- కేసముద్రం మార్కెట్ కార్యదర్శికి వ్యాపారుల వినతి
- ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీల తరలింపే కారణం
కేసముద్రం, న్యూస్‌లైన్ : అధికారుల అవగాహనా రాహిత్యం కారణంగా రైతులే ఇబ్బందులకు గురికావలసి వస్తోంది. ఒక పక్క కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో కాలంటాలు నిలిపివేశారు. ఇప్పటికే కొనుగులు చేసి నిల్వ ఉన్న ధాన్యాన్ని తరలిం చేందుకు ఏ ఒక్క లారీని వదలకుండా పోలీ సుల సహకారంతో వినియోగిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక మార్కెట్‌లో వ్యవసాయోత్పత్తుల ఎగుమతి కోసం వ్యాపారులు తెప్పించుకున్న లారీలను సైతం కొనుగోలు కేం ద్రాల వద్దకు మళ్లించారు.
దీంతో ఇతర వాహనాలను వెతుక్కుని సరుకులను ఎగుమతి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాపారులు వాపోయారు. ఇప్పటికే కేసముద్రం పీఏసీఎస్ ఆధ్వర్యంలో కోమటిపల్లి, కేసముద్రంవిలేజ్, ఇనుగుర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 20 వేలకుపైగా ధాన్యం బస్తాలు, ఐకేసీ ద్వారా కల్వల, కాట్రపల్లి, అర్పనపల్లి, ఇనుగుర్తి గ్రామాల్లోని కేంద్రాల్లో సుమారు 40వేల బస్తాలు, ధన్నసరి పీఏసీఎస్ కేంద్రంలో సుమారు 20వేల బస్తాల ధాన్యం నిల్వ ఉంది.
ఆ ధాన్యాన్ని తరలించడానికి నిర్వాహకులు, పోలీసు యంత్రాంగం నానా పాట్లు పడుతున్నారు. బుధవారం మార్కెట్‌లోని పత్తి వ్యాపారులంతా ఏకమయ్యారు. తాము తెచ్చుకున్న లారీలన్నింటినీ కొనుగోలు కేంద్రాలకు మళ్లిస్తున్నారని, గురువారం నుంచి తాము పత్తి కొనుగోళ్లు చేపట్టలేమంటూ మార్కెట్ ప్రత్యేకహోదా కార్యదర్శి శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు.