ఓడీ చెరువు/నల్లమాడ(శ్రీసత్యసాయి జిల్లా): పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడీ చెరువు, నల్లమాడ మండలాలకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు ఫోన్‌లో బండబూతులు తిట్టుకున్న ఆడియో శనివారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ విషయం నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో టీడీపీలో వర్గవిభేదాలు తార స్థాయిలో ఉన్నట్లు మరోసారి రుజువైంది. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీలో మరో నాయకుడు సైకం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏకు బంపర్ ఆఫర్
ఈ నేపథ్యంలో ఓడీ చెరువు మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సైకం శ్రీనివాసరెడ్డికి దగ్గరై అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. శనివారం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మహానాడుకు ఇరువర్గాలకు చెందిన నాయకులు తరలివెళ్లారు. ఈ క్రమంలో నల్లమాడకు చెందిన పల్లె అనుచరుడు ఓడీ చెరువుకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడతూ ‘పల్లె భిక్షతో ప్రజాప్రతినిధి అయ్యావు.
ఆనాడు పల్లె రెడ్డి సామాజిక వర్గాన్ని కాదని మైనార్టీ వర్గానికి చెందిన నీకు పదవి ఇచ్చాడు. ఆ పదవిని అడ్డుపెట్టుకుని మండలంలో కార్పొరేషన్ రుణాల్లో భారీగా దండుకున్నావు’ అంటూ రాయలేని భాషలో బండబూతులు తిట్టిన ఆడియో వైరల్ అయ్యింది. పల్లెకు వ్యతిరేకంగా పని చేస్తూ పార్టీని బ్రష్టు పట్టిస్తున్నావంటూ ఆక్రోశం వెళ్లకక్కాడు. తీవ్రస్థాయిలో తిట్లు దండకంతో ఒకరినొకరు ఎత్తుపోసుకున్నారు. ఈ ఆడియో విన్న పలువురు టీడీపీలో వర్గవిభేదాలు తార స్థాయికి చేరాయని చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment