
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇన్‌కం ట్యాక్స్ అడ్జ్యుడ్‌కేట్ అథారిటీలో హైదరాబాద్ ఐటీ శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ఎలాంటి ఆదాయ మార్గాలు లేకుండా రూ.వేల కోట్ల ఆస్తులను నయీం సంపాదించాడని ఐటీ శాఖ తేల్చింది. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత వేలాది మంది బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఫిర్యాదు చేశారు. తమను బెదిరింపులకు గురి చేసి భూములు లాక్కున్నారని ఫిర్యాదుల్లో పేరొన్నారు. వీటిపై విచారణ చేసిన సిట్ సంబంధిత ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీతో పాటు ఐటీ విభాగానికి లేఖలు రాసింది. ఈ మేరకు విచారణ జరిపిన ఐటీ బృందాలు నయీం ఆస్తులను బినామీ పేర్ల మీదకు బదలాయించారని, వారికి నోటీసులిచ్చి విచారణ జరిపాయి. ఈ సందర్భంగా వాళ్లకు ఎలాం టి ఆదాయ మార్గాలు లేవని దర్యాప్తులో బయటపడ్డట్టు తెలిసింది.
త్వరలోనే పిటిషన్ విచారణ..
నయీం బినామీల ఆస్తులను కొత్తగా తీసుకొచ్చిన బినామీ ప్రాపర్టీస్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకునేందుకు అనుమతివ్వాలని అడ్జ్యుడ్‌కేట్ అథారిటీలో ఐటీ పిటిషన్ దాఖలు చేసింది. నయీం బినామీ ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ.1,500 కోట్ల మేర ఉంటాయని ఐటీ పిటిషన్‌లో పేర్కొన్నట్టు సమాచారం. ఈ పిటిషన్‌పై త్వరలోనే వాదనలు జరుగుతాయని సంబంధిత దర్యాప్తు బృందాల ద్వారా తెలిసింది. ఇక, నయీం ఆస్తుల వ్యవహారంపై అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం ఈసీఐఆర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ఫైల్ చేసినట్టు తెలిసింది. ఈ దర్యాప్తు కోసం ఇప్పటివరకు సిట్ బృందం కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లను కోర్టు నుంచి తీసుకోనున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment