తూప్రాన్ : మండలంలో ఇసుకతో పాటు కంకర దందా కాసుల వర్షం కురిపిస్తోంది. అక్రమార్కులు నామమాత్రం అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూముల్లోని ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. మండలంలో ఘనపూర్, కూచారం, లింగారెడ్డిపేట, పాలాట గ్రామాల్లోని ప్రభుత్వ, పట్టా భూముల్లో క్వారీలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని చేస్తున్నారు.
బహిరంగంగానే ఈ అక్రమ దందా కొనసాగుతున్నా.. అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్వారీల ఏర్పాటు ప్రభుత్వ అనుమతులతో అనుమతించిన నిర్ణీత ప్రదేశంలో తవ్వకాలు జరపాలి. కానీ అక్రమార్కులు మాత్రం అధికారులకు ఓ స్థలాన్ని చూపి అనుమతులు పొందిన అనంతరం మరో చోట తవ్వకాలు జరుపుతున్నారు. భారీ పేలుళ్లు పేలుస్తూ పరిసర గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
ఈ పేలుళ్ల దాటికి పెంకుటిళ్ల పైకప్పు నుంచి మట్టి రాలి మీద పడుతుండగా.. సిమెంటుతో నిర్మించుకున్న భవనాలు బీటలు వారుతున్నాయి. క్వారీల నుంచి వెలువడే దుమ్ము పక్కనే ఉన్న పంటల పొలాలపై పడి వాటిని ఎదగడం లేదు. దీంతో పంటను మొత్తం కోల్పోవాల్సి వస్తోందని పలువురు రైతులు మైనింగ్ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు.
రోడ్లు గుంతల మాయంగా...
క్వారీల్లోని కంకరను టిప్పర్ల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్డు గుంతల మయంగా మారుతున్నాయి. ఘనపూర్ గ్రామ సమీపంలో సుమారు ఐదు క్వారీల్లోని వాహనాలు కంకర లోడుతో రామాయిపల్లి మీదుగా కొన్ని వాహనాలు, ధర్మారాజుపల్లి, దండుపల్లిల మీదుగా మరికొన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
ఈ క్రమంలో మండలంలోని ఘనపూర్ - రమాయిపల్లి గ్రామల మధ్య వేసిన బీటీ రోడ్డు కంకర తేలి గుంతలమయంగా మారింది. దీంతో ఈ రహదారిలో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఈ దారిగుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు.ఇప్పటికైనా గనుల శాఖ అధికారులు ఈ క్వారీలను తనిఖీలు చేసి ప్రభుత్వ వనరులను కొల్లగొడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాసులు కురిపిస్త్ను కంకర దందా!
Published Fri, Nov 7 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement