రైతులతో ఆడుకుంటున్నాయి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జీవన్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: గిట్టుబాటు ధర కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఆవరణ లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మిర్చి, పసుపు వంటి పంటలకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో మార్కెట్ల లోనే తగలబెట్టాల్సిన దుస్థితి వచ్చిందన్నారు.
మద్దతు ధర విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు తప్పులు నెట్టుకుంటూ రైతులను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. పక్క రాష్ట్రాల్లో క్వింటాలుకు రూ.1,500 అదనపు సొమ్ము చెల్లిస్తున్నారని, కేసీఆర్ మాత్రం దాన్ని విస్మరిస్తున్నారన్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా పౌరసరఫరాలు, వ్యవసాయశాఖల మంత్రులు బాధ్యతలు మరిచి డ్యాన్సులు చేస్తున్నారన్నారు.