ఇసుక తిని బతికేస్తున్న సాండ్ మ్యాన్!
వర్షం వస్తున్నపుడు వచ్చే మట్టి వాసనను ఇష్టపడని మనుషులుండరేమో.. అలాగే చిన్నతనంలో మట్టి తినని వారు కూడా ఉండరేమో.. కానీ ఓ వ్యక్తి చిరుతిండిలా... తినుబండారాలను తిన్నట్లుగా ఇసుక, మట్టిని తినెయ్యడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. శరీరంలో విటమిన్ల లోపం కారణంగానే అతడు మట్టి తినడానికి అలవాటు పడ్డాడని డాక్టర్లు చెప్తుండగా.. తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని చెప్తున్న సదరు వ్యక్తి ఏకంగా 'సాండ్ మాన్' గా పేరు తెచ్చుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన హంస్ రాజ్ ఏదో టిఫిన్ తిన్నట్లుగా రోజుకో ప్లేటు ఇసుకను తినేస్తున్నాడు. ఇరవై ఏళ్ళ వయసులో ఇసుక తినడానికి అలవాటు పడ్డ అతడు చివరికి అదే అలవాటుకు బానిసయ్యాడు. ఇసుకతోపాటు ఇటుక, రాళ్ళ ముక్కలను కూడ నంజుకుని కరాకరా నములుతూ తినేస్తున్నాడు. శరీరంలో విటమిన్లు లోపంవల్ల ఏర్పడే పికా డిజార్డర్ అతనికి ఉండొచ్చని, అందుకే అలా చేస్తున్నాడని డాక్టర్లు చెప్తున్నారు. అటువంటి అలవాటు కొన్నాళ్ళకు తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయని అంటున్నారు. ఇటువంటి రోగానికి చికిత్స లేదని చెప్తున్నారు. ఇలా ఇసుక తినడం వల్ల కొన్నాళ్ళకు అది విషంగా మారి ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అయితే హంస్ రాజ్ మాత్రం తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని, ఇసుక తినడం వల్ల ఎటువంటి సమస్యా లేదని చెప్తున్నాడు. ఇసుక తినడంతో తనకు విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా చేరుతున్నాయని, తాను ధృఢంగా ఉండేందుకు అవి తోడ్పడుతున్నాయని అంటున్నాడు. సుమారు 25 ఏళ్ళనుంచి ఇలా.. ఇసుక, రాళ్ళు, ఇటుక ముక్కలు తింటున్నానని, ఇలా తినడం ఇప్పటికీ తనకు ఎంతో ఇష్టమని ఆనందంగా చెప్తున్నాడు.
ప్రతిరోజూ ఓ ప్లేటు ఇసుక తిననిదే 45 ఏళ్ళ హంస్ రాజ్ కు నిద్ర పట్టదు. అందుకే తన గ్రామంనుంచీ పక్క గ్రామానికి వెళ్ళి మరీ బస్తాలతో ఇసుకను తెచ్చి ఇంట్లో భద్రపరచుకుంటున్నాడు. ఈ అలవాటు వల్ల అతను ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లోనే ఫేమస్ అయిపోయాడు. 'సాండ్ మ్యాన్' గా పేరు తెచ్చుకున్నాడు. ఇసుక తినడంవల్ల తన కడుపులోనూ, పళ్ళకు కూడ ఎటువంటి ఇబ్బందీ కలగడం లేదని, గట్టిగా ఉన్న రాయిని కూడ తాను సునాయాసంగా కొరకగల్గుతానని చెప్తున్నాడు.