ఇది హిందూపురం 14వ వార్డు పరిధిలోని సడ్లపల్లి పొలం సర్వేనంబర్ 433/11లోని 2.17 ఎకరాల స్థలం. దీనికి 1957 ప్రాంతంలో నల్లోడు అనే వ్యక్తి పేరిట డీ పట్టా మంజూరైంది. ఇది ప్రస్తుతం పట్టణంలో కలిసిపోయింది. ప్రస్తుతం అక్కడ సెంటు రూ.10 లక్షలకు పైగా పలుకుతోంది. 2012లో ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నేతలు... పత్రాలు పుట్టించారు. ప్లాట్లుగా వేసి సెంటు రూ.6 లక్షల చొప్పున 58 మందికి విక్రయించారు. కానీ నల్లోడు వంశీయులు తాతల కాలం నాటి తమ భూమికి అక్రమ పట్టా పుట్టించి అమ్ముకుని తమకు అన్యాయం చేశారని న్యాయపోరాటం చేస్తున్నారు.
చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది?
హిందూపురం(శ్రీసత్యసాయి జిల్లా): భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం డీ–ఫారం పట్టా మంజూరు చేస్తుంది. పట్టా పొందిన వ్యక్తి, ఆ తర్వాత వారి వంశీయులు సదరు భూమిని సాగు చేసుకుని జీవనం సాగించవచ్చు. అంతేకానీ ఇతరులకు విక్రయించే వీలు లేదు. ఈ విషయాన్ని 1977 పీఓటీ యాక్ట్ స్పష్టంగా చెబుతోంది. కానీ హిందూపురంలో డీ–ఫారం పట్టా ఉన్న 2.17 ఎకరాల భూమి తెలుగు తమ్ముళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కనీసం డీ–ఫారం పట్టా పొందిన వ్యక్తి వంశీయులకు కూడా తెలియకుండానే ఆ స్థలం ప్లాట్లుగా మారి ‘తమ్ముళ్ల’కు రూ. కోట్లు కురిపించింది.
కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించి..
సడ్లపల్లి పొలం సర్వేనంబర్ 433/1లోని 26.84 ఎకరాలను 1957లో ప్రభుత్వం లేబర్ యూనియన్ అధ్యక్షుడు కదిరప్ప పేరిట డీ–ఫారం పట్టా ఇచ్చింది. అతను సంఘంలోని సభ్యులకు ఎకరా, రెండెకరాల చొప్పున కేటాయించి పట్టాలిప్పించాడు. ఈ క్రమంలో 433/11లో 2.17 ఎకరాల భూమిని దళితుడైన నల్లోడు పేరిట ప్రభుత్వం డీ–ఫారం పట్టా మంజూరు చేసింది. ఈ భూమిని 2012లో నల్లోడు వంశీయులైన కొల్లప్ప, పెద్దసింహప్ప, చిన్న నరసింహప్ప నుంచి తాము కొనుగోలు చేసినట్లు కృష్ణయ్య, కాంతమ్మ మరికొందరు పత్రాలు సృష్టించుకున్నారు. ఆ తర్వాత కృష్ణయ్య 2012లో టీడీపీ నాయకులు మంగేష్, పురుషోత్తంరెడ్డికి విక్రయించారు. రూ.కోట్లు పలికే భూమిని కన్వర్షన్ చేయకుండానే టీడీపీ నాయకుడు మంగేష్ ప్లాట్లు వేసి విక్రయాలు సాగించేశారు. సెంటు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల చొప్పున 58 ప్లాట్లు విక్రయించారు.
అసైన్డ్ ల్యాండ్ స్వాధీన ప్రక్రియలో భాగంగా బోర్డు పాతుతున్న రెవెన్యూ సిబ్బంది
న్యాయం కోసం పోరాటం..
వాస్తవానికి ఆ భూమి పొందిన నల్లోడు అవివాహితుడు. అతను తన అన్న న్యాతప్పతో కలిసి ఉండేవాడు. అతని తదనంతరం ఈ భూమి వారసత్వంగా న్యాతప్ప కుమారులైన కొల్లప్ప తదితరులకు చెందాల్సి ఉంది. కానీ కొల్లప్పతో పాటు అతని అన్నదమ్ములు మృతి చెందిన తర్వాత వారి నుంచి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులు పత్రాలు సృష్టించారు. దీనిపై కొల్లప్ప కుమారుడు సూరి అ«ధికారులకు ఫిర్యాదు చేశారు. తమ భూమికి కృష్ణయ్య, కాంతమ్మ, రమేష్ మరికొందరు పేరుతో పత్రాలు సృష్టించి టీడీపీ నాయకులు మంగేష్, పురుషోత్తంరెడ్డి పేరిట రిజిస్టర్ చేసుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయ పోరాటం చేస్తున్నారు.
మా భూమిని లాక్కున్నారు
మా ముత్తాత కాలం నుంచి హక్కుగా వస్తున్న 2.17 ఎకరాల భూమిని టీడీపీ నేతలు కబ్జా చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించుకుని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. న్యాయం చేయాలని 2013 సంవత్సరం నుంచీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ అప్పటి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కబ్జా దారులు దర్జాగా లేఅవుట్‌వేసి స్థలాలు అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా మాకు న్యాయంచేసి ఆ భూమిని మా కుటుంబసభ్యులకు అప్పగించాలి.
– సూరి, కొల్లప్ప కుమారుడు, హిందూపురం
స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం
సర్వేనంబర్ 433/11లోని 2.17 ఎకరాలను అసైన్డ్‌ల్యాండ్‌గా గుర్తించాం. సాగుచేసుకుని జీవనం సాగించేందుకు గతంలో నల్లోడు అనే వ్యక్తికి డీపట్టా మంజూరైంది. ఆ తర్వాత వారి వంశీయులు ఎవరూ భూమిని సాగు చేయలేదు. ప్రస్తుతం పట్టణ నడిబొడ్డున ఉన్న ఆ స్థలానికి విలువ పెరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంబంధిత వారికి రీజెండర్ నోటీసులు జారీ చేసి స్థలాన్ని స్వాదీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించాం. ఆ స్థలంలో ఎవరూ ప్రవేశించడానికి వీలులేదని బోర్డు నాటించాం.
– శ్రీనివాసులు, తహసీల్దార్, హిందూపురం
Comments
Please login to add a commentAdd a comment