రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలు జరగడం లేదు | Bauxite mining is not taking place in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలు జరగడం లేదు

Published Tue, Jul 6 2021 3:31 AM | Last Updated on Tue, Jul 6 2021 6:54 AM

Bauxite mining is not taking place in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్‌ తవ్వకాలు జరగడం లేదని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. అయినా విశాఖ జిల్లాలో బాక్సైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయని ఓ పత్రిక తప్పుడు కథనం రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అలాగే లేటరైట్‌ మైనింగ్‌లో రూ.15 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను, గనుల శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా తప్పుడు కథనాలను ప్రచురించారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లేలా కథనాలు ప్రచురించిన ఆ పత్రికపై కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేస్తున్నామని తెలిపారు. 

మొత్తం తవ్వకాల విలువే అంత లేదు
గత ప్రభుత్వంలో విశాఖ జిల్లాలో లేటరైట్‌ మైనింగ్‌ కోసం ఆరు లీజులిచ్చారని ద్వివేది తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలతోనే ఒక మైనింగ్‌ మాత్రమే లీజుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఆ లీజుదారు ఇప్పటి వరకు కేవలం 5 వేల టన్నుల లేటరైట్‌ తవ్వారని తెలిపారు. 5 వేల టన్నుల తవ్వకాల్లో రూ.15 వేల కోట్ల అక్రమాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. మొత్తం తవ్వకాల విలువే అంత లేనప్పుడు, అన్ని వేల కోట్ల అక్రమాలు ఎలా జరుగుతాయన్నారు. రాష్ట్రంలో అటవీ వనరులను కాపాడటం, పర్యావరణ పరిరక్షణకు సీఎం వైఎస్‌ జగన్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అటవీ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడానికి మైనింగ్‌ లీజుల విషయంలో ప్రభుత్వం పర్యావరణానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా అనుతివ్వలేదు
విశాఖ జిల్లాలో ప్రభుత్వ అనుమతితో జరుగుతున్న లేటరైట్‌ తవ్వకాలను బాక్సైట్‌ తవ్వకాలుగా చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలు ప్రచురించడాన్ని ఖండిస్తున్నామని భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వి.జి.వెంకటరెడ్డి తెలిపారు. లేటరైట్, బాక్సైట్‌ ఖనిజాలు వేరువేరుగా ఉంటాయని, రాష్ట్రంలో ఎక్కడా బాక్సైట్‌ ఖనిజాల మైనింగ్‌కు అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం మైనింగ్‌ జరుగుతున్న ప్రదేశంలో లభించే ఖనిజం లేటరైట్‌ అని 2010లోనే జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ప్రాంతంలో 1981–82లో జరిగిన పరిశోధనల్లో ఇక్కడ లభించే ఖనిజం లేటరైట్‌గా నిర్ధారించారని తెలిపారు. కేవలం ఒక లీజు ద్వారా జరుగుతున్న లేటరైట్‌ మైనింగ్‌లో ఇప్పటి వరకు 5 వేల టన్నుల లేటరైట్‌ను వెలికితీశారన్నారు.

అయ్యన్న అక్రమాలకు ఆధారాలు
గత ప్రభుత్వంలో లేటరైట్‌ మైనింగ్‌లో అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన అనుయాయులు అనేక అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ జరిగిందని వెంకటరెడ్డి తెలిపారు. ఆ అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మైనింగ్‌ అధికారులు విచారణ జరిపారని, అప్పటి అక్రమ మైనింగ్‌లపై భారీ జరిమానాలు కూడా విధించామని చెప్పారు.

ఇసుక కొరత లేదు
జగనన్న కాలనీలకు ఇసుక కొరత లేదని గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి తెలిపారు. జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరుపుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా 200 రీచ్‌ల్లో తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. రోజుకు దాదాపు 2 లక్షల టన్నుల వరకు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. వర్షాకాలం కోసం ఇప్పటికే 50 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేశామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇరిగేషన్‌ శాఖ క్లియరెన్స్‌తో పూడికగా ఉన్న ఇసుక నిల్వలను ట్రెడ్జింగ్‌ చేసి సామాన్యులకు అందుబాటులోకి తెస్తామన్నారు. జగనన్న కాలనీల్లో ఇసుక కోసం రీచ్‌లకు 40 కిలోమీటర్ల లోపు ఉన్న వారు ఉచితంగా ఇసుకను తెచ్చుకునేందుకు కూపన్లను ఇస్తున్నామన్నారు. అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్న వారికి ప్రభుత్వమే కాలనీల వద్దకు ఇసుక రవాణా చేస్తోందని తెలిపారు. బోట్స్‌ మెన్‌ సొసైటీలకు గతంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉండేదని, ప్రస్తుతం కూడా అలా అనుమతులు కావాలని వారు కోరుతున్న మాట వాస్తవమేనన్నారు. దీనిని కూడా పరిశీలిస్తున్నామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement