బుద్వేల్ ల్యాండ్స్ కేసులో శివానందరెడ్డి కుట్ర
అసైనీలను భయపెట్టి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా భూములు కొట్టేయాలని పన్నాగం
10న విచారణకు రావాల్సిందిగా సీసీఎస్ నోటీసులు
ఆయనతో పాటు మరో నిందితుడు ఆరోగ్యం రెడ్డికీ ఇచ్చాం
నగర సీసీఎస్ డీసీపీ ఎన్.శ్వేత వెల్లడి
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల భూమి అసైన్డ్ ల్యాండ్ అని తెలిసే తెలుగుదేశం పార్టీ నేత, వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చిందని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీ ఎన్.శ్వేత శుక్రవారం తెలిపారు. ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్క్‌తో పాటు మరో నిందితుడిని విచారించిన నేపథ్యంలో ఇవి వెలుగులోకి వచ్చాయని వివరించారు. దీంతో సీసీఎస్ పోలీసులు న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ శివానందరెడ్డితో పాటు మరో నిందితుడు ఆరోగ్యం రెడ్డికి ఈనెల 10న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించడం కోసం కేసు దర్యాçప్తు చేస్తున్నామని శ్వేత వివరించారు. ఈ మేరకు ఆమె ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.
పలుకుబడితో పరిష్కరిస్తానని చెప్పి..
తొలుత అసైనీల నుంచి భూమిని చేజిక్కించుకోవాలని చూసిన రియల్టర్లు టీజే ప్రకాష్, గాంధీ, రామారావు 2021లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్ ద్వారా మాజీ పోలీసు అధికారి, వెస్సెల్లా గ్రూపు సీఈఓ మాండ్ర శివానందరెడ్డిని సంప్రదించారు. బుద్వేల్ భూమి పూర్వాపరాలు తెలిసిన ఆయన తన పరిచయాలు, పలుకుబడి వినియోగించి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. చివరికి ఆ 26 ఎకరాల భూమి తానే తీసుకుంటానని, చదరపు గజానికి రూ.12 వేల చొప్పున (మార్కెట్ కంటే తక్కువ ధర) ఇస్తానని ఎర వేశాడు. 2021–22 మధ్య కాలంలో అసైనీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెక్కుల రూపంలో చెల్లించారు. ఆ అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం శివానందరెడ్డి తదితరులు 2022–23 మధ్య కాలంలో వివిధ స్థాయిల్లో లాబీయింగ్ చేశారు.
దీని ఫలితంగా అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు ఓ సాధారణ మెమో జారీ అయింది. దీంతో గత ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. వీటి ఆధారంగా వీళ్లు ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్‌ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీస్‌లకు చెందిన శివానందరెడ్డి, ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కినిష్కలతో పాటు ప్రశాంత్‌రెడ్డికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా శివానందరెడ్డి తదితరులు అసైనీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి, ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములను లాక్కోవడానికి కుట్ర పన్నారు.
పోలీసులను నెట్టేసి పరారు
ఈ కేసుల విచారణ కోసం సీసీఎస్ పోలీసులు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులోని శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన వీళ్లను తోసేసి పారిపోయిన ఉదంతంపై బ్రాహ్మణ కొట్కూరు ఠాణాలో కేసు నమోదైంది. మాండ్ర కనిష్క, మాండ్ర ఉమాదేవి, పైరెడ్డి ప్రశాంత్‌రెడ్డికి సీసీఎస్ పోలీసులు గత మంగళవారం నోటీసులు జారీ చేశారు. దీంతో వీళ్లు శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వీళ్లు భూమి కొనుగోలుతో పాటు కంపెనీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవహారాలను శివానందరెడ్డి చూసుకుంటున్నారని బయటపెట్టారు. బుద్వేల్‌లోని భూమి స్వభావంపై తమకు అవగాహన ఉందని కూడా అంగీకరించారు. ఈ భూములపై అప్పటికే ఎంవోయూలు ఉన్నాయని తెలిసినా, భారీ ప్రయోజనాలను పొందే ప్రణాళికతో భూములను కొనుగోలు చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. శివానందరెడ్డి ఆదేశాల మేరకు వారికి నగదు, చెక్కులు అందించారని బయటపెట్టారు. కన్వేయన్స్ డీడ్ అమలు చేసిన రోజునే వారి నుంచి తమ పేర్లపై భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని పోలీసులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment