సాక్షి నెట్‌వర్క్: అప్పుల బాధతో వేర్వేరు జిల్లాల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కెపల్లికి చెందిన తలగంప తిరుపతి(31) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కింద రూ. 6 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేక తన భూమిలోనే పురుగుల మందు తాగి చనిపోయాడు.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మాల్కాపూర్‌కు చెందిన బట్టికాడి రాజాగౌడ్(48) తన మూడెకరాల్లో బోర్లు వేసేందుకు భూమిని తాకట్టు పెట్టి రూ. 2.50 లక్షలు అప్పు చేశాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పు మొత్తం రూ. 6 లక్షలు అయ్యింది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం చెర్కుపల్లి జీపీ పరిధి గజరాలతండాకు చెందిన కాట్రావత్ పాండు (45) పది ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి వేశాడు.
ఇందుకోసం సుమారు రూ. 5 లక్షలు అప్పు చేశాడు. వరి ఎండిపోగా, పత్తి దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో పెట్టుబడులూ రాలేదు. మనస్తాపం చెంది క్రిమిసంహారక మందుతాగాడు. రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మిట్టకంకల్‌కు చెందిన యాదమ్మ(45), అంతయ్య దంపతులకు 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశారు.
యాదమ్మ పేరిట బ్యాంకులో రూ. 30 వేలు, ప్రైవేటుగా రూ. 1.7 లక్షలు అప్పు చేశారు. వర్షాలు లేక పంట దెబ్బతింది. కూతురి పెళ్లి.. ఇంటి నిర్మాణం కోసం కూడా అప్పు చేశారు. అప్పు తీరే మార్గం కనిపించక యాదమ్మ శుక్రవారం పురుగుల మందు తాగిఆత్మహత్యకు పాల్పడింది.
అప్పుల బాధతో నలుగురు రైతుల ఆత్మహత్య
Published Sat, Nov 22 2014 12:17 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement