నీరులేని ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ
బనగానపల్లె (కర్నూలు): జలాశయాల్లో నీరు ఉన్నా.. శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్‌బీసీ), జీఎన్‌ఎస్‌ఎస్(గాలేరి–నగరి సుజల స్రవంతి) కాలువకు విడుదల చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. దీంతో ఆయకట్టు కింద ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం ఆదివారం నాటికి 873 అడుగులకు చేరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా
17,500 క్యూసెక్కుల నీటిని తెలుగంగ, కేసీ ఎస్కేప్ కాలువలకు విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఎస్సార్బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌కు కూడా నీరు వదలాలి. అయితే ఆ విధంగా జరగకపోవడంతో ఖరీఫ్ సాగు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
నారుమళ్లు పోసుకోవాలా..వద్దా?
జూలై చివరి నాటికి శ్రీశైలం ప్రాజెక్టులోకి 873 అడుగుల నీటిమట్టం చేరుకోవడం ఇదే మొదటిసారి. దీంతో వరినారుమళ్లు పోసేందుకు మంచి సమయంగా రైతులు భావించారు. ఎస్సార్బీసీ ద్వారా నీటి విడుదల జరుగుతుందని అధికారులు పేర్కొనడంతో రైతుల్లో ఆశలు చిగురించా యి. అయితే నీటిని ఎప్పుడు విడుదల చేసేది అధికారుల స్పష్టత ఇవ్వడం లేదు. ప్రస్తుతం నారుమళ్లు పోసుకునేందుకు 500 క్యూసెక్కుల నీటినైనా విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
ఒట్టిపోయిన జీఎన్‌ఎస్‌ఎస్
పోతిరెడ్డిపాడు నుంచి అవుకు రిజర్వాయర్ వరకు సుమారు 82 కి.మీ. పొడవున జీఎన్‌ఎస్‌ఎస్ వరదకాల్వ ఉంది. 20 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ఈ కాల్వ ద్వారా గత ఏడాది 5వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేశారు. ఈ ఏడాది 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కాల్వ ద్వారా విడుదల చేసిన నీరు అవుకు రిజర్వాయర్ చేరి అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లా గండికోట రిజర్వాయర్‌కు వెళ్తాయి.
ఈ పద్ధతిలో అవుకు రిజర్వాయర్ నిండి గండికోట రిజర్వాయర్‌కు చేరాలంటే కనీసం నెలరోజులు సమయం పడుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు ఇప్పుడు నీటిని విడుదల చేస్తే సెప్టెంబర్ మొదటి వారానికి గాని గండికోట రిజర్వాయర్‌కు చేరే అవకాశం ఉండదు. ప్రధాన కాల్వకు ఇరువైపులా లైనింగ్ లేనందున నీటి విడుదల జరిగితే పరివాహక ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగి వ్యవసాయ బోర్ల ద్వారా పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment