అమ్మో.. అంత తరలిస్తున్నారా?
Published Tue, Aug 9 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
గ్రావెల్ అక్రమ రవాణాపై విస్తుపోయిన విజిలెన్స్ అధికారులు
దగదర్తి : మండలంలోని తిరువీధిపాడు, చెన్నూరు, దామవరం, కౌరుగుంట తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలను చూసి గనులశాఖ విజిలెన్స్ అధికారులే విస్తుపోయారు. అరకొర అనుమతులతో గ్రావెల్‌తోపాటు రోడ్డు మెటల్ తవ్వకాలు భారీ స్థాయిలో జరుగుతుండటంతో అధికారులు అవాక్కయారు. వివరాల్లోకి వెళితే.. తిరువీధిపాడు పంచాయతీ పరిధిలోని కనిగిరి రిజార్వాయర్ లోతట్టు ప్రాంతంలో నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తికి రోడ్ మెటల్ క్వారీకి గతంలో అధికారులు అనుమతులు మంజూరు చేశారు. చుట్టుపక్కల ఉన్న భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి అనుమతులకు మించి తవ్వకాలు జరిపారు. తాజాగా మైనింగ్ లీజు అనుమతులను వారసత్వ బదిలీ చేయాలని నిర్వాహకుని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు మరోమారు గనులశాఖతో పాటు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మూడు రోజుల క్రితం తవ్వకాలు జరిగిన ప్రాంతాలను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు. పూర్తిస్థాయిలో నివేదిక కోసం భూగర్భగనులశాఖ, అదే శాఖకు చెందిన నిఘా విభాగం, రెవెన్యూ అధికారులతో కలిసి తవ్వకాలను జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. తవ్వకాలను ప్రాధమికంగా అంచనా వేస్తేనే రూ.కోట్లలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ వెంకటనాథ్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌లు శ్రీనివాసరావు, రాము, గనులశాఖ అధికారులు రాము, నాగమణి పాల్గొన్నారు.
Advertisement
Advertisement