‌ను కాజేయాలని ప్రయత్నించడంపై శివానందరెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ భూములు సొంతం చేసుకునే ఉద్దేశంతో 2021–22 మధ్య కాలంలో అసైనీలకు శివానందరెడ్డి తన సంస్థ ద్వారా చెక్కుల రూపంలో చెల్లించిన మొత్తం వివరాలను సీసీఎస్ పోలీసులు అడిగారు. ఇంకా మీ వెనుక ఎవరున్నారు? ఆ అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం 2022–23 మధ్య ఎవరెవరి ద్వారా? ఎక్కడెక్కడ లాబీయింగ్ చేశారు? ఈ వ్యవహారంలో ఎవరు కీలకంగా వ్యవహరించారు? అనే వివరాలను శివానందరెడ్డి నుంచి రాబట్టడానికి సీసీఎస్ పోలీసులు ప్రయత్నించారు. అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు మె మో జారీ అవడం వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశా న్నీ పోలీసులు ప్రశ్నించారు. గత ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ జరగ్గా.. ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీస్‌లకు వారిపై రిజిస్టర్ చే యడం పైనా దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. అసైనీలను భయపెట్టి ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములు లాక్కోవడానికి కుట్ర ప న్న డం ఉద్దేశపూర్వకంగా చేసిందా? అనే అంశాన్నీ పోలీ సు లు పరిగణనలోకి తీసుకుని శివానందరెడ్డిని ప్రశ్నించా రు. ఆయన నుంచి సేకరించిన సమాచారాన్ని సరిచూడాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం మరోసారి రావాలని స్పష్టం చేశారు. -
అసైన్డ్ అని తెలిసే ఆ భూమిని కొన్నారు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల భూమి అసైన్డ్ ల్యాండ్ అని తెలిసే తెలుగుదేశం పార్టీ నేత, వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చిందని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీ ఎన్.శ్వేత శుక్రవారం తెలిపారు. ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్క్‌తో పాటు మరో నిందితుడిని విచారించిన నేపథ్యంలో ఇవి వెలుగులోకి వచ్చాయని వివరించారు. దీంతో సీసీఎస్ పోలీసులు న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ శివానందరెడ్డితో పాటు మరో నిందితుడు ఆరోగ్యం రెడ్డికి ఈనెల 10న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించడం కోసం కేసు దర్యాçప్తు చేస్తున్నామని శ్వేత వివరించారు. ఈ మేరకు ఆమె ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. పలుకుబడితో పరిష్కరిస్తానని చెప్పి.. తొలుత అసైనీల నుంచి భూమిని చేజిక్కించుకోవాలని చూసిన రియల్టర్లు టీజే ప్రకాష్, గాంధీ, రామారావు 2021లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్ ద్వారా మాజీ పోలీసు అధికారి, వెస్సెల్లా గ్రూపు సీఈఓ మాండ్ర శివానందరెడ్డిని సంప్రదించారు. బుద్వేల్ భూమి పూర్వాపరాలు తెలిసిన ఆయన తన పరిచయాలు, పలుకుబడి వినియోగించి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. చివరికి ఆ 26 ఎకరాల భూమి తానే తీసుకుంటానని, చదరపు గజానికి రూ.12 వేల చొప్పున (మార్కెట్ కంటే తక్కువ ధర) ఇస్తానని ఎర వేశాడు. 2021–22 మధ్య కాలంలో అసైనీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెక్కుల రూపంలో చెల్లించారు. ఆ అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం శివానందరెడ్డి తదితరులు 2022–23 మధ్య కాలంలో వివిధ స్థాయిల్లో లాబీయింగ్ చేశారు. దీని ఫలితంగా అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు ఓ సాధారణ మెమో జారీ అయింది. దీంతో గత ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. వీటి ఆధారంగా వీళ్లు ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీస్‌లకు చెందిన శివానందరెడ్డి, ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కినిష్కలతో పాటు ప్రశాంత్‌రెడ్డికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా శివానందరెడ్డి తదితరులు అసైనీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి, ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములను లాక్కోవడానికి కుట్ర పన్నారు. పోలీసులను నెట్టేసి పరారు ఈ కేసుల విచారణ కోసం సీసీఎస్ పోలీసులు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులోని శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన వీళ్లను తోసేసి పారిపోయిన ఉదంతంపై బ్రాహ్మణ కొట్కూరు ఠాణాలో కేసు నమోదైంది. మాండ్ర కనిష్క, మాండ్ర ఉమాదేవి, పైరెడ్డి ప్రశాంత్‌రెడ్డికి సీసీఎస్ పోలీసులు గత మంగళవారం నోటీసులు జారీ చేశారు. దీంతో వీళ్లు శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వీళ్లు భూమి కొనుగోలుతో పాటు కంపెనీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవహారాలను శివానందరెడ్డి చూసుకుంటున్నారని బయటపెట్టారు. బుద్వేల్లోని భూమి స్వభావంపై తమకు అవగాహన ఉందని కూడా అంగీకరించారు. ఈ భూములపై అప్పటికే ఎంవోయూలు ఉన్నాయని తెలిసినా, భారీ ప్రయోజనాలను పొందే ప్రణాళికతో భూములను కొనుగోలు చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. శివానందరెడ్డి ఆదేశాల మేరకు వారికి నగదు, చెక్కులు అందించారని బయటపెట్టారు. కన్వేయన్స్ డీడ్ అమలు చేసిన రోజునే వారి నుంచి తమ పేర్లపై భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని పోలీసులకు తెలిపారు. -
పరారీలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి
సాక్షి, నంద్యాల/సాక్షి, హైదరాబాద్: టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డిని ఓ భూ వివాదం కేసులో అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. ఆయన వారి కళ్లుగప్పి పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన భార్యను, కుమారుడిని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసైన్డ్ భూముల కొనుగోలు పంచాయితీకి సంబంధించి భాగస్వాముల వివాదాలతో హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్)లో కేసులు నమోదయ్యాయి. వీటిని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మాజీ పోలీసు అధికారి అయిన శివానందరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం, వాటిలో నిర్మాణాల పేరుతో ప్రీలాంచ్ ఆఫర్లు ఇచ్చి అడ్వాన్సులు వసూలు చేయడం వంటి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం నంద్యాల జిల్లా అల్లూరు గ్రామంలో ఆయన ఇంటికి వచ్చారు. భూ కబ్జాకు సంబంధించిన కేసులో విచారణకు సహకరించాలని ఆయన్ని కోరారు. నోటీసులు ఇవ్వకుండా తాను సహకరించనని మాండ్ర చెప్పారు. దీంతో పోలీసులు నోటీసులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు శివానందరెడ్డి ఇంటికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే శివానందరెడ్డి పోలీసుల కళ్లుగప్పి కారులో పరారయ్యారు. ఆయన్ని వెంబడించేందుకు ప్రయత్నించిన పోలీసుల్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు బయటికి వెళ్లకుండా ఆయన అనుచరులు గేట్లు మూసేశారు. దీంతో మాండ్ర తప్పించుకుని పారిపోయారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న సీసీఎస్ పోలీసులు నగరంలోని తారామతి బారాదారి వద్ద ఉన్న వెస్సెల్లా మెడోస్‌లోని శివానందరెడ్డి ఇంటిపై దాడిచేశారు. ఆయన భార్య ఉమాదేవిని, కుమారుడు కనిష్్కరెడ్డిని, ప్రశాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. పరారీలో ఉన్న శివానందరెడ్డి కోసం పోలీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలోను ముమ్మరంగా గాలిస్తున్నారు. శివానందరెడ్డి తమ విధులకు ఆటంకం కలిగించి పరారయ్యారని సీసీఎస్ పోలీసులు బ్రాహ్మణకొట్కూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శివానందరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాను భూ కబ్జాలకు పాల్పడలేదని, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తే విచారణకు సహకరిస్తానని అందులో పేర్కొన్నారు. బుద్వేల్లోని అసైన్డ్ భూములు కేంద్రంగా.. సీఐడీలో సైబర్ క్రైమ్ ఎస్పీగా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న శివానందరెడ్డి 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల ఎంపీ అభ్యరి్థగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న ఆయన హైదరాబాద్ బుద్వేల్లోని అసైన్డ్ భూములు కేంద్రంగా పాల్పడిన నేరం బయటపడింది. రాజేంద్రనగర్ శివారులో ఉన్న ఈ ప్రాంతంలోని 282, 283, 284, 289 సర్వే నంబర్లలో 480 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని 1986లో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్‌గా ప్రకటిస్తూ దళితులకు పంపిణీ చేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో 1997లో అప్పటి ప్రభుత్వం ఈ భూముల్ని వెనక్కి తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ అసైనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అక్కడున్న అసైనీలతోపాటు అప్పటికే ఆ స్థలాల్లో ఉంటున్న వారికీ న్యాయం చేయాలని ఆదేశాలొచ్చాయి. 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఒక్కో అసైనీకి 800 చదరపు గజాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వారికి విక్రయించే హక్కుల్ని మాత్రం ఇవ్వలేదు. దీంతో అసైనీలు విక్రయహక్కుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మీద ఒక్కో అసైనీకి 800 చదరపు గజాల చొప్పున 66 మందికి, ఆ స్థలంలో ఉంటున్న ఒక్కొక్కరికి 400 చదరపు గజాల చొప్పున 82 మందికి ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. భాగస్వాముల విభేదాలతో.. ఈ నేపథ్యంలో ఈ భూముల కోసం టి.జె.ప్రకాష్, కోనేరు గాంధీ, ఎస్.దశరథరామారావు రంగంలోకి దిగారు. అసైనీలుగా ఉన్న గుంటి నర్సింహులు తదితరులతో 69,200 చదరపు గజాల స్థలంపై అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) చేసుకున్నారు. వీరికి చెల్లింపులు చేయడానికి గూడూరు కృష్ణ, రవి రాంబాబు, ఎంసీహెచ్ రాఘవరావు తదితరుల నుంచి 2014, 2018ల్లో పెట్టుబడులు తీసుకున్నారు. ఆ సందర్భాల్లో సర్వే నంబర్లు 282, 289ల్లో ఉన్న స్థలం నుంచి కొంతభాగం వీరికి ఇచ్చేలా, అది అసైన్డ్ భూమి కావడంతో గరిష్టంగా ఆరునెలల్లో ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందేలా ఒప్పందాలు చేసుకున్నారు. 2022 నాటికీ ఈ తంతు పూర్తిగాకపోవడంతో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో గూడూరు కృష్ణ, రవి రాంబాబు, ఎంసీహెచ్ రాఘవరావు తదితరులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో 2022 అక్టోబర్ 18న ప్రకాష్, గాం«దీ, దశరథ్‌లపై నాలుగు కేసులు నమోదయ్యాయి వీటి దర్యాప్తులో ఆయన పాత్ర వెలుగులోకి.. ఈ నాలుగు కేసుల దర్యాప్తులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ పాత్ర వెలుగులోకి వచి్చంది. 2015–16లో రంగంలోకి దిగిన శివానందరెడ్డి తాను బయటకు రాకుండా టి.జె.ప్రకాష్, కోనేరు గాందీ, ఎస్.దశరథరామారావులను ముందుపెట్టి కథ నడిపారు. ఆ భూముల్ని తన కంపెనీ పేరుతో రాయించుకోవడంతోపాటు రాత్రికిరాత్రే అనుమతి జీవోలు తెప్పించుకున్నారని వెలుగులోకి వచ్చింది. పట్టాలు కూడా అసైనీలకు ఇవ్వకుండా, లేఔట్ కూడా వేయకుండా వారిని భయపెట్టి రిజి్రస్టేషన్లు కూడా పూర్తిచేసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. గజం కనిష్టంగా రూ.12 వేల నుంచి రూ.15 వేలకు సొంతం చేసుకున్నట్లు బయటపడింది. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో కేసులు మరో మలుపు తిరిగాయి. ఈ వ్యవహారంలో అప్పటి కొందరు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. జనవరిలో కోర్టు అనుమతితో సీసీఎస్ పోలీసులు శివానందరెడ్డికి చెందిన వెస్సెల్లా గ్రూప్ కార్యాలయాల్లోను, ఆయన ఇంట్లోను సోదాలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నారు. మొత్తం 26 ఎకరాల అసైన్డ్ భూముల్ని చేజిక్కించుకున్న శివానందరెడ్డి.. వెస్సెల్లా గ్రూప్ పేరిట 400 చదరపు గజాలు (5 వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా), 800 చదరపు గజాల (10 వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా) విస్తీర్ణంలో లగ్జరీ విల్లాలు నిర్మిస్తామని ప్రచారం చేయడమేగాక ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో చదరపు అడుగుకి రూ.10 వేల చొప్పున అనేకమంది నుంచి అడ్వాన్సులు సైతం వసూలు చేశారని ఈ డాక్యుమెంట్ల ఆధారంగా గుర్తించారు. -
అసైన్డ్ భూముల కుంభకోణం:చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఐడీ చంద్రబాబుపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు సోమవారం వెల్లడించింది. రూ.4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు.. అసైన్డ్ భూముల స్కాంలో ప్రధాన ముద్దాయి. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ ముద్దాయిగా ఛార్జ్‌షీట్‌లో సీఐడీ పేర్కొంది. 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ తెలిపింది. అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ, క్యాపిటల్ సిటీ ప్లాన్‌తో చంద్రబాబు అండ్ కో భూ దోపిడికి పాల్పడినటట్లు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కాజేసినట్టు సీఐడీ గుర్తించింది.రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు సీఐడీ నిర్ధారణ చేసింది. చంద్రబాబు, నారాయణతో పాటుమాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ముద్దాయిలుగా సీఐడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. చదవండి: అసైన్డ్ భూములు కొట్టేసేందుకు.. ‘నల్ల’మార్గం -
దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 30.61 లక్షల ఇళ్ల పట్టాలు
-
అక్రమాల పుట్ట ‘అమరావతి’
సాక్షి, అమరావతి: ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు. రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్ధలవుతోంది. అధికార రహస్యాలను బయటకు వెల్లడించనని, రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని, తన, పర బేధం చూడనని చేసిన ప్రమాణాన్ని (ఓత్ ఆఫ్ సీక్రసీ) ఉల్లంఘించి అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ప్రజలు నివ్వెరపోతున్నారు. అమరావతిలో జరిగిన అసైన్డ్ భూముల స్కామ్ తాజాగా సీఐడీ దర్యాప్తులో బట్టబయలవడం, ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి భూముల కేటాయింపుల వరకు చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ ఉపసంఘం నుంచి సీఐడీ, ఈడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వరకు ఏ నివేదికను పరిశీలించినా అమరావతి అక్రమాల పుట్ట అని, చంద్రబాబు పర్యవేక్షణలోనే ఇవన్నీ జరిగాయని నిగ్గు తేలుతోంది. రాజధాని ముసుగులో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్ లబ్ధిదారులు గత సర్కారు పెద్దలు, మాజీ మంత్రులు, టీడీపీ నేతలే అన్నది జగమెరిగిన సత్యం. ఈ జాబితాలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర, చంద్రబాబు కరకట్ట నివాసం యజమాని లింగమనేని రమేష్, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్రావు, పుట్టా మహేష్ యాదవ్ తదితరులున్నారు. అమరావతి భూ కుంభకోణాన్ని మంత్రివర్గ ఉపసంఘం తవ్వి తీయడం తెలిసిందే. ఉపసంఘం నివేదికతో రంగంలోకి సీఐడీ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. రాజధాని పేరుతో లీకులు ఇచ్చి కారుచౌకగా భూములు కొట్టేసి ఆ తర్వాత ల్యాండ్ ఫూలింగ్‌తో ఆర్థికంగా లబ్ధి పొందిన అక్రమార్కుల జాబితాను సీఐడీ రూపొందించింది. రాజధాని ప్రకటనపై ముందస్తు సమాచారంతో క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్‌లో తక్కువ ధరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేసినట్లు నివేదికలో పేర్కొంది. రూ.కోట్లు విలువైన భూములను పేద వర్గాలు (797 మంది తెల్లకార్డుదారులు) కొనుగోలు చేయడం వెనుక బినామీలు టీడీపీ నాయకులేనని నిగ్గు తేల్చింది. నిజమైన పేదలే అయితే వారికి అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? ఒకవేళ డబ్బున్న వారైతే తెల్లకార్డులు ఎలా పొందారు? అనే కోణంలో విచారించిన సీఐడీ అధికారులు ఆదాయ పన్ను శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లకు నివేదికలు అందించడంతో ఆయా విభాగాలు తమదైన రీతిలో విచారణ సాగించాయి. అక్రమాల చిట్టా... చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బినామీ వేమూరి రవికుమార్ కుటుంబం పేరుతో 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. లింగమనేని రమేష్ తన భార్య, బంధువుల పేర్లతో భూములు కొన్నారు. మాజీ మంత్రి నారాయణ తన సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణకుమార్ పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ బినామీ పేర్లతో 68.6 ఎకరాలు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 37.84 ఎకరాలు, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు మైత్రీ ఇన్ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిర్థారణ అయ్యింది. బినామీలకు భారీ లబ్ధి చేకూర్చేలా.. టీడీపీ నేతలు, వారి బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు సర్కారు రాజధాని సరిహద్దులను కూడా మార్పు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించింది. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. బినామీలు, నేతల భూములకు ప్రయోజనం చేకూర్చేలా రాజధానిని ఏర్పాటు చేశారని తేటతెల్లమైంది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. 4,070 ఎకరాల భూములను ఇన్సైడర్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఎదుర్కోలేక అడ్డుకునే ప్రయత్నాలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి తాజాగా సీఐడీ నమోదు చేసిన అసైన్డ్ భూ కుంభకోణం వరకు దర్యాప్తును ఎదుర్కొనేందుకు చంద్రబాబు అండ్‌కోకు ధైర్యం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వ్యవస్థల ద్వారా దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ పెద్దలతోపాటు వారికి మద్దతుగా నిలిచిన ప్రముఖుల గుట్టు రట్టు కావడంతో సీఐడీ, ఏసీబీ, సిట్ దర్యాప్తులను గతేడాది అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. చదవండి: పేదలను బెదిరించారు..‘అసైన్డ్’ కాజేశారు -
అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్
-
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల స్కామ్‌లో ఐదుగురు అరెస్ట్
సాక్షి, విజయవాడ: రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో ఐదుగురిని సీఐడీ అరెస్ట్ చేసింది. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 1100 ఎకరాల అసైన్డ్‌భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అభియోగం. ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించి విచారణకు సంబంధించి ఐదుగురిని సీఐడీ అరెస్టు చేసింది. కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ.. బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్టుగా అభియోగాలు ఉన్నాయి. చదవండి: అరుదైన రికార్డ్.. ఆ విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంటకపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నంబర్లలో సుమారు 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణా హౌసింగ్ డైరెక్టర్ ఖాతాల ద్వారా పేమెంట్లు చేసి ఈ వ్యవహారాలు చేశారని నిర్ధారణ అయ్యింది.ఈకేసులో ఇతర నిందితులు వారి తరఫు మనుషులు మరో 79.45 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్‌ను అక్రమంగా కొనుగోలు చేశారని వెల్లడైంది.ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ – రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. -
అసైన్డ్ భూమిపై ‘పచ్చ’ గద్దలు.. కోట్లు దండుకున్న ‘తమ్ముళ్లు’
ఇది హిందూపురం 14వ వార్డు పరిధిలోని సడ్లపల్లి పొలం సర్వేనంబర్ 433/11లోని 2.17 ఎకరాల స్థలం. దీనికి 1957 ప్రాంతంలో నల్లోడు అనే వ్యక్తి పేరిట డీ పట్టా మంజూరైంది. ఇది ప్రస్తుతం పట్టణంలో కలిసిపోయింది. ప్రస్తుతం అక్కడ సెంటు రూ.10 లక్షలకు పైగా పలుకుతోంది. 2012లో ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నేతలు... పత్రాలు పుట్టించారు. ప్లాట్లుగా వేసి సెంటు రూ.6 లక్షల చొప్పున 58 మందికి విక్రయించారు. కానీ నల్లోడు వంశీయులు తాతల కాలం నాటి తమ భూమికి అక్రమ పట్టా పుట్టించి అమ్ముకుని తమకు అన్యాయం చేశారని న్యాయపోరాటం చేస్తున్నారు. చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? హిందూపురం(శ్రీసత్యసాయి జిల్లా): భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం డీ–ఫారం పట్టా మంజూరు చేస్తుంది. పట్టా పొందిన వ్యక్తి, ఆ తర్వాత వారి వంశీయులు సదరు భూమిని సాగు చేసుకుని జీవనం సాగించవచ్చు. అంతేకానీ ఇతరులకు విక్రయించే వీలు లేదు. ఈ విషయాన్ని 1977 పీఓటీ యాక్ట్ స్పష్టంగా చెబుతోంది. కానీ హిందూపురంలో డీ–ఫారం పట్టా ఉన్న 2.17 ఎకరాల భూమి తెలుగు తమ్ముళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కనీసం డీ–ఫారం పట్టా పొందిన వ్యక్తి వంశీయులకు కూడా తెలియకుండానే ఆ స్థలం ప్లాట్లుగా మారి ‘తమ్ముళ్ల’కు రూ. కోట్లు కురిపించింది. కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించి.. సడ్లపల్లి పొలం సర్వేనంబర్ 433/1లోని 26.84 ఎకరాలను 1957లో ప్రభుత్వం లేబర్ యూనియన్ అధ్యక్షుడు కదిరప్ప పేరిట డీ–ఫారం పట్టా ఇచ్చింది. అతను సంఘంలోని సభ్యులకు ఎకరా, రెండెకరాల చొప్పున కేటాయించి పట్టాలిప్పించాడు. ఈ క్రమంలో 433/11లో 2.17 ఎకరాల భూమిని దళితుడైన నల్లోడు పేరిట ప్రభుత్వం డీ–ఫారం పట్టా మంజూరు చేసింది. ఈ భూమిని 2012లో నల్లోడు వంశీయులైన కొల్లప్ప, పెద్దసింహప్ప, చిన్న నరసింహప్ప నుంచి తాము కొనుగోలు చేసినట్లు కృష్ణయ్య, కాంతమ్మ మరికొందరు పత్రాలు సృష్టించుకున్నారు. ఆ తర్వాత కృష్ణయ్య 2012లో టీడీపీ నాయకులు మంగేష్, పురుషోత్తంరెడ్డికి విక్రయించారు. రూ.కోట్లు పలికే భూమిని కన్వర్షన్ చేయకుండానే టీడీపీ నాయకుడు మంగేష్ ప్లాట్లు వేసి విక్రయాలు సాగించేశారు. సెంటు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల చొప్పున 58 ప్లాట్లు విక్రయించారు. అసైన్డ్ ల్యాండ్ స్వాధీన ప్రక్రియలో భాగంగా బోర్డు పాతుతున్న రెవెన్యూ సిబ్బంది న్యాయం కోసం పోరాటం.. వాస్తవానికి ఆ భూమి పొందిన నల్లోడు అవివాహితుడు. అతను తన అన్న న్యాతప్పతో కలిసి ఉండేవాడు. అతని తదనంతరం ఈ భూమి వారసత్వంగా న్యాతప్ప కుమారులైన కొల్లప్ప తదితరులకు చెందాల్సి ఉంది. కానీ కొల్లప్పతో పాటు అతని అన్నదమ్ములు మృతి చెందిన తర్వాత వారి నుంచి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులు పత్రాలు సృష్టించారు. దీనిపై కొల్లప్ప కుమారుడు సూరి అ«ధికారులకు ఫిర్యాదు చేశారు. తమ భూమికి కృష్ణయ్య, కాంతమ్మ, రమేష్ మరికొందరు పేరుతో పత్రాలు సృష్టించి టీడీపీ నాయకులు మంగేష్, పురుషోత్తంరెడ్డి పేరిట రిజిస్టర్ చేసుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. మా భూమిని లాక్కున్నారు మా ముత్తాత కాలం నుంచి హక్కుగా వస్తున్న 2.17 ఎకరాల భూమిని టీడీపీ నేతలు కబ్జా చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించుకుని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. న్యాయం చేయాలని 2013 సంవత్సరం నుంచీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ అప్పటి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కబ్జా దారులు దర్జాగా లేఅవుట్‌వేసి స్థలాలు అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా మాకు న్యాయంచేసి ఆ భూమిని మా కుటుంబసభ్యులకు అప్పగించాలి. – సూరి, కొల్లప్ప కుమారుడు, హిందూపురం స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం సర్వేనంబర్ 433/11లోని 2.17 ఎకరాలను అసైన్డ్ల్యాండ్గా గుర్తించాం. సాగుచేసుకుని జీవనం సాగించేందుకు గతంలో నల్లోడు అనే వ్యక్తికి డీపట్టా మంజూరైంది. ఆ తర్వాత వారి వంశీయులు ఎవరూ భూమిని సాగు చేయలేదు. ప్రస్తుతం పట్టణ నడిబొడ్డున ఉన్న ఆ స్థలానికి విలువ పెరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంబంధిత వారికి రీజెండర్ నోటీసులు జారీ చేసి స్థలాన్ని స్వాదీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించాం. ఆ స్థలంలో ఎవరూ ప్రవేశించడానికి వీలులేదని బోర్డు నాటించాం. – శ్రీనివాసులు, తహసీల్దార్, హిందూపురం -
బీజేపీలో భూ రగడ.. రాష్ట్ర అధిష్టానం దృష్టికి సమస్య
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీలో భూ రగడ వివాదాస్పదమవుతోంది.. ఆ పార్టీకి చెందిన జిల్లా ముఖ్య నాయకుల ప్రమేయంపై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు గుర్రుగా ఉన్నారు. మంగళవారం రాత్రి ఈ వివాదం విషయమై ఎంపీని కలిసేందుకు వెళ్లిన కొంతమంది ముఖ్య నాయకులను ఎంపీ గన్మెన్లు ఆ సమయంలో కలిసేందుకు అనుమతినివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో వారు గన్మెన్లను నెట్టివేశారు. వారు మావల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌రెడ్డిపై కేసు నమోదైంది. అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడం సంచలనం కలిగిస్తుంది. అయితే గన్మెన్లను నెట్టివేసిన తీవ్రత కంటే భూ రగడ విషయంలోనే కేసు తీవ్రతకు కారణమైందని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎంపీ సోయం బాపురావుకు, పార్టీ జిల్లా ముఖ్య నాయకుల మధ్య వివాదం బీజేపీలో చర్చనీయంగా మారింది. రాష్ట్ర అధిష్టానం దృష్టికి.. అసైన్డ్ భూమి విషయంలో జిల్లా నేతల ప్రమేయం, దాని విషయంలో ఎంపీ నివాస గృహం వద్ద దురుసు ప్రవర్తన వంటి విషయాలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎంపీ ఇంటి వద్ద జరిగిన వివాదంలో పలువురు బీజేపీ జిల్లా నేతలు ఉన్నప్పటికీ ఈ విషయంలో పార్టీ పరువును దృష్టిలో ఉంచుకుని కొంతమందిని కేసు నుంచి తప్పించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే జిల్లా అధికార ప్రతినిధిపై మాత్రం అట్రాసిటీ కేసు నమోదైంది. కనిపించని సందడి.. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పుట్టిన రోజు గురువారం కాగా, ఆ సందడి ఆదిలాబాద్ పట్టణంలో కనిపించలేదు. ఇదిలా ఉంటే ఆయన అత్యవసర పని నిమిత్తం ఢిల్లీ వెళ్లారని ఎంపీ క్యాంప్ ఆఫీస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పట్టణంలో ఎక్కడ కూడా ఎంపీ సోయం బాపురావుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు దర్శనమివ్వలేదు. బీజేపీలో ఏ కార్యక్రమం జరిగినా ఫ్లెక్సీల సందడి కనిపిస్తుంది. అలాంటిది ఎంపీ బర్త్ డే సందర్భంగా సందడి కనిపించకపోవడంపైనా చర్చ సాగుతోంది. అసైన్డ్ భూమి విషయంలో.. ఇచ్చోడ మండలం బాబుల్‌డోవ్ గ్రామ శివారులో ఎనిమిది ఎకరాల అసైన్డ్ భూమి విషయంలోనే ఈ వివాదం చోటుచేసుకుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ జిల్లా ముఖ్య నాయకుడు, అతని బంధువులు ఈ భూమిని కొనుగోలు చేసేందుకు గతేడాది సెప్టెంబర్‌లో నలుగురు అసైన్డ్‌దారులతో ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. డబ్బుల విషయంలో వివాదం, ఆ నలుగురి కుటుంబాలను సదరు నేతలు వేధంచడంతో బాధితులు ఓ వ్యక్తి ద్వారా ఎంపీ సోయం బాపురావును కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలోనే మంగళవారం రాత్రి ఎంపీ సోయం బాపురావు తన నివాస గృహంలో ఉన్నప్పుడు అసైన్డ్‌దారుల తరపు వ్యక్తి మాట్లాడేందుకు రాగా, ఈ విషయం తెలుసుకుని జిల్లా బీజేపీ నాయకులు పలువురు అక్కడికి చేరుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎంపీ సూచన మేరకు బీజేపీ నాయకులను గన్మెన్లు మరుసటి రోజు ఉదయం రమ్మని చెబుతున్నా దురుసుగా ఇంట్లోకి ప్రవేశించడం, ఆ క్రమంలో గన్మెన్లను నెట్టివేయడం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. చదవండి: సీఐతో శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు నిందితుడి సెల్ఫీ -
ఇక ‘అసైన్డ్’ వంతు!
రాష్ట్రంలో నెలకొన్న భూముల సమస్యలు, వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత సమస్యలను పేద, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా పరిష్కరించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా అసైన్డ్ భూములు, నోటరీ స్థలాలు, లే అవుట్ల రెగ్యులరైజేషన్ సంబంధిత అంశాలపై దృష్టి సారించింది. దీంతో ఈ అంశాలకు కూడా త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అసైన్డ్ భూములతో పాటు నోటరీ స్థలాలు, లే అవుట్ల రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా కీలకమైన అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల భూమిని 14 లక్షల మందికి అసైన్ చేశారు. అయితే ఈ భూములపై అసైనీలకు ఎలాంటి యాజమాన్య హక్కులు కల్పించలేదు. భూబదలాయింపు నిషేధ చట్టం (పీవోటీ) కారణంగా ఈ భూములపై అసైనీలకు హక్కులు కల్పించే అవకాశం లేకుండా పోయింది. దీంతో కేవలం వారసత్వ బదిలీకి మాత్రమే ఈ భూములు పరిమితం అయ్యాయి. ఇప్పుడు ధరణి పోర్టల్‌లో చాలా అసైన్డ్ భూములు నిషేధిత భూముల జాబితాలో ఉండడంతో ఈ లావాదేవీలు కూడా జరగడం లేదు. అయితే ఓ కటాఫ్ తేదీని నిర్ధారించి ఈ కటాఫ్ తేదీ కంటే ముందు పేదలకు అసైన్ చేసిన భూములపై పీవోటీ చట్టాన్ని సవరించడం ద్వారా అసైనీలకు సర్వహక్కులు కల్పించాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లాల వారీగా ఎన్ని ఎకరాల అసైన్డ్ భూములున్నాయి? అందులో ఎన్ని అసైనీల చేతిలో ఉన్నాయి? ఎన్ని థర్డ్ పార్టీల చేతుల్లో ఉన్నాయి? ఎన్ని ఎకరాల్లో వెంచర్లు వేసి అక్రమంగా అమ్మకాలు జరిగాయి? థర్డ్ పార్టీల సామాజిక, ఆర్థిక స్థితిగతులేంటి ? అనే వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. ఈ వివరాల ఆధారంగా అసైన్డ్ భూముల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా కొంత కసరత్తు జరిపింది. అయితే ఈ హక్కుల కల్పనకు గాను పీవోటీ చట్టాన్ని సవరించాల్సి ఉండడంతో త్వరలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు సభ ముందుకు తెస్తారా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. ఒకవేళ ఈసారి వాయిదా పడితే వర్షాకాల సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా సభ ముందుకు బిల్లు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంచర్లకు మార్గదర్శకాలు సిద్ధం మరోవైపు అనువుగా ఉన్న చోట్ల అసైన్డ్ భూముల్లో ప్రభుత్వమే వెంచర్లు వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేసిన పట్టణాభివృద్ధి సంస్థల్లో అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేసేందుకు మార్గదర్శకాలు కూడా సిద్ధమయ్యాయి. ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా పట్టాదారు రైతులు ఎకరం భూమి ఇస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాల కోసం మినహాయించగా మిగిలే 2,800 గజాల్లో సగం భూమిపై రైతుకు యాజమాన్య హక్కు ఇవ్వాలని, లావుణి భూములయితే 600 గజాలపై హక్కు ఇవ్వాలని, అదే అసైన్డ్ భూమి అయితే సదరు అసైనీకి 25 శాతం (700 గజాలు) హక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే పద్ధతిని హైదరాబాద్ శివార్లలోని కొన్ని గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూముల విషయంలో అవలంబించాలన్న ప్రతిపాదన కూడా పెండింగ్‌లో ఉంది. అయితే ఈ భూముల విషయంలో హక్కు ఇవ్వడం కన్నా పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుని ఆ తర్వాత వాటిని అమ్మాలనే ప్రతిపాదనల వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అసైన్డ్ భూములకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ కూడా కొలిక్కి! పనిలో పనిగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)ను కూడా ఓ కొలిక్కి తేవాలనే దిశలో ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ స్కీం కింద పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తే చాలా వరకు భూ సమస్యలు తీరిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్పై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అంటున్నారు. నోటరీ స్థలాలకు ఒకసారి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పిన నేపథ్యంలో దీనిపై కూడా త్వరలోనే ప్రకటన వస్తుందనే అభిప్రాయాన్ని రెవెన్యూ వర్గాలు వ్యక్తం చేశాయి. -
AP High Court: వేలంలో కొన్న అసైన్డ్ భూమి నిషేధిత జాబితాలోకి రాదు
సాక్షి, అమరావతి: బహిరంగ వేలంలో కొన్న అసైన్డ్ భూమిని నిషేధిత భూముల జాబితా (22ఏ)లో చేర్చడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. అసైన్డ్ భూమిని ఎవరైనా బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేసినప్పుడు దాన్ని అసైన్డ్ భూమిగా పరిగణించడానికి వీల్లేదంది. ఈ మేరకు చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కొట్రమంగళంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్వహించిన బహిరంగ వేలంలో కొనుగోలు చేసిన 10 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితాలో చేరుస్తూ రెవెన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా సీసీఎల్ఏ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు ఇచ్చారు. నిషేధిత భూముల జాబితాలో చేర్చడం సరికాదు.. బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూమిని నిషేధిత భూముల జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పి.గీత, ఇ.మోహన్ రామిరెడ్డి, ఎం.విజయభాస్కరరాజు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ‘పిటిషనర్లు వ్యవసాయ సహకార సంఘం నిర్వహించిన బహిరంగ వేలంలో భూములు కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా వారి పేర్లు నమోదయ్యాయి. పాసు పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. తుడా అధికారులు కూడా ఎన్వోసీ ఇచ్చారు. ఇన్ని జరిగినప్పటికీ ప్రభుత్వం పిటిషనర్ల భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చింది’ అని ఆక్షేపించారు. అంతేకాకుండా ‘భూమిని అసైన్డ్‌దారుకి కేటాయించినప్పుడు ఆ భూమికి ప్రభుత్వం యజమాని కాదు. ఆ భూమికి అన్ని రకాలుగా అసైన్డ్‌దారే యజమాని. భూమిని తాకట్టుపెట్టి అసైన్డ్‌దారు రుణం తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని అసైన్డ్‌దారు చెల్లించలేకపోతే ఆ భూమిని వేలం వేయొచ్చు. వేలంలో ఆ భూమిని ఎవరైనా కొనుగోలు చేస్తే అప్పటి నుంచి ఆ భూమిని అసైన్డ్ భూమిగా పరిగణించరాదు’ అని తీర్పులో పేర్కొన్నారు. -
ఆ 142 ఎకరాలు సర్కారువే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లోని గండిపేట మండలం మంచిరేవులలో గ్రేహౌండ్స్ దళాల శిక్షణ కోసం సర్వే నంబర్ 391/1 నుంచి 391/20ల్లో 2007లో కేటాయించిన 142.39 ఎకరాల భూమి సర్కారుదేనని హైకోర్టు స్పష్టం చేసింది. నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అసైన్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించిన నేపథ్యంలో.. ఆ అసైన్మెంట్ను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తేల్చిచెప్పింది. ఈ భూమిని అసైన్మెంట్ ద్వారా పొందిన వారికి హక్కులున్నాయని, వారికి పరిహారం చెల్లిం చి భూములు స్వాధీనం చేసుకోవాలంటూ 2010లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం అనుమతిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ధర్మాసనం తీర్పుతో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఈ భూమిని కాపాడినట్లైంది. లావుని నిబంధనలు పాటించలేదు ‘‘లావుని నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోవడం సరికాదన్న అసైన్‌మెంట్‌దారుల తరఫు న్యాయవాదుల వాదన సరికాదు. లావుని నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములను వేలం ద్వారా కేటాయించాలి. వేలంలో భూమిని పొందిన వ్యక్తులు 25 శాతం డబ్బును వెంటనే చెల్లించాలి. మిగిలిన 75 శాతం 15 రోజుల్లో చెల్లించాలి. అయితే ఈ భూములను భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్ విధానంలో కేటాయించారు. ఇతరులకు విక్రయించరాదనే షరతు కూడా ఉంది. అయితే వీరు భూమిని విక్రయించేందుకు ప్రైవేట్ వ్యక్తులతో ఒప్పందం చేసు కున్నారు. 1991లో ఎంఎ.భక్షికి జీపీఏ ఇచ్చారు. ఆ భూమిని అభివృద్ధి చేసిన భక్షి అసైన్‌మెంట్‌దారులకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇది అసైన్మెంట్ భూమిని విక్రయించరాదన్న నిబంధనను ఉల్లంఘించడమే. తర్వాత భక్షికి చేసిన జీపీఏను అసైన్మెంట్దారులు రద్దు చేసినా అప్పటికే అసైన్మెంట్ నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారణ అయ్యింది.ఈ నేపథ్యంలో వీరికి చేసిన అసైన్మెం ట్ను రద్దు చేసే అధికారం రెవెన్యూ అధికారులకు ఉంది’అని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ‘గ్రేహౌండ్స్’శిక్షణ కోసం కేటాయించారు.. ‘అసైన్మెంట్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి ఈ భూమిని స్వాధీనం చేసుకొని ప్రజోపయోగమైన పనుల కోసం ప్రభుత్వం కేటాయించింది. నక్సల్స్‌ను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ దళాలకు శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ కమాండోలతోపాటు కేంద్ర పారామిలిటరీ బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి నక్సలిజం నిర్మూలన కోసం వినియోగిస్తున్నారు. ఈ భూమిని ప్రభుత్వం 2003లో స్వాధీనం చేసుకుంది. 2006 డిసెంబర్లో ప్రజోపయోగమైన పనులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. 1961లో అసైన్మెంట్ కింద కేటాయించిన ఈ ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తులపరం కాకుండా డీజీపీ, గ్రేహౌండ్స్ అదనపు డీజీ, రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, గండిపేట తహసీల్దార్లు కృషి చేశారని ధర్మాసనం అభినందింది. ఇదిలా ఉం డగా, ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి వెంచర్లు వేసిన కబ్జాదారులపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి క్రిమినల్ కోర్టులో విచారణలో ఉంది. -
తవ్వేకొద్దీ అక్రమాలు!
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలోని అసైన్డ్ భూమి వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయి. ఈ దందాలో అప్పటి తహసీల్దార్, ప్రస్తుతం సస్పెండైన కామారెడ్డి ఆర్డీఓ నరేందర్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. అసైన్డ్, సీలింగ్ భూములతో పాటు వివాదాస్పద భూముల్లో కూడా ఆయన జోక్యం ఉందని చెబుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఖాజీపల్లిలో సుమారు రూ.80 కోట్ల విలువ చేసే అసైన్డ్ భూమికి ఎసరు పెట్టారని సాక్షిలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. అప్పటి జిన్నారం తహసీల్దార్, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ నరేందర్, మరొక అధికారిని సస్పెండ్ చేసింది. అలాగే.. మరో ఆరుగురు ఉద్యోగులు, నలుగురు మాజీ సైనికులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. 2012–13లో నరేందర్ జిన్నారం తహసీల్దార్‌గా ఉన్న సమయంలో అన్నారంలోని 261 సర్వే నంబర్లోని అసైన్డ్ భూములను కూడా పట్టాలుగా మార్చి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా కొనసాగాయి. మాదారంలోని అసైన్డ్ స్థలాన్ని గుట్టుచప్పుడు కాకుండా పట్టాగా మార్చినట్లు సమాచారం. అలాగే.. కొర్లకుంట గ్రామంలోని 35 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూములకు సంబంధించి అధికారులు రికార్డులు తారుమారు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఖాజీపల్లిలోని 180 సర్వే నంబర్లో సీలింగ్ భూమిని ఇతరులకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూమిలో ఫ్యాక్టరీ నిర్మాణం కూడా జరుగుతున్నట్లు సమాచారం. నరేందర్ తహసీల్దార్‌గా ఉన్న సమయంలో జరిగిన స్థలాల మార్పిడి, ఇతర రెవెన్యూపరమైన అంశాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మాజీ సైనికులకు నోటీసులు! అసైన్డ్ భూ దందాలో భాగస్వాములైన మాజీ సైనికులు తోట వెంకటేశ్వర్లు, ఉప్పు రంగ నాయకులు, ఎం.మధుసూదన్, ఎన్.గంగాధర్ రావులకు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఖాజీపల్లిలోని 180 సర్వేనంబరు అసైన్డ్ భూమిని మీకు ఏ సంవత్సరంలో అప్పగించారు, ఎప్పటి నుంచి రికార్డులలో మీ పేరుంది? వాస్తవానికి ఈ భూమి ప్రభుత్వం మీకు ఇవ్వడానికి అర్హత ఉందా..? ఈ భూ కుంభకోణంలో మీ పాత్ర ఎంత ఉంది..? చనిపోయిన తహసీల్దార్ సంతకంతో మీకు పట్టాలు ఎవరిచ్చారు..? తదితర ప్రశ్నలకు 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. నోటీసులకు సరైన, సంతృప్తికరమైన సమాధానం రాకపోతే ఈ భూమిని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోరాదనే అంశంపై కూడా వివరణ ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం. కొల్చారం తహసీల్దార్‌కూ లింకు! కొల్చారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రస్తుత కొల్చారం తహసీల్దార్ పాత్ర ఉందని తేలింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఆయన.. ఈ నెల 14వ తేదీ నుంచి సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. అప్పట్లో సహదేవ్ జిన్నారం తహసీల్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. భూ దందాల్లో కూడా సహదేవ్ పాత్ర ఉందని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్‌కు సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. కాగా, రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన సర్వే నంబర్ 297లో గల 0.13 గుంటల భూమికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో సహదేవ్ విచారణ ఎదుర్కొంటున్నారు. -
అమరావతిలో ‘అసైన్డ్’ ప్లాట్లు రద్దు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినవారికి ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏ కేటాయించిన ప్లాట్లను ప్రభుత్వం రద్దు చేసింది. టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్ చట్టం 2015 ప్రకారం రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించారు. కాగా దళితులు, పేదలకు గతంలో మంజూరు చేసిన అసైన్డ్ భూములను కొందరు రాజకీయ నేతలు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారు. అనంతరం సీఆర్డీఏ వీటిని భూ సమీకరణ కింద సేకరించి బదులుగా వారికి వాణిజ్య, నివాస స్థలాలను కేటాయించింది. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ (పీవోటీ) 1977 ప్రకారం చట్ట విరుద్ధం. అసైన్డ్ భూములు సేకరించి బదులుగా వారికి ప్లాట్లు కేటాయించడం కూడా నిబంధనలకు విరుద్ధమే. ల్యాండ్ పూలింగ్ కింద మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి తీసుకుంటే 500 గజాల నివాస స్థలం, 50 గజాల వాణిజ్య స్థలం, జరీబు భూములకైతే 500 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. కాగా అసైన్డ్ ప్లాట్ల కేటాయింపులు రద్దు చేయాలని ఇటీవల మంత్రిమండలి తీర్మానించింది. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వారికి సీఆర్డీఏ కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి: బహుళ రాజధానులే బహుబాగు) -
ప్రజల కళ్లుగప్పి చంద్రబాబు చీకటి జీవోలు
-
ప్రభుత్వ స్థలంలో తారు ప్లాంట్
భూమి కబ్జా, అనుమతి లేకుండా నిర్మాణం అసైన్ట్ భూమిని లీజ్‌కు ఇచ్చిన రైతు? పాలకుర్తి టౌన్ : ప్రభుత్వ పంచరాయి భూమిని దర్జాగా కబ్జా చేసి అక్రమంగా డాంబర్ ప్లాంట్ నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని 33/11కేవీ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న629 సర్వే నెంబర్లో రూ.లక్షల విలువైన 196 ఎకరాల ప్రభుత్వ పంచరాయి భూమి ఉంది. ఈ భూమిని గతంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేసింది. ఈ భూమిని సాగుకు ఉపయోగించుకోవాలే తప్ప అమ్మడం కానీ లీజ్‌కు ఇవ్వడం కానీ చేయొద్దనే నిబంధనలు ఉన్నా పాలకుర్తికి చెందిన ఓ రైతు భూమిని డాంబర్ ప్లాంట్ నిర్వాహకులకు లీజ్‌కు ఇచ్చినట్లు సమాచారం, దీంతో ఆ స్థలంలో కొన్ని నెలలగా ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే, కళ్లెదుట అనుమతి తీసుకోకుండా ప్లాంట్ నిర్మిస్తున్నా రెవెన్యూ, గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జాకు గురైన అసైన్డ్ భూములు మండల కేంద్రంలో రూ.కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంటున్నారు. నిరుపేదలు భూమి సాగు చేసుకోవడానికి ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ముఫ్పై ఏళ్ల క్రితం భూమి లేని నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం 265 ఎకరాల భూమిని మూడు విడతలుగా పంపిణీ చేసింది. 566, 629 సర్వే నెంబర్లలో జనగామ, రఘనాథపల్లి రోడ్డు పక్కన ఈ భూములు ఉన్నాయి. అయితే, జనగామ రోడ్డులో ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కస్తూర్భా బాలికల గురుకుల పాఠశాలకు రెండు ఎకరాలు ఇచ్చారు. కూషిగుట్ట పక్కన స్టోన్ క్రషర్స్ యాజమానులు కొంత భూమిని కబ్జా చేసినట్లు సమాచారం. ఇకనైనా అధికారులు స్పందించి భూమిన కబ్జాదారుల పరం కాకుండా చూడాలని స్థానికులు కొరుతున్నారు. భూమి స్వాధీనం చేసుకుంటాం భూక్యా భన్సీలాల్, తహసీల్దార్, పాలకుర్తి డాంబర్ ప్లాంట్ నిర్మిస్తున్నది ప్రభుత్వ పంచరాయి భూమి అని తేలితే సీజ్ చేస్తాం. ఇక రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూమిని ఇతరులకు లీజుకు ఇవ్వడం, అమ్ముకోవడం చట్టవిరుద్ధం. ఇలా ఎవరైనా చేస్తే ఆయా భూములు స్వాధీనం చేసుకుంటాం. -
అసైన్డ్ భూమి..అమ్మకానికి సిద్ధం!
కోదాడ : పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల అసైన్డ్ భూమిని అమ్మకానికి సిద్ధం చేశారు. విలువైన ఈ భూమిని కొద్ది రోజులుగా శుభ్రం చేసి ప్లాట్లుగా విభజించడం వెనుక ఓ రాజకీయ నేత కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు ఎంతకు తెగించారంటే కోదాడ పెద్దచెరువు మునక భూమిలో కూడా రాళ్లు పాతి ప్లాట్లు చేయడం గమనార్హం. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు రెవెన్యూ, ఐబీ అధికారులకు ఫిర్యాదు చెయ్యడంతో వారు వచ్చి అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. దీంతో ప్లేటు ఫిరాయించిన సదరు నేత భూమి అమ్మడం లేదని ప్రభుత్వం 14 మందికి కేటాయించడంతో వారందరికీ పంచి ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భూమిని పంచి ఇవ్వడానికి ఆయనెవ్వరని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే... కోదాడకు చెందిన తమ్మర వెంకట సీతరామారావు కోదాడ రెవెన్యూ పరిధిలో రామిరెడ్డిపాలెం వెళ్లే దారిలో ఉన్న సర్వే నంబర్ 55లో సీలింగ్ కింద ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ఈ భూమిని అధికారులు కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్జంగ్ పేటకు చెందిన 14 మంది దళితులు, మైనార్టీలకు అసైన్డ్ చేశారు. వారు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుని జీవించాల్సి ఉంది. అమ్మకం, కొనుగోళ్లు చెయ్యరాదు. కానీ ఈ భూమిని 1990లో కోదాడకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశారు. దానిని తన తండ్రి పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు నాయకులు నాడు సదరు భూమిలో పార్టీ జెండాలను పాతి తిరిగి పేదలకు కేటాయించాలని ఉద్యమం కూడా చేశారు. ఈ తరువాత విషయం హైకోర్టు వరకు చేరింది. దీంతో కోర్టు రిజస్ట్రేషన్ రద్దు చేసి తిరిగి పేదలకు అప్పగించాలని చెప్పడంతో అధికారులు తిరిగి వారికే కేటాయించారు. ఇది జరిగి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఈ భూమి అలాగే ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పట్టణం విస్తరించడంతో భూమి విలువ ఎకరం కోటి రూపాయలకు చేరింది. దీంతో నాడు భూములను స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఓ నేత తెర వెనకుండి ఈభూమిని శుభ్రం చేయించి ప్లాట్లుగా పెట్టి అమ్మకానికి సిద్ధం చేశాడు. పనిలో పనిగా పెద్ద చెరువు నీరు ఉండే ప్రాంతంలో కూడా రాళ్లు పెట్టి ప్లాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు రెండు రోజుల క్రితం రెవెన్యూ అధికారులకు, పెద్ద చెరువు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చెయ్యడంతో వారు వచ్చి పనులను అడ్డుకున్నారు. -
పనులు అడ్డుకున్న భూ నిర్వాసితులు
నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఓసీపీలో ముంపునకు గురైన సింగపూర్ గ్రామ భూ నిర్వాసితులు గురువారం ఆందోళన చేపట్టారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓబీ వాహనాలను అడ్డుకుని ఆందోళన చేశారు. క్వారీ నుంచి డంప్‌యార్డుకు వెళ్లే మార్గంలో మట్టి టిప్పర్లకు అడ్డంగా బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం, రెవెన్యూ అధికారులు కలిసి తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. గ్రామంలో 312 ఎకరాల అసైన్డ్ భూమిని ఓసీీపీ క్రింద తీసుకున్నారని తెలిపారు. 205 ఎకరాలకు డబ్బులు ఇవ్వాలని అవి ఈ నెల 2న ఇస్తామని నాడు రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. నష్టపరిహారాలు చెల్లించేంత వరకు పనులు నడవనివ్వమని భీష్మించుకు కూర్చున్నారు. ఘటనా స్థలానికి ఎస్సై మసూద్ చేరుకుని ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో నిర్వాసిత కమిటీ నాయకులు గుంట జెగ్గయ్య, రంగ రమేశ్, ఐత శంకరయ్య, మల్లమ్మ, బుచ్చయ్య, బానేశ్, తిరుపతి, బానేశ్‌లు పాల్గొన్నారు. -
చక్రబంధంలో టీపీసీసీ చీఫ్!
* భూముల విషయంలో పొన్నాలకు ఇరకాటం * సర్కారు వ్యూహంతో ఆత్మరక్షణలో కాంగ్రెస్ * ప్రతిపక్షాన్ని ఇరుకునపెట్టిన అధికారపక్షం * సభాసంఘం ఏర్పాటు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో అధికార పార్టీ వ్యూహంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడిపోయింది. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను లక్ష్యంగా చేసుకుని అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం చేపట్టిన చర్చ ద్వారా కాంగ్రెస్ శాసనసభా పక్షం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. బుధవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవ ర్ ముగిసిన తర్వాత పొన్నాలకు భూ కేటాయింపుల అంశాన్ని నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. దీనికి శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ వివరాలను సభ ముందుంచారు. తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడారు. ఒక వ్యక్తిని ఉద్దేశించి అసైన్డు భూముల వ్యవహారాన్ని చ ర్చకు తీసుకోలేదని, అన్ని రకాల భూముల వ్యవహారంపై వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే చర్చంతా పొన్నాల లక్ష్యంగానే సాగింది. దీంతో పీసీసీ చీఫ్‌ను వెనకేసుకువచ్చే పరిస్థితి కాంగ్రెస్ సభ్యులకు లేకపోయింది. మధ్యలో సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని వాదించే ప్రయత్నం చేశారు. అయితే వారి వాదనలో బలం లేకపోవడం, ప్రభుత్వం వద్ద ఆధారాలు బలంగా ఉండడంతో ఏమీ చేయలేకపోయారు. వరంగల్ జిల్లాలోని రాంపూర్ గ్రామంలో దళితుల భూమిని పొన్నాల ఎలా దక్కించుకున్నారో ఆధారాలతో సహా హరీశ్‌రావు వివరించారు. దీంతో ఎవరూ పొన్నాలకు అనుకూలంగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అసైన్డ్ భూముల విషయంలో ఉన్న నిబంధనలు, పొన్నాల విషయంలో జరిగిన ఉల్లంఘనలు, కోర్టుల మొట్టికాయలు, కాగ్ అక్షింతలు, ఏపీఐఐసీతో అధికార దుర్వినియోగం, అప్పటి కాంగ్రెస్ సర్కారు తీరు వంటి అనేక అంశాలను హరీశ్ ప్రస్తావించడంతో పొన్నాల చక్రబంధంలో చిక్కుకున్నట్లయింది. ‘టీపీసీసీ చీఫ్ పొన్నాల భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ను బదనాం చేయాలనుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం విజయవంతమైంది. ఒక విధంగా మేం ఈ రోజు ఆత్మరక్షణలో పడ్డాం. అయితే సభాసంఘం పది జిల్లాల్లో అన్యాక్రాంతమైన భూములకు సంబంధించి విచారణ జరుపుతుంది. అదొక్కటే ఊరట’ అని కాంగ్రె స్కు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ‘ఈ వివాదం వల్ల ప్రభుత్వ తీరును పీసీసీ చీఫ్ ఎలా ఎండగడతారు?’ అని అభిప్రాయపడ్డారు. ‘టీపీసీసీ అధ్యక్షునిగా పార్టీని అధికారంలోకి తీసుకురాలేక పోయినప్పుడే, ఆయన తప్పుకొని ఉంటే గౌరవంగా ఉండేది. ఇప్పుడు ఈ వివాదం వ్యక్తగతమే అయినా, ఆయన టీపీసీసీ అధ్యక్షుడు కావడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది’ అని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఇప్పుడు పొన్నాల తప్పొప్పుల గురించి చర్చించి లాభం లేదని, పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఓ వర్గం తాజా పరిణామంతో ఆనందంలో మునిగిపోయింది. పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని ప్రచారం సాగుతున్న తరుణంలో ఇప్పుడు అసైన్డ్ భూముల వివాదం తెరపైకి రావడం వ్యూహాత్మకమేనని ఆ వర్గం భావిస్తోంది. -
'అసైన్డ్'పై సభాసంఘం
* భూ అక్రమాలపై రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయం * భూముల దొంగలందరినీ బయటపెడదామన్న సీఎం కేసీఆర్ * సభాసంఘం ఏర్పాటుకు అన్నిపక్షాల ఏకాభిప్రాయం * విచారణ పరిధిలోకి భూదాన్, దేవాలయ, వక్ఫ్, చర్చి భూములు.. * వచ్చే సమావేశాల నాటికి సభకు నివేదిక అందించాలని గడువు * రాష్ట్రంలో 1.90 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయన్న సీఎం * వాటిని తిరిగి పేదలకే కట్టబెడతామని అసెంబ్లీలో ప్రకటన * పొన్నాలకు భూ కేటాయింపులపై సభలో దుమారం * చట్ట విరుద్ధంగా భూములు పొందారన్న మంత్రి హరీశ్ * అధికారం అండతో చట్టాన్ని చుట్టాలుగా చేసుకున్నారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల పంపిణీ, కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని రాష్ర్ట అసెంబ్లీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు సభాసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారి బుధవారం శాసనసభలో ప్రకటన చేశారు. దీనిప్రకారం రాష్ట్రం లో దళిత, గిరిజనులు సహా ఇతర వర్గాల వారికి ఇప్పటివరకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములతో పాటు పది జిల్లాల్లో అసైన్మెంట్ పరిధిలోకి వచ్చే భూదాన్, దేవాలయ, వక్ఫ్, చర్చి వంటి అన్ని రకాల భూములపై సభాసంఘం విచారణ జరపనుంది. ఇది అన్ని జిల్లాల్లో పర్యటించి భూ అక్రమాలపై నివేదికను వచ్చే సమావేశాల నాటికి సభ ముందు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. సభాసంఘం చేసే సిఫార్సులు, సూచనలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రకటించారు. నివేదిక సమర్పణకు, దాని అమలుకు నిర్దిష్ట కాలపరిమితిని మరోమారు సభలో చర్చించి నిర్ణయిద్దామన్నారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు జరిపిన 8.39 ఎకరాల భూ కేటాయింపులపై బుధవారం టీఆర్ఎస్ సభ్యుడు ఇంద్రకరణ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు సహా ఇతర సభ్యులు ఇచ్చిన సావధాన తీర్మానంపై శాసనసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా అన్ని పక్షాల నేతలు మాట్లాడారు. అన్యాకాంత్ర భూములపై సభాసంఘం వేయాలని, ఒక్క ధర్మసాగర్ భూములే కాకుండా, కబ్జాలకు గురైన అన్ని రకాల భూములను సభాసంఘం పరిధిలోకి తీసుకొచ్చి విచారణ జరపాలని గట్టిగా కోరారు. దీనిపై కాంగ్రెస్ కొన్ని అభ్యంతరాలను లేవనెత్తే ప్రయత్నం చేసినా, మిగిలిన పక్షాలన్నీ సభాసంఘం ఏర్పాటుకు అంగీకరించడంతో ఆ పార్టీ కూడా అందుకు సమ్మతించింది. అధికారంతో యథేచ్ఛగా అక్రమాలు సభ్యుల సావధాన తీర్మానంపై మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. ‘1971లో దళితులకు కేటాయించిన భూములను తర్వాతి కాలంలో పొన్నాల లక్ష్మయ్య, పొన్నాల రామ్మోహన్‌లు కబ్జా చేశారు. దీనిపై 2001లో వేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. 2002లో అప్పీల్‌కు వెళ్లగా సమయం వృథా చేశారంటూ కోర్టు చీవాట్లు పెట్టింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దళితులకు చెందిన 81.13 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి, మరో 8.39 ఎకరాల భూమిని పొన్నాల లక్ష్మయ్యకు ఏపీఐఐసీ ద్వారా కట్టబెడుతూ జీవో ఇచ్చింది. అయితే ఈ భూమిలో పరిశ్రమలను నెలకొల్పకపోవడంతో 2009 నుంచి వరుసగా నోటీసులు కూడా జారీ అయ్యాయి. పొన్నాలకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలని 2013లో ఏపీఐఐసీని ఆదేశించినా అది అమలు కాలేదు. పొన్నాలకు భూ కేటాయింపుల విషయంలోనూ ఉదారంగా వ్యవహరించారు. వరంగల్ పట్టణానికి అతి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న భూమిని ఎకరం కేవలం రూ. 25,500 చొప్పున ఇచ్చారు. ఇదీగాక ఈ భూమిని ఇవ్వడం వల్ల ఏపీఐఐసీకి చెందిన మరో మూడెకరాలకు దారి లేకుండా పోయింది. భూ కేటాయింపుల్లో అన్ని చట్టాలను ఉల్లంఘించారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుంటూ, అధికారం అండతో యథేచ్ఛగా భూ అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి ఎలాంటి శిక్ష విధించాలో కాంగ్రెస్ పార్టీనే చెప్పాలి’ అని హరీశ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. సభలో లేని వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడటాన్ని సభా నిబంధనలు ఒప్పుకోవని అన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత జానారెడ్డి సైతం అభ్యంతరం తెలిపారు. మంత్రి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిని ఎండగట్టేందుకు ఉద్దేశించినవిగా ఉన్నాయన్నారు. అయినా హరీశ్ కొనసాగిస్తూ.. ‘ఇడుపులపాయలో భూ ఆక్రమణలపై గతంలో అసెంబ్లీలో చర్చ సందర్భంగా నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి.. దళితులకు చెందిన భూములను ఎవరైనా తిరిగిచ్చేయాలన్నారు. ఆయన స్వయంగా భూములివ్వడమే కాకుండా ఆ మేర కు చట్టాన్ని కూడా తెచ్చారు. దాన్ని కూడా పొన్నాల పట్టిం చుకోలేదు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు హరీశ్ మాట్లాడుతున్నంతసేపు కాంగ్రెస్ సభ్యు లు తీవ్ర అభ్యంతరం తెలపడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు అధికారపక్షం వాదనతో పార్టీలన్నీ ఏకీభవించాయి. దళితుల భూ కబ్జాలపై వెంటనే సభా సంఘాన్ని వేయాలని, దీంతో పాటే హన్మకొండ మండలంలోని తిమ్మాపూర్‌లో కబ్జాకు గురైన 200 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని వైఎస్సార్సీపీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు కోరారు. టీడీపీ తరఫున ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీజేపీ తరఫున రాంచంద్రారావు, ఎంఐ ఎం సభ్యుడు పాషా ఖాద్రి, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తది తరులు సైతం సభాసంఘం వేయాలని డిమాం డ్ చేశారు. రాష్ట్రంలో అసైన్డ్ అక్రమాలన్నింటిపైనా విచారణ చేయాలని కోరారు. కాంగ్రెస్ తరఫున సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకునేందుకు దళితులను వాడుకోరాదని హితవు పలికారు. భూములిచ్చినా.. అభివృద్ధిలేదు.. సభాసంఘం ఏర్పాటుపై సభలో ఏకాభిప్రాయం వ్యక్తమవడంతో దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. పొన్నాలకు భూ కేటాయింపులు చట్టవిరుద్ధమని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా భూములను కట్టబెట్టిందని, అది పద్ధతి కాదని ముఖ్యమంత్రి అన్నారు. దళితులకు భూ కేటాయింపులు చేసినా అభివృద్ధి జరగలేదని, ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని పేర్కొన్నారు. ‘దళితులకు, గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూములపై రెవెన్యూ అధికారులతో సర్వే చేయిస్తే 1.90 లక్షల ఎకరాల భూమి ఆక్రమణలకు గురైందని తేలింది. ఇక్కడ ఓ వ్యక్తిని లక్ష్యం చేసుకోవడం కాదు. పొన్నాలకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని ఏపీఐఐసీకి, దాని స్థానిక జోనల్ మేనేజర్‌ను ప్రభుత్వం ఆదేశించినా అది జరగలేదు. దానిపై చర్యలు తీసుకుందాం’ అని సీఎం అన్నారు. దీంతో ప్రతిపక్ష నేత జానారెడ్డి జోక్యం చేసుకుంటూ.. అన్యాక్రాంతమైన భూముల విషయంలో సభాసంఘం వేయడం మంచిదేనని, ఇలాంటి భూములు ఎవరి అధీనంలో ఉన్నా పరిశీలించి అందరికీ న్యాయం చేయాలని సూచించారు. అయితే పొన్నాలకు భూ కేటాయింపుల విషయంలో ప్రభుత్వమే దళితుల భూమిని కొనుగోలు చేసి ఏపీఐఐసీకి ఇచ్చింద ని, భూముల కొనుగోలులో గత ప్రభుత్వం తప్పు చేసి ఉంటే ఈ ప్రభుత్వం దాన్ని సవరిం చాలని అన్నారు. దొంగలందరినీ బయటపెడదాం.. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ కొనసాగించారు. ‘అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కారాదు. భూదాన్తోపాటు లక్షల కోట్ల విలువైన వక్ఫ్ భూములు సహా అన్ని రకాల భూములను ఇందులో చేర్చి దొంగలందరినీ బయటపెడదాం. పేదల నోటికాడి భూములు కొట్టేసిన వారంతా శిక్షార్హులే. సభాసంఘం విషయంలో ఏకాభిప్రాయం ఉన్నందున అది జిల్లాలన్నీ తిరిగి అన్ని భూములపై విచారణ జరిపి వచ్చే సమావేశాల నాటికి సభ ముందు పెట్టాలి. ఆ సిఫారసుల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అసైన్డ్ భూములను ఎవరి దగ్గరి నుంచి తీసుకున్నారో తిరిగి ఆ పేదలకే భూములు దక్కేలా నిర్ణయం చేద్దామ’ని సీఎం అన్నారు. దీనిపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ గతంలో వక్ఫ్ భూముల ఆక్రమణలపై సభాసంఘం వేసినా.. దానికి నిర్దిష్ట గడువు లేకపోవ డంతో నివేదిక ఆలస్యమైందని గుర్తు చేశారు. ఈ దృష్ట్యా ప్రస్తుత సభాసంఘానికి గడువు విధించి, నిర్దిష్ట సమయంలో చర్యలు చేపట్టాలని సూచించారు. -
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్..
కేసముద్రం మార్కెట్ కార్యదర్శికి వ్యాపారుల వినతి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీల తరలింపే కారణం కేసముద్రం, న్యూస్‌లైన్ : అధికారుల అవగాహనా రాహిత్యం కారణంగా రైతులే ఇబ్బందులకు గురికావలసి వస్తోంది. ఒక పక్క కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో కాలంటాలు నిలిపివేశారు. ఇప్పటికే కొనుగులు చేసి నిల్వ ఉన్న ధాన్యాన్ని తరలిం చేందుకు ఏ ఒక్క లారీని వదలకుండా పోలీ సుల సహకారంతో వినియోగిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక మార్కెట్లో వ్యవసాయోత్పత్తుల ఎగుమతి కోసం వ్యాపారులు తెప్పించుకున్న లారీలను సైతం కొనుగోలు కేం ద్రాల వద్దకు మళ్లించారు. దీంతో ఇతర వాహనాలను వెతుక్కుని సరుకులను ఎగుమతి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాపారులు వాపోయారు. ఇప్పటికే కేసముద్రం పీఏసీఎస్ ఆధ్వర్యంలో కోమటిపల్లి, కేసముద్రంవిలేజ్, ఇనుగుర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 20 వేలకుపైగా ధాన్యం బస్తాలు, ఐకేసీ ద్వారా కల్వల, కాట్రపల్లి, అర్పనపల్లి, ఇనుగుర్తి గ్రామాల్లోని కేంద్రాల్లో సుమారు 40వేల బస్తాలు, ధన్నసరి పీఏసీఎస్ కేంద్రంలో సుమారు 20వేల బస్తాల ధాన్యం నిల్వ ఉంది. ఆ ధాన్యాన్ని తరలించడానికి నిర్వాహకులు, పోలీసు యంత్రాంగం నానా పాట్లు పడుతున్నారు. బుధవారం మార్కెట్లోని పత్తి వ్యాపారులంతా ఏకమయ్యారు. తాము తెచ్చుకున్న లారీలన్నింటినీ కొనుగోలు కేంద్రాలకు మళ్లిస్తున్నారని, గురువారం నుంచి తాము పత్తి కొనుగోళ్లు చేపట్టలేమంటూ మార్కెట్ ప్రత్యేకహోదా కార్యదర్శి శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. -
తవ్వేస్తున్నారు..
భైంసా, న్యూస్‌లైన్ : అక్రమార్కులు గుట్టలను తవ్వేస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లోని గుట్టలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రొక్లెయిన్లతో తవ్వేసి మొరంను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మొరం తవ్వకాలతో ఏర్పడిన గుంతలు, కందకాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోజురోజుకు ఈ అక్రమ తవ్వకాలు అధికమవుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు గుట్టను అక్రమంగా తవ్వేస్తున్నారు. ప్రాజెక్టు పక్క నుంచే ఉన్న ప్రధాన మార్గం అక్రమ తవ్వకాలతో ప్రమాదకరంగా మారింది. ఒకవైపు తవ్వేసిన గుంతలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గుట్ట దిగే ప్రాంతంలో మూలమలుపు వద్ద అక్రమార్కులు పూర్తిగా మొరం తవ్వేశారు. దీంతో వేగంగా వచ్చే వాహన చోదకులు మూలమలుపు వద్ద ప్రమాదాల బారిన పడుతున్నారు. పట్టణ సమీపంలోని డిగ్రీ కళాశాలకు వెళ్లే ప్రాంతంలోనూ మొరం తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. భైంసా పట్టణంలో నిర్మించే భవనాలకు ఇక్కడి నుంచే మొరం తరలిస్తున్నారు. అధికారుల కళ్లముందే ఈ తతంగం జరుగుతున్నా ఎవరు స్పందించడం లేదు. భైంసా మండలం దేగాం, వాలేగాం గ్రామాల్లోనూ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. అక్రమార్కులు రోజు వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లలో మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ముథోల్ వద్ద... భైంసా - బాసర ప్రధాన రహదారిని ఆనుకుని ముథోల్ నేత్ర వైద్యశాల, సబ్‌స్టేషన్ ప్రాంతాల్లోనూ ఈ అక్రమ దందా కొనసాగుతోంది. కొందరు కాంట్రాక్టర్లు ఎలాంటి అనుమతి పొందకుండా మొరం తరలించేస్తున్నారు. పెద్దమొత్తంలోనే ఈ వ్యవహారం సాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రమాదకరంగా కందకాలు.. అక్రమ తవ్వకాలతో నియోజకవర్గంలోని భైంసా, ముథోల్, దేగాం, వాలేగాం తదితర ప్రాంతాల్లో భారీ కందకాలు ఏర్పడుతున్నాయి. ఏటా వర్షాకాలంలో ఈ కందకాలు వరద నీటితో నిండిపోతున్నాయి. కందకాల లోతు తె లియక మూగజీవాలు దాహార్తి తీర్చుకునేందుకు వెళ్లి అందులో పడి చనిపోతున్నాయి. ప్రధాన మార్గాల్లోనే ఇలాంటి కందకాలు ఉన్నా ఎవరూ స్పందించడంలేదు. భైంసా-నాందేడ్ అంతర్రాష్ట్ర రహదారికి ఆనుకుని మాంజ్రి గుట్ట వద్ద సైతం ఇలాంటి కందకాలు ఉన్నాయి. అక్రమ తవ్వకాలతో ఏర్పడ్డ కందకాలను పూడ్చడంలోనూ అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇకనైనా అధికారులు అక్రమ తవ్వకాలు జరపకుండా చర్యలు తీసుకోవాలని, భారీ కందకాలు ఉన్న ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. ఇలా తవ్వకాలు చేపట్టకుండా అన్ని గ్రామాల రెవెన్యూ అధికారులకు అప్రమత్తం చేస్తాం. అక్రమ తవ్వకాలు చేపట్టినట్లు తేలితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా తవ్వితే సమాచారమివ్వండి.