తవ్వేస్తున్నారు.. | illegal mining in government lands | Sakshi
Sakshi News home page

తవ్వేస్తున్నారు..

Published Wed, Apr 30 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

illegal mining in government lands

భైంసా, న్యూస్‌లైన్ :   అక్రమార్కులు గుట్టలను తవ్వేస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లోని గుట్టలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రొక్లెయిన్‌లతో తవ్వేసి మొరంను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మొరం తవ్వకాలతో ఏర్పడిన గుంతలు, కందకాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోజురోజుకు ఈ అక్రమ తవ్వకాలు అధికమవుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు గుట్టను అక్రమంగా తవ్వేస్తున్నారు. ప్రాజెక్టు పక్క నుంచే ఉన్న ప్రధాన మార్గం అక్రమ తవ్వకాలతో ప్రమాదకరంగా మారింది. ఒకవైపు తవ్వేసిన గుంతలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గుట్ట దిగే ప్రాంతంలో మూలమలుపు వద్ద అక్రమార్కులు పూర్తిగా మొరం తవ్వేశారు. దీంతో వేగంగా వచ్చే వాహన చోదకులు మూలమలుపు వద్ద ప్రమాదాల బారిన పడుతున్నారు. పట్టణ సమీపంలోని డిగ్రీ కళాశాలకు వెళ్లే ప్రాంతంలోనూ మొరం తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. భైంసా పట్టణంలో నిర్మించే భవనాలకు ఇక్కడి నుంచే మొరం తరలిస్తున్నారు. అధికారుల కళ్లముందే ఈ తతంగం జరుగుతున్నా ఎవరు స్పందించడం లేదు. భైంసా మండలం దేగాం, వాలేగాం గ్రామాల్లోనూ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. అక్రమార్కులు రోజు వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లలో మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

 ముథోల్ వద్ద...
 భైంసా - బాసర ప్రధాన రహదారిని ఆనుకుని ముథోల్ నేత్ర వైద్యశాల, సబ్‌స్టేషన్ ప్రాంతాల్లోనూ ఈ అక్రమ దందా కొనసాగుతోంది. కొందరు కాంట్రాక్టర్లు ఎలాంటి అనుమతి పొందకుండా మొరం తరలించేస్తున్నారు. పెద్దమొత్తంలోనే ఈ వ్యవహారం సాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

 ప్రమాదకరంగా కందకాలు..
 అక్రమ తవ్వకాలతో నియోజకవర్గంలోని భైంసా, ముథోల్, దేగాం, వాలేగాం తదితర ప్రాంతాల్లో భారీ కందకాలు  ఏర్పడుతున్నాయి. ఏటా వర్షాకాలంలో ఈ కందకాలు వరద నీటితో నిండిపోతున్నాయి. కందకాల లోతు తె లియక మూగజీవాలు దాహార్తి  తీర్చుకునేందుకు వెళ్లి అందులో పడి చనిపోతున్నాయి. ప్రధాన మార్గాల్లోనే ఇలాంటి కందకాలు ఉన్నా ఎవరూ స్పందించడంలేదు. భైంసా-నాందేడ్ అంతర్రాష్ట్ర రహదారికి ఆనుకుని మాంజ్రి గుట్ట వద్ద సైతం ఇలాంటి కందకాలు ఉన్నాయి. అక్రమ తవ్వకాలతో ఏర్పడ్డ కందకాలను పూడ్చడంలోనూ అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇకనైనా అధికారులు అక్రమ తవ్వకాలు జరపకుండా  చర్యలు తీసుకోవాలని, భారీ కందకాలు ఉన్న ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

 కఠిన చర్యలు తీసుకుంటాం
 అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. ఇలా తవ్వకాలు చేపట్టకుండా అన్ని గ్రామాల రెవెన్యూ అధికారులకు అప్రమత్తం చేస్తాం. అక్రమ తవ్వకాలు చేపట్టినట్లు తేలితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా తవ్వితే సమాచారమివ్వండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement