తూప్రాన్, న్యూస్‌లైన్: పొదుపు డబ్బులను ఒకే గ్రూపునకు రెండుసార్లు జమచేసి, వాటిలో కొంత డబ్బును తిరిగి తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. ఇది గమనించిన సభ్యులు అధికారులను నిలదీశారు. దీనిపై అధికారులు వివరణ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఘనపూర్ పంచాయతీ పరిధిలోని వెంకటాపూర్‌కు చెందిన తులసీ గ్రూపు సంఘం సభ్యులకు గత ఏడాది మే 18న రుణం డబ్బులు రూ.50 వేలను పొదుపు ఖాతాలో ఐకేపీ సీఏ అమృత జమ చేశారు. అలాగే మరుసటి రోజు తిరిగి రూ.50 వేలను తులసీ గ్రూప్‌నకు చెందిన ఖతాలో పొరపాటున జమచేశారు.
ఇది గమనించిన వారు వెంటనే ఆ ఖాతాలో పొరపాటున జమ చేసిన రూ.50 వేలను బ్యాంకు నుంచి డ్రా చేసి అదే గ్రామానికి చెందిన మరో గ్రూపు దీవెనాకు రుణంగా ఇచ్చారు. అయితే తులసీ గ్రూపు నకు చెందిన బ్యాంకు పాసు పుస్తకంలో రూ.50 వేల చొప్పున రెండు మార్లు ఉండడంతో గ్రామస్తులు గమనించి ఆదివారం గ్రామానికి వచ్చిన ఐకేపీ సీఏ.అమృత, సీసీ మమతలను నిలదీశారు. దీంతో గందరగోళ నెలకొంది. జరిగిన విషయాన్ని అధికారులు వివరించడంతో గ్రామస్తులు, గ్రూపు సభ్యులు శాంతిం చారు. అయితే మొదట ఐకేపీ సీఏ, సీసీలు పొంతన లేని సమాధానాలు చెప్పాడంతో గ్రామస్తులు అనుమానించారు.
తులసీ గ్రూపు సభ్యులకు కేవలం రూ.50 వేల రుణం మాత్రమే ఇచ్చామని గ్రామస్తుల సమక్షంలో తీర్మానం రాసి ఇచ్చారు. ఈ విషయంలో ‘న్యూస్‌లైన్’ ఐకేపీ ఎపీఎంను వివరణ కోరగా గ్రామానికి చెందిన తులసీ గ్రూపునకు చెందిన పొదుపు డబ్బుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని, బ్యాంకులో పొరపాటున వారి ఖాతాలో డబ్బులు జమచేశామన్నారు. అయినా తమ సిబ్బంది వెంటనే సరి చేశారని తెలిపారు.
పొదుపు డబ్బుల జమలో గందరగోళం
Published Sun, Jan 12 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement