కెనరా బ్యాంకులో భారీ చోరీ
వెల్దుర్తి, తూప్రాన్: దాచుకున్న సొమ్ములు దోచుకెళ్లిండ్రు... కాయకష్టం చేసుకుని పైసాపైస కుడబెట్టి దొంగల భయంతో నగదు, బంగారాన్ని బ్యాంకుల్లో దాచుకున్నా చోరీకి గురయ్యాయని బాధితులు విలపించారు. మంగళవారం వెల్దుర్తి మండలం 44వ జాతీయ రహదారి పక్కనే మాసాయిపేట కెనరా బ్యాంకులో చోరీ విషయం తెలిసి బాధితులంతా పరుగుపరుగున సంఘటాన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సొమ్మును బ్యాంకులోని లాకర్లలో దాచుకునేందుకు ఏడా దికి రూ.1,400 చెల్లిస్తున్నామని తెలిపారు.
ఆభరణాలు, నగదు...
సినీఫక్కీలో దోపిడీకి పాల్పడిన దొంగల ముఠా సభ్యులు బ్యాంకుకు కన్నం వేసి బీరువాలో దాచి ఉంచిన రూ.15 లక్షల నగదు, వ్యవసాయ రుణాలు పొందేందుకు రైతులు తాకట్టు పెట్టిన సుమారు ఐదు కిలోల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బ్యాంకు లోపలి గదిలో లాకర్లలో ఖాతాదారులు దాచి ఉంచిన ఆరు లాకర్లను ధ్వంసం చేసి నగదు, బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు.
దోపిడీకి పాల్పడింది ఇలా...
బ్యాంకు దోపిడీ చేసేందుకు ముందుగానే పతకం పన్నినట్లు దొంగతనం చేసిన తీరును పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అర్ధరాత్రి సమయంలో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న బ్యాంకును చోరీ కోసం ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుకు రహదారి వైపు ఉన్న దుకాణాల వెనుక కిటికీని ఎంచుకుని కన్నం వేశారు. అనంతరం లోపలికి ప్రవేశించి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి స్ట్రాంగ్‌రూంకు రంధ్రం చేసి లాకర్లను పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అనంతరం బ్యాంకు పక్కనే ఉన్న తన ఇంటి తాళం పగులగొట్టి రూ.1,500 దోచుకెళ్లినట్లు బాధితుడు నరేందర్ తెలిపాడు.
విషయం తెలిసిందిలా...
ఉదయం బ్యాంకు సిబ్బంది బాషా, గోపాల్‌లు బ్యాంకును తెరిచేందుకు వెళ్లారు. దోపిడీ జరిగినట్లు గుర్తించి వెంటనే బీఎం ఇసాక్‌కు, బ్యాంకు అధికారులకు విషయం తెలిపారు. ఉదయం 10గంటలకు స్థానిక బ్యాంకు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దోపిడీ విషయం తెలుసుకున్న ఖాతాదారులు, పెద్ద సంఖ్యలో అక్కడకు చేరారు. అప్పటికే తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సంజాయ్‌కుమార్, రామయంపేట సీఐ నందీశ్వర్, ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి, చేగుంట ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డిలు పోలీసు బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు లోపల చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, దోపిడీ జరిగిన తీరును గమనించి వెంటనే క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. వారు మధ్యాహ్నం 12.45 నిమిషాలకు సంఘటన స్థలానికి చేరకున్నారు. వేలిముద్రలను సేకరించారు. డాగ్‌స్క్వాడ్ మాత్రం బ్యాంకు ఆవరణలో కలియ తిరిగి అనంతరం బ్యాంకు సమీపంలోని వ్యవసాయ పొలాల్లోంచి రైల్వే స్టేషన్ వరకు నిలిచిపోయింది.
త్వరలోనే పట్టుకుంటాం...
బ్యాంకు దోపిడీకి పాల్పడింది అంతరాష్ట్ర ముఠా సభ్యులుగా భావిస్తున్నట్లు తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. బీహార్, గుల్బార్గా ముఠా సభ్యులు మాత్రమే ఇలాంటి దోపిడీలకు పాల్పడుతారని తెలిపారు. చేగుంట, రామయంపేట ఎస్‌ఐల ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్‌లలో ఉన్న పాత నేరస్తులను విచారించి త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు. గతంలోనే బ్యాంకు అధికారులకు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.