
సాక్షి, హైదరాబాద్ : విద్య పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధనా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం హర్షణీయమన్నారు. అయితే ఇక్కడ మాత్రం 2019-20 విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా ఉపాధ్యాయుల కొరతలో మార్పులేదని విమర్శించారు. విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్నారని విద్యాశాఖ మంత్రి పేర్కొనడం ఆయన అవగాహనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ‘మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంచుతుందని భావించాము. కేజీ నుంచి పీజీ వరకు ఆంగ్ల భాషలో నిర్బంధ విద్య అమలవుతుందని ఆశించాము. కానీ అవేమీ జరగలేదు. 20వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఎంపికైన టీచర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వానికి ఇప్పటికీ సమర్పించలేదు. దీంతో ఈ విద్యా సంవత్సరం కూడా సమస్య అలాగే వుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ పాలన చూసి కేసీఆర్ కళ్లు తెరవాలి
‘పక్క రాష్ట్రంలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి తీసుకువస్తున్న సంస్కరణలు బాగున్నాయి . ప్రైవేటు పాఠశాలలో 25 శాతం సీట్లు ఇవ్వడంతో పాటు.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పరిచేలా ఉన్నాయి. అమ్మఒడి వంటి వాటిని చేపట్టారు. నాడు వైఎస్సార్ పాదయాత్రతో సమస్యలు తెలుసుకుని... అనేక పథకాలు ప్రవేశ పెట్టారు. ఆయన దారిలో వైఎస్ జగన్ నడుస్తున్నారు. గతంలో ఏపీలో రెండు డీఎస్సీలు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ వేయలేదు. ఉద్యోగులకు ఐఆర్, ఆర్టీసీ, విద్య, ఇళ్ల నిర్మాణం పట్ల పాలన పగ్గాలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని అమలు చేస్తున్నారు. పక్క రాష్ట్ర పాలన చూసైనా కేసీఆర్ కళ్లు తెరుస్తాడని ఆశిస్తున్నా. దేశంలో గొప్ప పథకాలు అంటున్న కేసీఆర్.. ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయడం లేదు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం’ అని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment