
సాక్షి, న్యూఢిల్లీ : షెల్ కంపెనీలపై కొరడా ఝళిపిస్తున్న పన్ను అధికారులు, తాజాగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లపై కూడా చర్యలకు సిద్దమయ్యారు. యాంటీ-బినామీ చట్ట నిబంధనల కింద రూ.30 లక్షలకు పైనున్న అన్ని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల పన్ను ప్రొఫైల్స్‌పై ఐటీ శాఖ విచారణ జరుపుతోంది. ఒకవేళ ఎవరైనా అక్రమ ఆస్తులు కలిగి ఉంటే చర్యలు తీసుకునేందుకు కూడా సిద్దమైందని సీబీడీటీ చీఫ్ తెలిపారు. షెల్ కంపెనీలు, అంతేకాక వాటి డైరెక్టర్లపై పన్ను అధికారులు విచారణ జరుపుతున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశిల్ చంద్ర తెలిపారు. బ్యాంకు అకౌంట్లతో కలిపి ఇప్పటివరకు 621 ప్రాపర్టీలను తాము అటాచ్ చేసుకున్నట్టు ఐటీ శాఖ టాప్-బాస్ చెప్పారు. బినామి లావాదేవీల యాక్ట్ కింద ఈ కేసుల్లో భాగమైన మొత్తం నగదు రూ.1,800 కోట్లు ఉంటుందని తెలిపారు. బ్లాక్‌మనీని వైట్‌మనీ మార్చుకునేందుకు అక్రమార్కులు చేస్తున్న అన్ని సాధనాలను తాము నాశనం చేస్తున్నామని, దీనిలోనే షెల్ కంపెనీలు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నట్టు పేర్కొన్నారు.
రూ.30 లక్షలకు పైన రిజిస్ట్రీ విలువున్న అన్ని ప్రాపర్టీలను ఆదాయపు పన్ను ప్రొఫైల్స్‌తో సరిపోల్చుతున్నట్టు ఐటీ శాఖ తెలిపింది. బినామి చట్టం కింద సమాచారానంతటిన్నీ సేకరిస్తున్నామని, ఒకవేళ ఏమైనా అనుమానిత ప్రొఫైల్స్ ఉన్నట్టు తేలితె వారిపై చర్యలు తీసుకోనున్నట్టు చంద్ర చెప్పారు. బినామి ఆస్తులను తాము చాలా సీరియస్‌గా పరిగణలోకి తీసుకోనున్నామని, పన్ను అధికారులు ఈ విషయంలో చాలా ఎక్కువగా కృషిచేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తాము 24 యూనిట్లను తెరిచామని, వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు వెల్లడించారు. బినామి చట్టం కింద గరిష్టంగా ఏడేళ్లు జైలు, జరిమానాలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. గతేడాది నవంబర్ 1న కొత్త బినామి లావాదేవీల సరవణ చట్టం 2016 కింద ఈ చర్యలు తీసుకోవడం ఐటీ శాఖ ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment