కాలువల పనుల్లో 75 శాతం అక్రమాలే
-
-పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు
-
-సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్
అమలాపురం :
జిల్లాలో కాలువల మూసివేత సమయంలో చేపట్టిన రిటైనింగ్ వాల్స్, ఇతర కట్టడాల పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు ఆరోపించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాలువలకు నీరు విడుదల చేసిన తర్వాత కూడా పనులు కొనసాగించి, నీరు విడుదల చేసినా కొన్ని ప్రాంతాలకు నీరు ఆపి పనులను హడావుడిగా, నాణ్యతా లోపాలతో పనులు చేశారన్నారు. వాస్తవానికి 25 శాతం పనులే పూర్తయ్యాయని, మిగిలిన 75 శాతం పనులను కాలువలకు నీరు వచ్చేసిందన్న సాకుతో హడావుడితో, అక్రమాలతో పూర్తి చేశారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు ఆ 75 శాతం పనులు ఇష్టారాజ్యంగా చేసుకుని బిల్లులు పొందారని ధ్వజమెత్తారు. దీనిపై కలెక్టర్‌తోపాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, టీడీపీ పాలనపై 16న చార్జిషీటు
కేంద్ర రాష్ట్రాలో బీజేపీ, టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత గత మూడేళ్లలో ప్రభుత్వాల వైఫల్యాలపై పీసీసీ ఈనెల 16న విజయవాడలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చేతుల మీదుగా చార్జిషీటు విడుదల చేయనున్నట్టు రుద్రరాజు చెప్పారు.2004–2014 మధ్య యూపీఏ పాలనను, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ఈ మూడేళ్ల ఎన్‌డీఏ, టీడీపీ పాలనతో పోల్చి అప్పట్లో ఏ నిర్ణయాల ద్వారా ప్రజలకు ఎక్కువ లబ్ధి చేకూరింది, ఇప్పుడు ప్రజలు ఏఏ నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతున్నారో ఈ చార్జిషీటులో సవివరంగా ఉంటుందని చెప్పారు.
జన్మభూమి కమిటీలతో స్వపరిపాలన స్ఫూర్తికి భంగం
టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలకే పెత్తనం ఇచ్చి గ్రామాల్లో స్వపరిపాలన స్ఫూర్తికి, రాజ్యాంగంలోని 73, 74 సవరణల మార్గదర్శకాలకు విఘాతం కలిగిస్తోందని రుద్రరాజు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారుల ప్రమేయం లేకుండా జన్మభూమి కమిటీలే శాసిస్తున్నాయని చెప్పారు. వీటిని రాజ్యాంగ విరుద్ధమైన చర్యల కింద పరిగణించాల్సి ఉన్నా అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లతో మాట్లాడలేకపోతున్నారన్నారు. విలేకరుల సమావేశంలో పీసీసీ కార్యదర్శులు వంటెద్దు బాబి, యార్లగడ్డ రవీంద్ర, ఎండీ ఆరిఫ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, కొత్తూరి శ్రీను, ములపర్తి సత్యనారాయణ, షహెన్ షా తదితరులు పాల్గొన్నారు.