అడవి, సమాధి.. అన్నీ ఆకాశంలోనే..!
- నగరాల్లో తీవ్రస్థాయిలో స్థలం కొరత
- అధిగమించడానికి కొత్త ఐడియాలు
- ఆకాశ హర్మ్యాల్లోనే అడవులు, తోటలు
శ్మశానమంటే... సమాధులుండే ఓ పెద్ద మైదానం. మరి పంటలంటే...? పొలాల్లో పండేవి. అడవులంటే... కొన్ని వేల ఎకరాల్లో చెట్టూపుట్టా కలిసి విస్తరించేవి. కాకుంటే ముందు తరాలకు ఈ నిర్వచనాలన్నీ మారిపోయే ప్రమాదం స్పష్టంగానే కనిపిస్తోంది. పెద్దపెద్ద నగరాల్లో స్థలమనేది గగనమైపోవటంతో... సమాధుల నుంచి అడవుల దాకా అన్నీ గగనాన్ని తాకేటట్టే ఏర్పాటు చేస్తున్నారు. భూమిని ‘ఆదా’ చేస్తున్నారు.
సింగపూర్లో స్థలాభావం తీవ్రంగా ఉండటంతో భూగృహంలోనే కొత్త నగరాల్ని నిర్మించడానికి అక్కడి యంత్రాంగం ప్రణాళికలు వేస్తోంది. అయితే స్థలం కొరత చాలా తీవ్రంగా ఉన్న నార్వే... మరికాస్త ముందుకెళ్లిపోయింది. ఆకాశ హర్మ్యాల్లో సమాధులు నిర్మించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుత పద్ధతి ప్రకారం అక్కడ పౌరులందరికీ కొంత స్థలం చొప్పున కేటాయిస్తున్నారు. దాన్లో సమాధి నిర్మించాక రెండు దశాబ్దాలు అలాగే ఉంచుతారు. ఆ తరవాత సమాధిని తొలగించి మరొకరికి కేటాయిస్తున్నారు. అప్పటికల్లా మృతదేహం మట్టిలో కలిసిపోతుంది కనక ఇబ్బంది ఉండదు. అయితే కొందరు పౌరులు... మట్టి కలుషితం కాకుండా ఉండటానికని బాడీని పాలిథిన్ కవర్లలో చుట్టి సమాధి చేయటం మొదలెట్టారు.
20 ఏళ్ల తరవాత కూడా ఆ కవరు అలాగే ఉండి... మృతదేహం కుళ్లిపోవటంతో ఏం చేయాలో అధికారులకు అర్థంకాలేదు. దీంతో మార్టిన్ మెక్‌షెరీ అనే ఆర్కిటెక్చర్ విద్యార్థి కొత్త ఐడియా వేశాడు. నిట్టనిలువు స్మశాన హర్మ్యాల ప్రతిపాదన తెచ్చాడు. మార్టిన్ డిజైన్ ప్రకారం... నగరం మధ్యలో ఒకదానిపై మరొకటి గడులు..గడులుగా ఈ సిమెట్రీని నిర్మిస్తారు. భవంతి పక్కనే ఉండే క్రేన్‌తో శవపేటికలను ఒక్కో గడిలోకి చేరుస్తారు. సంఖ్య పెరిగేకొద్దీ.. మరిన్ని గడులు.. పైన కట్టుకుంటూ పోతారు. ఇలా సదరు భవంతి ఎత్తు పెరుగుతూనే ఉంటుంది. స్మశానం ఇలా నిట్టనిలువుగా నిర్మించడం వల్ల కింద పార్కులు, ఇళ్లూ గట్రా కట్టుకోవచ్చట. ‘‘స్థలం కొరత ఉన్న ప్రతి నగరంలోనూ ఇలాంటి సిమెట్రీలు కట్టొచ్చు. కొన్నాళ్లకు ప్రతి నగరంలోనూ సిమెట్రీయే అత్యంత ఎత్తులో ఉంటుంది. అవి విలువైన స్మారకాలుగా మారతాయి’’ అనేది మార్టిన్ మాట. నిజానికి డిజైన్ పరంగా మార్టిన్ ప్రతిపాదన వెరైటీగా ఉన్నప్పటికీ.. ఇప్పటికే జపాన్, బ్రెజిల్ వంటి కొన్ని దేశాల్లో ఆకాశ సిమెట్రీలున్నాయి. బ్రెజిల్‌లోని 32 అంతస్తుల మెమోరియల్ నెక్రోపోల్ ఈక్యుమెనికా భవంతి ప్రపంచంలోనే అత్యంత ఎత్తై సిమెట్రీ.
కూరగాయల పంటలూ భవనాల్లోనే...
ఇటలీలోని మిలన్ నగరం కూడా స్థలాభావంలో పెద్దన్నే. దీంతో ఇక్కడి ఆర్కిటెక్టులు ఎత్తై అడవికి శ్రీకారం చుట్టారు. ఇందులో ఏకంగా 730 చెట్లు, 5,000 పైచిలుకు పొదలు, 11,000 మేర మొక్కలు ఉంటాయని చెబుతోంది స్పీగెల్ ఇంటర్నేషనల్. ఈ కంపెనీయే రెండు టవర్లలో ఈ అడవి నిర్మాణం మొదలెట్టింది. ఒక టవర్ ఎత్తు 262 అడుగులు కాగా మరొకటి 367 అడుగులు. 8.5 కోట్ల డాలర్లతో ఈ అడవి రూపుదిద్దుకుంటోంది. ఇలాగే, స్కైగ్రీన్స్ పేరిట సింగపూర్‌లో ఎత్తై వ్యవసాయ క్షేత్రం కూడా ఉంది. దీన్లో రొటేటింగ్ వెజిటెబుల్ గార్డెన్స్ లాంటి హంగులున్నాయి. ముప్పై అడుగుల ఎత్తునుండే 120 అల్యూమినియం టవర్ల ఈ క్షేత్రంలో రోజుకు ఒక టన్ను మేర కూరగాయలు పండుతున్నాయట. ఇక, స్కూళ్లు, కాలేజీల ఎత్తు కూడా భారీగా పెరిగిపోతోంది. న్యూయార్క్‌లోని బీకన్ హైస్కూల్ ఏడంతస్తులు కాగా, ఇటీవల జార్జియాలో ప్రారంభమైన నార్త్ అట్లాంటా హైస్కూల్ ఎత్తు 11 అంతస్తులు.