మున్సిపల్ ఎన్నికల ఘట్టంలో అసలు పోరు షురూ అయింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల చైర్మన్లతోపాటు మొత్తం 75 వార్డు పదవులకు ఆదివారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీచేయాలనే దానిపై స్పష్టత రావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆశావహులు తమ గాడ్‌ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా.. అభ్యర్థుల ఎంపికపై ఆయా రాజకీయపార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
సాక్షి, మెదక్: జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ పుర పీఠం పదవి జనరల్‌కు.. నూతనంగా ఆవిర్భవించిన తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట పురపాలికల చైర్మన్ పదవులు బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థులు ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన పలువురు ఆశావహులు అంచనాలు తప్పడంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కునే పనిలో పడ్డారు. భార్యలను బరిలో దించాలా లేదా తమ కుటుంబ సభ్యులతో పోటీ చేయించాలా అని మారిన రాజకీయ సమీకరణలను బేరీజు వేసుకుంటూ ఆరా తీస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చిన వారు ఆయా వార్డుల్లో సన్నిహితులతో కలిసి కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు.
మెదక్.. ఫుల్ గిరాకీ
మెదక్ పురపాలక పీఠం జనరల్‌కు ఖరారు కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో 32 వార్డులు ఉండగా.. చైర్మన్ పదవికి పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఏ వర్గం వారైనా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ పీఠంపై ఆశలు పెట్టుకున్న పలువురు తమ వార్డుల్లో రిజర్వేషన్ల అంచనాలు తప్పడంతో కుటుంబ సభ్యులను బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయా పార్టీలకు చెందిన నేతలు, సన్నిహితుల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్థుల ఎంపికపై నేతల మల్లగుల్లాలు
రిజర్వేషన్ల పీటముడి వీడడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక రోజు.. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి రెండు రోజులు.. నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన జిల్లాస్థాయి, నియోజకవర్గ నేతలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశారు. ఒక వార్డులో ఒకే పార్టీ నుంచి తక్కువగా ఇద్దరు, ఎక్కువగా ఆరుగురు పోటీపడుతుండడం.. నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో ఆయా నియోజకవర్గాల నేతలు ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. సమయం తక్కువగా ఉండడంతో అసమ్మతులను బుజ్జగిస్తూనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగిరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment