![Allocation of iron ore mines to Kadapa Steel Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/27/kadapa-steel.jpg.webp?itok=AqzfxCL7)
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సమీపంలో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుమును ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) సరఫరా చేయనుంది. ఇందుకోసం అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలంలోని సిద్ధాపురం తండా, అంతరాగంగమ్మ కొండ ప్రాంతాల్లోని 25 హెక్టార్లను ఏపీఎండీసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ గని నుంచి తవ్విన ముడి ఇనుమును కడప స్టీల్ ఫ్యాక్టరీకి సరఫరా చేయడానికి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ గనులకు సంబంధించిన సరిహద్దులను సూచిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు.
వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేసేందుకు మరో రెండు గనులను కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు.
వెనుకబడిన రాయలసీమ జిల్లాలో ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జమ్మలమడుగు మండలంలో ఏటా 3 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే యూనిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి కల్పించే ఈ స్టీల్ ప్లాంట్‌కు 2019, డిసెంబర్ 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత కరోనా రావడంతో పనులు అనుకున్నంత వేగంగా జరగలేదని, ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment