
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టులో హెడ్ వర్క్స్ (జలాశయం), కుడి, ఎడమ కాలువల పనులను కొలిక్కితెస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. 7.2 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువల (డిస్ట్రిబ్యూటరీ) పనులకూ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వీటి సర్వే పనులను పూర్తిచేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించింది. డీపీఆర్ అందగానే.. డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్లు పిలిచి పనులను శరవేగంగా పూర్తిచేసి ఆయకట్టుకు 2022లో నీళ్లందించేలా చర్యలు చేపట్టింది.
► ప్రాజెక్టును పూర్తిచేయడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళిక మేరకు హెడ్ వర్క్స్.. కుడి, ఎడమ కాలువలు, పునరావాసం కల్పన పనులను వేగవంతం చేసింది.
► మే, 2021కు స్పిల్ వే.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసి వాటికి సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనులు చేపట్టాలని అధికారులకు నిర్దేశించింది.
► జూన్, 2021లో గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి, ఈసీఆర్‌ఎఫ్ పనులను వరద సమయంలోనూ కొనసాగించి డిసెంబర్, 2021 నాటికి జలాశయం
పనులను పూర్తిచేసే దిశగా చర్యలు చేపట్టింది. ఆలోగా జలాశయాన్ని కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీలను సిద్ధంచేయనుంది.
ఆయకట్టుకు నీళ్లందించే పనులకు మోక్షం
► పోలవరం కుడి కాలువ ద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. కృష్ణా డెల్టాలోని 13.09 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలి.
► ఎడమ కాలువ కింద తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. ఆయకట్టుకు నీళ్లందించాలంటే ప్రధాన కాలువ నుంచి బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువలు తవ్వాలి. కానీ, గత సర్కార్ వీటిపై దృష్టి పెట్టలేదు.
► దీంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టడానికి సర్వే పూర్తిచేయగా డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. అనంతరం టెండర్ల ప్రక్రియ జరుగుతుంది.
ఎడమ కాలువ పనులపై ప్రత్యేక దృష్టి
► దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలోనే కుడి కాలు వ పనులు పూర్తయ్యా యి. ఎడమ కాలువ పనుల్లో మిగిలిన పనులను గత సర్కార్ పూర్తి చేయలేకపోయింది.
► ఒకటి, ఐదు, ఆరు, ఎనిమిది ప్యాకేజీ పనులను కొత్తవారికి అప్పగించి, గడువులోగా పూ ర్తిచేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
అనుకున్న సమయానికి పూర్తి చేస్తాం
సీఎం వైఎస్ జగన్ నిర్దేశించిన గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం. ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీల పనులకు సంబంధించిన సర్వే పూర్తయింది. డీపీఆర్ అందగానే టెండర్లు పిలుస్తాం. ప్రాజెక్టు పూర్తయ్యేలోగా డిస్ట్రిబ్యూటరీలను పూర్తిచేసి 2022 నాటికి ఆయకట్టుకు నీళ్లందించే దిశగా చర్యలు చేపట్టాం. – సుధాకర్‌బాబు, సీఈ, పోలవరం
Comments
Please login to add a commentAdd a comment