Illegal Excavations
-
ఆయుధ అలజడి...తరచూ తుపాకులు, తూటాలు కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తరచూ తుపాకులు ‘దొరుకుతున్నాయి’. అక్రమ ఆయుధాలు వినియోగిస్తున్న, రవాణా చేస్తున్న, కలిగి ఉన్న వారితో పాటు లైసెన్స్ ఉన్న ఆయుధాలను దుర్వినియోగం చేసిన వారిని పట్టుకోవడం నాణేనికి ఒక వైపైతే... చెత్త కుప్పలు, చెట్ల పొదల్లో అక్రమాయుధాలు, తూటాలు లభిస్తుండటం మరో వైపైంది. తాజాగా శుక్రవారం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న పబ్లిక్ గార్డెన్స్‌లో లభించిన రెండు తపంచాలు, ఓ కంట్రీమేడ్ రివాల్వర్ తీవ్ర కలకలం సృష్టించాయి. గతంలో రెండు సందర్భాల్లో ఇలా ఆయుధాలు, బుల్లెట్లు బయటపడ్డాయి. ఆ కేసులు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. తాజా ఉదంతంతో సహా మొత్తం మూడూ శుక్రవారాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. మొదటగా గాంధీ ఆస్పత్రి సమీపంలో... సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో 2013 ఫిబ్రవరి 15న (శుక్రవారం) ఆయుధాలు, తూటాలు లభించాయి. చిలకలగూడ ఠాణా పరిధిలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఇవి దొరికాయి. ఈ ప్రాంతాల మధ్య కేవలం కిలోమీటరు దూరమే ఉండటంతో ఒకరి పనిగానే అనుమానించారు. సదరు తుపాకులు, తూటాలు దాదాపు 40 ఏళ్ల క్రితం నాటివిగా అంచనా వేశారు. పద్మారావునగర్‌లో ఆ రోజు ఉదయం 6.30 గంటలకు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులు చెత్తను డబ్బాలో వేసేందుకు వెళ్లారు. అందులో ప్లాస్టిక్ గోనెసంచిలో కట్టిన రెండు తుపాకులు (రైఫిల్స్ మాదిరివి) కనిపించాయి. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన సిబ్బంది వెంటనే చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కలకలం కొనసాగుతుండగానే... మరో అరగంటకు షాబాద్‌గూడ నుంచి మరో సమాచారం వచ్చింది. రామచంద్రయ్య అనే వ్యక్తి చెత్త పడేసేందుకు తన ఇంటి సమీపంలోని డబ్బా వద్దకు వెళ్లగా... అందులో తూటాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తుపాకులు, తూటాలు సైతం అమెరికాలో తయారైనవిగా వెల్లడైంది. రెమింగ్టన్ కంపెనీకి పాయింట్ 410 ఎంఎం, 0.38 ఆర్మీడ్, 3.57 రేంజర్ క్యాలిబర్లతో కూడిన తూటాలు మొత్తం వంద వరకు, మరికొన్ని ఖాళీ క్యాట్రిడ్జ్‌లు (కాల్చేయగా మిగిలినవి) ఉన్నట్లు గుర్తించారు. కొన్నింటిని పాన్ల్లో వినియోగించే ఖాళీ జర్దా డబ్బాలో, మరికొన్ని ప్రముఖ మిఠాయి దుకాణం కర్నూలు బ్రాంచ్‌కు చెందిన డబ్బాలో ఉంచి చెత్తడబ్బాలో పడేశారు. మూడేళ్ల క్రితం రైల్వేస్టేషన్ వద్ద... హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి) సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్‌లో 2019 డిసెంబర్ 20న (శుక్రవారం) రెండు రివాల్వర్లు దొరికాయి. ఆ రోజు రాత్రి మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. దీంతో కాంప్లెక్స్ నిర్వాహకులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనాస్ధలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి రివాల్వర్లు కాదని, తపంచాలని పోలీసులు నిర్ధారించారు. తపంచాలు వదిలిపెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులే సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం చేసి ఉంటారని, వాళ్లే ఇక్కడ వదిలిపెట్టి వెళ్లినట్టుగా భావించి ఆ కోణంలోనూ ఆరా తీశారు. అక్రమ రవాణా ముఠాలు, దోపిడీ దొంగలు, రౌడీ షీటర్లు, మావోయిస్టులు, మాజీ నక్సలైట్లు.. వీళ్లల్లో ఎవరైనా తీసుకువచి్చ, సులభ్ కాంప్లెక్స్‌లో వీటిని మరిచిపోయారని అంచనా వేశారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు జటిలమే... సాధారణంగా కంపెనీల్లో తయారయ్యే మారణాయుధాలకు కొన్ని సీరియల్ నెంబర్లు, బ్యాచ్ నెంబర్లు తదితరాలు ఉంటాయి. ఇవి ఎక్కడైనా లభిస్తే ఈ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్లి బాధ్యలను గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాటు తుపాకులు, తపంచాలకు ఇలాంటి లేకపోవడంతో పాటు విదేశాల్లో తయారైన వాటికి ఇవి ఉన్నా ఫలితం ఉండట్లేదు. నగరానికి నాటు తుపాకులు, తపంచాలు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ల్లోని వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నాయి. ఇలాంటివి లభించినప్పుడు వాటి రూపం, పిడి ఉన్న తీరుతెన్నుల్ని బట్టి బాలిస్టిక్ నిపుణులు సైతం ఏ ప్రాంతంలో తయారైందో మాత్రమే చెప్పలగరు. ఇంతకు మించి ముందుకు వెళ్లడానికి సీసీ కెమెరాలు వంటి వాటిపై ఆధారపడాల్సిందే. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో వాటిలోనూ సరైన ఆధారాలు లభించట్లేదు. ఫలితంగా ఈ అక్రమ ఆయుధాల కేసులు బాధ్యులు గుర్తించడం జరగకుండానే పెండింగ్‌లో ఉండి క్లోజ్ అయిపోతున్నాయి. (చదవండి: రామోజీపై భూకబ్జా కేసు పెట్టాలి.. ఆ 70 ఎకరాలు..) -
మాఫియా డాన్‌గా టీడీపీ నేత.. పగలు, రాత్రి తేడా లేకుండా..
మదనపల్లె(చిత్తూరు జిల్లా): మదనపల్లె మండలంలో మట్టి, గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా కొండలు, గుట్టలను పిండిచేస్తోంది. భారీ వాహనాలు పెట్టి పగలు, రాత్రి తేడా లేకుండా తరలిస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడంతో పాటు ప్రకృతివనరులను ధ్వంసం చేస్తోంది. ఈ వ్యవహారం మండలంలోని పోతబోలు, వెంకప్పకోట, బసినికొండ, కొత్తపల్లె, అంకిశెట్టిపల్లె, చీకలబైలు పంచాయతీల్లో సాగుతోంది. టిడ్కో గృహాలకు కేటాయించిన ప్రభుత్వస్థలాన్నీ యథేచ్ఛగా తవ్వేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. చదవండి: టీడీపీ సమావేశంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, గుట్టలు, ప్రభుత్వ స్థలాల్లోని మట్టి అక్రమార్కులకు వరంగా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు టీడీపీ నేతలు ఇష్టానుసారం తవ్వి అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులు సహకరిస్తుండడంతో వీరి దందా మూడు ట్రాక్టర్లు, ఆరు ట్రిప్పర్లుగా సాగుతోంది. వెంకప్పకోట పంచాయతీలో ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సర్వే నం.72, 75, 74, 75, 90లో 40.68 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఇళ్ల నిర్మాణం చేస్తున్న ప్రాంతానికి ఎదురుగా ఉన్న స్థలంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నాయి. పోతబోలు పంచాయతీ తురకపల్లె నమాజుకట్ట వద్ద ప్రభుత్వ స్థలంలో సర్వే నం.1312, 1314లో జేసీబీలతో మట్టిని తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లతో పట్టణంలోకి తరలిస్తున్నారు. ట్రాక్టర్ రూ.800–1,000 వరకు, టిప్పర్ మట్టిని రూ.4 వేలకు అమ్ముకుంటున్నారు. అక్రమదందా వెనుక స్థానిక వీఆర్వో నాగరాజ ప్రమేయం ఉన్నట్లు సమాచారం. తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగిన టీడీపీ మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, తదితరులు మాఫియా డాన్‌గా టీడీపీ మాజీ ఎంపీటీసీ మండలంలో గ్రావెల్ మాఫియాకు సంబంధించి పోతబోలు టీడీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు డాన్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. టీడీపీ హయాంలో అడ్డగోలుగా ఇసుక, మట్టి వ్యాపారాల్లో రాటుదేలి ఆర్థికంగా స్థిరపడిన అతను ట్రిప్పర్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేసి స్నేహితులతో కలిసి అక్రమదందా సాగిస్తున్నట్టు సమాచారం. శనివారం పోతబోలు తురకపల్లె వద్ద తహసీల్దార్ సీకే.శ్రీనివాసులు జరిపిన దాడుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడమే కాకుండా తాను చేస్తోంది సక్రమమేనని వాదనలకు దిగడం కొసమెరుపు. గతంలో ఇతనిపై మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్లో పదికిపైగా కేసులు ఉండడం గమనార్హం. ఎలాంటి అనుమతులు లేవు మండలంలో మట్టి, గ్రావెల్ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. టిప్పర్, ట్రాక్టర్ యజమానులు ముఠా గా ఏర్పడి మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దాడుల్లో పట్టుబడిన వాహనాలను సీజ్‌చేసి కేసు నమోదుచేశాం. –సీకే.శ్రీనివాసులు, తహసీల్దార్, మదనపల్లె నమాజ్ కట్టవద్ద ♦మదనపల్లె మండలం, పాతబోలు పంచాయతీ, తురకపల్లె నమాజ్ కట్ట వద్ద ఉన్న ప్రభుత్వ స్థలం : 20 ఎకరాలు ♦అక్రమార్కులు తవ్వేసిన విస్తీర్ణం : సుమారు 5 ఎకరాల్లో ♦ఎన్ని రోజులుగా సాగుతోంది?: నెల రోజులుగా ♦రోజుకు అక్రమంగా తరలుతున్న ట్రిప్పర్లు: 40పైనే ♦గ్రావెల్ తరలించి కొల్లగొట్టిన సొమ్ము: రూ.45 లక్షలపైనే వెంకటప్ప పంచాయతీలో.. ♦టిడ్కో ఇళ్లకు కేటాయించిన స్థలం: 40.68 ఎకరాలు ♦రోజుకు అక్రమంగా తరలుతున్న గ్రావెల్ : 20 ట్రిప్పర్లు ♦తవ్వేసిన విస్తీర్ణం : మూడెకరాల్లో ♦ఎన్నిరోజులుగా సాగుతోంది: వారం రోజులుగా ♦కొల్లగొట్టిన సొమ్ము : రూ.5 లక్షలపైనే ఈ రెండు ప్రాంతాల్లోనే ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే.. ఇక మండలంలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏడాది కాలంగా కోట్ల రూపాయల గ్రావెల్‌ను అక్రమార్కులు తరలించి సొమ్ముచేసుకున్నట్టు స్పష్టమవుతోంది. -
అక్రమార్కులపై చర్యలు పాము కాటులా ఉండాలి
సాక్షి, అమరావతి: ఖనిజ తవ్వకాల పేరుతో తాత్కాలిక అనుమతులు పొంది, విచక్షణారహితంగా అక్రమ తవ్వకాలు చేస్తుంటే నిద్రపోతున్నారా? అంటూ గనుల శాఖ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఇలా తవ్వకాలు చేస్తున్న వారి విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారంటూ అధికారులపై హైకోర్టు మండిపడింది. నామమాత్రపు జరిమానాలతో చేతులు దులుపుకుంటున్నారంటూ ఆక్షేపించింది. అక్రమార్కులకు 5 రెట్ల జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదుచేసే అవకాశం చట్టం కల్పిస్తున్నా, అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించింది. అక్రమార్కులపై చర్యలు పాము కాటులా ఉండాలే తప్ప, దోమకాటులా కాదంటూ అధికారులకు దిశానిర్దేశం చేసింది. తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం పరిధిలోని లంక గ్రామాల్లో ఇసుక, బొండు మట్టి అక్రమ తవ్వకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఉత్తర్వులిచ్చారు. -
తవ్వుకుపోతున్నారు..!
రామభద్రపురం: రామభద్రపురం మండలంలో జోరుగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. చాలా వరకు గ్రామాల్లో నాణ్యమైన గ్రావెల్ లభ్యం కావడంతో ఇతర మండలాల వారు కూడా వచ్చి తరలించుకుపోతున్నారు. కొందరైతే ఏకంగా కాంట్రాక్టర్ అవతారం ఎత్తి అనుమతులు లేకుండానే రియల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నా పట్టించుకునే అధికారులు కానరావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రం నుంచి తారాపురం మీదుగా సాలూరుకు వెళ్లే జాతీయ రహదారి పక్క నుంచి మిర్తివలస గ్రామానికి వెళ్లే రోడ్డు ఆనుకుని ఉంది. దానికి సమాంతరంగా బొబ్బిలికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొట్టక్కి రెవెన్యూ పరిధిలోని 301, 315, 316 సర్వే నంబర్లలోని 13.30 ఎకరాల్లో లేఅవుట్ వేస్తున్నారు. దానికి బొబ్బిలికి చెందిన ఓ కాంట్రాక్టర్ గ్రావెల్ సమకూర్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అంతే నిబంధనలను గాలికొదిలేసి మండలంలోని నాయుడువలస పంచాయతీ పరిధిలోని 34 సర్వే నంబర్ బొంగువాని చెరువులో నీరు – చెట్టు పథకం కింద పూడికలు తీయిస్తున్నామన్న నెపంతో అక్రమంగా జేసీబీతో గ్రావెల్ తవ్వించి టిప్పర్లతో తరలిస్తున్నారు. దరఖాస్తు చేయలే.. వాస్తవానికి చెరువులో పూడికల పేరుతో మట్టి, గ్రావెల్ తీయాలంటే సదరు వ్యక్తులు తహసీల్దార్‌కు మీ సేవలో దరఖాస్తు చేయాల్సి ఉంది. దాన్ని తహసీల్దార్ ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వారు ఆ చెరువును గుర్తించి లోతును బట్టి అనుమతి ఇవ్వాలి. ఇంత జరిగితే కానీ మట్టి తవ్వకాలకు వీల్లేదు. కానీ ఇక్కడ గ్రావెల్ తరలిస్తున్న కాంట్రాక్టర్ ఇరిగేషన్ ఈఈ వద్ద అనుమతులు తీసుకున్నట్లు చెబుతున్నాడంట. అయితే దీనిపై అసలు విషయాలు రావాల్సి ఉంది. ఇలాగే మండలంలో చాలా గ్రామాల్లో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ పట్టించుకునే అధికారులే కానరావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే సాగునీరు మదుముల ద్వారా వెళ్లే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. అనుమతులు మార్చి.. మండలంలో గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న కాంట్రాక్టర్ వంగపండు శ్రీపారినాయుడు. ఆయనకు ఇరిగేషన్ అధికారులు బొబ్బిలి మున్సిపాలిటీలోని ఓ చెరువుకు తవ్వకాలకు అనుమతులు ఇస్తే, ఆయన రామభద్రపురం మండలంలో తవ్వకాలు చేపడుతున్నారు. ఈ మండలంలోని చెరువులు పార్వతీపురం సబ్ డివిజన్లో ఉంటాయి. అక్కడి అధికారులు అనుమతులు ఇస్తే తప్ప తవ్వకాలకు వీలుకాదు. మరి బొబ్బిలి అధికారులు ఇస్తే ఎలా తవ్వకాలు చేస్తున్నారో అర్థం కాని విషయం. అయితే ఈ కాంట్రాక్టర్‌కు బొబ్బిలి పద్మనాయుని చెరువు తవ్వకాలకు అనుమతి ఇస్తే ఆయన రామభద్రపురం మండలంలోని నాయుడు వలస పంచాయతీ బొంగురు చెరువులో తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు తహసీల్దార్‌కు ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ మార్పిడి ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. అధికారులే ఇలా అనుమతి ఇచ్చారా లేక కాంట్రాక్టర్ ఏమైనా ఫోర్జరీ చేశారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అనుమతి పొందా.. నీరు చెట్టు పథకం కింద చెరువులో మట్టి తీసేందుకు క్యూబిక్ మీటర్‌కు ఒక రూపాయి చొప్పున చలానా తీశా. ఇరిగేషన్ అధికారుల వద్ద అనుమతి కూడా తీసుకుని గ్రావెల్ తరలిస్తున్నా. – వంగపండు శ్రీపారినాయుడు, కాంట్రాక్టర్. తవ్వకాలకు ఆర్డరు ఇవ్వలే.. చెరువుల్లో మట్టి గ్రావెల్ తీసేందుకు మావద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేదు. ఎవరికీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తరలిస్తే చర్యలు తీసుకుంటాం. –డి.సురేష్, ఇరిగేషన్ డీఈఈ, పార్వతీపురం. నేను అనుమతులు ఇవ్వలే.. రామభద్రపురం మండంలలోని సీతారాంపురం, గొల్లపేట, రొంపల్లి గ్రామాలు మాత్రమే బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. నాయుడువలస పార్వతీపురం సబ్ డివిజన్‌లోకి వెళ్తుంది. అక్కడ గ్రావెల్ తవ్వకాలకు తాను అనుమతులు ఇవ్వలేను. సదరు కాంట్రాక్టర్‌కు అనుమతి పత్రం ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఈఈ దృష్టిలో పెట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం. – బాలసూర్యం, ఇరిగేషన్ డీఈఈ, బొబ్బిలి. -
శభాష్ పోలీస్
ద్వారకాతిరుమల : చేపల కోసం చెరువులోకి దిగిన ఒక యువకుడు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఇతడ్ని రక్షిద్దామని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తుల పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టబోయిన్డట్టయ్యింది. మండలంలోని కొమ్మరలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొమ్మరకు చెందిన మానుకొండ నాగరాజు(29)కూలి పనులు చేస్తూ భార్య కుమారి, తన ఇద్దరి పిల్లలను పోషిస్తున్నాడు. అయితే ఉదయం వర్షం కురుస్తుండటంతో పనికి సెలవుపెట్టి, స్థానిక బూర్గులమ్మ చెరువు వద్దకు చేపల వేట నిమిత్తం వెళ్లాడు. అతని వెనుక అదే గ్రామానికి చెందిన శీలం విఘ్నేశ్వరరావు, ముంగమూరి లక్ష్మణరావు సైతం వెళ్లగా, నాగరాజు చెరువులోకి దిగాడు. ఆ ప్రాంతంలో దాదాపు 12 అడుగుల లోతు ఉండటంతో నాగరాజు అక్కడ మునిగిపోయాడు. చివరి క్షణాల్లో దీన్ని గమనించిన విఘ్నేశ్వరరావు, లక్ష్మణరావులు నాగరాజును రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారు వెనుదిరిగి విషయాన్ని స్థానికులు, పోలీసులు, భీమడోలు అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే యువకుడు నీటమునిగిన ప్రాంతం లోతుగా ఉండటంతో పాటు, వర్షం కురుస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఈ తరుణంలో ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్యతో పాటు భీమడోలు సీఐ బి.నాగేశ్వర్ నాయక్ సంఘటనా స్థలానికి వచ్చారు. ఎంతకీ మృతదేహం లభ్యం కాకపోవడంతో భీమడోలు సీఐ చెరువులోకి దిగి, మృతదేహాన్ని కనుగొని ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఐ.వీర్రాజు తెలిపారు. అక్రమ తవ్వకాలే బలిగొన్నాయి కొమ్మరలోని బూర్గులమ్మ చెరువులో గతంలో కొందరు టీడీపీ నేతలు మట్టి అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా జరిపారు. రియల్ ఎస్టేట్లకు ఆ మట్టిని అమ్మి సొమ్ము చేసుకున్నారు. అయితే చెరువును క్రమ పద్ధతిలో తవ్వకుండా ఇష్టం వచ్చినట్లు తవ్వేయడంతో అగాథాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా ఏర్పడిన అగాథాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు పుష్కలంగా నీరు చేరి, స్థానికులకు లోతు తెలియలేదు. ఈ కారణంగానే చేపల వేట కోసం చెరువులోకి దిగిన నాగరాజు ఆ అగాథంలో పడి దుర్మరణం పాలైనట్టు స్థానికులు తెలిపారు. చెరువులోకి దిగి యువకుడి మృతదేహాన్ని వెలికితీసిన సీఐ ఒకానొక సమయంలో ఎంతకీ నాగరాజు మృతదేహం లభ్యం కాకపోవడంతో అందరిలో నైరాశ్యం నెలకొంది. ఈ క్రమంలో ప్రమాదమని తెలిసినా భీమడోలు సీఐ బి.నాగేశ్వర్ నాయక్ తానే స్వయంగా రంగంలోకి దిగారు. యూనిఫాంను తొలగించి, షార్ట్, టీ షర్టులను ధరించి శవాన్ని వెదికేందుకు చెరువులోకి దిగారు. దాదాపు గంట పాటు సీఐ చెరువులో మునిగి ఈత కొడుతూ.. చివరికి మృతదేహాన్ని గుర్తించారు. తనే స్వయంగా మృతదేహాన్ని బయటకు తీసి బోటులో ఉన్న ఎస్సై వీర్రాజుకు అందించారు. అక్కడి నుంచి బోటులోనే జాగ్రత్తగా శవాన్ని ఒడ్డుకు చేర్చారు. అధికారే స్వయంగా చెరువులోకి దిగి మృతదేహాన్ని కనుగొనడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా పలువురు ఆయన సాహసాన్ని ప్రశంసించారు. -
పెందుర్తిలో కార్మికుల సొసైటీ పేరిట అక్రమ తవ్వకాలు
-
తవ్వేస్తున్నారు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పగలు, రాత్రీ తేడా లేకుండా మొరం తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చీకటి పడితే చాలు జేసీబీలు షురూ అవుతున్నాయి. రాత్రంతా తవ్వకాలు, టిప్పర్లలో తరలింపు జరుగుతోంది. నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లలో మొరాన్ని నిజామాబాద్ నగరానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పరుకు రూ.రెండు వేల నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. నగరంలో రియల్ వెంచర్లకు, కట్టడాలకు, రోడ్ల పనులకు, ఇతర అవసరాలకు సరఫరా చేస్తూ కాసులు దండుకుంటున్నారు. చేతులెత్తేసిన గనుల శాఖ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన భూగర్భ గనుల శాఖ సిబ్బంది కొరత పేరుతో చేతులెత్తేసింది. కార్యాలయంలో ఉన్నది కేవలం ముగ్గురే ఉద్యోగులని, ఉన్న ఉద్యోగులు కార్యాలయం విధులకే సరిపోవడం లేదని.. క్షేత్ర స్థాయి తనిఖీలు ఎలా చేపట్టేదని వారు పేర్కొంటున్నారు. సిబ్బంది, యంత్రాంగం ఉన్న రెవెన్యూ శాఖ గానీ, పొలీసుశాఖ గానీ ఈ తవ్వకాలను, అక్రమ రవాణాను అడ్డుకోవాలని వారు చెబుతున్నారు. ఇలా ఒకరంటే.. మరొకరు బా«ధ్యతను బదలాయించుకునేలా చేస్తుండటంతో మొరం మాఫియా తమ దందాను యథేచ్ఛగా కానిచ్చేస్తోంది. అధికార పార్టీ అండదండలు.. మొరం మాఫియాకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలుండటంతో ఈ అక్రమ దందాను అడ్డుకునే నాథుడే లేకుండా పోయారు. కళ్ల ముందే తవ్వకాలు, రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు ఈ అక్రమ రవాణా వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేకుండాపోయింది. అధికారులేమంటున్నారంటే.. అక్రమ తవ్వకాలపై భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.సత్యనారాయణను ‘సాక్షి’ సంప్రదించగా., తమశాఖలో సిబ్బంది కొరత తీవ్రం గా ఉందని చెప్పారు. దీంతో తాము క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసేందుకు వీలు పడటం లేదని చెప్పారు. అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకునేందుకు అధికారాలు రెవెన్యూ, పోలీసు శాఖలకు డెలిగేషన్ అయ్యాయన్నా రు. వారు చూసుకోవాలన్నారు. నిజామాబాద్ ఆర్డీఓ వినోద్‌కుమార్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన స్పందించలేదు. -
బడే దేవరకొండపై యంత్రాలు మాయం!
పార్వతీపురం టౌన్: మండలంలోని బడేదేవరకొండపై అక్రమంగా తవ్వకాలు చేపట్టిన కాంట్రాక్టర్ ఒక్కొక్కటిగా యంత్రాలను తరలించేస్తున్నారు. అయినా అటవీశాఖాధికారులు పట్టించుకోవడంలేదు. దీనిపై ఇప్పటికే న్యాయస్థానంవద్ద కేసు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు హైపవర్ కమిటీ వచ్చి సర్వే చేసి నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. దీనిపై తీర్పు వెలువడేంతవరకూ అక్కడ ఎలాంటి పనులు చేయకూడదనీ... ఇదివరకు అక్కడ ఉన్న వస్తువులను, యం త్రాలను తరలించకూడదనీ ఉత్తర్వులున్నాయి. కానీ యంత్రాలు తరలిపోతున్నా అటవీశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అసలేం జరిగిందంటే... మండలంలోని ములగపంచాయతీ పరిధి సర్వేనంబర్ 1లో తవ్వకాలకు ఎంఎస్ పళని గ్రానైట్స్ కంపెనీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సంస్థ ఆ ఉత్తర్వులను విస్మరించి కోరి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 1లో తవ్వకాలు ప్రారంభించింది. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. కానీ ఇచ్చిన అనుమతులు సక్రమమేనంటూ స్థానిక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, రెవె న్యూ, అటవీ, మైన్స్ శాఖాధికారులు నిర్థారించారు. అయి తే హైకోర్టు నియమించిన హైపవర్ కమిటీలోని అధికారులు పక్కాగా రిజర్వ్ ఫారెస్టు అని తేల్చి నివేదికను తయా రు చేసి హైకోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో హైకో ర్టు అక్కడ ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని, కొండపైవున్న యంత్రాలను తరలించకూడదని హైపవర్ కమిటీకి సూచించింది. అంతేగాకుండా సబ్‌కమిటీ రిపోర్టును కూడా సమర్పించాలని హైకోర్టు కోరింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం రెండు వారాల గడువు కావాలని కోరినట్లు సమాచారం. సబ్‌కమిటీ రిపోర్టు తయారు చేసే లోగా బడేదేవరకొండపై ఉన్న యంత్ర పరికరాలను తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా తరలిన యంత్రాలు కొండపై గ్రానైట్ కటింగ్ పనులు ప్రారంభించిన సమయంలో ఐదు యంత్రాలు ఉండేవి. వాటితోపాటు జనరేటర్, జేసీబీ వంటి యంత్రాలు ఉండేవి. కానీ ప్రస్తుతం అవేవీ అక్కడ కన్పించడం లేదు. కేవలం ఒక్క యంత్రం మాత్రమే ప్రస్తుతం ఉంది. సబ్ కమిటీ రిపోర్టు తయారు చేసే లోపు ఉన్న ఆ ఒక్క యంత్రాన్ని కూడా తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రిజర్వ్ ఫారెస్టులో తవ్వకాలు జరిపి, పచ్చని కొండలను విధ్వంసం చేసినందుకు ఎవరు బాధ్యులవుతారు. జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. మొదటినుంచీ ఇక్కడ జరుగుతున్న అకృత్యాలను, రిజర్వ్‌ఫారెస్టులో జరుగుతున్న తవ్వకాలను వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తూనే ఉంది. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్‌ను పోలీసులు అరెస్టుచేసి చిత్రహింసలకు గురిచేసిన సంగతీ తెలిసిందే. ఇతనితోపాటు మరో 40 మంది గిరిజనులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఇప్పుడు జరిగిన తప్పిదానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నదే ప్రశ్న. -
వారు తప్పు చేశారు
► రెవెన్యూ సహకరించింది టేకు, గ్రావెల్ అమ్ముకున్నారు ► తహసీల్దార్ జనార్దన్‌పై వేటుకు రంగం సిద్ధం ► ఆర్ఐ, వీఆర్వో, అటవీ అధికారులకు షోకాజ్ నోటీసులు ► కానిస్టేబుల్‌పై దాడి కేసులోవేమిరెడ్డి ఆదినాయణరెడ్డి అరెస్ట్ సాక్షిప్రతినిధి, నెల్లూరు: టేకు చెట్లు నరికివేత.. గ్రావెల్ అక్రమ తవ్వకాలకు సహకరించిన రెవెన్యూ అధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. నెల్లూరు రూరల్ తహసీల్దార్‌గా పనిచేసిన జనార్దన్‌ను సస్పెండ్‌చేసి క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ జానకి ప్రకటించారు. అదేవిధంగా ఆర్ఐ, వీఆర్వోలతో పాటు అటవీ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే మంగళవారం కానిస్టేబుల్ రమేష్‌బాబుపై దాడిచేసిన కేసులో వేమిరెడ్డి ఆదినారాయణరెడ్డిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవేదగిరి నరసింహస్వామి ఆలయ భూములను లీజుకు తీసుకున్న వేమిరెడ్డి హరిశివారెడ్డి అందులో ఉన్న విలువైన టేకుచెట్లు, మామిడి, వేప, కొబ్బరి చెట్లను కొట్టేశారు. అదేవిధంగా మాన్యం భూముల్లో రూ.70 లక్షలు విలువచేసే గ్రావెల్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వుకుని సొమ్ముచేసుకున్నారు. అందుకు అప్పటి తహసీల్దార్ జనార్దన్ టీడీపీ నేత వేమిరెడ్డి హరిశివారెడ్డికి పూర్తి సహకారం అందించినట్లు అధికారల విచారణలో తేలింది. టేకు చెట్లు, గ్రావెల్ మాయం విషయంలో ప్రధాన నిందితుడైన వేమిరెడ్డి హరిశివారెడ్డిని అరెస్టు చేయకుండా పథకం ప్రకారం జాగ్రత్తపడ్డారు. ముందస్తుగా కోర్టులో లొంగిపోయేలా పోలీసు అధికారులు కొందరు చర్యలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. హరిశివారెడ్డి కోర్టులో లొంగిపోయేందుకు వాహనంలో వచ్చిన సమయంలో సోదరుడు వేమిరెడ్డి ఆదినారాయణరెడ్డి అక్కడే ఉన్న కానిస్టేబుల్ రమేష్‌బాబును కారుతో ఢీకొట్టినట్లు కేసునమోదు చేశారు. ఆ కేసులో ఆదినారాయణరెడ్డిని బుధవారం అరెస్టు చేశారు. హరిశివారెడ్డిని కొద్దిరోజుల తర్వాతబెయిల్పై బయటకు తీసుకొచ్చి కేసును వాయిదాలు వేయించుకుంటూ తప్పించే విధంగా టీడీపీ నేతలు మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలిసింది. వణికిపోతున్న అధికారులు టేకుచెట్ల నరికివేత వ్యవహారంపై బుధవారం కలెక్టర్ జానకి రెవెన్యూ, అటవీ, మైనింగ్, దేవాదాయశాఖ అధికారులతో సమావేశమయ్యారు. చెట్ల నరికివేత, మైనింగ్ తవ్వకాల్లో అధికారులు ఎటువంటి నిబంధనలు పాటిస్తారు? ఆలయ మాన్యం భూమిలో ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం మొత్తంపై రెవెన్యూ, అటవీశాఖ అధికారులు తయారుచేసిన నివేదికను కలెక్టర్ జానకికి అందజేసినట్లు సమాచారం. ఈ వ్యహారంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికారులు వణికిపోతున్నారు. ఏ అధికారిని కదిలించినా ‘వామ్మో.. ఆ విషయం మాత్రం నన్ను అడగొద్దు ఫ్లీజ్’ అంటూ చెప్పి వెళ్లిపోతున్నారు. మొత్తంగా టేకుచెట్ల నరికివేత వ్యహారం అధికారుల గుండల్లో వణుకుపుట్టిస్తోంది. -
గుప్త నిధుల కోసం దేవాలయంలో తవ్వకాలు
దేవరకొండ (నల్లగొండ జిల్లా) : గుప్త నిధుల కోసం గుర్తుతెలియని దుండగులు ముత్యాలమ్మ దేవాలయంలో తవ్వకాలు జరిపారు. ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని నసర్లబావి తండా సమీపంలో ఉన్న ముత్యాలమ్మ దేవాలయంలో జరిగింది. పురాతన దేవాలయం కావడంతో ఎన్నో ఏళ్లుగా చుట్టుపక్కల ఉన్న తండా వాసులు ముత్యాలమ్మను కొలుస్తున్నారు. ప్రతి ఏడాది దసరా సందర్భంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జాతర నిర్వహిస్తుంటారు. కాగా గుర్తుతెలియని దుండగులు గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాలలో చెట్టు కింద ఉన్న ముత్యాలమ్మ విగ్రహం స్వల్పంగా ధ్వంసమైంది. అయితే సోమవారం అటుగా వెళ్లిన గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.