
గుంటూరు లీగల్ : నాణ్యమైన తీర్పులతో ప్రజల హక్కులకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా న్యాయాధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజలోని ఏపీ జ్యుడీషియల్ అకాడమిలో శనివారం న్యాయాధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పాల్గొని.. న్యాయాధికారులకు వృత్తిలో మెలకువలను వివరించారు. జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఆకుల శేషసాయి, జస్టిస్ వై.సోమయాజులు, జస్టిస్ సి.మానవేంద్రనాథ్‌రాయ్ తదితరులు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ హరిహరనాధశర్మ, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
జస్టిస్ ప్రవీణ్‌కుమార్ కృషి అభినందనీయం
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో హైకోర్టు అభివృద్ధికి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఎంతో కృషి చేశారని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రశంసించారు. హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా జ్యుడీషియల్ అకాడమీలో ప్రవీణ్‌కుమార్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్‌కుమార్ సేవలను కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment