వారు తప్పు చేశారు
► రెవెన్యూ సహకరించింది టేకు, గ్రావెల్ అమ్ముకున్నారు
► తహసీల్దార్ జనార్దన్‌పై వేటుకు రంగం సిద్ధం
► ఆర్‌ఐ, వీఆర్వో, అటవీ అధికారులకు షోకాజ్ నోటీసులు
► కానిస్టేబుల్‌పై దాడి కేసులోవేమిరెడ్డి ఆదినాయణరెడ్డి అరెస్ట్
సాక్షిప్రతినిధి, నెల్లూరు: టేకు చెట్లు నరికివేత.. గ్రావెల్ అక్రమ తవ్వకాలకు సహకరించిన రెవెన్యూ అధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. నెల్లూరు రూరల్ తహసీల్దార్‌గా పనిచేసిన జనార్దన్‌ను సస్పెండ్‌చేసి క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ జానకి ప్రకటించారు. అదేవిధంగా ఆర్‌ఐ, వీఆర్వోలతో పాటు అటవీ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే మంగళవారం కానిస్టేబుల్ రమేష్‌బాబుపై దాడిచేసిన కేసులో వేమిరెడ్డి ఆదినారాయణరెడ్డిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవేదగిరి నరసింహస్వామి ఆలయ భూములను లీజుకు తీసుకున్న వేమిరెడ్డి హరిశివారెడ్డి అందులో ఉన్న విలువైన టేకుచెట్లు, మామిడి, వేప, కొబ్బరి చెట్లను కొట్టేశారు.
అదేవిధంగా మాన్యం భూముల్లో రూ.70 లక్షలు విలువచేసే గ్రావెల్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వుకుని సొమ్ముచేసుకున్నారు. అందుకు అప్పటి తహసీల్దార్ జనార్దన్ టీడీపీ నేత వేమిరెడ్డి హరిశివారెడ్డికి పూర్తి సహకారం అందించినట్లు అధికారల విచారణలో తేలింది. టేకు చెట్లు, గ్రావెల్ మాయం విషయంలో ప్రధాన నిందితుడైన వేమిరెడ్డి హరిశివారెడ్డిని అరెస్టు చేయకుండా పథకం ప్రకారం జాగ్రత్తపడ్డారు. ముందస్తుగా కోర్టులో లొంగిపోయేలా పోలీసు అధికారులు కొందరు చర్యలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. హరిశివారెడ్డి కోర్టులో లొంగిపోయేందుకు వాహనంలో వచ్చిన సమయంలో సోదరుడు వేమిరెడ్డి ఆదినారాయణరెడ్డి అక్కడే ఉన్న కానిస్టేబుల్ రమేష్‌బాబును కారుతో ఢీకొట్టినట్లు కేసునమోదు చేశారు. ఆ కేసులో ఆదినారాయణరెడ్డిని బుధవారం అరెస్టు చేశారు. హరిశివారెడ్డిని కొద్దిరోజుల తర్వాతబెయిల్‌పై బయటకు తీసుకొచ్చి కేసును వాయిదాలు వేయించుకుంటూ తప్పించే విధంగా టీడీపీ నేతలు మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలిసింది.
వణికిపోతున్న అధికారులు
టేకుచెట్ల నరికివేత వ్యవహారంపై బుధవారం కలెక్టర్ జానకి రెవెన్యూ, అటవీ, మైనింగ్, దేవాదాయశాఖ అధికారులతో సమావేశమయ్యారు. చెట్ల నరికివేత, మైనింగ్ తవ్వకాల్లో అధికారులు ఎటువంటి నిబంధనలు పాటిస్తారు? ఆలయ మాన్యం భూమిలో ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం మొత్తంపై రెవెన్యూ, అటవీశాఖ అధికారులు తయారుచేసిన నివేదికను కలెక్టర్ జానకికి అందజేసినట్లు సమాచారం. ఈ వ్యహారంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికారులు వణికిపోతున్నారు. ఏ అధికారిని కదిలించినా ‘వామ్మో.. ఆ విషయం మాత్రం నన్ను అడగొద్దు ఫ్లీజ్’ అంటూ చెప్పి వెళ్లిపోతున్నారు. మొత్తంగా టేకుచెట్ల నరికివేత వ్యహారం అధికారుల గుండల్లో వణుకుపుట్టిస్తోంది.