సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగులు తమ విధి నిర్వహణలో అంకితభావం చూపి తీరాల్సిందేనని, అలా చూపకపోవడం దుష్ప్రవర్తన కిందకే వస్తుందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఉద్యోగులు తప్పుడు నివేదికలు ఇవ్వడమంటే తమ విధులపట్ల అంకితభావం చూపకపోడమే అవుతుందని పేర్కొంది. ఇలా తప్పుడు నివేదికలు ఇచ్చి ఖజానాకు రూ.215.06 కోట్ల మేర నష్టం కలిగించినందుకు గనుల శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు వారి సస్పెన్షన్‌ను మరికొంత కాలం పాటు కొనసాగించడాన్ని సమర్థించింది. సస్పెన్షన్‌లో ఉన్న అధికారులు విచారణకు సహకరించనప్పుడు వారి సస్పెన్షన్‌ను పొడిగించడంలో ఎలాంటి దోషంలేదని పేర్కొంది. ఆ ఉద్యోగుల సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఇదీ వివాదం..
శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామంలో ఎంఎస్‌పీ గ్రానైట్స్ సంస్థ 4.517 హెక్టార్లలో మైనింగ్ లీజు తీసుకుంది. ఈ కంపెనీ తవ్వితీసిన ఖనిజం ఎంతో తేల్చేందుకు గనుల శాఖ అధికారులు 2020లో సర్వే నిర్వహించారు. ఈ కంపెనీ 1.45 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఖనిజాన్ని తవ్వితీసిందని గనుల శాఖలో అసిస్టెంట్ మైన్స్ అధికారులుగా పనిచేస్తున్న ఆనందరావు, వెంకటేషు, సర్వేయర్ కుసుమ శ్రీధర్‌లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.విజిలెన్స్ అధికారులు సర్వేచేసి 4.18 లక్షల క్యూబిక్ మీటర్ల మేర సదరు సంస్థ తవ్వకాలు జరిపినట్లు తేల్చారు.
ఈ నివేదికలను పరిశీలించిన గనుల శాఖ ఉన్నతాధికారులు.. ఆనందరావు తదితరులు ఎంఎస్‌పీ గ్రానైట్స్‌తో కుమ్మక్కై తప్పుడు నివేదిక ఇచ్చారని తేల్చారు. తాము 4.18 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఖనిజాన్ని తవ్వినట్లు ఎంఎస్‌పీ గ్రానైట్స్ అంగీకరించింది. దీంతో ఆనందరావు తదితరుల తప్పుడు నివేదికవల్ల ఖజానాకు రూ.215 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చి ఆనందరావు తదితరులను సస్పెండ్ చేశారు. దీనిని సవాలు చేస్తూ వారు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. సింగిల్ జడ్జి వీరి సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తీర్పునిచ్చారు.
ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు ఇచ్చిన తప్పుడు నివేదికవల్ల లీజుదారు నుంచి రూ.215.06 కోట్ల మేర పెనాల్టీ రాకుండా పోయిందన్నారు. తద్వారా వారు ఖజానాకు నష్టం కలిగించారని వివరించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఇటీవల ఈ తీర్పు వెలువరించింది.
ప్రభుత్వోద్యోగులు అంకితభావం చూపాలి
Published Sun, Jan 23 2022 4:11 AM | Last Updated on Sun, Jan 23 2022 4:47 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment