నయీమ్.. నన్ను బెదిరించాడు
రైతు గర్జన సభలో రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నల్లగొండ జిల్లాలో 99 శాతం టీఆర్‌ఎస్ నేతలకు నయీమ్‌తో సంబంధాలన్న కాంగ్రెస్ నేత
కమీషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు: దిగ్విజయ్
టీఆర్‌ఎస్ అక్రమాలపై జాతీయ స్థాయిలో పోరు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్
గ్యాంగ్‌స్టర్ నయీమ్ తనను ఎన్నోసార్లు బెదిరించాడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నయీమ్ మనుషులు తన దగ్గరకు వచ్చి, పోటీ నుంచి తప్పుకోవాలంటూ హెచ్చరించారన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రైతు గర్జన బహిరంగ సభలో మాట్లాడుతూ కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నయీమ్ బెదిరింపులకు తాను బెదరలేదన్నారు. నల్లగొండ జిల్లాలో 99 శాతం టీఆర్‌ఎస్ నాయకులకు నయీమ్‌తో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. నయీమ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌పై నమ్మకం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ‘‘పోలీస్‌స్టేషన్లను, తహసీల్దార్ కార్యాలయాలను టీఆర్‌ఎస్ నేతలు తమ అధీనంలోకి తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారికి కేసీఆర్ పదవులు కట్టబెట్టారు. సీఎం చివరికి వయసు సరిపోతే తన మనవడికి కూడా ఎమ్మెల్సీ పదవిచ్చేలా ఉన్నారు. కాంగ్రెస్‌లో ఎన్ని గ్రూపులున్నా అంతా ఏకమై ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నాం’’ అని అన్నారు.
సంక్షోభంలో రైతన్న: దిగ్విజయ్
ఎన్నికల హామీల అమలులో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమవుతోందని సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ దుయ్యబట్టారు. రెండున్నరేళ్ల పాలనలో రైతులు సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. ‘‘రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమే. వాటి అంచనా వ్యయాలను భారీగా పెంచడంలో అవినీతి దాగుంది. ఈ అక్రమాలపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తాం’’ అని ప్రకటించారు. రైతులు పత్తి పండించవద్దని ముఖ్యమంత్రే చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే మల్లన్నసాగర్ భూ సేకరణ చేయాలన్నారు. దీనిపై హైకోర్టులో చుక్కెదురవడం సర్కారు పనితీరుకు అద్దం పడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌లోని బెలుచిస్థాన్ పోరాటానికి మద్దతిచ్చే ముందు అంతర్గత శాంతిభద్రతలపై దృష్టి సారించాలన్నారు. దళితుల కంటే ముందు తనను కాల్చండనడం సిగ్గుచేటన్నారు.
వైఎస్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
దిగ్విజయ్ తన ప్రసంగంలో పలుమార్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకున్నారు. వైఎస్ హయాంలో తెలంగాణలో సాగు, తాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సభలో పలుమార్లు కార్యకర్తలు వైఎస్సార్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చే శారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రైతులు వలస కూలీలుగా ముంబై మురికివాడల్లో దయనీయ జీవితం గడుపుతున్నారని ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు ఆవేదన వెలిబుచ్చారు.
కాంట్రాక్టర్ రాజ్: ఉత్తమ్ ధ్వజం
కాంగ్రెస్ పాలనలో రైతేరాజన్న ధ్యేయంతో పని చేస్తే, కేసీఆర్ సర్కారులో మాత్రం కాంట్రాక్టర్లే రాజాలుగా వర్ధిల్లుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బలవంతపు భూసేకరణకు దిగితే సహించబోమని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే వెళ్లాలని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల మంది రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయి. 3 లక్షల మంది మహిళా రైతుల బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టులో ఉన్నాయి. ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల అంచనాల్లో టీఆర్‌ఎస్ సర్కారు మాయ చేస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.26 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్లకు పెంచిందని దుయ్యబట్టారు. ఏఐసీసీ కార ్యదర్శి కుంతియా, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, జి.చిన్నారెడ్డి, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మధుయాష్కిగౌడ్, షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, మల్లు రవి, బలరాం నాయక్, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు సభలో పాల్గొన్నారు.
30న కాంగ్రెస్ నేతలకు శిక్షణ
కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలకు ఈ నెల 30న శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఆదిలాబాద్‌లో దిగ్విజయ్ అధ్యక్షతన నిర్వహించిన టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు.