Gravel
-
వైఎస్సార్సీపీ సవాల్,తోక ముడిచి పారిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
-
అనుమతి కంటే అధికంగా తవ్వకాలు జరిపారు
సాక్షి, నెల్లూరు : గ్రావెల్ అక్రమాలు చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఈ కృష్ణమోహన్ తెలిపారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌రెడ్డిలపై కేసుపెట్టామని వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అనుమతి కంటే అధికంగా తవ్వకాలు జరిపారు. గ్రావెల్ తవ్వకాలు ఆపాలని ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మాగుంట శ్రీనివాసులురెడ్డి లేఖ ఇచ్చినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదు. రిజర్వాయర్ కెపాసిటీ పెంచే ఉద్దేశంతోనే మట్టితవ్వకాలు అనుమతిస్తాం. భవిష్యత్తులో ఫొటో ఐడీతో పాటు పూర్తి వివరాలతో అనుమతిస్తాం’’ అని అన్నారు. -
వందెకరాల్లో దందా
- కేశవరంలో అధికార పార్టీ నేతల కొత్త దందా - పగలు అనుమతి భూముల్లో.. రాత్రిళ్లు ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు - ఇసుక తరహాలో గ్రావెల్ తవ్వకాలు - ఒకే వే బిల్లుపై పలు ట్రిప్పులు - 100 ఎకరాల్లో - ప్రభుత్వ ఆదాయానికి గండి - ప్రేక్షకపాత్రలో సంబంధితాధికారులు . మండపేట : గ్రావెల్ తవ్వకాల్లో తెలుగు తమ్ముళ్లు సరికొత్త పంధాను తెరపైకి తెచ్చారు. ఇసుక తరహాలో గ్రావెల్ నిల్వలు వేస్తూ అక్రమాలకు కొత్తబాటలు తెరదీస్తున్నారు. పగలు అనుమతి పొందిన భూముల్లో, రాత్రిళ్లు ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో లక్షలాది రూపాయల గ్రావెల్‌ను అక్రమంగా తరలించుకుపోతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది. . వందెకరాల్లో దందా... సాధారణంగా వరదలు వచ్చే ముందుగా ఇసుకను ఎక్కడికక్కడ అనధికారికంగా నిల్వలు చేసి అమ్మకాలు చేయడం పరిపాటి. ఇప్పుడు గ్రావెల్ తవ్వకాల్లోనూ తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీ నేతలు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ సరికొత్త విధానానికి మండలంలోని కేశవరంలో మొదలుపెట్టారు. కేశవరంలోని బీటు మెట్ట ప్రాంతంలో పేదలకు పంపిణీ చేసిన, ప్రభుత్వ భూములు దాదాపు వంద ఎకరాలకుపైగా ఉన్నాయి. పట్టా భూములు, ప్రైవేటు స్థలాలను సాగుకు అనుకూలంగా చదును చేయడం పేరిట అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. నిర్ణీత స్థలంలో మెరకను తీసివేసి సాగుకు అనువుగా చదును చేసేందుకు అనుమతులు తెచ్చుకుని దానిమాటున అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. పగటి వేళల్లో అధికారిక స్థలాల్లో తవ్వకాలు చేస్తూ రాత్రి సమయంలో ప్రభుత్వ భూములు, అనుమతులు లేని స్థలాల్లో లక్షలాది రూపాయలు విలువైన గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకానికి, రోడ్డు పక్కల బెర్ముల వినియోగించే విలువైన పూస గ్రావెల్, ఎర్రమట్టి ఈ భూముల్లో దొరుకుతుండటంతో అక్రమ తవ్వకాలు జోరుగా సాగిపోతున్నాయి. ఐదు యూనిట్లు స్థానికంగానే రూ. 4000 వరకు ఉండే ఈ గ్రావెల్, బయటి ప్రాంతాలకు ధరను మరింత పెంచి తరలిస్తుంటారు. డిమాండ్‌ను బట్టి మిగిలిన గ్రావెల్‌ను గుట్టలుగా నిల్వ చేస్తుండటం గమనార్హం. గతంలో లీజుకు తీసుకుని తవ్వకాలు పూర్తిచేసిన భూముల్లో ఈ గ్రావెల్‌ను నిల్వ చేస్తున్నారు. దీనివల్ల అధికారులు వస్తే ఇంకా తవ్వకాలు చేయాల్సి ఉందని చూపించి వారికి ఎంతోకొంత ముట్టజెప్పి పంపిచేస్తున్నట్టు సమాచారం. పెద్ద ఎత్తున అక్రమంగా ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేసి గ్రావెల్ నిల్వ చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోపక్క ఒకే వే బిల్లుపై దూరాన్ని బట్టి రెండు నుంచి ఐదు ట్రిప్పుల వరకు లారీలు పంపిస్తున్నారు. దీనివల్ల సీనరేజీ రూపంలో ప్రభుత్వానికి చేరాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండికొడుతున్నారు. తరలిపోయిన పెట్రో యూనివర్శిటీ... ప్రభుత్వ భూములు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అధికారులు భావించినప్పటికీ అక్రమ తవ్వకాలు అడ్డంకిగా మారాయి. అక్రమ తవ్వకాలు ద్వారా ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున గోతులు ఏర్పడి పరిశ్రమ ఏర్పాటుకు అనువుగా లేకపోవడంతో ఇప్పటికే పెట్రోవర్శిటీ ఈ ప్రాంతం నుంచి తరలిపోయింది. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన మైనింగ్, ఇతర శాఖల అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో వ్యాపారులకు అక్రమ తవ్వకాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు లారీలను తనిఖీలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి అధికారులు గండిపడకుండా చూడాలంటున్నారు. -
గ్రావెల్ తోలుతున్న వాహనాల పట్టివేత
ఒక జేసీబీ, డోజర్, 10 ట్రాక్టర్లు సీజ్ బర్లగూడెం వద్ద ఇసుకర్యాంపునకు దారి వేస్తుండగా దాడులు పినపాక : అటవీ భూముల నుంచి నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న వాహనాలను శుక్రవారం రాత్రి ఏడూళ్లబయ్యారం అటవీ క్షేత్ర కార్యాలయ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ట్రైనీ ఐఎఫ్ఎస్, రేంజర్ లక్ష్మణ్రంజి™Œ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని పద్మాపురం పంచాయతీ బర్లగూడెం–అల్లేరుగూడెం గ్రామాల మధ్య గల అటవీ భూముల నుంచి నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ క్వారీ ఏర్పాటు చేసి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు రేంజర్ తన సిబ్బందితో పాటు కరకగూడెం పోలీసుల సహకారంతో అల్లేరుగూడెం అడువుల్లో ఏర్పాటు చేసిన గ్రావెల్ క్వారీ వద్దకు చేరుకున్నారు. కాగా ముందుగానే అధికారులు వస్తున్నారన్న సమాచారం అందుకున్న వాహనాల యజమానులు అక్కడి నుంచి వాహనాలను అటవీ ప్రాంతంలోకి తీసుకవెళ్లి దాచి ఉంచారు. ఈ క్రమంలో రేంజర్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా దాచి ఉంచిన ఒక జేసీబీ, ఒక డోజర్ ట్రాక్టర్, 10 ట్రాక్టర్లను అధికారులు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకొని ఏడూళ్లబయ్యారం రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు.. లక్ష్మణ్‌రంజిత్‌నాయక్, ట్రైనీ ఐఎఫ్ఎస్ అల్లేరుగూడెం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక క్వారీకి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు గ్రావెల్‌ను తోలుతున్నట్లు తమ విచారణలో తేలింది. అక్రమంగా తరలించిన గ్రావెల్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డీఎఫ్‌ఓకు నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. -
మట్టి..గ్రావెల్ మాఫియా
యథేచ్ఛగా తమిళనాడుకు తరలింపు విచ్చలవిడిగా తెలుగు తమ్ముళ్ల వ్యాపారం సూళ్లూరుపేట : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చా ఆ పార్టీ నేతలు అలీబాబా 40 దొంగల్లా మారారు. సంపాదనకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. చెరువుల్లో మట్టి.. రిజర్వ్ ఫారెస్ట్‌లోని కొల్లగొట్టే మాఫియాగా మారారు. అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలను చూస్తే వణికిపోతున్నారు. విచ్చలవిడిగా తెలుగు తమ్ముళ్లు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ జేబులు నింపుకుంటున్నా.. అధికారులు మాత్రం నిస్సాహాయస్థితిలో ఉన్నారు. నీరు–చెట్టు పథకంలో తీసిన మట్టిని రియల్ ఎస్టేట్ల వెంచర్లకు తోలుకుని రెండు వైపులా సొమ్ము చేసుకుంటున్నారు. సూళ్లూరుపేట, తడ మండలాల్లో చెరువుల్లో మట్టి తవ్వేసి చెరువులను సర్వనాశనం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మట్టి, గ్రావెల్‌ను పగలూ, రాత్రి తేడా లేకుండా తరలించడం చూస్తుంటే జాతరలా ఉంది పరిస్థితి. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పాముల కాలువ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్న టెక్స్టైల్ పార్కుకు తడ మండలంలోని కాదలూరు పెద్ద చెరువు, కొండూరు సోమయాజులు చెరువు, కాశింఖాన్కండ్రిగ చెరువు, చేనిగుంట వడగనేరి చెరువు, తడకండ్రిగ చెరువు, వెండ్లూరుపాడు చెరువు, సూళ్లూరుపేట మండలంలో ఇలుపూరు, మంగళంపాడు చెరువుల్లో ఇబ్బడి ముబ్బడిగా మట్టిని తరలిస్తున్నారు. ఆయా చెరువుల్లో మట్టి తీసేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి పేషీ నుంచి అనుమతులు తీసుకోవడంతో స్థానిక అధికారులెవరూ ఆపే ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. ‘ ఊరు మనదే దోచేయ్’ అనే రీతిలో ఆ పార్టీ నేతల పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన ఎం.జానకి ఇచ్చిన అనుమతిలో చెరువుల్లో పద్ధతి ప్రకారం రెండు నుంచి నాలుగు అడుగుల లోతులో చెరువు అంతా మట్టి తీయాలని ఆదేశాలిచ్చారు. అలా కాకుండా చెరువుల్లో ఎక్కడ పడితే అక్కడే పెద్ద పెద్ద బావులను తలపించేలా తవ్వేస్తున్నారు. భవిష్యత్‌లో వానలు తక్కువగా కురిస్తే గుంతల్లోనే నీళ్లు చేరిపోయి తూములు వరకు వచ్చే పరిస్థితులు లేవని రైతులు అందోళన చెందుతున్నారు. రిజర్వు ఫారెస్ట్‌లో గ్రావెల్ అక్రమ రవాణా చెరువుల్లో మట్టి దోపిడీ చేయడంతో పాటు తడ మండలం మాంబట్టు సమీపంలోని నెల్లూరు–చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో గ్రావెల్‌ను తమిళనాడుకు అక్రమంగా యథేచ్ఛగా తరలించేస్తున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకంలో నిరుపేద దళితులకు ఇచ్చిన రిజర్వ్ ఫారెస్ట్ భూములను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారే వచ్చి నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన నేతలకు అప్పగించారు. దీంతో వీళ్లు మరో ఓబులాపురం గనుల తరహాలో అయిదారు హిటాచీలు పెట్టి వందలాది టిప్పుర్లతో తమిళనాడుకు గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. మాంబట్టు సెజ్‌లోని ఆపాచీ కంపెనీ, భారత్ లెదర్ కంపెనీ మధ్యలో డొంకదారిని వెడల్పు చేసి అటవీ శాఖ భూముల్లో రోడ్డు ఏర్పాటు చేసుకుని గ్రావెల్‌ను పగలు రాత్రి తేడా లేకుండా తరలించేస్తున్నారు. అటవీ ప్రాంతమంతా ఓబులాపురం గనుల తరహాలో సుమారు ఒక తాటిమాను మునిగిపోయేంత లోతుగా తవ్వేసి తరలిస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ప్రస్తుతం సూళ్లూరుపేట, తడ ప్రాంతంలో హైవే మీద వెళ్లాలంటేనే టిప్పర్లు స్పీడ్‌కు భయపడిపోతున్నారు. -
అమ్మో.. అంత తరలిస్తున్నారా?
గ్రావెల్ అక్రమ రవాణాపై విస్తుపోయిన విజిలెన్స్ అధికారులు దగదర్తి : మండలంలోని తిరువీధిపాడు, చెన్నూరు, దామవరం, కౌరుగుంట తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలను చూసి గనులశాఖ విజిలెన్స్ అధికారులే విస్తుపోయారు. అరకొర అనుమతులతో గ్రావెల్‌తోపాటు రోడ్డు మెటల్ తవ్వకాలు భారీ స్థాయిలో జరుగుతుండటంతో అధికారులు అవాక్కయారు. వివరాల్లోకి వెళితే.. తిరువీధిపాడు పంచాయతీ పరిధిలోని కనిగిరి రిజార్వాయర్ లోతట్టు ప్రాంతంలో నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తికి రోడ్ మెటల్ క్వారీకి గతంలో అధికారులు అనుమతులు మంజూరు చేశారు. చుట్టుపక్కల ఉన్న భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి అనుమతులకు మించి తవ్వకాలు జరిపారు. తాజాగా మైనింగ్ లీజు అనుమతులను వారసత్వ బదిలీ చేయాలని నిర్వాహకుని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు మరోమారు గనులశాఖతో పాటు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మూడు రోజుల క్రితం తవ్వకాలు జరిగిన ప్రాంతాలను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు. పూర్తిస్థాయిలో నివేదిక కోసం భూగర్భగనులశాఖ, అదే శాఖకు చెందిన నిఘా విభాగం, రెవెన్యూ అధికారులతో కలిసి తవ్వకాలను జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. తవ్వకాలను ప్రాధమికంగా అంచనా వేస్తేనే రూ.కోట్లలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ వెంకటనాథ్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, రాము, గనులశాఖ అధికారులు రాము, నాగమణి పాల్గొన్నారు. -
వారు తప్పు చేశారు
► రెవెన్యూ సహకరించింది టేకు, గ్రావెల్ అమ్ముకున్నారు ► తహసీల్దార్ జనార్దన్‌పై వేటుకు రంగం సిద్ధం ► ఆర్ఐ, వీఆర్వో, అటవీ అధికారులకు షోకాజ్ నోటీసులు ► కానిస్టేబుల్‌పై దాడి కేసులోవేమిరెడ్డి ఆదినాయణరెడ్డి అరెస్ట్ సాక్షిప్రతినిధి, నెల్లూరు: టేకు చెట్లు నరికివేత.. గ్రావెల్ అక్రమ తవ్వకాలకు సహకరించిన రెవెన్యూ అధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. నెల్లూరు రూరల్ తహసీల్దార్‌గా పనిచేసిన జనార్దన్‌ను సస్పెండ్‌చేసి క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ జానకి ప్రకటించారు. అదేవిధంగా ఆర్ఐ, వీఆర్వోలతో పాటు అటవీ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే మంగళవారం కానిస్టేబుల్ రమేష్‌బాబుపై దాడిచేసిన కేసులో వేమిరెడ్డి ఆదినారాయణరెడ్డిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవేదగిరి నరసింహస్వామి ఆలయ భూములను లీజుకు తీసుకున్న వేమిరెడ్డి హరిశివారెడ్డి అందులో ఉన్న విలువైన టేకుచెట్లు, మామిడి, వేప, కొబ్బరి చెట్లను కొట్టేశారు. అదేవిధంగా మాన్యం భూముల్లో రూ.70 లక్షలు విలువచేసే గ్రావెల్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వుకుని సొమ్ముచేసుకున్నారు. అందుకు అప్పటి తహసీల్దార్ జనార్దన్ టీడీపీ నేత వేమిరెడ్డి హరిశివారెడ్డికి పూర్తి సహకారం అందించినట్లు అధికారల విచారణలో తేలింది. టేకు చెట్లు, గ్రావెల్ మాయం విషయంలో ప్రధాన నిందితుడైన వేమిరెడ్డి హరిశివారెడ్డిని అరెస్టు చేయకుండా పథకం ప్రకారం జాగ్రత్తపడ్డారు. ముందస్తుగా కోర్టులో లొంగిపోయేలా పోలీసు అధికారులు కొందరు చర్యలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. హరిశివారెడ్డి కోర్టులో లొంగిపోయేందుకు వాహనంలో వచ్చిన సమయంలో సోదరుడు వేమిరెడ్డి ఆదినారాయణరెడ్డి అక్కడే ఉన్న కానిస్టేబుల్ రమేష్‌బాబును కారుతో ఢీకొట్టినట్లు కేసునమోదు చేశారు. ఆ కేసులో ఆదినారాయణరెడ్డిని బుధవారం అరెస్టు చేశారు. హరిశివారెడ్డిని కొద్దిరోజుల తర్వాతబెయిల్పై బయటకు తీసుకొచ్చి కేసును వాయిదాలు వేయించుకుంటూ తప్పించే విధంగా టీడీపీ నేతలు మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలిసింది. వణికిపోతున్న అధికారులు టేకుచెట్ల నరికివేత వ్యవహారంపై బుధవారం కలెక్టర్ జానకి రెవెన్యూ, అటవీ, మైనింగ్, దేవాదాయశాఖ అధికారులతో సమావేశమయ్యారు. చెట్ల నరికివేత, మైనింగ్ తవ్వకాల్లో అధికారులు ఎటువంటి నిబంధనలు పాటిస్తారు? ఆలయ మాన్యం భూమిలో ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం మొత్తంపై రెవెన్యూ, అటవీశాఖ అధికారులు తయారుచేసిన నివేదికను కలెక్టర్ జానకికి అందజేసినట్లు సమాచారం. ఈ వ్యహారంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికారులు వణికిపోతున్నారు. ఏ అధికారిని కదిలించినా ‘వామ్మో.. ఆ విషయం మాత్రం నన్ను అడగొద్దు ఫ్లీజ్’ అంటూ చెప్పి వెళ్లిపోతున్నారు. మొత్తంగా టేకుచెట్ల నరికివేత వ్యహారం అధికారుల గుండల్లో వణుకుపుట్టిస్తోంది. -
గ్రా‘వెల్’ దోపిడీ
అక్రమంగా భారీ తవ్వకాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మం డల స్థాయి అధికారులను మేనేజ్ చేసుకొని అక్రమార్కులు ఈ తంతుకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో దీనిని అడ్డుకోవలసిన అధికారులు మామూళ్ల మత్తులోనో..అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకో తలొగ్గి ఫిర్యాదులొచ్చినా ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. స్వయంగా జిల్లా కలెక్టరే గ్రావెల్ అక్రమ తవ్వకాలపై సీరియస్ అవుతున్నా మండల స్థాయి అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. అనుమతులు లేని తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అధికారుల కళ్లెదుటే జరుగుతున్న ఈ తంతు తమకు సంబంధించింది కాదులే..అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి నుంచి మర్రి పాడు మండలం బాట వరకు 565వ జాతీయ రహదారి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులకు అవసరమైన గ్రావెల్‌ను అక్రమంగా భారీగా తరలిస్తున్నారు. ఒకట్రెండు చోట్ల అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు పెద్దమొత్తంలో మట్టిని కొల్లగొడుతున్నారు. రామాపురం,వరికుంటపాడు,చింతలగుంట, దుత్తలూరు, వేంపాడు తదితర ప్రాం తాల్లో పెద్దఎత్తున అక్రమంగా గ్రావెల్ తరలించి రోడ్డు పనులకు వినియోగిస్తున్నారు. కాంట్రాక్టర్లు ఆయా ప్రాం తాల్లోని అధికారులకు ముడుపులు అప్పజెప్పి తమ పని సులువుగా కానిస్తున్నారు. ఆయా గ్రామాల్లో అభ్యంతరాలు వచ్చినప్పటికీ అధికారుల నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో స్థానికులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లతో గ్రామస్థాయి రాజకీయ నేతలు అవగాహనకు వచ్చి తామే దగ్గరుండి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. వాస్తవంగా రోడ్డుకు గ్రావెల్ తరలించాలంటే ముందు గా గనుల శాఖ నుంచి అనుమతి తీసుకొని లీడ్ పొం దాలి. కానీ ఈ వ్యవహారం పాక్షికంగానే జరిగింది. ప్రభుత్వ పథకాలకూ ఇదే తంతు ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి రోడ్ల కోసం గ్రావెల్ తరలిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో రూ.10 కోట్లతో పంచాయతీల్లో సిమెంటు రోడ్ల పనులు జరిగాయి. ఈ రోడ్ల మార్జిన్లలో మట్టి నింపేందుకు ఆయా ప్రాంతాల్లో భారీగా గ్రావెల్ తరలించారు. జెడ్పీ నిధులతో జరిగే ఈ రోడ్డు పనులకు కూడా పెద్ద ఎత్తున అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. ఇటీవల నియోజకవర్గంలో పలు మార్గాల్లో తారురోడ్లు వేశారు. వీటి మార్జిన్లు నింపేం దుకు గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. సోమవారం విం జమూరులోని మల్లపరాజు చెరువు నుంచి భారీ ఎత్తున ప్రొక్లెయిన్ ద్వారా గ్రావెల్ తరలించారు. దీనిపై కొంతమంది స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా తమకేమీ తెలియదన్నట్లుగానే తప్పించుకున్నారు. మొత్తమ్మీద నియోజకవర్గంలో ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కువ లోతుతో గుం తలు తీసినందున వర్షాకాలంలో వాటిలోకి నీరు చేరి కొ న్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కాంట్రాక్టర్లు ఇచ్చే పర్సంటేజీలకు జైకొడుతూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. -
ఇసుక తిని బతికేస్తున్న సాండ్ మ్యాన్!
వర్షం వస్తున్నపుడు వచ్చే మట్టి వాసనను ఇష్టపడని మనుషులుండరేమో.. అలాగే చిన్నతనంలో మట్టి తినని వారు కూడా ఉండరేమో.. కానీ ఓ వ్యక్తి చిరుతిండిలా... తినుబండారాలను తిన్నట్లుగా ఇసుక, మట్టిని తినెయ్యడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. శరీరంలో విటమిన్ల లోపం కారణంగానే అతడు మట్టి తినడానికి అలవాటు పడ్డాడని డాక్టర్లు చెప్తుండగా.. తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని చెప్తున్న సదరు వ్యక్తి ఏకంగా 'సాండ్ మాన్' గా పేరు తెచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన హంస్ రాజ్ ఏదో టిఫిన్ తిన్నట్లుగా రోజుకో ప్లేటు ఇసుకను తినేస్తున్నాడు. ఇరవై ఏళ్ళ వయసులో ఇసుక తినడానికి అలవాటు పడ్డ అతడు చివరికి అదే అలవాటుకు బానిసయ్యాడు. ఇసుకతోపాటు ఇటుక, రాళ్ళ ముక్కలను కూడ నంజుకుని కరాకరా నములుతూ తినేస్తున్నాడు. శరీరంలో విటమిన్లు లోపంవల్ల ఏర్పడే పికా డిజార్డర్ అతనికి ఉండొచ్చని, అందుకే అలా చేస్తున్నాడని డాక్టర్లు చెప్తున్నారు. అటువంటి అలవాటు కొన్నాళ్ళకు తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయని అంటున్నారు. ఇటువంటి రోగానికి చికిత్స లేదని చెప్తున్నారు. ఇలా ఇసుక తినడం వల్ల కొన్నాళ్ళకు అది విషంగా మారి ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అయితే హంస్ రాజ్ మాత్రం తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని, ఇసుక తినడం వల్ల ఎటువంటి సమస్యా లేదని చెప్తున్నాడు. ఇసుక తినడంతో తనకు విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా చేరుతున్నాయని, తాను ధృఢంగా ఉండేందుకు అవి తోడ్పడుతున్నాయని అంటున్నాడు. సుమారు 25 ఏళ్ళనుంచి ఇలా.. ఇసుక, రాళ్ళు, ఇటుక ముక్కలు తింటున్నానని, ఇలా తినడం ఇప్పటికీ తనకు ఎంతో ఇష్టమని ఆనందంగా చెప్తున్నాడు. ప్రతిరోజూ ఓ ప్లేటు ఇసుక తిననిదే 45 ఏళ్ళ హంస్ రాజ్ కు నిద్ర పట్టదు. అందుకే తన గ్రామంనుంచీ పక్క గ్రామానికి వెళ్ళి మరీ బస్తాలతో ఇసుకను తెచ్చి ఇంట్లో భద్రపరచుకుంటున్నాడు. ఈ అలవాటు వల్ల అతను ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లోనే ఫేమస్ అయిపోయాడు. 'సాండ్ మ్యాన్' గా పేరు తెచ్చుకున్నాడు. ఇసుక తినడంవల్ల తన కడుపులోనూ, పళ్ళకు కూడ ఎటువంటి ఇబ్బందీ కలగడం లేదని, గట్టిగా ఉన్న రాయిని కూడ తాను సునాయాసంగా కొరకగల్గుతానని చెప్తున్నాడు. -
3 ట్రాక్టర్ల కంకర సీజ్
బుచ్చిరెడ్డిపాళెం: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగాయకుంట నుండి అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కొడవలూరుకు చెందిన చక్కా నారయ్య, ఆయన అనుచరులు 3 ట్రాక్టర్లలో శనివారం ఉదయం గ్రావెల్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో వీఆర్వో మోహన్, ఎస్ఐ శ్రీనివాసరావు దాడిచేశారు. ఈ దాడిలో 3 ట్రాక్టర్లతో పాటు ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. గ్రావెల్ తరలిస్తున్న వ్యక్తులు పరారయ్యారు. వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కాసులు కురిపిస్త్ను కంకర దందా!
తూప్రాన్ : మండలంలో ఇసుకతో పాటు కంకర దందా కాసుల వర్షం కురిపిస్తోంది. అక్రమార్కులు నామమాత్రం అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూముల్లోని ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. మండలంలో ఘనపూర్, కూచారం, లింగారెడ్డిపేట, పాలాట గ్రామాల్లోని ప్రభుత్వ, పట్టా భూముల్లో క్వారీలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని చేస్తున్నారు. బహిరంగంగానే ఈ అక్రమ దందా కొనసాగుతున్నా.. అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్వారీల ఏర్పాటు ప్రభుత్వ అనుమతులతో అనుమతించిన నిర్ణీత ప్రదేశంలో తవ్వకాలు జరపాలి. కానీ అక్రమార్కులు మాత్రం అధికారులకు ఓ స్థలాన్ని చూపి అనుమతులు పొందిన అనంతరం మరో చోట తవ్వకాలు జరుపుతున్నారు. భారీ పేలుళ్లు పేలుస్తూ పరిసర గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ పేలుళ్ల దాటికి పెంకుటిళ్ల పైకప్పు నుంచి మట్టి రాలి మీద పడుతుండగా.. సిమెంటుతో నిర్మించుకున్న భవనాలు బీటలు వారుతున్నాయి. క్వారీల నుంచి వెలువడే దుమ్ము పక్కనే ఉన్న పంటల పొలాలపై పడి వాటిని ఎదగడం లేదు. దీంతో పంటను మొత్తం కోల్పోవాల్సి వస్తోందని పలువురు రైతులు మైనింగ్ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు. రోడ్లు గుంతల మాయంగా... క్వారీల్లోని కంకరను టిప్పర్ల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్డు గుంతల మయంగా మారుతున్నాయి. ఘనపూర్ గ్రామ సమీపంలో సుమారు ఐదు క్వారీల్లోని వాహనాలు కంకర లోడుతో రామాయిపల్లి మీదుగా కొన్ని వాహనాలు, ధర్మారాజుపల్లి, దండుపల్లిల మీదుగా మరికొన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో మండలంలోని ఘనపూర్ - రమాయిపల్లి గ్రామల మధ్య వేసిన బీటీ రోడ్డు కంకర తేలి గుంతలమయంగా మారింది. దీంతో ఈ రహదారిలో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఈ దారిగుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు.ఇప్పటికైనా గనుల శాఖ అధికారులు ఈ క్వారీలను తనిఖీలు చేసి ప్రభుత్వ వనరులను కొల్లగొడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అతడే ఓ మాఫియా
►ఇసుక, గ్రావెల్ కావాలంటే ఎప్పుడైనా రెడీ ►నిర్భీతిగా తవ్వకాలు.. యథేచ్ఛగా అమ్మకాలు ►అనుమతుల్లేవ్.. అడ్డుకునే వారూ లేరు ► అధికార పార్టీ నేత బహిరంగ వ్యాపారం సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఇసుక కోసం మీ సేవా కేంద్రాల వద్ద బారెడు క్యూలో నిలబడాల్సి వస్తోందా.. సొమ్ముకట్టినా సరుకు రాక విసుగెత్తిపోతున్నారా.. అయితే పెదవేగి మండలంలోని తెలుగుదేశం పార్టీ నేత వద్దకు వెళ్లి సొమ్ము చెల్లిస్తే చాలు. ఎంతకావాలంటే అంత సరుకును వెంటనే ఇచ్చేస్తారు. ఇసుక.. మట్టి.. గ్రావెల్.. ఏది కావాలంటే అది క్షణాల్లోనే పంపిస్తారు. అధికార పార్టీ నేతకు దీంతో సంబంధం ఏమిటనుకుంటున్నారా. అడ్డగోలు ఆదాయ మార్గాల అన్వేషణలో ఉన్న సదరు నేత ప్రస్తుతానికి తెల్ల బంగారంగా పేరొం దిన ఇసుక తవ్వకాల పనిలో నిమగ్నమయ్యూరు. దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న తమ్మిలేరు వాగు నుంచి ఇసుకను తవ్వేస్తున్నారు. మట్టిని కొల్లగొట్టేస్తున్నారు. చివరకు పోలవరం కాలువ తవ్వగా వచ్చిన గ్రావెల్ గుట్టలనూ మింగేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నా అధికారులు మాత్రం సదరు నేత జోలికి వెళ్లి ఇదేమిటని అడిగే సాహసం చేయలేకపోతున్నారు. ఎక్కడెక్కడ నుంచి.. పెదవేగి మండలం విజయరాయి సమీపంలోని తమ్మిలేరు వాగు నుంచి ఇసుక, నడిపిల్లి అడ్డరోడ్డు దాటిన తర్వాత నక్కవారిగూడెంలోని వాగు నుంచి, జానంపేట గ్రామం దాటిన తర్వాత తమ్మిలేరు వాగు నుంచి ఇసుక, విజయా గార్డెన్స్ వెనుక వైపున పోలవరం కాలువ గట్టు నుంచి గ్రావెల్, పినకడిమి నుంచి గ్రావెల్, బి.శింగవరం వద్దనున్న తమ్మిలేరు వాగు నుంచి ఇసుక, వంగూరు లక్ష్మీపురం పోలవ రం కాలువ గట్టు నుంచి గ్రావెల్‌ను జేసీబీలు, పొక్లెయిన్లతో తవ్వేస్తున్నారు. సుమారు రోజుకు 100 ట్రాక్టర్ల ఇసుక, వందలాది లారీల గ్రావెల్ తరలిస్తున్నారంటే ఆయా ప్రాంతాల్లో ఏ మేరకు తవ్వకాలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ధరలు ఇలా.. ట్రాక్టర్ ఇసుక రూ.3 వేలకు, లారీ గ్రావెల్ రూ.2 వేలకు బహిరంగంగానే విక్రరుుస్తున్నారు. ఏలూరు ఆటోనగర్ వద్ద లెవెలింగ్ పనులు చేపట్టిన నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇసుక, మట్టి కొరత తీవ్రంగా ఉండటంతో అడిగినంత ధర ఇచ్చి ఆ నాయకుడి నుంచి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇలా నిత్యకల్యాణం పచ్చతోరణం మాదిరిగా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు, అమ్మకాలతో సదరు నేత కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని అంటున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు గాని, రెవెన్యూ అధికారులు గాని అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నారు. సాధారణంగానే అధికారులపై చీటికీ మాటికీ నోరేసుకు పడిపోయే ఆ అధికార పార్టీ నేత జోలికి వెళ్తే ఇంకేమైనా ఉందా.. అంటూ సంబంధిత శాఖల అధికారులు హడలెత్తిపోతున్నారు. కనీసం జిల్లాస్థాయి ఉన్నతాధికారులైనా స్పందించి సదరు నేత ఆగడాలకు అడ్డుకట్ట వేసి ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. -
గ్రావెల్ రవాణాపై కలెక్టర్‌కు ఫిర్యాదు
ఏలూరు : పోలవరం కుడి ప్రధాన కాలువ తవ్వకాల్లో వచ్చిన గ్రావెల్‌ను టీడీపీ నాయకులు అక్రమంగా రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారని పంగిడిగూడెం సర్పంచ్ లావూరి చిన్న వెంకన్న కలెక్టర్ కె.భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో యంత్రాంగంలో కదలిక వచ్చి ంది. పోలవరం కాలువ గట్టు తవ్వకాలపై శనివారం ‘పోలవరం గట్టు వదిలితే ఒట్టు’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అక్రమంగా గ్రావెల్‌ను రవాణా చేస్తున్నారనిచిన్న వెంకన్న జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారులతో పాటు, మండల రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి వె ళ్లి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీంతో గ్రావెల్ అక్రమ రవాణాను దగ్గరుండి చేపట్టిన ద్వారకాతిరుమల మండల టీడీపీ అధ్యక్షుడు, ఎంపీపీ వడ్లమూడి ఈశ్వర భానువర ప్రసాద్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భీమడోలు మండలం పోలసానిపల్లి రెవెన్యూ పరిధిలో కాలువ గట్టును రాత్రి వేళల్లో తవ్వుతున్నారు. ఎంపీపీ ఈశ్వర భానువరప్రసాద్ ఆ ప్రాంతానికి పక్కనే ఉన్న పంగిడిగూడెంకు చెందినవారు. ఆయన దగ్గరుండి తవ్వకాలు సాగిస్తుండగా గ్రామ సర్పంచ్ లావూరి చిన్న వెంకన్న అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఎంపీపీ ఆయనతో వాగ్వివాదానికి దిగారు. అక్రమ తవ్వకాలపై సర్పంచ్ కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్ ఈఈ, తహసిల్దార్, ఎంపీడీవోలకు కూడా ఫిర్యాదు చేశారు. ద్వారకాతిరుమల ఆర్ఐ టి.నాగరాజు, పంగిడిగూడెం వీఆర్వో పి.ప్రభాకరరావు సర్వేయర్ ఎం.ధ ర్మారావు పోలీసులతో ఘటనాస్థలానికి వెళ్లి పూర్తిస్థాయి విచారణ నిర్వహించి తహసిల్దార్ సీహెచ్ ప్రసాద్‌కు నివేదిక ఇచ్చారు. దీనిపై పూర్తి సమాచారాన్ని ఆయన ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్‌కు పంపారు. నివేదికలో భారీఎత్తున గ్రావెల్‌ను తరలించినట్టు అధికారులు ధ్రువీకరించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కూడా తాను గ్రావెల్ త రలింపునకు ఎటువంటి లేఖ ఇవ్వలేదని అధికారులకు చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఇరిగేషన్ డీఈ బాలకృష్ణ కూడా గ్రావెల్ తవ్వకాలపై విచారణ చేసి నివేదిక ఇచ్చారు. అధికార పార్టీ నేత కావడంతో ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. తవ్వకాలు వాస్తవమే పంగిడిగూడెం గ్రామ శివారులో గ్రావెల్ అక్రమ రవాణా జరగటం వాస్తమమని మా అధికారులు నివేదిక ఇచ్చారు. దీనిపై ఇరిగేషన్ అధికారులకు కూడా లేఖ పంపించా. కలెక్టర్ కె.భాస్కర్‌తో పాటు ఆర్డీవో తేజ్ భరత్‌కు నివేదిక ఇస్తాం. - సీహెచ్.ప్రసాద్, తహసిల్దార్, ద్వారకాతిరుమల డీఈ విచారణ చేస్తున్నారు పోలవరం కాలువ తవ్వకాలలో భాగంగా గట్టు వెంబడి పెట్టిన గ్రావెల్ ద్వారకాతిరుమల ఎంపీపీ తరలించుకుపోతున్న విషయంపై డెప్యూటీ ఇంజినీర్ బాలకృష్ణను విచారణ చేసి నివేదిక ఇవ్వమని ఆదేశించాం. నివేదిక రాగానే కలె క్టర్‌కు పంపుతాం. - చినబాబు, ఇరిగేషన్ ఈఈ -
అడవి, సమాధి.. అన్నీ ఆకాశంలోనే..!
నగరాల్లో తీవ్రస్థాయిలో స్థలం కొరత అధిగమించడానికి కొత్త ఐడియాలు ఆకాశ హర్మ్యాల్లోనే అడవులు, తోటలు శ్మశానమంటే... సమాధులుండే ఓ పెద్ద మైదానం. మరి పంటలంటే...? పొలాల్లో పండేవి. అడవులంటే... కొన్ని వేల ఎకరాల్లో చెట్టూపుట్టా కలిసి విస్తరించేవి. కాకుంటే ముందు తరాలకు ఈ నిర్వచనాలన్నీ మారిపోయే ప్రమాదం స్పష్టంగానే కనిపిస్తోంది. పెద్దపెద్ద నగరాల్లో స్థలమనేది గగనమైపోవటంతో... సమాధుల నుంచి అడవుల దాకా అన్నీ గగనాన్ని తాకేటట్టే ఏర్పాటు చేస్తున్నారు. భూమిని ‘ఆదా’ చేస్తున్నారు. సింగపూర్‌లో స్థలాభావం తీవ్రంగా ఉండటంతో భూగృహంలోనే కొత్త నగరాల్ని నిర్మించడానికి అక్కడి యంత్రాంగం ప్రణాళికలు వేస్తోంది. అయితే స్థలం కొరత చాలా తీవ్రంగా ఉన్న నార్వే... మరికాస్త ముందుకెళ్లిపోయింది. ఆకాశ హర్మ్యాల్లో సమాధులు నిర్మించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుత పద్ధతి ప్రకారం అక్కడ పౌరులందరికీ కొంత స్థలం చొప్పున కేటాయిస్తున్నారు. దాన్లో సమాధి నిర్మించాక రెండు దశాబ్దాలు అలాగే ఉంచుతారు. ఆ తరవాత సమాధిని తొలగించి మరొకరికి కేటాయిస్తున్నారు. అప్పటికల్లా మృతదేహం మట్టిలో కలిసిపోతుంది కనక ఇబ్బంది ఉండదు. అయితే కొందరు పౌరులు... మట్టి కలుషితం కాకుండా ఉండటానికని బాడీని పాలిథిన్ కవర్లలో చుట్టి సమాధి చేయటం మొదలెట్టారు. 20 ఏళ్ల తరవాత కూడా ఆ కవరు అలాగే ఉండి... మృతదేహం కుళ్లిపోవటంతో ఏం చేయాలో అధికారులకు అర్థంకాలేదు. దీంతో మార్టిన్ మెక్షెరీ అనే ఆర్కిటెక్చర్ విద్యార్థి కొత్త ఐడియా వేశాడు. నిట్టనిలువు స్మశాన హర్మ్యాల ప్రతిపాదన తెచ్చాడు. మార్టిన్ డిజైన్ ప్రకారం... నగరం మధ్యలో ఒకదానిపై మరొకటి గడులు..గడులుగా ఈ సిమెట్రీని నిర్మిస్తారు. భవంతి పక్కనే ఉండే క్రేన్‌తో శవపేటికలను ఒక్కో గడిలోకి చేరుస్తారు. సంఖ్య పెరిగేకొద్దీ.. మరిన్ని గడులు.. పైన కట్టుకుంటూ పోతారు. ఇలా సదరు భవంతి ఎత్తు పెరుగుతూనే ఉంటుంది. స్మశానం ఇలా నిట్టనిలువుగా నిర్మించడం వల్ల కింద పార్కులు, ఇళ్లూ గట్రా కట్టుకోవచ్చట. ‘‘స్థలం కొరత ఉన్న ప్రతి నగరంలోనూ ఇలాంటి సిమెట్రీలు కట్టొచ్చు. కొన్నాళ్లకు ప్రతి నగరంలోనూ సిమెట్రీయే అత్యంత ఎత్తులో ఉంటుంది. అవి విలువైన స్మారకాలుగా మారతాయి’’ అనేది మార్టిన్ మాట. నిజానికి డిజైన్ పరంగా మార్టిన్ ప్రతిపాదన వెరైటీగా ఉన్నప్పటికీ.. ఇప్పటికే జపాన్, బ్రెజిల్ వంటి కొన్ని దేశాల్లో ఆకాశ సిమెట్రీలున్నాయి. బ్రెజిల్‌లోని 32 అంతస్తుల మెమోరియల్ నెక్రోపోల్ ఈక్యుమెనికా భవంతి ప్రపంచంలోనే అత్యంత ఎత్తై సిమెట్రీ. కూరగాయల పంటలూ భవనాల్లోనే... ఇటలీలోని మిలన్ నగరం కూడా స్థలాభావంలో పెద్దన్నే. దీంతో ఇక్కడి ఆర్కిటెక్టులు ఎత్తై అడవికి శ్రీకారం చుట్టారు. ఇందులో ఏకంగా 730 చెట్లు, 5,000 పైచిలుకు పొదలు, 11,000 మేర మొక్కలు ఉంటాయని చెబుతోంది స్పీగెల్ ఇంటర్నేషనల్. ఈ కంపెనీయే రెండు టవర్లలో ఈ అడవి నిర్మాణం మొదలెట్టింది. ఒక టవర్ ఎత్తు 262 అడుగులు కాగా మరొకటి 367 అడుగులు. 8.5 కోట్ల డాలర్లతో ఈ అడవి రూపుదిద్దుకుంటోంది. ఇలాగే, స్కైగ్రీన్స్ పేరిట సింగపూర్‌లో ఎత్తై వ్యవసాయ క్షేత్రం కూడా ఉంది. దీన్లో రొటేటింగ్ వెజిటెబుల్ గార్డెన్స్ లాంటి హంగులున్నాయి. ముప్పై అడుగుల ఎత్తునుండే 120 అల్యూమినియం టవర్ల ఈ క్షేత్రంలో రోజుకు ఒక టన్ను మేర కూరగాయలు పండుతున్నాయట. ఇక, స్కూళ్లు, కాలేజీల ఎత్తు కూడా భారీగా పెరిగిపోతోంది. న్యూయార్క్‌లోని బీకన్ హైస్కూల్ ఏడంతస్తులు కాగా, ఇటీవల జార్జియాలో ప్రారంభమైన నార్త్ అట్లాంటా హైస్కూల్ ఎత్తు 11 అంతస్తులు. -
గ్రావెల్ స్వాహా
మేదరమెట్ల, న్యూస్‌లైన్: గుండ్లకమ్మ రిజర్వాయర్ ముంపు గ్రామమైన తమ్మవరంలో గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. అక్రమార్కులు లక్షలకు లక్షలు దండుకుంటున్నారు. తమ్మవరంలో గ్రావెల్ అధికంగా లభిస్తుండటంతో కొందరి కన్ను ఆ గ్రామంపై పడింది. పగలు, రాత్రీ తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పది అడుగుల లోతుకుపైగా గుంతలు తీసి గ్రావెల్ తవ్వి మాయం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో గ్రావెల్ తరలిపోతున్నా రెవెన్యూ, మైనింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. ముంపు గ్రామాలను త్వరగా ఖాళీ చేస్తే ఆ ప్రాంతంలో అటవీ శాఖాధికారులు మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పి గ్రామస్తులను ఖాళీ చేయించారు. కానీ నేటికీ అటవీ శాఖకు సంబంధించి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రావెల్ అక్రమార్కులకు వరంగా మారింది. గ్రామం మొత్తం భారీగా గోతులు పెట్టి గ్రావెల్ తరలించుకుపోతున్నారు. గుండ్లకమ్మ నదికి ఆనుకొని రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. పథకాల సమీపంలో 15 అడుగుల లోతులో గోతులు తీయడం వల్ల భారీ వర్షాలకు గోతులు నీటితో నిండిపోయి..పథకాలు సైతం నీటమునిగే పరిస్థితి ఏర్పడనుంది. ట్రాక్టర్ గ్రావెల్‌ను రూ 800 నుంచి వెయ్యి రూపాయల వరకు దూరాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. టిప్పర్ల ద్వారా సమీపంలోని గ్రోత్ సెంటరుకు గ్రావెల్ తరలిస్తున్నారు. ఒక్కో టిప్పరుకు రూ 3 వేల వరకు వసూలు చేయడం గమనార్హం. దీంతో చివరకు ఆ గ్రామంలో గుంతలు తప్ప ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు.