Tupran
-
తుఫ్రాన్‌లో కూలిపోయిన శిక్షణ విమానం.. పైలట్ మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలోని తుఫ్రాన్‌లో శిక్షణ విమానం కూలిపోయింది. అయితే, విమానం కూలిపోయిన వెంటన భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పైలెట్, కో-పైలట్ మృతిచెందారు. వివరాల ప్రకారం.. తుఫ్రాన్ మున్సిపల్ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ సమీపంలో ఉన్న గుట్టల మధ్య సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. కాగా, కూలిన విమానాన్ని దుండిగల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన శిక్షణ విమానంగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. Two Indian Air Force pilots were killed in action when their Pilatus trainer aircraft crashed at 8:55 during training at Air Force Academy, Dindigul in Telangana. The pilots include an instructor and one cadet: Indian Air Force officials pic.twitter.com/48bGdfawRy — ANI (@ANI) December 4, 2023 -
పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకున్నాడు.. తల్లిదండ్రుల ఎంట్రీతో..
సాక్షి, మెదక్ (తూప్రాన్): యువతిని ప్రేమించి పెళ్లి చేసుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ కేసు నమోదైంది. మంగళవారం ఎస్ఐ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలం కోనాయపల్లి(పీటీ) గ్రామ పంచాయతీ పరిధి ధర్మరాజ్పల్లి గ్రామానికి చెందిన భాషబోయిన తేజశ్రీ, అదే గ్రామానికి చెందిన సాయిరెడ్డిగారి యశ్వంత్‌రెడ్డి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకున్నాడు. వీరి పెళ్లికి కులాలు అడ్డు రావడంతో కుల పెద్దలు నిరాకరించారు. దీంతో గతనెల 19వ తేదీన లక్ష్మీనర్సింహా స్వామి దేవాలయం వద్ద పెళ్లి చేసుకున్నారు. తూప్రాన్‌లో కాపురం పెట్టారు. విషయం తెలుసుకున్న అబ్బాయి, కుటుంబసభ్యులు, కుల పెద్దలు 20న తూప్రాన్ వచ్చి అబ్బాయిని తమ వెంట తీసుకెళ్లారు. ప్రశ్నించినందుకు యశ్వంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు చంపుతామని బెదిరిస్తున్నారని తేజశ్రీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు యశ్వంత్‌రెడ్డి, కుటుంబ సభ్యులు జయరాంరెడ్డి, రమణమ్మ, అభిషేక్‌రెడ్డి, పుష్ప, శిల్ప, బల్వంత్‌రెడ్డి, మణేమ్మ, రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం) -
పాపం పసిపాప.. అక్షరాభ్యాసం కోసం వెళ్లి వస్తుండగా
సాక్షి, మెదక్/వరంగల్: అభం శుభం తెలియని ఓ పసిపాప తండ్రి అజాగ్రత్తకు మృత్యుఒడికి చేరింది. అక్షరాభ్యాసం కోసం బాసరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అప్పటివరకూ తల్లి ఒడిలో ఉన్న చిన్నారి శాశ్వత నిద్రలోకి జారుకుంది. కళ్ల ముందే చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మాసాయిపేట మండలం స్టేషన్ మాసాయిపేట శివారు 44వ జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో ఏడాదిన్నర వయస్సు గల చిన్నారి మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చేగుంట ఎస్సై ప్రకాశ్‌గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లారెడ్డిపల్లికి చెందిన వికాస్‌రెడ్డి తన కుటుంబంతో హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుచుకోవడంతో భార్య ప్రవల్లిక, ఇద్దరు కూతుర్లు సాన్విక, ఏడాదిన్నర అద్విక, మరో వ్యక్తితో కలిసి బాసర సరస్వతి ఆలయానికి అక్షరాభ్యాసం కోసం తన కారులో వెళ్లారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి హైదరాబాద్ వెళ్తుండగా మాసాయిపేట మండలం స్టేషన్ మాసాయిపేట శివారు 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులోంచి రోడ్డుపై పడిన చిన్నారి అద్విక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా వారికి గాయాలయ్యాయి. వికాస్‌రెడ్డి సోదరుడు విపుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రకాష్‌గౌడ్ తెలిపారు. నుజ్జునుజ్జయిన కారు అతివేగమే ప్రమాదానికి కారణం అతివేగం, అజాగ్రత వల్లే కారు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. రహదారిపై అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో కారు మొత్తం నుజ్జునుజ్జయింది. కారులో అప్పటివరకు తల్లి చెంతనున్న చిన్నారి అద్విక ఒక్కసారిగా ఎగిరి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలపాలై మృత్యుడికి చేరింది. -
రాత్రి ఇంట్లో నిద్రించారు.. తెల్లారేసరికి మాయం.. ఎటు వెళ్లినట్లు?
సాక్షి, మనోహరాబాద్(మెదక్): మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. ఎస్సై రాజుగౌడ్ వివరాల ప్రకారం మండలంలోని కాళ్లకల్ గ్రామానికి చెందిన షేక్ జహంగీర్ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అతని రెండో కూతురు షేక్ జహ్నబీ(21) ఈనెల 24 రాత్రి ఎప్పటిలాగే ఇంట్లో నిద్రపోయింది. అయితే కుటుంబ సభ్యులు వేకువ జామున చూసేసరికి జహ్నాబీ ఇంట్లోంచి వెళ్లిపోయింది. బంధువులు, తెలిసినవారి వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. కాగా కాళ్లకల్ గ్రామానికి చెందిన వీరబోయిన కృష్ణ మూడో కుమారుడు నాగార్జున్‌తో వెళ్లినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తండ్రి శనివారం ఫిర్యాధు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. స్వప్న యువతి అదృశ్యం పరిగి: ఓ యువతి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్లో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ కిష్టయ్య కూతురు స్వప్న ఈనెల 23న తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డిపై అనుమానంతో అతడి ఇంటికి వెళ్లి చూడగా అతడు కూడా కనిపించలేదు. మధు సూదన్రెడ్డిపై అనుమానంతో యువతి కుటుంబీకులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: భర్త వర్క్ ఫ్రం హోమ్‌లో బిజీ.. భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లడంతో. -
మొక్కలు ఎందుకు ఎండిపోయాయ్.. కొత్తవి నాటండి: కేసీఆర్
సాక్షి, గజ్వేల్: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోవడంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఇటీవల ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి మృతి చెందగా.. బుధవారం సుమన్‌ను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం, తిరుగు ప్రయాణంలో తూప్రాన్.. అక్కడి నుంచి గజ్వేల్ మీదుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. మార్గమధ్యలో రోడ్డుకు ఇరువైపులా కొన్నిచోట్ల ట్రీగార్డులు పడిపోవడం, మరికొన్ని చోట్ల మొక్కలు ఎండిపోవడం గమనించారు. ఎందుకిలా జరిగిందని కాన్వాయ్ నుంచే ‘గడా’(గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. గతేడాది నర్సాపూర్ నియోజకవర్గానికి గజ్వేల్ నుంచి ప్రత్యేకంగా పైప్‌లైన్ నిర్మించడంతో మొక్కలు దెబ్బతిన్నాయని ముత్యంరెడ్డి సీఎంకు వివరించారు. అయితే వాటి స్థానంలో కొత్తవి ఎందుకు నాటలేదని ప్రశ్నించిన సీఎం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోనూ రోడ్డుకు ఇరువైపులా దెబ్బతిన్న మొక్కల స్థానంలో తిరిగి కొత్త మొక్కలు నాటాలన్నారు. దీంతో గురువారం ‘గడా’ప్రత్యేకాధికారి.. తూప్రాన్ నుంచి గజ్వేల్ వరకు దెబ్బతిన్న మొక్కల స్థానంలో కొత్తవి నాటేందుకు చర్యలు ప్రారంభించారు. పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్ -
ఇంత రిస్క్ అవసరమా !
సాక్షి, తూప్రాన్ : లాక్డౌన్ గత 40 రోజులకు పైగా కొనసాగుతుండడంతో వలస కార్మికులకు ఉపాధి కరువై తమ సొంత గూటికి చేరుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. లారీల్లో పైన ప్రమాదం అంచును ప్రయాణం సాగిస్తున్నారు. కనీసం వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చావైనా... బతుకైనా తమ సొంత ఊరీలోనే అంటూ వలస కార్మికులు ప్రయాణం సాగిస్తున్నారు. వందలాది కిలోమీటర్ల దూరంను సైతం లెక్కచేయకుండా తమ పిల్లపాపలతో నడక సాగిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, రాజస్థాన్, చత్తీస్గాడ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు వందల సంఖ్యలో మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని టోల్‌ప్లాజా వద్ద గూమిగుడుతున్నారు. టోల్‌ప్లాజా వద్ద ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న లారీల్లో వారు ప్రమాదం అంచున ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి, వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మాజీ ఎంపీ కవిత కాన్వాయ్‌లో ప్రమాదం!
తుప్రాన్: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ఆమె హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ తుప్రాన్ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారును కాన్వాయ్‌లోని మరో కారు ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు నుజ్జునుజ్జయింది. అయితే, ప్రమాద సమయంలో ఎమ్మెల్యే అందులో లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. కాగా, నిజామాబాద్ చేరుకున్న కవిత శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. (చదవండి: డ్రోన్ కేసు: రేవంత్ రెడ్డికి బెయిల్) -
మున్సిపాలిటీల్లో వేడెక్కిన రాజకీయం
మున్సిపల్ ఎన్నికల ఘట్టంలో అసలు పోరు షురూ అయింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల చైర్మన్లతోపాటు మొత్తం 75 వార్డు పదవులకు ఆదివారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీచేయాలనే దానిపై స్పష్టత రావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆశావహులు తమ గాడ్ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా.. అభ్యర్థుల ఎంపికపై ఆయా రాజకీయపార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. సాక్షి, మెదక్: జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ పుర పీఠం పదవి జనరల్‌కు.. నూతనంగా ఆవిర్భవించిన తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట పురపాలికల చైర్మన్ పదవులు బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులు ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన పలువురు ఆశావహులు అంచనాలు తప్పడంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కునే పనిలో పడ్డారు. భార్యలను బరిలో దించాలా లేదా తమ కుటుంబ సభ్యులతో పోటీ చేయించాలా అని మారిన రాజకీయ సమీకరణలను బేరీజు వేసుకుంటూ ఆరా తీస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చిన వారు ఆయా వార్డుల్లో సన్నిహితులతో కలిసి కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు. మెదక్.. ఫుల్ గిరాకీ మెదక్ పురపాలక పీఠం జనరల్‌కు ఖరారు కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో 32 వార్డులు ఉండగా.. చైర్మన్ పదవికి పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఏ వర్గం వారైనా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ పీఠంపై ఆశలు పెట్టుకున్న పలువురు తమ వార్డుల్లో రిజర్వేషన్ల అంచనాలు తప్పడంతో కుటుంబ సభ్యులను బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయా పార్టీలకు చెందిన నేతలు, సన్నిహితుల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై నేతల మల్లగుల్లాలు రిజర్వేషన్ల పీటముడి వీడడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక రోజు.. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి రెండు రోజులు.. నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో అధికార పార్టీ టీఆర్ఎస్తోపాటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన జిల్లాస్థాయి, నియోజకవర్గ నేతలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశారు. ఒక వార్డులో ఒకే పార్టీ నుంచి తక్కువగా ఇద్దరు, ఎక్కువగా ఆరుగురు పోటీపడుతుండడం.. నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో ఆయా నియోజకవర్గాల నేతలు ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. సమయం తక్కువగా ఉండడంతో అసమ్మతులను బుజ్జగిస్తూనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగిరం చేశారు. -
బైక్‌ను తీసుకొని పారిపోతుండగా..
సాక్షి, తూప్రాన్ : బైక్‌ను దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్ఐ సుభాశ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల26న పోతరాజ్‌పల్లి కమాన్ వద్ద కిష్టయ్య ఓటల్‌వద్ద పార్క్ చేసి ఉన్న బైక్ చోరీకి గురైందన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా సోమవారం ఉదయం అల్లాపూర్ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పట్టుకొని విచారించగా వాహనానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లభించలేదని అన్నారు. ఈ వాహనం గత మూడు రోజుల క్రితం చోరీకి గురైనట్లుగా గుర్తించి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వర్గల్ మండల కేంద్రానికి చెందిన సుధాకర్‌గా గుర్తించి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
హల్దీ బచావో..
సాక్షి, తూప్రాన్: వెల్దుర్తి మండలంలోని హకింపేట, అచ్చంపేట, కొప్పులపల్లి, హస్తాల్పూర్, మెల్లూర్, ఉప్పులింగాపూర్, ఆరెగూడెం, పంతులుపల్లి, దామరంచ, కుకునూర్ తదితర గ్రామాల్లోని పంట పొలాలకు సాగు నీరందించే వరప్రదాయని హకింపేట శివారులోని హల్దీప్రాజెక్ట్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లో అక్రమ మట్టి, మొరం రవాణా మూడు హిటాచీ యంత్రాలు ఆరు టిప్పర్లు అన్న చందంగా తయారైంది. వాల్టా చట్టానికి విరుద్ధంగా.. ప్రతి రోజు ప్రాజెక్ట్‌లోని వెనుక భాగంలో పెద్ద పెద్ద హిటాచీ, జేసీబీ యంత్రాలతో పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మొరం, నల్లమట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొందరు స్థానికంగా భూములు కొనుగోలు చేసిన నగరంలోని బడా భూస్వాములకు తరలిస్తుండగా మరికొందరు ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా గత కొద్ది రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలించడంతో ప్రాజెక్ట్ వెనుకభాగంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరితే లోతు తెలీక మూగజీవాలు, పశువుల కాపరులు మృత్యువాత పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే బెదిరింపులు! అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని అధికారులకు సమాచారం అందిస్తే అడ్డుకోవాల్సింది పోయి వారు సంబంధిత అక్రమార్కులకు తమ ఫోన్ నంబర్లు ఇస్తున్నారని, ఫలితంగా సంబంధిత వ్యక్తుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు అక్రమార్కులు ఇచ్చే మామూళ్లకు అలవాటుపడటం వల్లే ప్రాజెక్ట్‌లో విలువైన మట్టిని అక్రమార్కులు ఇతర ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రైతులు పంట పొలాలకు మట్టి తీసుకెళ్తే నిబంధనల పేరిట ఇబ్బందులకు గురిచేసే అధికారులకు అక్రమ రవాణా కనిపించడం లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్టవేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు హల్దీ ప్రాజెక్ట్‌లో అక్రమ తవ్వకాలు చేపట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇటీవల మండల పర్యటనకు వచ్చిన ఇరిగేషన్ ఎస్ఈ అనంతరెడ్డి ఆదేశాలను కిందిస్థాయి అధికారులు పెడచెవిన పె డుతున్నారు. ప్రాజెక్ట్ శిఖం భూమిలో ఆక్రమణకు గురైన స్థలాలను సర్వే చేపట్టి కబ్జా జేసిన వారిపై ఫిర్యాదు చేయాలని ఆదేశించినా సిబ్బంది పట్టించుకోడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం నుంచి నీరు వచ్చే అవకాశం.. కాళేశ్వరం కాలువ ద్వారా సాగునీరు హల్దీ ప్రాజెక్ట్‌లోకి చేరే అవకాశం ఉన్నందున, ప్రాజెక్ట్ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు పూర్తిగా నిషేధించి, శిఖం ప్రాంతాన్ని పూర్తిగా సంరక్షించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. విజిలెన్స్ ఏర్పాటు చేస్తాం హల్దీ ప్రాజెక్ట్ నుంచి అక్రమంగా మొరం, మట్టి తరలించకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. రెవిన్యూ, పోలీస్ అధికారులచే విజిలెన్స్ టీం ఏర్పాటు చేసి నిఘా పెంచుతాం. వాల్టా చట్టానికి విరుద్ధంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా రవాణా చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్యాంప్రకాశ్, ఆర్డీఓ, తూప్రాన్ -
హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం
-
హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం
సాక్షి, మెదక్ : టీఆర్ఎస్ పార్టీ రోడ్ షోలో సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు కొద్దిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తుప్రాన్ రోడ్ షో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రచార వాహనంపై హరీశ్ రావు ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా జనరేటర్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆయన తన ప్రసంగాన్ని అర్థాంతరంగా నిలిపేసి వాహనం దిగిపోయారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆ వాహనంపై ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ ఎన్నికల ప్రచార సమయంలో కార్యకర్తలు బాణాసంచా పేల్చిన సందర్భంగా.. హరీశ్ రావుకు ప్రమాదం తప్పిన విషయం విదితమే. -
భూగర్భ గదిలో వారం నుంచి మహిళ
తూప్రాన్: మూఢత్వమో.. దైవత్వమో.. భక్తి మార్గమో తెలియదు. కానీ మాతమాణికేశ్వరి శిష్యురాలిగా చెప్పుకుంటున్న ఓ భక్తురాలు సజీవంగా భూగర్భంలో యోగనిద్ర చేస్తున్న ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ సమీపంలోని రామలింగేశ్వర ఆలయంలో చోటుచేసుకుంది. ఆమె శిష్యులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. వారం రోజులుగా భూగర్భంలోని ఓ చిన్న గదిలో ఆమె తపస్సు చేస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణానికి చెందిన అంజమ్మ అనే భక్తురాలు తాను శ్రీమాణికేశ్వరిమాత శిష్యురాలినని గ్రామస్తులకు తెలిపింది. లోక కల్యాణమే పరమావధిగా వారం రోజులపాటు గాలి, వెలుతురు లేని భూగర్భ గదిలో యోగముద్రలో ఆమె గడుపుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గత గురువారం ఉదయం 11:30 గంటలకు మాత అంజమ్మ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న ఓ భూగర్భ గదిలోకి వెళ్లింది. గది పైనుంచి శిష్యులు ఇటుకల గోడతో పూర్తిగా మూసివేశారు. బుధ వారం 7వ రోజు యోగముద్ర నుంచి బయటకు వస్తుందని ఆమె శిష్యులు చెబుతున్నారు. బుధ వారం ఆమె బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిపారు. కర్ణాటకలోని తన ఆశ్రమంలో ఇప్పటి వరకు 8 సార్లు భూగర్భంలో తపస్సు చేసినట్లు తెలిపారు. ఏటా శ్రావణ మాసంలో 41 రోజులు దీక్ష చేపట్టి 7 రోజులు భూగర్భంలో తపస్సు చేస్తుందన్నారు. -
మరణ మృదంగం
తూప్రాన్ : శ్రీరామ నవమి రోజున 44వ జాతీయ రహదారిపై నాగులపల్లి చౌరస్తా వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట పడేదెలా అని పలువురు చర్చించుకున్నారు. నాయకులు, అధికారులు మేల్కోకపోతే ఈ మరణమృదంగం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. రహదారిపై జరుగుతున్న ప్రమాదాలపై ప్రత్యేక కథనం.. మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్లోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న క్రాసింగ్‌లు మృత్యుకుహరాలుగా మారాయి, క్రాసింగ్‌ల వద్ద తరచూ ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయి. మండలంలోని నాగులపల్లి చౌరస్తా, కరీంగూడ చౌరస్తా, దాబా హోటళ్ల వద్ద, మనోహరాబాద్ చౌరస్తా, కూచా రం చౌరస్తా, బంగారమ్మ దేవాలయం వద్ద, జనతా హోటల్ వద్ద ఉన్న క్రాసింగ్‌లు ప్రమాదాలకు నిలయంగా మారి ఎందరినో బలిగొంటున్నాయి. నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నా.. హైవే అథారిటీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రమాదాల వివరాలు మండలంలో తొమ్మిదేళ్ల కాలంలో హైవేపై జరిగిన ప్రమాదాల్లో 287 మంది మృత్యువాత పడినట్లు పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి. ఇందులో 406 మందికి పైగా గాయపడ్డారు. వికలాంగులుగా మారిన వారి జీవనోపాధి మరీ దయనీయంగా మారింది. పోలీ సుల రికార్డుల్లో నమోదు కాని ప్రమాదాలు మరెన్నో ఉన్నాయి. హైవే అథారిటీ అధికారులు క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల హెచ్చరికల సూచికల బోర్డులు, సిగ్నళ్లు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. నాలుగు లేన్ల దారి అయిందని సం తో ష పడాలో, లేక ప్రమాదాల బారిన పడుతున్నందుకు బాధపడాలో తెలి యని దుస్థితిలో వాహనచోదకులు, బాటసారులు కొట్టుమిట్టాడుతున్నారు. నాగులపల్లి చౌరస్తా క్రాసింగ్ వెరీ డేంజర్: మండలంలోని 44వ జాతీయ రహదారి విస్తరణ పనులు 2006 సెప్టెంబరు 26న ప్రారంభించారు. అంతకు ముందు 7వ నంబరు జాతీయ రహదారిగా తూప్రాన్ పట్టణం మధ్యలోంచి ఈ దారి ఉండేది. తర్వాత ఇదే 44వ నంబరు జాతీయ రహదారిగా మారింది. అయితే విస్తరణంలో భాగంగా నాగులపల్లి చౌరస్తా వద్ద, కరీంగూడ చౌరస్తా వద్ద వంతెనలు ఏర్పాటు చేయలేదు. అప్పట్లో ఎవరూ ప్రతిపాదనలు చేయకపోవడం, హైవే అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వంతెనలు నిర్మించకపోవడంతో ఈ ప్రదేశాలు ప్రయాణికుల పాలిట యమపాశాలుగా మారాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో రోజూ ఏదో ఓ చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే బైపాస్ మార్గంలో ఏర్పాటు చేసిన దాబా హోటళ్ల వద్ద వాహనాలను రాత్రి వేళల్లో రహదారిపై నిలిపి భోజనాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రహదారి దాటేటప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే వాహనాలకు సైడ్ ఇంటికేటర్లు వేయడం లేదు. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. క్రాసింగ్‌ల వద్ద వాహనాల స్పీడ్ తగ్గించేందుకు ఎలాంటి కంట్రోల్ వ్యవస్థ లేదు. స్పీడ్ బ్రేకర్లు లేవు. రేడియం స్టిక్కర్లు లేవు. హెచ్చరిక బోర్టులు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా వాహనాలు అతివేగంగా వచ్చి ఢీకొట్టుకుంటున్నాయి. త్వరలో రూ.34 కోట్లతో వంతెన పనులు గత ఏడాదినాగులపల్లి చౌరస్తా వద్ద వంతెన నిర్మాణం కోసం నేషనల్ హైవే పీడీతో కలిసి ఎంపీలు స్థల పరిశీలన చేశారు. అనంతరం వంతెన నిర్మాణం కోసం రూ.34 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇటీవల తూప్రాన్‌కు చెందిన అధికారు పార్టీ నేతలు వంతెన ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. త్వరలోనే వంతెన పనులు 44వ జాతీయ రహదారిపై నాగులపల్లి చౌరస్తా వద్ద జరుగుతన్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.34కోట్ల నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. –నేషనల్ హైవే పీడీ మీర్ అమీద్ అలీ -
రెండు కొత్త మార్కెట్ కమిటీలు
హైదరాబాద్: జనగామ జిల్లా పాలకుర్తి, సిద్దిపేట జిల్లా తూప్రాన్‌లో కొత్త మార్కెట్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కొడకండ్ల మార్కెట్ కమిటీలో భాగంగా ఉన్న పాలకుర్తి మండలంలోని గ్రామాలను వేరు చేస్తూ పాలకుర్తి మార్కెట్ కమిటీని, వంటిమామిడి మార్కెట్ కమిటీలో భాగంగా ఉన్న తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని గ్రామాలను వేరు చేస్తూ తూప్రాన్ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే నిర్మల్ జిల్లా నిర్మల్ మార్కెట్ కమిటీ పరిధిలోని లక్ష్మణచందలో సబ్ మార్కెట్ యార్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
తూప్రాన్‌లో రూ.92 లక్షల మార్పిడి?
- మార్పిడి పేరుతో మోసం జరిగినట్లుగా ప్రచారం - ఇరు వర్గాల మధ్య దాడులు.. సీన్లోకి పోలీసు అధికారి తూప్రాన్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రూ.92 లక్షల నోట్ల మార్పిడిలో ఓ పోలీసు అధికారి తన చేతి వాటం చూపించినట్లుగా ప్రచారం సాగుతోంది. కొత్త నోట్లు తెచ్చిన వ్యక్తిని బెదిరించి సదరు పోలీసు అధికారి అతని సన్నిహిత వ్యాపారి కలసి రూ.92 లక్షలు నొక్కేసినట్లుగా వదంతులు వినిపిస్తున్నాయి. ఈ ఉదంతం తూప్రాన్, మనోహరాబాద్ మండలా ల్లో కలకలం సృష్టిస్తోంది. మెదక్ జిల్లా మనోహరా బాద్ మండలం కాళ్లకల్‌కు చెందిన ఓ వ్యాపారి తనకున్న పరిచయంతో హైదరాబాద్‌కు చెందిన కోడిగుడ్ల వ్యాపారితో పెద్ద నోట్ల మార్పిడి విషయం లో చర్చించినట్లు తెలిసింది. ఇందుకోసం 20 నుంచి 30 శాతం వరకు కమీషన్ కోసం ఇరువురి మధ్య ఒప్పందం జరిగినట్లు సమాచారం. కాళ్లకల్‌కు చెందిన సదరు వ్యాపారి తమ వద్ద ప్రభుత్వం రద్దు చేసిన రూ.1000, రూ.500 నోట్లు రూ.కోటి ఉన్నా యని నమ్మబలికాడు. దీంతో హైదరాబాద్‌కు చెంది న వ్యాపారి తన స్నేహితులతో చర్చించి వారి వద్ద ఉన్న రూ.92 లక్షలను గత రెండు రోజుల క్రితం సోమవారం రాత్రి కాళ్లకల్‌కు తీసుకువచ్చారు. కాగా, గ్రామ సమీపంలోని టీఎంటైర్ పరిశ్రమకు ఎదురు గా ఉన్న గ్రీన్పార్కులోకి తీసుకుని వెళ్లారు. పెద్ద మొత్తాన్ని కాళ్లకల్ వ్యాపారి చూసి పెద్ద నోట్లను తీసుకురమ్మని తన స్నేహితులకు చెబుతానని నమ్మ బలికి నలుగురు వ్యక్తులను వారు ఉన్న ప్రదేశానికి రప్పించాడు. ఇదే అదనుగా భావించి ఆ నలుగురు హైదరాబాద్ నుంచి వచ్చిన వారి వద్ద నుంచి డబ్బులు లాగేసే ప్రయత్నం చేశారు. దీంతో కాళ్లకల్‌కు చెందిన వ్యాపారి తనతో సన్నిహితంగా ఉన్న ఓ పోలీస్ అధికారికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సదరు పోలీసు అధికారి వారిని అక్కడి నుంచి చెదర గొట్టాడు. అక్కడ లభించిన రూ.27 లక్షలు వంద రూపాయల నోట్ల కట్టలను తన వెంట తీసుకెళ్లి నట్లుగా తెలిసింది. రూ.65 లక్షలు విలువ చేసే 2వేల రూపాయల నోట్ల కట్టలను కాళ్లకల్ వ్యాపారి కాజేసి నట్లుగా వీరికి ఓ స్థానిక మహిళ సహకరించినట్లుగా తూప్రాన్‌లో ప్రచారం సాగుతోంది. సోమవారం రాత్రి గాయపడిన బాధితులు హైదరాబాద్‌లో కొందరు నాయకులతో మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ‘సాక్షి’ స్థానిక డీఎస్పీని వివరణ కోరగా విషయం వాస్తవమేనని ధ్రువీకరించారు. కాళ్లకల్‌కు చెందిన వెంకట్, రాజు, మరో ఇద్దరిపై కేసు పెట్టా మన్నారు. మనోహరాబాద్ ఎస్ఐపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇందుకోసం తూప్రాన్, శివ్వం పేట ఎస్సైలు విచారణ చేపట్టినట్టు తెలిపారు. -
పరువు కోసం అన్న ఆత్మహత్య
చెల్లెలు ప్రేమ వివాహం చేసుకున్నదని.. తూప్రాన్ : చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపంతో ఓ సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోసాన్ పల్లికి చెందిన ములుగు శ్రావణ్‌కుమార్‌రెడ్డి (24) తూప్రాన్ లో కొన్నేళ్లుగా తల్లి రాణి, చెల్లెలితో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. చెల్లెలు స్వాతికి నర్సాపూర్ మండలానికి చెందిన వ్యక్తితో ఈనెల 20న నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. చెల్లెలు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోరుు ఆదివారం రాత్రి తూప్రాన్ పోలీసులను ఆశ్రరుుంచింది. చెల్లెలు కులాంతర వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెందిన శ్రావణ్ ఆదివారం రాత్రి బ్రాహ్మణపల్లి రైల్వేగేటు సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
తూప్రాన్ డివిజన్‌ను స్వాగతిస్తున్నాం
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వెల్లడి తూప్రాన్: తూప్రాన్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు నర్సాపూర్ ఎమ్మెల్యే సీహెచ్ మదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తూప్రాన్ మండలం మనోహరాబాద్ శివారులోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటును తాను వ్యతిరేకిస్తున్నట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. భౌగోళికంగా అన్ని విధాలుగా ఆలోచించిన తరువాతే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కానీ నర్సాపూర్‌కు తాలూకాగా ఓ చరిత్ర కలిగి ఉందన్నారు. అందుకు తాము తూప్రాన్‌తోపాటు నర్సాపూర్‌ను సైతం రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరుతున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తమ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్నే సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. కానీ కొందరు సీఎంతో సన్నిహితంగా ఉన్నంఽదును తూప్రాన్‌ను అడ్డుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ సమావేశంలో శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి. రమణగౌడ్, రాజశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తూప్రాన్‌ను రెవెన్యూ డివిజన్‌గానే ఉంచాలి
తూప్రాన్: ప్రభుత్వం ప్రకటించినట్లుగానే తూప్రాన్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఉంచాలని యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు అబోతు వెంకటేశ్‌యాదవ్ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తూప్రాన్ మండలంను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంపట్ల ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కాని నర్సాపూర్ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి మాత్రం తూప్రాన్ బదులుగా నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలన్నారు. అభివృద్ధిలో ముందంజలో ఉండి హైదరాబాద్ నగరానికి సమీప దూరంలో ఉన్న తూప్రాన్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయడం పట్ల ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే మండలంలో పోలీస్ సబ్‌డివిజన్, విద్యుత్ సబ్ సబ్డివిజన్లు ఉన్నాయని చెప్పారు. చాల ఏళ్ల కాలం నుంచి మండల ప్రజలు రెవెన్యూ డివిజన్ కోసం కృషి చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి మండల ప్రజల గోడును విని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడం పట్ల సర్వత్ర అభినందనలు తెలియజేశారన్నారు. కాని నర్సాపూర్ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి తమ మండల అభివృద్ధిని గుర్తించి సహకరించాల్సింది పోయి నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తించడం సమంజసం కాదన్నారు. సమావేశంలో గొర్ల కాపారుల సంఘం జిల్లా డైరక్టర్ గండి మల్లేష్ యాదవ్, యూత్ నాయకులు రాజుయాదవ్, మల్లేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్‌ను ఢీకొన్న లారీ దగ్ధం
-
విద్యుత్‌షాక్‌లతో కోనాయిపల్లి విలవిల
⇒సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా ఒకరి మృతి ⇒15 మందికి గాయాలు ⇒మృతదేహంతో విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి ⇒పోలీసుల హామీతో ఆందోళన విరమణ ⇒ఫిర్యాదు చే స్తున్నా పట్టించుకోలేదంటున్న గ్రామస్తులు తూప్రాన్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఖరీదు ఓ నిండి ప్రాణాన్ని బలిగొనడమే గాక మరో 15 మంది గాయపడ్డారు. అయితే సంబంధిత అధికారుల తీరును నిరసిస్తూ గ్రామ పరిధిలోని సబ్ స్టేషన్‌ను ముట్టడించి ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. అయితే పోలీసుల జోక్యంతో గ్రామస్తులు శాంతించారు. ఈ సంఘటన మండలంలోని కోనాయిపల్లి (పీటీ)లో మంగళవారం చోటు చేసుకుం ది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన శెట్టి నరసింహులు, భారతమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు ఆడపిల్లలకు వివాహాలు కాగా కుమారుడు శ్రీకాంత్ (20) కాళ్లకల్ గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో శ్రీకాంత్ సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. దీంతో విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు అప్పటికే పనులకు వెళ్లిన శ్రీకాంత్ తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవే స్తూ బాధితుడిని కొంపల్లిలోని లీలా ఆస్పత్రికి తరలిం చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మృతి చెందాడ ని ధ్రువీకరించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద మృతదేహంతో ఆందోళన శ్రీకాంత్ మృతికి ట్రాన్స్‌కో అధికారులే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యు లు, గ్రామస్తులు మృతదే హాన్ని గ్రామ సమీపంలో గల విద్యుత్ సబ్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఆందోళనకు దిగారు. అక్కడి గదుల కిటికీల అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సంతోష్‌కుమార్ సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పే యత్నం చేయడంతో వారు తిరగబడ్డారు. దీంతో ఎస్ఐ విషయాన్ని సీఐ సంజయ్ కుమార్‌కు తెలపడంతో ఆయన శివ్వంపేట ఎస్ఐ రాజేష్, సిబ్బందిని వెంటబెట్టుకుని గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడారు. విద్యుత్ అధికారులతో చర్చించి నష్టపరిహారంతో పాటు విద్యుత్ అధికారులపై కేసు నమోదు చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమే.. గ్రామంలోని ఓవర్‌హెడ్ ట్యాంకు వద్ద ఉన్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఎర్తింగ్ లోపంతోనే దీని పరిధిలోని ఇళ్లకు సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో షాక్ రావడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఇదే విషయాన్ని విద్యుత్ అధికారులకు చెప్పినా ఎవరూ స్పందించలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యమే గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్రాణం తీసిందని గ్రామస్తులు ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త మన్నే సురేఖ ఇంట్లో ఉదయం వంట చేసేందుకు రైస్ కుక్కర్‌తో అన్నం వండేందుకు స్విచ్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రా ణాపాయ స్థితి నుంచి బయటపడింది. ఇలా గ్రామానికి చెందిన బక్క శోభ, మ హిపాల్, మన్నే రవి, మల్లిక, పృథ్వీరా జ్, మంగమ్మలతో పాటు మరికొందరు గ్రామస్తులు విద్యుదాఘాతానికి గురై గా యపడ్డారు. ఈ విషయంపై ఏడీఈ వినోద్‌రెడ్డిని వివరణ కోరగా విద్యుదాఘాతంతో మృతి చెందిన యువకుడి కుటుంబానికి తమ శాఖ తరఫున రూ. 2 లక్షల నష్టపరిహారాన్ని మూడు నెలల్లో అందిస్తామని తెలిపారు. మండలంలోని సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లకు గల ఎర్తింగ్లను సరి చేస్తామన్నారు. -
అప్పుల బాధతో నలుగురు రైతుల ఆత్మహత్య
సాక్షి నెట్వర్క్: అప్పుల బాధతో వేర్వేరు జిల్లాల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కెపల్లికి చెందిన తలగంప తిరుపతి(31) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కింద రూ. 6 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేక తన భూమిలోనే పురుగుల మందు తాగి చనిపోయాడు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మాల్కాపూర్కు చెందిన బట్టికాడి రాజాగౌడ్(48) తన మూడెకరాల్లో బోర్లు వేసేందుకు భూమిని తాకట్టు పెట్టి రూ. 2.50 లక్షలు అప్పు చేశాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పు మొత్తం రూ. 6 లక్షలు అయ్యింది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం చెర్కుపల్లి జీపీ పరిధి గజరాలతండాకు చెందిన కాట్రావత్ పాండు (45) పది ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి వేశాడు. ఇందుకోసం సుమారు రూ. 5 లక్షలు అప్పు చేశాడు. వరి ఎండిపోగా, పత్తి దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో పెట్టుబడులూ రాలేదు. మనస్తాపం చెంది క్రిమిసంహారక మందుతాగాడు. రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మిట్టకంకల్కు చెందిన యాదమ్మ(45), అంతయ్య దంపతులకు 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశారు. యాదమ్మ పేరిట బ్యాంకులో రూ. 30 వేలు, ప్రైవేటుగా రూ. 1.7 లక్షలు అప్పు చేశారు. వర్షాలు లేక పంట దెబ్బతింది. కూతురి పెళ్లి.. ఇంటి నిర్మాణం కోసం కూడా అప్పు చేశారు. అప్పు తీరే మార్గం కనిపించక యాదమ్మ శుక్రవారం పురుగుల మందు తాగిఆత్మహత్యకు పాల్పడింది. -
కాసులు కురిపిస్త్ను కంకర దందా!
తూప్రాన్ : మండలంలో ఇసుకతో పాటు కంకర దందా కాసుల వర్షం కురిపిస్తోంది. అక్రమార్కులు నామమాత్రం అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూముల్లోని ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. మండలంలో ఘనపూర్, కూచారం, లింగారెడ్డిపేట, పాలాట గ్రామాల్లోని ప్రభుత్వ, పట్టా భూముల్లో క్వారీలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని చేస్తున్నారు. బహిరంగంగానే ఈ అక్రమ దందా కొనసాగుతున్నా.. అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్వారీల ఏర్పాటు ప్రభుత్వ అనుమతులతో అనుమతించిన నిర్ణీత ప్రదేశంలో తవ్వకాలు జరపాలి. కానీ అక్రమార్కులు మాత్రం అధికారులకు ఓ స్థలాన్ని చూపి అనుమతులు పొందిన అనంతరం మరో చోట తవ్వకాలు జరుపుతున్నారు. భారీ పేలుళ్లు పేలుస్తూ పరిసర గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ పేలుళ్ల దాటికి పెంకుటిళ్ల పైకప్పు నుంచి మట్టి రాలి మీద పడుతుండగా.. సిమెంటుతో నిర్మించుకున్న భవనాలు బీటలు వారుతున్నాయి. క్వారీల నుంచి వెలువడే దుమ్ము పక్కనే ఉన్న పంటల పొలాలపై పడి వాటిని ఎదగడం లేదు. దీంతో పంటను మొత్తం కోల్పోవాల్సి వస్తోందని పలువురు రైతులు మైనింగ్ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు. రోడ్లు గుంతల మాయంగా... క్వారీల్లోని కంకరను టిప్పర్ల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్డు గుంతల మయంగా మారుతున్నాయి. ఘనపూర్ గ్రామ సమీపంలో సుమారు ఐదు క్వారీల్లోని వాహనాలు కంకర లోడుతో రామాయిపల్లి మీదుగా కొన్ని వాహనాలు, ధర్మారాజుపల్లి, దండుపల్లిల మీదుగా మరికొన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో మండలంలోని ఘనపూర్ - రమాయిపల్లి గ్రామల మధ్య వేసిన బీటీ రోడ్డు కంకర తేలి గుంతలమయంగా మారింది. దీంతో ఈ రహదారిలో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఈ దారిగుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు.ఇప్పటికైనా గనుల శాఖ అధికారులు ఈ క్వారీలను తనిఖీలు చేసి ప్రభుత్వ వనరులను కొల్లగొడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కెనరా బ్యాంకులో భారీ చోరీ
వెల్దుర్తి, తూప్రాన్: దాచుకున్న సొమ్ములు దోచుకెళ్లిండ్రు... కాయకష్టం చేసుకుని పైసాపైస కుడబెట్టి దొంగల భయంతో నగదు, బంగారాన్ని బ్యాంకుల్లో దాచుకున్నా చోరీకి గురయ్యాయని బాధితులు విలపించారు. మంగళవారం వెల్దుర్తి మండలం 44వ జాతీయ రహదారి పక్కనే మాసాయిపేట కెనరా బ్యాంకులో చోరీ విషయం తెలిసి బాధితులంతా పరుగుపరుగున సంఘటాన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సొమ్మును బ్యాంకులోని లాకర్లలో దాచుకునేందుకు ఏడా దికి రూ.1,400 చెల్లిస్తున్నామని తెలిపారు. ఆభరణాలు, నగదు... సినీఫక్కీలో దోపిడీకి పాల్పడిన దొంగల ముఠా సభ్యులు బ్యాంకుకు కన్నం వేసి బీరువాలో దాచి ఉంచిన రూ.15 లక్షల నగదు, వ్యవసాయ రుణాలు పొందేందుకు రైతులు తాకట్టు పెట్టిన సుమారు ఐదు కిలోల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బ్యాంకు లోపలి గదిలో లాకర్లలో ఖాతాదారులు దాచి ఉంచిన ఆరు లాకర్లను ధ్వంసం చేసి నగదు, బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. దోపిడీకి పాల్పడింది ఇలా... బ్యాంకు దోపిడీ చేసేందుకు ముందుగానే పతకం పన్నినట్లు దొంగతనం చేసిన తీరును పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అర్ధరాత్రి సమయంలో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న బ్యాంకును చోరీ కోసం ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుకు రహదారి వైపు ఉన్న దుకాణాల వెనుక కిటికీని ఎంచుకుని కన్నం వేశారు. అనంతరం లోపలికి ప్రవేశించి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి స్ట్రాంగ్‌రూంకు రంధ్రం చేసి లాకర్లను పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అనంతరం బ్యాంకు పక్కనే ఉన్న తన ఇంటి తాళం పగులగొట్టి రూ.1,500 దోచుకెళ్లినట్లు బాధితుడు నరేందర్ తెలిపాడు. విషయం తెలిసిందిలా... ఉదయం బ్యాంకు సిబ్బంది బాషా, గోపాల్‌లు బ్యాంకును తెరిచేందుకు వెళ్లారు. దోపిడీ జరిగినట్లు గుర్తించి వెంటనే బీఎం ఇసాక్‌కు, బ్యాంకు అధికారులకు విషయం తెలిపారు. ఉదయం 10గంటలకు స్థానిక బ్యాంకు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దోపిడీ విషయం తెలుసుకున్న ఖాతాదారులు, పెద్ద సంఖ్యలో అక్కడకు చేరారు. అప్పటికే తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సంజాయ్కుమార్, రామయంపేట సీఐ నందీశ్వర్, ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి, చేగుంట ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిలు పోలీసు బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు లోపల చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, దోపిడీ జరిగిన తీరును గమనించి వెంటనే క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. వారు మధ్యాహ్నం 12.45 నిమిషాలకు సంఘటన స్థలానికి చేరకున్నారు. వేలిముద్రలను సేకరించారు. డాగ్‌స్క్వాడ్ మాత్రం బ్యాంకు ఆవరణలో కలియ తిరిగి అనంతరం బ్యాంకు సమీపంలోని వ్యవసాయ పొలాల్లోంచి రైల్వే స్టేషన్ వరకు నిలిచిపోయింది. త్వరలోనే పట్టుకుంటాం... బ్యాంకు దోపిడీకి పాల్పడింది అంతరాష్ట్ర ముఠా సభ్యులుగా భావిస్తున్నట్లు తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. బీహార్, గుల్బార్గా ముఠా సభ్యులు మాత్రమే ఇలాంటి దోపిడీలకు పాల్పడుతారని తెలిపారు. చేగుంట, రామయంపేట ఎస్ఐల ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్‌లలో ఉన్న పాత నేరస్తులను విచారించి త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు. గతంలోనే బ్యాంకు అధికారులకు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. -
51 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
మెదక్: మెదక్ జిల్లా తుప్రాన్లోని ఓ ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి... 51 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 సెల్ ఫోన్లతోపాటు రూ. 65 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. తుప్రాన్‌లో పేకాట రాయుళ్ల ఇటీవల కాలంలో మరింత రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తరచుగా పలు నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించారు.