binami act
-
నయీం బినామీ ఆస్తుల స్వాధీనానికి చర్యలు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇన్‌కం ట్యాక్స్ అడ్జ్యుడ్‌కేట్ అథారిటీలో హైదరాబాద్ ఐటీ శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ఎలాంటి ఆదాయ మార్గాలు లేకుండా రూ.వేల కోట్ల ఆస్తులను నయీం సంపాదించాడని ఐటీ శాఖ తేల్చింది. నయీం ఎన్కౌంటర్ తర్వాత వేలాది మంది బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఫిర్యాదు చేశారు. తమను బెదిరింపులకు గురి చేసి భూములు లాక్కున్నారని ఫిర్యాదుల్లో పేరొన్నారు. వీటిపై విచారణ చేసిన సిట్ సంబంధిత ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీతో పాటు ఐటీ విభాగానికి లేఖలు రాసింది. ఈ మేరకు విచారణ జరిపిన ఐటీ బృందాలు నయీం ఆస్తులను బినామీ పేర్ల మీదకు బదలాయించారని, వారికి నోటీసులిచ్చి విచారణ జరిపాయి. ఈ సందర్భంగా వాళ్లకు ఎలాం టి ఆదాయ మార్గాలు లేవని దర్యాప్తులో బయటపడ్డట్టు తెలిసింది. త్వరలోనే పిటిషన్ విచారణ.. నయీం బినామీల ఆస్తులను కొత్తగా తీసుకొచ్చిన బినామీ ప్రాపర్టీస్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకునేందుకు అనుమతివ్వాలని అడ్జ్యుడ్‌కేట్ అథారిటీలో ఐటీ పిటిషన్ దాఖలు చేసింది. నయీం బినామీ ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ.1,500 కోట్ల మేర ఉంటాయని ఐటీ పిటిషన్లో పేర్కొన్నట్టు సమాచారం. ఈ పిటిషన్‌పై త్వరలోనే వాదనలు జరుగుతాయని సంబంధిత దర్యాప్తు బృందాల ద్వారా తెలిసింది. ఇక, నయీం ఆస్తుల వ్యవహారంపై అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం ఈసీఐఆర్ (ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ఫైల్ చేసినట్టు తెలిసింది. ఈ దర్యాప్తు కోసం ఇప్పటివరకు సిట్ బృందం కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లను కోర్టు నుంచి తీసుకోనున్నట్టు తెలిసింది. -
రూ.30 లక్షలకు పైనున్న ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లపై...
సాక్షి, న్యూఢిల్లీ : షెల్ కంపెనీలపై కొరడా ఝళిపిస్తున్న పన్ను అధికారులు, తాజాగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లపై కూడా చర్యలకు సిద్దమయ్యారు. యాంటీ-బినామీ చట్ట నిబంధనల కింద రూ.30 లక్షలకు పైనున్న అన్ని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల పన్ను ప్రొఫైల్స్‌పై ఐటీ శాఖ విచారణ జరుపుతోంది. ఒకవేళ ఎవరైనా అక్రమ ఆస్తులు కలిగి ఉంటే చర్యలు తీసుకునేందుకు కూడా సిద్దమైందని సీబీడీటీ చీఫ్ తెలిపారు. షెల్ కంపెనీలు, అంతేకాక వాటి డైరెక్టర్లపై పన్ను అధికారులు విచారణ జరుపుతున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశిల్ చంద్ర తెలిపారు. బ్యాంకు అకౌంట్లతో కలిపి ఇప్పటివరకు 621 ప్రాపర్టీలను తాము అటాచ్ చేసుకున్నట్టు ఐటీ శాఖ టాప్-బాస్ చెప్పారు. బినామి లావాదేవీల యాక్ట్ కింద ఈ కేసుల్లో భాగమైన మొత్తం నగదు రూ.1,800 కోట్లు ఉంటుందని తెలిపారు. బ్లాక్‌మనీని వైట్‌మనీ మార్చుకునేందుకు అక్రమార్కులు చేస్తున్న అన్ని సాధనాలను తాము నాశనం చేస్తున్నామని, దీనిలోనే షెల్ కంపెనీలు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నట్టు పేర్కొన్నారు. రూ.30 లక్షలకు పైన రిజిస్ట్రీ విలువున్న అన్ని ప్రాపర్టీలను ఆదాయపు పన్ను ప్రొఫైల్స్‌తో సరిపోల్చుతున్నట్టు ఐటీ శాఖ తెలిపింది. బినామి చట్టం కింద సమాచారానంతటిన్నీ సేకరిస్తున్నామని, ఒకవేళ ఏమైనా అనుమానిత ప్రొఫైల్స్ ఉన్నట్టు తేలితె వారిపై చర్యలు తీసుకోనున్నట్టు చంద్ర చెప్పారు. బినామి ఆస్తులను తాము చాలా సీరియస్‌గా పరిగణలోకి తీసుకోనున్నామని, పన్ను అధికారులు ఈ విషయంలో చాలా ఎక్కువగా కృషిచేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తాము 24 యూనిట్లను తెరిచామని, వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు వెల్లడించారు. బినామి చట్టం కింద గరిష్టంగా ఏడేళ్లు జైలు, జరిమానాలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. గతేడాది నవంబర్ 1న కొత్త బినామి లావాదేవీల సరవణ చట్టం 2016 కింద ఈ చర్యలు తీసుకోవడం ఐటీ శాఖ ప్రారంభించింది. -
బినామీ లావాదేవీలు చేస్తే భారీ జరిమానా
న్యూఢిల్లీ: బినామీ లావాదేవీలు నిర్వహిస్తే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుందని ఆదాయ పన్నుల (ఐటీ) శాఖ హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన జారీ చేసింది. 2016 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ చట్టం- 1988 ప్రకారం ఎవరూ బినామీ లావాదేవీలు జరపడానికి వీల్లేదని పేర్కొంది. బినామీగా వ్యవహరించిన వ్యక్తి, వాస్తవ ఆస్తిపరుడు, సాయం చేసిన వారు అందరూ శిక్షార్హులేనని, వారికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, బినామీ ఆస్తి మార్కెట్ ధరలో 25 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని ఐటీ శాఖ తెలిపింది. బినామీ ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, ఆస్తి మార్కెట్ ధరలో 10 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, సంబంధిత బినామీ ఆస్తిని గుర్తిస్తే ప్రభుత్వం దాన్ని జప్తు చేస్తుందని వెల్లడించింది. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుటి నుంచి దేశవ్యాప్తంగా 230 కేసులు రిజిస్ట్రర్ కాగా, రూ. 55 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ అయ్యాయి. అలాగే రూ. 200 కోట్ల ఆస్తులకు సంబంధించి 140 మందికి ఐటీ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు 124 కేసులకు సంబంధించిన రూ. 55 కోట్ల విలువైన బినామీ ఆస్తులను అటాచ్ చేసినట్లు ఐటీ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అటాచ్ అయిన ఆస్తుల్లో బ్యాంకు డిపాజిట్లు, వ్యవసాయ, ఇతర భూములు, ప్లాట్లు, జ్యువెలరీ ఉన్నాయని అధికారులు వెల్లడించారు.