అరకొర సరఫరాపై రైతన్నల ఆగ్రహం | farmers angry on insufficient supplies | Sakshi
Sakshi News home page

అరకొర సరఫరాపై రైతన్నల ఆగ్రహం

Published Mon, Jan 13 2014 11:25 PM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM

farmers angry on insufficient supplies

తూప్రాన్, న్యూస్‌లైన్:  రైతులకు పండుగనాడూ కరెంటు కష్టాలు తప్పలేదు. వ్యవసాయానికి సర్కార్ ఇస్తామన్న 7 గంటల సరఫరాలో కేవలం గంట మాత్రమే విద్యుత్ ఇస్తుండడంతో ఆగ్రహించిన నాగులపల్లి గ్రామ రైతులు గ్రామ సమీపంలోని 33/11 సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అంతటితో ఆగకుండా సబ్‌స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న లైన్‌మన్ జీవన్‌రెడ్డి, ఆపరేటర్లు రాజిరెడ్డి, రాజేష్‌లను గదిలో నిర్బంధించి తాళం వేశారు. ట్రాన్స్‌కో ఏఈ వచ్చి తమ సమస్య పరిష్కరిచేంత వరకూ సబ్‌స్టేషన్ నుంచి కదలబోమని భీష్మించుకుని కూర్చున్నారు.

 విషయం తెలుసుకున్న పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు.  గ్రామ సర్పంచ్ ఏశబోయిన శ్రీశైలంయాదవ్ ఫోన్‌లో ట్రాన్స్‌కో అధికారులను సంప్రదించి సమాచారం తెలిపినా,అధికారులు సంఘటన స్థలానికి రాలేదు. దీంతో మరింత ఆగ్రహించిన రైతులు తమ ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు రైతు లు, వారం రోజులుగా వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంటును రెం డు, మూడు గంటలు మాత్రమే అందిస్తున్నారని, ఆదివారం మాత్రం గంట సేపు సరఫరా ఇచ్చారన్నారు.

అయినప్పటికీ రికార్డుల్లో మాత్రం ఎక్కువ గంటలు సరఫరా చేసినట్లు నమోదు చేశారన్నారు. ట్రాన్స్‌కో ఏఈ వచ్చి తమ సమస్య పరిష్కరించేంత వరకు తాము ఇక్కడి నుంచి కదలబోమన్నారు. దీం తో పోలీసులు ట్రాన్స్‌కో అధికారులను ఫోన్ సంప్రదించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ట్రాన్స్‌కో లైన్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం, వ్యవసాయానికి తప్పకుండా ఏడు గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.

 సబ్‌స్టేషన్ ముట్టడి
 కొల్చారం: వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండల పరిధిలోని సంగాయిపేట గ్రామ రైతులు వరిగుంతం సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగించినా ట్రాన్స్‌కో అధికారులెవరూ అక్కడకు రాకపోవడంతో రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన పలువురు రైతులు,  రెండు రోజుల్లో సమస్య పరిష్కరించి సాగు కు 7 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు.

నాట్లువేసే సమయం లో సాగుకు విద్యుత్ కోతలేమిటంటూ ప్రశ్నించారు. సాగుకు 7 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తామన్న సర్కార్, 3 గంటలు కూడా ఇవ్వడం లేదనీ, అందులోనూ కోతలు విధిస్తూ రైతులు వేధించడం దారుణంగా ఉందన్నారు. ప్రస్తుతం నాట్లు వేసేం దుకు సిద్ధమైన తాము  విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement