నాగులపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం (ఫైల్)
తూప్రాన్ : శ్రీరామ నవమి రోజున 44వ జాతీయ రహదారిపై నాగులపల్లి చౌరస్తా వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటనతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట పడేదెలా అని పలువురు చర్చించుకున్నారు. నాయకులు, అధికారులు మేల్కోకపోతే ఈ మరణమృదంగం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. రహదారిపై జరుగుతున్న ప్రమాదాలపై ప్రత్యేక కథనం..
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్‌లోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న క్రాసింగ్‌లు మృత్యుకుహరాలుగా మారాయి, క్రాసింగ్‌ల వద్ద తరచూ ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయి. మండలంలోని నాగులపల్లి చౌరస్తా, కరీంగూడ చౌరస్తా, దాబా హోటళ్ల వద్ద, మనోహరాబాద్ చౌరస్తా, కూచా రం చౌరస్తా, బంగారమ్మ దేవాలయం వద్ద, జనతా హోటల్ వద్ద ఉన్న క్రాసింగ్‌లు ప్రమాదాలకు నిలయంగా మారి ఎందరినో బలిగొంటున్నాయి. నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నా.. హైవే అథారిటీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
ప్రమాదాల వివరాలు
మండలంలో తొమ్మిదేళ్ల కాలంలో హైవేపై జరిగిన ప్రమాదాల్లో 287 మంది మృత్యువాత పడినట్లు పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి. ఇందులో 406 మందికి పైగా గాయపడ్డారు. వికలాంగులుగా మారిన వారి జీవనోపాధి మరీ దయనీయంగా మారింది. పోలీ సుల రికార్డుల్లో నమోదు కాని ప్రమాదాలు మరెన్నో ఉన్నాయి. హైవే అథారిటీ అధికారులు క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల హెచ్చరికల సూచికల బోర్డులు, సిగ్నళ్లు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. నాలుగు లేన్ల దారి అయిందని సం తో ష పడాలో, లేక ప్రమాదాల బారిన పడుతున్నందుకు బాధపడాలో తెలి యని దుస్థితిలో వాహనచోదకులు, బాటసారులు కొట్టుమిట్టాడుతున్నారు.
నాగులపల్లి చౌరస్తా క్రాసింగ్ వెరీ డేంజర్:
మండలంలోని 44వ జాతీయ రహదారి విస్తరణ పనులు 2006 సెప్టెంబరు 26న ప్రారంభించారు. అంతకు ముందు 7వ నంబరు జాతీయ రహదారిగా తూప్రాన్ పట్టణం మధ్యలోంచి ఈ దారి ఉండేది. తర్వాత ఇదే 44వ నంబరు జాతీయ రహదారిగా మారింది. అయితే విస్తరణంలో భాగంగా నాగులపల్లి చౌరస్తా వద్ద, కరీంగూడ చౌరస్తా వద్ద వంతెనలు ఏర్పాటు చేయలేదు. అప్పట్లో ఎవరూ ప్రతిపాదనలు చేయకపోవడం, హైవే అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వంతెనలు నిర్మించకపోవడంతో ఈ ప్రదేశాలు ప్రయాణికుల పాలిట యమపాశాలుగా మారాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో రోజూ ఏదో ఓ చోట ప్రమాదం జరుగుతూనే ఉంది.
ఇదిలా ఉంటే బైపాస్ మార్గంలో ఏర్పాటు చేసిన దాబా హోటళ్ల వద్ద వాహనాలను రాత్రి వేళల్లో రహదారిపై నిలిపి భోజనాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రహదారి దాటేటప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే వాహనాలకు సైడ్ ఇంటికేటర్లు వేయడం లేదు. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. క్రాసింగ్‌ల వద్ద వాహనాల స్పీడ్ తగ్గించేందుకు ఎలాంటి కంట్రోల్ వ్యవస్థ లేదు. స్పీడ్ బ్రేకర్లు లేవు. రేడియం స్టిక్కర్లు లేవు. హెచ్చరిక బోర్టులు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా వాహనాలు అతివేగంగా వచ్చి ఢీకొట్టుకుంటున్నాయి.
త్వరలో రూ.34 కోట్లతో వంతెన పనులు
గత ఏడాదినాగులపల్లి చౌరస్తా వద్ద వంతెన నిర్మాణం కోసం నేషనల్ హైవే పీడీతో కలిసి ఎంపీలు స్థల పరిశీలన చేశారు. అనంతరం వంతెన నిర్మాణం కోసం రూ.34 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇటీవల తూప్రాన్‌కు చెందిన అధికారు పార్టీ నేతలు వంతెన ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు.
త్వరలోనే వంతెన పనులు
44వ జాతీయ రహదారిపై నాగులపల్లి చౌరస్తా వద్ద జరుగుతన్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.34కోట్ల నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం.
–నేషనల్ హైవే పీడీ మీర్ అమీద్ అలీ
Comments
Please login to add a commentAdd a comment