నయీం పేరు కూడా వినలేదు: రిటైర్డ్ ఎస్పీ
తాను అసలు నయీం పేరు కూడా విన్నట్లు గుర్తులేదని రిటైర్డ్ పోలీసు అధికారి శివానందరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండలో తాను అతి తక్కువ కాలం మాత్రమే ఏఎస్పీగా పనిచేశానని, అది కూడా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కావడంతో శాంతిభద్రతల గురించి, తీవ్రవాదుల కార్యకలాపాల గురించి తనకు పెద్దగా తెలియదని ఆయన అన్నారు. 2003 వరకు తాను నల్లగొండ జిల్లాలో ఉన్నానని, అప్పటికి అతడిపేరు కూడా పెద్దగా ప్రచారంలోకి రాలేదని తెలిపారు.
తాను సజ్జనార్, శివధర్‌రెడ్డి లాంటి అధికారుల వద్ద పనిచేశానని, వాళ్లు చాలా మంచి పేరు కలవారని.. వాళ్లకు నయీంతో సంబంధం లేదని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. తాను అడ్మినిస్ట్రేషన్‌లో ఉండటంతో ఇన్ఫార్మర్ల వ్యవస్థ గురించి పెద్దగా తెలియదన్నారు. అలాగే ఆ సమయంలో నల్లగొండ జిల్లాలో పనిచేసిన ఎస్ఐలు, సీఐలలో 99 శాతం మందికి నయీంతో లింకులు ఉన్నాయంటే తాను నమ్మనని చెప్పారు. అన్ని రంగాల్లోనూ ఉన్నట్లే పోలీసు శాఖలో కూడా ఒకరిద్దరు బ్లాక్ షీప్ ఉండొచ్చని, కానీ అంతమాత్రాన అందరి మీద ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు.
తన తండ్రి కాంగ్రెస్ నాయకుడని.. కానీ తనకు మాత్రం రాజకీయాలతో సంబంధం లేదని తెలిపారు. టీడీపీ వాళ్లు నయీం విషయంలో తనకు ఎప్పుడూ ఫోన్లు చేయలేదని చెప్పారు. అయినా అప్పట్లో రాజకీయ నాయకుల మాట వినాల్సిన అవసరం జిల్లా ఎస్పీలకు ఉండేది కాదని, ప్రధానంగా ఉగ్రవాద నియంత్రణ కార్యకలాపాలు చూసేవాళ్లకు ఆ అవసరం ఉండేది కాదని అన్నారు. తాను పదవీ విరమణ చేసి ఏడేళ్లవుతోందని, ఒక్క చానల్ లో మాత్రమే తన పేరు వచ్చిందని తెలిపారు. నల్లగొండలో పనిచేశానని తన పేరు బయటకు వచ్చి ఉండొచ్చేమో గానీ.. దాన్ని ఖరారు చేసుకుని ఉపయోగించాలని సూచించారు. తమ కుటుంబానికి రాజకీయ చరిత్ర కూడా కేవలం నందికొట్కూరులో మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు.