canal work
-
పోలవరం డిస్ట్రిబ్యూటరీల పనులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టులో హెడ్ వర్క్స్ (జలాశయం), కుడి, ఎడమ కాలువల పనులను కొలిక్కితెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. 7.2 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువల (డిస్ట్రిబ్యూటరీ) పనులకూ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వీటి సర్వే పనులను పూర్తిచేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించింది. డీపీఆర్ అందగానే.. డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్లు పిలిచి పనులను శరవేగంగా పూర్తిచేసి ఆయకట్టుకు 2022లో నీళ్లందించేలా చర్యలు చేపట్టింది. ► ప్రాజెక్టును పూర్తిచేయడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళిక మేరకు హెడ్ వర్క్స్.. కుడి, ఎడమ కాలువలు, పునరావాసం కల్పన పనులను వేగవంతం చేసింది. ► మే, 2021కు స్పిల్ వే.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసి వాటికి సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనులు చేపట్టాలని అధికారులకు నిర్దేశించింది. ► జూన్, 2021లో గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి, ఈసీఆర్ఎఫ్ పనులను వరద సమయంలోనూ కొనసాగించి డిసెంబర్, 2021 నాటికి జలాశయం పనులను పూర్తిచేసే దిశగా చర్యలు చేపట్టింది. ఆలోగా జలాశయాన్ని కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీలను సిద్ధంచేయనుంది. ఆయకట్టుకు నీళ్లందించే పనులకు మోక్షం ► పోలవరం కుడి కాలువ ద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. కృష్ణా డెల్టాలోని 13.09 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలి. ► ఎడమ కాలువ కింద తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. ఆయకట్టుకు నీళ్లందించాలంటే ప్రధాన కాలువ నుంచి బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువలు తవ్వాలి. కానీ, గత సర్కార్ వీటిపై దృష్టి పెట్టలేదు. ► దీంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టడానికి సర్వే పూర్తిచేయగా డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. అనంతరం టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. ఎడమ కాలువ పనులపై ప్రత్యేక దృష్టి ► దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలోనే కుడి కాలు వ పనులు పూర్తయ్యా యి. ఎడమ కాలువ పనుల్లో మిగిలిన పనులను గత సర్కార్ పూర్తి చేయలేకపోయింది. ► ఒకటి, ఐదు, ఆరు, ఎనిమిది ప్యాకేజీ పనులను కొత్తవారికి అప్పగించి, గడువులోగా పూ ర్తిచేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. అనుకున్న సమయానికి పూర్తి చేస్తాం సీఎం వైఎస్ జగన్ నిర్దేశించిన గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం. ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులకు సంబంధించిన సర్వే పూర్తయింది. డీపీఆర్ అందగానే టెండర్లు పిలుస్తాం. ప్రాజెక్టు పూర్తయ్యేలోగా డిస్ట్రిబ్యూటరీలను పూర్తిచేసి 2022 నాటికి ఆయకట్టుకు నీళ్లందించే దిశగా చర్యలు చేపట్టాం. – సుధాకర్‌బాబు, సీఈ, పోలవరం -
కాలువలు మరిచారా?
ఇంద్రవెల్లి(ఖానాపూర్): రైతుల మెట్ట భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో మండలంలోని ముత్నూర్ శంకగర్గూడ గ్రామపంచాయతీల పరిధిలో 2005లో త్రివేణి సంఘం చెరువు నిర్మించారు. కాని ఎడమ, కుడి కాలువలు నిర్మించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో రైతులకు సాగునీరు అందక వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారు. 15 ఏళ్లుగా రైతులు ఆశతో సాగునీటి కోసం ఎదురుచూస్తేనే ఉన్నారు. రూ.3.70కోట్లతో చెరువు నిర్మాణం మండలంలోని ముత్నూర్, శంకర్‌గూడ, కేస్లాపూర్, మెండపల్లి, మెండపల్లిగూడ, దుర్వగూడ, గౌరపూర్, చిత్తబట్ట,« ధర్మసాగర్, మల్లాపూర్ తదితర గ్రామాల పరిధిలోని సుమారు 1500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2005లో నీటిపారుదలశాఖ రూ.3.70కోట్లతో ముత్నూర్, శంకర్‌గూడ గ్రామాల మధ్య సుమారు 150ఎకరాల విస్తీర్ణంలో త్రివేణి సంఘం చెరువు నిర్మాణం చేపట్టారు. 14 సంవత్సరాలు పూర్తి కావస్తున్న చెరువు కుడి, ఎడమ కాలువలు మాత్రం నిర్మించలేదు. దీంతో చెరువు కేవలం చేపలు పెంచడానికి మాత్రమే పరిమితమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కాలువలను నిర్మించాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. కాలువల నిర్మాణానికి రూ.2కోట్లు మండలంలోని ముత్నూర్ గ్రామ సమీపంలో నిర్మించినా త్రివేణి సంఘం చెరువు కుడి, ఎడమ కాలువు నిర్మించడానికి మూడు సంవత్సరాల క్రితం నీటిపారుదల శాఖ సర్వే చేసింది. ఎడమ, కుడి కాలువలు నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేసింది. నిధులు మంజూరై మూడేళ్లవుతున్నా స్థానిక నీటిపారుదల, రెవెన్యూశాఖల అధికారుల నిర్లక్ష్యంతో కాలువల నిర్మాణ పనులు కదలడం లేదు. చెరువు కింద భూములు పోతున్న రైతులు తమకు పరిహారం గిట్టుబాటుకాదని భూములు ఇవ్వడం లేదు. ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించకపోవడంతో కాలువల నిర్మాణం ముందుకు సాగడం లేదు. చెరువుకు కాలువలు నిర్మిస్తే తమ భూములకు సాగునీరు వస్తోందని ఆశతో ఉన్న ఆ ప్రాంత రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి కాలువలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. సర్వే చేసినా ఫలితం లేదు.. ముత్నూర్ త్రివేణి సంఘం చెరువు నిర్మించారు. కానీ కాలువల నిర్మాణం మర్చిపోయారు. మూడు సంవత్సరాలుగా అధికారులు సర్వే చేస్తున్నా కాలువలు మాత్రం నిర్మించడం లేదు. దీంతో మా వ్యవసాయ భూములకు సాగునీరు అందడం లేదు. చెరువుల్లో ఈ ప్రాంత రైతుల వ్యవసాయ భూములకు సరిపడా సాగునీరు ఉన్నా ఫలితం లేదు. దీంతో కేవలం వర్షాధార పంటలపైనే ఆధారపడి సాగు చేస్తున్నాం. – తొడసం సంపత్‌రావు, రైతు ముత్నూర్ అసంపూర్తిగా ఎడమ కాలువు -
కాలువ పేరుతో కోట్లు దోపిడీ
సాక్షి, కావలి: నిన్నటి వరకు కావలి అధికార పార్టీ నాయకులుగా బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ నిధుల దోపిడీని యథేచ్ఛగా కొనసాగించారు. నిధుల లూటీలో ఒక వనరుగా ‘కావలి కాలువ’ను ఎంచుకొన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కావలి కాలువ మరమ్మతుల కోసం రూ.55 కోట్లు నిధులు మంజూరయ్యాయి. బీద సోదరులు బినామీలుగా అవతరించి తెరమీద ఉతుత్తి కాంట్రాక్టర్లను పెట్టి, తెర వెనుక ఈ నిధులను కొల్లగొట్టే పనిని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. నియోజకవర్గానికి ఉన్న ప్రధాన సాగునీటి వనరు కావలి కాలువ. సాగునీటిని సంగం బ్యారేజ్ నుంచి ప్రారంభమయ్యే కావలి కాలువకు సోమశిల ప్రాజెక్ట్ నుంచి వదులుతారు. 1974లో నిర్మించిన కావలి కాలువ 67 కిలోమీటర్ల పొడవు ఉంది. కాగా కావలి కాలువ కింద ఉండే పొలాలకు మాత్రం సోమశిల జలాలు ఏనాడు పుష్కలంగా అందిన దాఖలాలు లేవు. ఏటా ఒక్క రబీ సీజన్లో మాత్రమే ఒక్క కారు మంటనే రైతులు ఈ కాలువ కింద 1.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. అయితే వర్షాలు బాగా కురిసి చెరువుల్లో గుంటల్లో, వాగుల్లో నీరు ఉంటే మాత్రం రైతులు ఈ జలాలపై ఆశలు పెట్టుకోరు. టీడీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్ల కాలంలో వర్షాలు కురవకపోవడంతో సోమశిల జలాలపై ఆశలు పెటుకున్న రైతులకు ఆ నీరు రాక పంటలు సాగు చేసుకోలేక పోయారు. దీనివల్ల నియోజకవర్గంలోని 40 వేల ఎకరాల భూమి బీడుగా మారిపోయింది. కరెంట్ మోటార్ల కింద సాగు చేసిన రైతులు అరకొరగా పండించుకొన్నారు. కనీసం ఆరుతడి పంటలైన పత్తి, పెసర, శనగ సాగు చేసుకోవడానిరి కూడా కావలి కాలువ ద్వారా సోమశిల జలాలు రైతులకు అందలేదు. దీంతో కొద్దిపాటి సాగునీరు కూడా లేక ఆరుతడి పంటలు ఎండిపోవడంతో కావలి కాలువ కింద రైతులు తీవ్రంగా నష్టపోయారు. సరిగ్గా రైతులు సాగునీటి సమస్యతో కుమిలిపోతున్న వైనాన్ని గుర్తించి, కాలువ మర్మమ్మతుల పేరుతో ఈ ఐదేళ్ల కాలంలో రూ.55 కోట్లు మంజూరు అయినప్పటికీ, నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. సోమశిల జలాలు మాత్ర కావలి రైతులకు చుక్క కూడా అందలేదు. ఇది ఇలా ఉండగా ఇటీవల రూ.17 కోట్లు నిధులు కాలువ మరమ్మతులకు మంజూరు అయ్యాయి. ఈ నిధులను కూడా బినామీల ద్వారా కాజేయడానికి త్వరితగతిన టెండర్లు పూర్తి చేయాలని హడావుడి చేశారు. కాని ఆదివారం ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఈ లూటీ వ్యవహారాన్ని పక్కన పెట్టేశారు. ఐదేళ్లలో నీళ్లు చూడనేలేదు మా గ్రామాలకు సోమశిల నీళ్లు అనేది ఈ ఐదేళ్లలో చూడలేదు. వర్షాలు కూడా లేకపోవడంతో వరి సేద్యం చేయడమే మానుకున్నాం. భూములు బీడులుగా మారిపోయాయి.- జంపాని రాఘవులు గౌడ్, రైతు, చెంచుగానిపాళెం, కావలి రూరల్ మండలం సాగునీరు ఇవ్వకుండా జలపూజలు పొద్దస్తమానం జలపూజ అంటూ టీడీపీ నాయకులు కాలక్షేపం చేశారే కానీ, కావలి కాలువ నుంచి మా పొలాలకు సాగునీటిని అందించలేదు. ప్రతి రబీ సీజన్‌కు ముందు ప్రతి ఒక్క ఎకరా కు నీరు ఇస్తామని సినిమా డైలాగులు చెప్పడం, పేపర్లులో రాయించుకోవడం తప్ప అసలు నీరు ఎక్కడ ఇచ్చారు. ఇలాగే గడిచిపోయింది ఈ ఐదేళ్ల కాలం అంతా.- చీకుర్తి కోటయ్య యాదవ్, రైతు, అన్నగారిపాలెం, కావలి రూరల్ మండలం -
ఖతార్ దేశం ఇకపై ద్వీపం!
రియాద్: ఇప్పటికే సంబంధాలు దెబ్బతిన్న సౌదీ అరేబియా, ఖతార్‌ల మధ్య చిచ్చుపెట్టే మరో అంశం తెరపైకొచ్చింది. ఖతార్ సరిహద్దులో 60 కి.మీ పొడవు, 200 మీటర్ల వెడల్పుతో ఓ కాలువను తవ్వాలని సౌదీ అరేబియా యోచిస్తోంది. ఈ కాలువ వల్ల ద్వీపకల్పంగా ఉన్న ఖతార్ దీవిగా మారుతుందని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్టు సాకారమైతే సౌదీ ప్రధాన భూభాగం నుంచి ఖతార్ ద్వీపకల్పం పూర్తిగా వేరుపడుతుందని తెలిపాయి. కాలువలో కొంత భాగాన్ని అణు వ్యర్థాల శుద్ధి ప్లాంట్‌కు కేటాయించాలని సౌదీ ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్లు తెలిసింది. ప్రతిపాదిత సాల్వా దీవి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉందని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సలహాదారుడు సౌద్ అల్–కాటాని శుక్రవారం ట్వీట్ చేశారు. ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఇరాన్‌కు సన్నిహితంగా మెలుగుతోందని ఆరోపిస్తూ సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు గతేడాది ఏప్రిల్‌లో ఖతార్‌తో దౌత్య సంబంధాలు తెంచుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఖతార్‌కు ఉన్న ఏకైక భూ సరిహద్దును మూసేసారు. ఆ దేశ విమానాలు తమ గగనతలాన్ని వినియోగించుకోకుండా పొరుగుదేశాలు నిషేధం విధించాయి. సంక్షోభాన్ని పరిష్కరించడంలో అమెరికా, కువైట్ల మధ్యవర్తిత్వం విఫలమైంది. సాల్వా కాలువ ప్రాజెక్టుపై ఖతార్ స్పందించలేదు. -
నీరు పుష్కలం.. విడుదలలో జాప్యం
బనగానపల్లె (కర్నూలు): జలాశయాల్లో నీరు ఉన్నా.. శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ), జీఎన్ఎస్ఎస్(గాలేరి–నగరి సుజల స్రవంతి) కాలువకు విడుదల చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. దీంతో ఆయకట్టు కింద ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం ఆదివారం నాటికి 873 అడుగులకు చేరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 17,500 క్యూసెక్కుల నీటిని తెలుగంగ, కేసీ ఎస్కేప్ కాలువలకు విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఎస్సార్బీసీ, జీఎన్ఎస్ఎస్కు కూడా నీరు వదలాలి. అయితే ఆ విధంగా జరగకపోవడంతో ఖరీఫ్ సాగు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నారుమళ్లు పోసుకోవాలా..వద్దా? జూలై చివరి నాటికి శ్రీశైలం ప్రాజెక్టులోకి 873 అడుగుల నీటిమట్టం చేరుకోవడం ఇదే మొదటిసారి. దీంతో వరినారుమళ్లు పోసేందుకు మంచి సమయంగా రైతులు భావించారు. ఎస్సార్బీసీ ద్వారా నీటి విడుదల జరుగుతుందని అధికారులు పేర్కొనడంతో రైతుల్లో ఆశలు చిగురించా యి. అయితే నీటిని ఎప్పుడు విడుదల చేసేది అధికారుల స్పష్టత ఇవ్వడం లేదు. ప్రస్తుతం నారుమళ్లు పోసుకునేందుకు 500 క్యూసెక్కుల నీటినైనా విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఒట్టిపోయిన జీఎన్ఎస్ఎస్ పోతిరెడ్డిపాడు నుంచి అవుకు రిజర్వాయర్ వరకు సుమారు 82 కి.మీ. పొడవున జీఎన్ఎస్ఎస్ వరదకాల్వ ఉంది. 20 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ఈ కాల్వ ద్వారా గత ఏడాది 5వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేశారు. ఈ ఏడాది 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కాల్వ ద్వారా విడుదల చేసిన నీరు అవుకు రిజర్వాయర్ చేరి అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లా గండికోట రిజర్వాయర్‌కు వెళ్తాయి. ఈ పద్ధతిలో అవుకు రిజర్వాయర్ నిండి గండికోట రిజర్వాయర్‌కు చేరాలంటే కనీసం నెలరోజులు సమయం పడుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు ఇప్పుడు నీటిని విడుదల చేస్తే సెప్టెంబర్ మొదటి వారానికి గాని గండికోట రిజర్వాయర్‌కు చేరే అవకాశం ఉండదు. ప్రధాన కాల్వకు ఇరువైపులా లైనింగ్ లేనందున నీటి విడుదల జరిగితే పరివాహక ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగి వ్యవసాయ బోర్ల ద్వారా పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. -
కాలువల పనుల్లో 75 శాతం అక్రమాలే
-పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు -సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ అమలాపురం : జిల్లాలో కాలువల మూసివేత సమయంలో చేపట్టిన రిటైనింగ్ వాల్స్, ఇతర కట్టడాల పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు ఆరోపించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాలువలకు నీరు విడుదల చేసిన తర్వాత కూడా పనులు కొనసాగించి, నీరు విడుదల చేసినా కొన్ని ప్రాంతాలకు నీరు ఆపి పనులను హడావుడిగా, నాణ్యతా లోపాలతో పనులు చేశారన్నారు. వాస్తవానికి 25 శాతం పనులే పూర్తయ్యాయని, మిగిలిన 75 శాతం పనులను కాలువలకు నీరు వచ్చేసిందన్న సాకుతో హడావుడితో, అక్రమాలతో పూర్తి చేశారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు ఆ 75 శాతం పనులు ఇష్టారాజ్యంగా చేసుకుని బిల్లులు పొందారని ధ్వజమెత్తారు. దీనిపై కలెక్టర్‌తోపాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీ పాలనపై 16న చార్జిషీటు కేంద్ర రాష్ట్రాలో బీజేపీ, టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత గత మూడేళ్లలో ప్రభుత్వాల వైఫల్యాలపై పీసీసీ ఈనెల 16న విజయవాడలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చేతుల మీదుగా చార్జిషీటు విడుదల చేయనున్నట్టు రుద్రరాజు చెప్పారు.2004–2014 మధ్య యూపీఏ పాలనను, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ఈ మూడేళ్ల ఎన్డీఏ, టీడీపీ పాలనతో పోల్చి అప్పట్లో ఏ నిర్ణయాల ద్వారా ప్రజలకు ఎక్కువ లబ్ధి చేకూరింది, ఇప్పుడు ప్రజలు ఏఏ నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నారో ఈ చార్జిషీటులో సవివరంగా ఉంటుందని చెప్పారు. జన్మభూమి కమిటీలతో స్వపరిపాలన స్ఫూర్తికి భంగం టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలకే పెత్తనం ఇచ్చి గ్రామాల్లో స్వపరిపాలన స్ఫూర్తికి, రాజ్యాంగంలోని 73, 74 సవరణల మార్గదర్శకాలకు విఘాతం కలిగిస్తోందని రుద్రరాజు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారుల ప్రమేయం లేకుండా జన్మభూమి కమిటీలే శాసిస్తున్నాయని చెప్పారు. వీటిని రాజ్యాంగ విరుద్ధమైన చర్యల కింద పరిగణించాల్సి ఉన్నా అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లతో మాట్లాడలేకపోతున్నారన్నారు. విలేకరుల సమావేశంలో పీసీసీ కార్యదర్శులు వంటెద్దు బాబి, యార్లగడ్డ రవీంద్ర, ఎండీ ఆరిఫ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, కొత్తూరి శ్రీను, ములపర్తి సత్యనారాయణ, షహెన్ షా తదితరులు పాల్గొన్నారు.