sivananda reddy
-
రోడ్డు స్వరూపం మార్చేశారు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ శివార్లలోని బుద్వేల్‌లో దళితులకు చెందాల్సిన 26 ఎకరాల భూమి కబ్జా చేశారనే కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన కొత్తగా వేస్తున్న వెంచర్ కోసం గతంలో నిర్మించిన విల్లాల్లోని ప్రైవేటు రోడ్డు పబ్లిక్ రోడ్డుగా స్వరూపం మార్చేశారు. అలాగే ఓ నాలాపై అనుమతుల్లేకుండానే వంతెన నిర్మించారు. ఈ అక్రమాలపై రామ్దేవ్గూడలోని వెస్సెల్లా మెడోస్ నివాసితులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదై దర్యాప్తు మొదలవడంతో దిగివచ్చిన శివానందరెడ్డి... తన తప్పులు సరిదిద్దుకొనేలా జీహెచ్ఎంసీకి మరో దరఖాస్తు చేశారు. ఈ వ్యవహారం మొత్తంలో అధికారుల ఉదాశీనత, శివానందరెడ్డి లాబీయింగ్ స్పష్టంగా కనిపిస్తోందని వెస్సెల్లా మెడోస్ నివాసితులు చెబుతున్నారు. కొత్త వెంచర్‌కు రోడ్డు లేక... మాండ్ర శివానందరెడ్డి సీఈఓగా ఉన్న వెస్సెల్లా గ్రూప్ రామ్‌దేవ్‌గూడ ప్రధాన మార్గంలో తారామతి–బారాదరి ఎదురుగా 38 ఎకరాల్లో వెస్సల్లా మెడోస్ పేరుతో 295 త్రీ, ఫోర్, ఫైవ్ బీహెచ్‌కే విల్లాలు నిర్మించడానికి 2017లో జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకుంది. అప్పట్లో ఈ విల్లాస్ లోపల రెండు అంతర్గత ప్రైవేటురోడ్లు ఉండేలా రూపొందించిన ప్లాన్‌కే అధికారులు అనుమతి ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం వెస్సెల్లా గ్రూప్ పాత వెంచర్‌కు వెనుక వైపు నాలా పక్కన మరో 9 ఎకరాల్లో మరో వెంచర్ మొదలుపెట్టింది. ప్రధాన రహదారి నుంచి ఈ వెంచర్‌కు చేరుకోవాలంటే సమీప మార్గం లేదు. ఈ నేపథ్యంలోనే శివానందరెడ్డి మరో కుట్రకు తెరలేపారు. వెస్సెల్లా మెడోస్‌లో ఉన్న రెండు ప్రైవేట్ రహదారుల్లో ఒకదాన్ని పబ్లిక్ రోడ్డుగా అక్రమంగా మార్చేశారు. ఈ మేరకు రివైజ్డ్ ప్లాన్‌తో 2022లో జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని అధికారులు ఆమోదించడంతో వెస్సెల్లా మెడోస్‌లోని ప్రైవేట్ రోడ్డు పబ్లిక్ రోడ్డుగా మారిపోయి వెనుక ఉన్న 9 ఎకరాల వెంచర్‌ను ప్రధాన రహదారికి దగ్గర చేసింది. ఈ రెండు వెంచర్ల మధ్య ఓ నాలా ఉండటంతో ఇరిగేషన్ విభాగం సహా ఎవరి అనుమతి లేకుండానే ఆయన దానిపై వంతెన నిర్మించారు. బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి.. వెస్సెల్లా మెడోస్ శాంక్షన్డ్ ప్లాన్‌కు విరుద్ధంగా తమ ప్రైవేటు రోడ్డును పబ్లిక్ రోడ్డుగా శివానందరెడ్డి మార్చేసినట్లు నివాసితులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలిసింది. దీంతో 6 విల్లాలకు చెందిన యజమానులు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఐపీసీలోని 420, 406 సెక్షన్ల కింద అదే నెల 8న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు నమోదు కాకుండా చూసేందుకు శతవిధాలా శివానందరెడ్డి ప్రయత్నించినప్పటికీ ఉన్నతాధికారుల జోక్యంతో కేసు నమోదై దర్యాప్తు ప్రారంభం కావడంతో ఆయన హైకోర్డును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ వేశారు. తనపై కేసు కొట్టేయాల్సిందిగా కోరారు. దీనికి అంగీకరించని న్యాయస్థానం... నిందితులకు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించి కేసు దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది. దీంతో గత్యంతరం లేక శివానందరెడ్డి వెస్సెల్లా మెడోస్కు సంబంధించి తాను సమర్పించిన రివైజ్డ్ ప్లాన్‌ను రద్దు చేయాలంటూ జీహెచ్ఎంసీకి మరో దరఖాస్తు సమర్పించినట్లు తెలిసింది. కాగా, జీహెచ్ఎంసీ అధికారులను మోసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఈ కేసులో శివానందరెడ్డిపై పోలీసులు అదనపు సెక్షన్లు జోడించాలని వెస్సెల్లా మెడోస్ నివాసితుడు ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ కోరారు. -
అసైన్డ్ అని తెలిసే ఆ భూమిని కొన్నారు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల భూమి అసైన్డ్ ల్యాండ్ అని తెలిసే తెలుగుదేశం పార్టీ నేత, వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చిందని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీ ఎన్.శ్వేత శుక్రవారం తెలిపారు. ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్క్‌తో పాటు మరో నిందితుడిని విచారించిన నేపథ్యంలో ఇవి వెలుగులోకి వచ్చాయని వివరించారు. దీంతో సీసీఎస్ పోలీసులు న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ శివానందరెడ్డితో పాటు మరో నిందితుడు ఆరోగ్యం రెడ్డికి ఈనెల 10న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించడం కోసం కేసు దర్యాçప్తు చేస్తున్నామని శ్వేత వివరించారు. ఈ మేరకు ఆమె ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. పలుకుబడితో పరిష్కరిస్తానని చెప్పి.. తొలుత అసైనీల నుంచి భూమిని చేజిక్కించుకోవాలని చూసిన రియల్టర్లు టీజే ప్రకాష్, గాంధీ, రామారావు 2021లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్ ద్వారా మాజీ పోలీసు అధికారి, వెస్సెల్లా గ్రూపు సీఈఓ మాండ్ర శివానందరెడ్డిని సంప్రదించారు. బుద్వేల్ భూమి పూర్వాపరాలు తెలిసిన ఆయన తన పరిచయాలు, పలుకుబడి వినియోగించి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. చివరికి ఆ 26 ఎకరాల భూమి తానే తీసుకుంటానని, చదరపు గజానికి రూ.12 వేల చొప్పున (మార్కెట్ కంటే తక్కువ ధర) ఇస్తానని ఎర వేశాడు. 2021–22 మధ్య కాలంలో అసైనీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెక్కుల రూపంలో చెల్లించారు. ఆ అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం శివానందరెడ్డి తదితరులు 2022–23 మధ్య కాలంలో వివిధ స్థాయిల్లో లాబీయింగ్ చేశారు. దీని ఫలితంగా అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు ఓ సాధారణ మెమో జారీ అయింది. దీంతో గత ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. వీటి ఆధారంగా వీళ్లు ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీస్‌లకు చెందిన శివానందరెడ్డి, ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కినిష్కలతో పాటు ప్రశాంత్‌రెడ్డికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా శివానందరెడ్డి తదితరులు అసైనీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి, ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములను లాక్కోవడానికి కుట్ర పన్నారు. పోలీసులను నెట్టేసి పరారు ఈ కేసుల విచారణ కోసం సీసీఎస్ పోలీసులు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులోని శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన వీళ్లను తోసేసి పారిపోయిన ఉదంతంపై బ్రాహ్మణ కొట్కూరు ఠాణాలో కేసు నమోదైంది. మాండ్ర కనిష్క, మాండ్ర ఉమాదేవి, పైరెడ్డి ప్రశాంత్‌రెడ్డికి సీసీఎస్ పోలీసులు గత మంగళవారం నోటీసులు జారీ చేశారు. దీంతో వీళ్లు శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వీళ్లు భూమి కొనుగోలుతో పాటు కంపెనీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవహారాలను శివానందరెడ్డి చూసుకుంటున్నారని బయటపెట్టారు. బుద్వేల్లోని భూమి స్వభావంపై తమకు అవగాహన ఉందని కూడా అంగీకరించారు. ఈ భూములపై అప్పటికే ఎంవోయూలు ఉన్నాయని తెలిసినా, భారీ ప్రయోజనాలను పొందే ప్రణాళికతో భూములను కొనుగోలు చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. శివానందరెడ్డి ఆదేశాల మేరకు వారికి నగదు, చెక్కులు అందించారని బయటపెట్టారు. కన్వేయన్స్ డీడ్ అమలు చేసిన రోజునే వారి నుంచి తమ పేర్లపై భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని పోలీసులకు తెలిపారు. -
బుద్వేల్ భూమి కోసం భారీ లాబీయింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల భూమిని కాజేయడానికి వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి లాబీయింగ్ చేసినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీ ఎన్.శ్వేత బుధవారం తెలిపారు. దాని ఫలితంగానే అప్పట్లో ఎమ్మార్వోకు సాధారణ మెమో జారీ అయిందని, దీని ద్వారానే ఆ భూముల కన్వర్షన్ జరిగిందని వివరించారు. తన అనుచరులతో కలిసి శివానందరెడ్డి చేసిన కుట్ర, అసైన్డ్ భూములు ఖరీదు చేయడం వంటి ఆరోపణలపై సీసీఎస్‌లో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీటిపై విచారించేందుకు సోమవారం అల్లూరు వెళ్లగా... శివానందరెడ్డి పారిపోయారని డీసీపీ వివరించారు. ఈ కేసులు, వాటి పూర్వాపరాలపై బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రియల్టర్ల కన్ను..అసైనీలకు దగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1994లో బుద్వేల్లోని సర్వే నం.282 నుంచి 299 వరకు ఉన్న 281 ఎకరాల భూములను 66 మందికి అసైన్ చేసింది. వీరికి రాజేంద్రనగర్ మండల అధికారులు అసైనీ పాస్ పుస్తకాలను సైతం జారీ చేశారు. ఆ తర్వాత మరో 82 మంది అక్కడ మిగిలి ఉన్న భూమిని ఆక్రమించారు. 2000లో అసైనీలు తమ భూములను ఎస్కే డెవలపర్స్ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో రెవెన్యూ అధికారులు అసైన్మెంట్ పట్టాలు రద్దు చేశారు. చేవెళ్ల ఆర్డీఓ ఆ భూమిని నిబంధనల ప్రకారం హెచ్ఎండీఏ, పర్యాటక శాఖలకు అప్పగించారు. దీన్ని సవాల్ చేస్తూ అసైనీలు గుంటి నర్సింçహులు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి కేసు పరిష్కరించాలంటూ చేవెళ్ల ఆర్డీఓను కోర్టు ఆదేశించింది. దీంతో అసైనీలు ఆర్డీఓకు వివరణ ఇచ్చినా.. దాన్ని ఆయన తిరస్కరించారు. ఆర్డీఓ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2002లో అసైనీలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. అదే భూమిని అభివృద్ధి చేసి, తమకు ప్లాట్లు ఇవ్వాలంటూ అసైనీలు ప్రభుత్వానికి విన్నవించారు. దీనిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే దీన్ని క్యాష్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు టీజే ప్రకాష్, కోనేరు గాం«దీ, దశరథ రామారావు రంగంలోకి దిగారు. అసైనీలతో పాటు ఇతరులను సంప్రదించారు. అసైనీలకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేలా తాము ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకులను మ్యానేజ్ చేస్తా మని నమ్మబలికారు. ఇది నమ్మిన అసైనీలు వీరితో అగ్రిమెంట్లు, ఎంఓయూలు చేసుకున్నారు. వాటిని చూపించిన ఈ ముగ్గురూ ఆ స్థలం అమ్ముతామంటూ కొందరి నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రకా‹Ù, గాం«దీ, రామారావు 2021లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్‌ను సంప్రదించి అసైనీలు ప్లాట్లు పొందేలా సహకరించాలని కోరారు. ఇతడి ద్వారానే టీజే ప్రకాష్ మాజీ పోలీసు అధికారి, వెస్సెల్లా గ్రూపు సీఈఓ మాండ్ర శివానందరెడ్డిని సంప్రదించారు. రియల్టర్లకు శివానందరెడ్డి ఎర బుద్వేల్ భూమి పూర్వాపరాలు తెలిసిన ఆయన తన çపలుకుబడి వినియోగించి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. ఆ 26 ఎకరాల భూమి తానే తీసుకుంటానని, చదరపు గజానికి రూ.12 వేల చొప్పున ఇస్తానని ఎర వేశాడు. 2021–22 మధ్య కాలంలో అసైనీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెక్కుల రూపంలో చెల్లించారు. కన్వర్షన్ కోసం ముమ్మర యత్నం అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం శివానందరెడ్డి తదితరులు 2022–23 మధ్య కాలంలో లాబీయింగ్ చేశారు. దీని ఫలితంగా అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు ఓ సాధారణ మెమో జారీ అయింది. దీంతో గతేడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. వీటి ఆధారంగా అసైనీలు, ఆక్రమణదారులు ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీలకు చెందిన శివానందరెడ్డి, ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కినిష్కలతో పాటు ప్రశాంత్‌రెడ్డిలకు రిజి్రస్టేషన్ చేశారు. ఇలా శివానందరెడ్డి తదితరులు అసైనీలను భయపెట్టి, ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములు లాక్కోవడానికి కుట్ర పన్నారు. -
పోలీసు భూమిపై మాజీ పోలీస్ భార్య కన్ను
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ ల్యాండ్స్ స్కామ్, ప్రీలాంచ్ ఆఫర్స్ పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల నుంచి తప్పించుకుపోయిన ఏపీలోని నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి భార్య ఉమాదేవిపై మరో కేసు కూడా ఉంది. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ విభాగం గ్రేహౌండ్స్‌కు చెందిన భూమిపై ఆమె కన్నేశారు. తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి కాజేయడానికి కుట్ర పన్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు నిందితులపై సప్లిమెంటరీ చార్జ్‌షిట్ ఫైల్ చేశారు. శివానందరెడ్డికి సంబంధించిన తాజా ఎపిసోడ్ నేపథ్యంలో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో త్వరలో పూర్తిస్థాయి అభియోగ పత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉన్న ఆ భూమి మార్కెట్ విలువ రూ.2,500 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. తాజా కేసులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య ఉమాదేవి కూడా నిందితురాలిగా ఉన్న విషయం విదితమే. 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 393/1 నుంచి 392/20 వరకు ఉన్న భూమిని గ్రేహౌండ్స్‌కు కేటాయించింది. మొత్తం 142 ఎకరాల 39 కుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి అప్పటి నుంచి గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉంది. అ స్టే ఉత్తర్వులు ఉన్నా.. కాగా.. ఈ భూమిని 1961లో ప్రభుత్వం తమకు కేటాయించిందంటూ 20 మంది అసైనీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయస్థానం విధించిన స్టేటస్ కో (యధాత«థ స్థితి) ఉత్తర్వులు కొనసాగుతున్నాయి. ఓ దశలో ఈ వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆ న్యాయస్థానం స్పష్టం చేయడంతో స్టేటస్ కో కొనసాగుతోంది. ఈ వివాదాల నేపథ్యంలో ఉమాదేవి తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి రంగంలోకి దిగారు. యూ అండ్ ఏ పేరుతో ఉన్న కంపెనీ ముసుగులో కథ నడిపారు. ఆ భూమికి సంబంధించిన అసైనీల వారసుల పేరుతో కొందరి నుంచి తమ కంపెనీ పేరుతో ఒప్పందాలు చేసుకున్నారు. ఎకరం రూ.4 కోట్లకు బేరమాడుకుని, రూ.8 లక్షల చొప్పున అడ్వాన్స్ చెల్లిస్తూ అనేక మంది వారసులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ భూములపై హక్కు పొందేందుకు తమవేనంటూ జీపీఓ కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సర్కారు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో రాజేంద్రనగర్ రెవెన్యూ అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమాదేవి, ఆరోగ్యరెడ్డి తదితరులు గ్రేహౌండ్స్ స్థలం కాజేయడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు ఐపీసీ 406, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం జరిగినట్టు నిర్ధారణ కావడంతో ఉమాదేవి, ఆరోగ్యరెడ్డితో పాటు అసైనీ వారసులుగా చెప్పుకుని ఒప్పందాలు చేసుకున్న 60 మందికి సీసీఎస్ పోలీసులు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు తుది దశకు చేరిన నేపథ్యంలో ఉమాదేవి సహా మరికొందరిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలోనూ తెరవెనుక శివానందరెడ్డి పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భూ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఆ భూమి ప్రభుత్వానిదే అని, సర్కారే గ్రేహౌండ్స్‌కు కేటాయించడంతో ప్రస్తుతం ఆ విభాగానికి చెందినదే అంటూ తీర్పు కూడా ఇచ్చింది. అరెస్టులు వద్దు మరోవైపు బుద్వేల్ అస్సైన్డ్ భూముల కబ్జా కేసులో తదుపరి విచారణ వరకు నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ ఎస్పీ శివానందరెడ్డి, అతని భార్య ఉమాదేవి, కుమారుడు కని‹Ù్కలను అరెస్టు చేయవద్దని సీసీఎస్ పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో 26 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించారన్న ఆరోపణలపై శివానందరెడ్డితోపాటు ఉమాదేవి, కనిష్క్(నిందితులు)లపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి 8వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. -
పరారీలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి
సాక్షి, నంద్యాల/సాక్షి, హైదరాబాద్: టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డిని ఓ భూ వివాదం కేసులో అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించారు. ఆయన వారి కళ్లుగప్పి పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన భార్యను, కుమారుడిని హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసైన్డ్ భూముల కొనుగోలు పంచాయితీకి సంబంధించి భాగస్వాముల వివాదాలతో హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్)లో కేసులు నమోదయ్యాయి. వీటిని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మాజీ పోలీసు అధికారి అయిన శివానందరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం, వాటిలో నిర్మాణాల పేరుతో ప్రీలాంచ్ ఆఫర్లు ఇచ్చి అడ్వాన్సులు వసూలు చేయడం వంటి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం నంద్యాల జిల్లా అల్లూరు గ్రామంలో ఆయన ఇంటికి వచ్చారు. భూ కబ్జాకు సంబంధించిన కేసులో విచారణకు సహకరించాలని ఆయన్ని కోరారు. నోటీసులు ఇవ్వకుండా తాను సహకరించనని మాండ్ర చెప్పారు. దీంతో పోలీసులు నోటీసులను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు శివానందరెడ్డి ఇంటికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే శివానందరెడ్డి పోలీసుల కళ్లుగప్పి కారులో పరారయ్యారు. ఆయన్ని వెంబడించేందుకు ప్రయత్నించిన పోలీసుల్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు బయటికి వెళ్లకుండా ఆయన అనుచరులు గేట్లు మూసేశారు. దీంతో మాండ్ర తప్పించుకుని పారిపోయారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న సీసీఎస్ పోలీసులు నగరంలోని తారామతి బారాదారి వద్ద ఉన్న వెస్సెల్లా మెడోస్‌లోని శివానందరెడ్డి ఇంటిపై దాడిచేశారు. ఆయన భార్య ఉమాదేవిని, కుమారుడు కనిష్్కరెడ్డిని, ప్రశాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. పరారీలో ఉన్న శివానందరెడ్డి కోసం పోలీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలోను ముమ్మరంగా గాలిస్తున్నారు. శివానందరెడ్డి తమ విధులకు ఆటంకం కలిగించి పరారయ్యారని సీసీఎస్ పోలీసులు బ్రాహ్మణకొట్కూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శివానందరెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాను భూ కబ్జాలకు పాల్పడలేదని, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇస్తే విచారణకు సహకరిస్తానని అందులో పేర్కొన్నారు. బుద్వేల్లోని అసైన్డ్ భూములు కేంద్రంగా.. సీఐడీలో సైబర్ క్రైమ్ ఎస్పీగా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న శివానందరెడ్డి 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల ఎంపీ అభ్యరి్థగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న ఆయన హైదరాబాద్ బుద్వేల్లోని అసైన్డ్ భూములు కేంద్రంగా పాల్పడిన నేరం బయటపడింది. రాజేంద్రనగర్ శివారులో ఉన్న ఈ ప్రాంతంలోని 282, 283, 284, 289 సర్వే నంబర్లలో 480 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని 1986లో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్‌గా ప్రకటిస్తూ దళితులకు పంపిణీ చేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో 1997లో అప్పటి ప్రభుత్వం ఈ భూముల్ని వెనక్కి తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ అసైనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అక్కడున్న అసైనీలతోపాటు అప్పటికే ఆ స్థలాల్లో ఉంటున్న వారికీ న్యాయం చేయాలని ఆదేశాలొచ్చాయి. 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఒక్కో అసైనీకి 800 చదరపు గజాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వారికి విక్రయించే హక్కుల్ని మాత్రం ఇవ్వలేదు. దీంతో అసైనీలు విక్రయహక్కుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మీద ఒక్కో అసైనీకి 800 చదరపు గజాల చొప్పున 66 మందికి, ఆ స్థలంలో ఉంటున్న ఒక్కొక్కరికి 400 చదరపు గజాల చొప్పున 82 మందికి ఇచ్చే ప్రయత్నాలు జరిగాయి. భాగస్వాముల విభేదాలతో.. ఈ నేపథ్యంలో ఈ భూముల కోసం టి.జె.ప్రకాష్, కోనేరు గాంధీ, ఎస్.దశరథరామారావు రంగంలోకి దిగారు. అసైనీలుగా ఉన్న గుంటి నర్సింహులు తదితరులతో 69,200 చదరపు గజాల స్థలంపై అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) చేసుకున్నారు. వీరికి చెల్లింపులు చేయడానికి గూడూరు కృష్ణ, రవి రాంబాబు, ఎంసీహెచ్ రాఘవరావు తదితరుల నుంచి 2014, 2018ల్లో పెట్టుబడులు తీసుకున్నారు. ఆ సందర్భాల్లో సర్వే నంబర్లు 282, 289ల్లో ఉన్న స్థలం నుంచి కొంతభాగం వీరికి ఇచ్చేలా, అది అసైన్డ్ భూమి కావడంతో గరిష్టంగా ఆరునెలల్లో ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందేలా ఒప్పందాలు చేసుకున్నారు. 2022 నాటికీ ఈ తంతు పూర్తిగాకపోవడంతో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో గూడూరు కృష్ణ, రవి రాంబాబు, ఎంసీహెచ్ రాఘవరావు తదితరులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో 2022 అక్టోబర్ 18న ప్రకాష్, గాం«దీ, దశరథ్‌లపై నాలుగు కేసులు నమోదయ్యాయి వీటి దర్యాప్తులో ఆయన పాత్ర వెలుగులోకి.. ఈ నాలుగు కేసుల దర్యాప్తులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ పాత్ర వెలుగులోకి వచి్చంది. 2015–16లో రంగంలోకి దిగిన శివానందరెడ్డి తాను బయటకు రాకుండా టి.జె.ప్రకాష్, కోనేరు గాందీ, ఎస్.దశరథరామారావులను ముందుపెట్టి కథ నడిపారు. ఆ భూముల్ని తన కంపెనీ పేరుతో రాయించుకోవడంతోపాటు రాత్రికిరాత్రే అనుమతి జీవోలు తెప్పించుకున్నారని వెలుగులోకి వచ్చింది. పట్టాలు కూడా అసైనీలకు ఇవ్వకుండా, లేఔట్ కూడా వేయకుండా వారిని భయపెట్టి రిజి్రస్టేషన్లు కూడా పూర్తిచేసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. గజం కనిష్టంగా రూ.12 వేల నుంచి రూ.15 వేలకు సొంతం చేసుకున్నట్లు బయటపడింది. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో కేసులు మరో మలుపు తిరిగాయి. ఈ వ్యవహారంలో అప్పటి కొందరు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. జనవరిలో కోర్టు అనుమతితో సీసీఎస్ పోలీసులు శివానందరెడ్డికి చెందిన వెస్సెల్లా గ్రూప్ కార్యాలయాల్లోను, ఆయన ఇంట్లోను సోదాలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నారు. మొత్తం 26 ఎకరాల అసైన్డ్ భూముల్ని చేజిక్కించుకున్న శివానందరెడ్డి.. వెస్సెల్లా గ్రూప్ పేరిట 400 చదరపు గజాలు (5 వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా), 800 చదరపు గజాల (10 వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా) విస్తీర్ణంలో లగ్జరీ విల్లాలు నిర్మిస్తామని ప్రచారం చేయడమేగాక ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో చదరపు అడుగుకి రూ.10 వేల చొప్పున అనేకమంది నుంచి అడ్వాన్సులు సైతం వసూలు చేశారని ఈ డాక్యుమెంట్ల ఆధారంగా గుర్తించారు. -
నయీం పేరు కూడా వినలేదు: రిటైర్డ్ ఎస్పీ
తాను అసలు నయీం పేరు కూడా విన్నట్లు గుర్తులేదని రిటైర్డ్ పోలీసు అధికారి శివానందరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండలో తాను అతి తక్కువ కాలం మాత్రమే ఏఎస్పీగా పనిచేశానని, అది కూడా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కావడంతో శాంతిభద్రతల గురించి, తీవ్రవాదుల కార్యకలాపాల గురించి తనకు పెద్దగా తెలియదని ఆయన అన్నారు. 2003 వరకు తాను నల్లగొండ జిల్లాలో ఉన్నానని, అప్పటికి అతడిపేరు కూడా పెద్దగా ప్రచారంలోకి రాలేదని తెలిపారు. తాను సజ్జనార్, శివధర్‌రెడ్డి లాంటి అధికారుల వద్ద పనిచేశానని, వాళ్లు చాలా మంచి పేరు కలవారని.. వాళ్లకు నయీంతో సంబంధం లేదని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. తాను అడ్మినిస్ట్రేషన్‌లో ఉండటంతో ఇన్ఫార్మర్ల వ్యవస్థ గురించి పెద్దగా తెలియదన్నారు. అలాగే ఆ సమయంలో నల్లగొండ జిల్లాలో పనిచేసిన ఎస్ఐలు, సీఐలలో 99 శాతం మందికి నయీంతో లింకులు ఉన్నాయంటే తాను నమ్మనని చెప్పారు. అన్ని రంగాల్లోనూ ఉన్నట్లే పోలీసు శాఖలో కూడా ఒకరిద్దరు బ్లాక్ షీప్ ఉండొచ్చని, కానీ అంతమాత్రాన అందరి మీద ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. తన తండ్రి కాంగ్రెస్ నాయకుడని.. కానీ తనకు మాత్రం రాజకీయాలతో సంబంధం లేదని తెలిపారు. టీడీపీ వాళ్లు నయీం విషయంలో తనకు ఎప్పుడూ ఫోన్లు చేయలేదని చెప్పారు. అయినా అప్పట్లో రాజకీయ నాయకుల మాట వినాల్సిన అవసరం జిల్లా ఎస్పీలకు ఉండేది కాదని, ప్రధానంగా ఉగ్రవాద నియంత్రణ కార్యకలాపాలు చూసేవాళ్లకు ఆ అవసరం ఉండేది కాదని అన్నారు. తాను పదవీ విరమణ చేసి ఏడేళ్లవుతోందని, ఒక్క చానల్ లో మాత్రమే తన పేరు వచ్చిందని తెలిపారు. నల్లగొండలో పనిచేశానని తన పేరు బయటకు వచ్చి ఉండొచ్చేమో గానీ.. దాన్ని ఖరారు చేసుకుని ఉపయోగించాలని సూచించారు. తమ కుటుంబానికి రాజకీయ చరిత్ర కూడా కేవలం నందికొట్కూరులో మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. -
నయీం పేరు కూడా వినలేదు: రిటైర్డ్ ఎస్పీ