నయీంతో సిటీ మాజీమంత్రి చెట్టపట్టాలు?
నయీం కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఇప్పటికే కొందరు పోలీసు ఉన్నతాధికారులు, పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ మాజీ మంత్రి పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు నయీంతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈగ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఎన్నో భూ దందాలు, సెటిల్‌మెంట్లు చేసినట్లు వార్తలొస్తున్నాయి. డైరీలో ఈ అంశాలను నయీం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తుండగా... ఆ మంత్రి ఎవరై ఉంటారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
పోలీసు శాఖలో వివిధ స్థాయిల్లోని దాదాపు 42 మంది అధికారులు నయీంకు సహకరించినట్లు సమాచారం. వారిలో ఎక్కువమంది ఉన్నతాధికారులే ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ జాబితాలో 18మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారని... వీరిలో సర్వీసులో ఉన్నవారు 9 మంది, రిటైరైనవారు 9 మంది ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలివారు కింది కేడర్ అని సమాచారం. డీసీపీ, ఏసీపీలుగా ఉన్నవారి నుంచి ఉన్నతస్థాయి వరకు నయీంకు తోడూ.. నీడగా నిలిచినట్లు సమాచారం. నక్సల్స్ వ్యవహారాలపై నిఘా పెట్టే స్పెషల్ ఇంటెలిజెన్స్‌లో పనిచేసి రిటైర్ అయిన వారిలో ఆరుగురు ఎస్పీ కేడర్ అధికారులకు నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కూడా కేసీఆర్‌కు ఇచ్చిన నివేదికలో ఉందని వార్తలు వచ్చాయి. అయితే, నయీం వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయిన కొందరు తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వంలో ఉన్నవారి పేర్లను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.