సాక్షి, అమరావతి: న్యాయస్థానాల్లోనే కేసుల ఫైళ్లు మాయం అవుతుండటంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కోర్టుల్లోనే ఫైళ్లు మాయం అయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు, తప్పు చేసే ప్రభుత్వాధికారులను తామెలా ప్రశ్నించగలమని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. నర్సరావుపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరు జిల్లా కోర్టులో ఓ కేసుకు సంబంధించిన ఫైల్ మాయం కావడంపై విచారణకు ఆదేశించింది.
ఈ ఘటనపై విచారణ జరపాలని గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ఆదేశించింది. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసేలా చూడాలంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రిన్సిపల్ జిల్లా జడ్జికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు కోర్టుల్లోనూ లేని కేసు ఫైల్
నర్సరావుపేటలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 1998 ఏప్రిల్ 6న ఓ కేసులో ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ కాపీని ఇవ్వాలంటూ వినుకొండకు చెందిన షేక్ లతీఫ్ సాహెబ్ దరఖాస్తు చేశారు. అయితే ఆ కేసు ఫైల్ తమ వద్ద లేదంటూ ఆ దరఖాస్తును కోర్టు సిబ్బంది తిరస్కరించారు. గుంటూరు జిల్లా కోర్టులోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో లతీఫ్ సాహెబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది కె.వెంకట రామారావు వాదనలు వినిపిస్తూ, నర్సరావుపేట కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఓ కేసులో తాము అడుగుతున్న సర్టిఫైడ్ కాపీ అవసరం చాలా ఉందన్నారు. ఎక్కడా ఆ ఫైల్ లేకపోవడంతో సర్టిఫైడ్ కాపీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఆ కాపీ లేకపోవడం వల్ల పిటిషనర్‌కు తీరని నష్టం కలుగుతుందని చెప్పారు. వాదనలు విన్న సీజే ధర్మాసనం దీనిపై విచారణ జరపాలని గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment