వందెకరాల్లో దందా
Published Tue, Jun 13 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM
- కేశవరంలో అధికార పార్టీ నేతల కొత్త దందా
- పగలు అనుమతి భూముల్లో..
రాత్రిళ్లు ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు
- ఇసుక తరహాలో గ్రావెల్ తవ్వకాలు
- ఒకే వే బిల్లుపై పలు ట్రిప్పులు
- 100 ఎకరాల్లో
- ప్రభుత్వ ఆదాయానికి గండి
- ప్రేక్షకపాత్రలో సంబంధితాధికారులు
.
మండపేట :
గ్రావెల్ తవ్వకాల్లో తెలుగు తమ్ముళ్లు సరికొత్త పంధాను తెరపైకి తెచ్చారు. ఇసుక తరహాలో గ్రావెల్ నిల్వలు వేస్తూ అక్రమాలకు కొత్తబాటలు తెరదీస్తున్నారు. పగలు అనుమతి పొందిన భూముల్లో, రాత్రిళ్లు ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో లక్షలాది రూపాయల గ్రావెల్‌ను అక్రమంగా తరలించుకుపోతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
.
వందెకరాల్లో దందా...
సాధారణంగా వరదలు వచ్చే ముందుగా ఇసుకను ఎక్కడికక్కడ అనధికారికంగా నిల్వలు చేసి అమ్మకాలు చేయడం పరిపాటి. ఇప్పుడు గ్రావెల్ తవ్వకాల్లోనూ తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీ నేతలు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ సరికొత్త విధానానికి మండలంలోని కేశవరంలో మొదలుపెట్టారు. కేశవరంలోని బీటు మెట్ట ప్రాంతంలో పేదలకు పంపిణీ చేసిన, ప్రభుత్వ భూములు దాదాపు వంద ఎకరాలకుపైగా ఉన్నాయి. పట్టా భూములు, ప్రైవేటు స్థలాలను సాగుకు అనుకూలంగా చదును చేయడం పేరిట అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. నిర్ణీత స్థలంలో మెరకను తీసివేసి సాగుకు అనువుగా చదును చేసేందుకు అనుమతులు తెచ్చుకుని దానిమాటున అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. పగటి వేళల్లో అధికారిక స్థలాల్లో తవ్వకాలు చేస్తూ రాత్రి సమయంలో ప్రభుత్వ భూములు, అనుమతులు లేని స్థలాల్లో లక్షలాది రూపాయలు విలువైన గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకానికి, రోడ్డు పక్కల బెర్ముల వినియోగించే విలువైన పూస గ్రావెల్, ఎర్రమట్టి ఈ భూముల్లో దొరుకుతుండటంతో అక్రమ తవ్వకాలు జోరుగా సాగిపోతున్నాయి. ఐదు యూనిట్లు స్థానికంగానే రూ. 4000 వరకు ఉండే ఈ గ్రావెల్, బయటి ప్రాంతాలకు ధరను మరింత పెంచి తరలిస్తుంటారు. డిమాండ్‌ను బట్టి మిగిలిన గ్రావెల్‌ను గుట్టలుగా నిల్వ చేస్తుండటం గమనార్హం. గతంలో లీజుకు తీసుకుని తవ్వకాలు పూర్తిచేసిన భూముల్లో ఈ గ్రావెల్‌ను నిల్వ చేస్తున్నారు. దీనివల్ల అధికారులు వస్తే ఇంకా తవ్వకాలు చేయాల్సి ఉందని చూపించి వారికి ఎంతోకొంత ముట్టజెప్పి పంపిచేస్తున్నట్టు సమాచారం. పెద్ద ఎత్తున అక్రమంగా ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేసి గ్రావెల్ నిల్వ చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
మరోపక్క ఒకే వే బిల్లుపై దూరాన్ని బట్టి రెండు నుంచి ఐదు ట్రిప్పుల వరకు లారీలు పంపిస్తున్నారు. దీనివల్ల సీనరేజీ రూపంలో ప్రభుత్వానికి చేరాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండికొడుతున్నారు.
తరలిపోయిన పెట్రో యూనివర్శిటీ...
ప్రభుత్వ భూములు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అధికారులు భావించినప్పటికీ అక్రమ తవ్వకాలు అడ్డంకిగా మారాయి. అక్రమ తవ్వకాలు ద్వారా ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున గోతులు ఏర్పడి పరిశ్రమ ఏర్పాటుకు అనువుగా లేకపోవడంతో ఇప్పటికే పెట్రోవర్శిటీ ఈ ప్రాంతం నుంచి తరలిపోయింది. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన మైనింగ్, ఇతర శాఖల అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో వ్యాపారులకు అక్రమ తవ్వకాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు లారీలను తనిఖీలు చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి అధికారులు గండిపడకుండా చూడాలంటున్నారు.
Advertisement
Advertisement