
సాక్షి, అమరావతి: ఖనిజ తవ్వకాల పేరుతో తాత్కాలిక అనుమతులు పొంది, విచక్షణారహితంగా అక్రమ తవ్వకాలు చేస్తుంటే నిద్రపోతున్నారా? అంటూ గనుల శాఖ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఇలా తవ్వకాలు చేస్తున్న వారి విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారంటూ అధికారులపై హైకోర్టు మండిపడింది. నామమాత్రపు జరిమానాలతో చేతులు దులుపుకుంటున్నారంటూ ఆక్షేపించింది.
అక్రమార్కులకు 5 రెట్ల జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదుచేసే అవకాశం చట్టం కల్పిస్తున్నా, అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించింది. అక్రమార్కులపై చర్యలు పాము కాటులా ఉండాలే తప్ప, దోమకాటులా కాదంటూ అధికారులకు దిశానిర్దేశం చేసింది. తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం పరిధిలోని లంక గ్రామాల్లో ఇసుక, బొండు మట్టి అక్రమ తవ్వకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఉత్తర్వులిచ్చారు.