ఒప్పందం చేసుకుంటున్న గనుల శాఖాధికారులు, అస్కీ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)ను మరింత బలోపేతం చేసేందుకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ) సహకారంతో ఈ సంస్థను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందుకోసం అస్కీతో ఏపీఎండీసీ ఒప్పందం చేసుకుంది. సోమవారం గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ వీజీ వెంకటరెడ్డి, సలహాదారు డీఎల్‌ఆర్ ప్రసాద్ హైదరాబాద్‌లోని అస్కీ కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
అనంతరం పునర్వ్యవస్థీకరణ ఒప్పందంపై ఏపీఎండీసీ తరఫున వీజీ వెంకటరెడ్డి, అస్కీ నుంచి రిజిస్ట్రార్ ఓపీ సింగ్, ప్రొఫెసర్ హర్ష శర్మ సంతకాలు చేశారు. ఏపీఎండీసీ నిర్వహణ సామర్థ్యం, ఉద్యోగుల నైపుణ్యాలను మరింత పెంచాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల ప్రకారం ఈ ఒప్పందం జరిగిందని వెంకటరెడ్డి తెలిపారు.
ఒప్పందంలో భాగంగా అస్కీ ఏపీఎండీసీ పనితీరును అధ్యయనం చేసి 3 నెలల్లో ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి. కార్పొరేట్ సంస్థలకు దీటుగా వార్షిక లక్ష్యాల సాధన, అధికారులు, ఉద్యోగుల పనితీరు, కెరీర్ ప్రోగ్రెషన్ ప్రణాళికను అమలు చేయడంపై విధి విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
సీఎం జగన్ నిర్ణయాలతో ఇప్పటికే బలమైన సంస్థగా ఏపీఎండీసీ
సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలతో ఏపీఎండీసీ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై బలమైన సంస్థగా ఎదిగింది. పారదర్శక విధానాలు అవలంబిస్తూ, జాతీయ స్థాయిలో కోల్ ఇండియా, సింగరేణి వంటి సంస్థలతో పోటీ పడి వాణిజ్య సరళిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థగా అరుదైన గుర్తింపును అందుకుంది. బెరైటీస్ ఉత్పత్తి, విక్రయాల్లో మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది.
గ్రానైట్, బాల్ క్లే, కాల్సైట్, సిలికాశాండ్ వంటి ఖనిజాల ఉత్పత్తిలోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సుల్యారీలో బొగ్గు గనులను నిర్వహిస్తోంది. త్వరలో జార్ఖండ్‌లోని బ్రహ్మదియాలో కోకింగ్ కోల్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ పురోగతిని శాస్త్రీయంగా మదింపు చేసి, అధికారులు, ఉద్యోగుల వృత్తి నైపుణ్యాలు, మార్కెటింగ్ వ్యూహాలు, జాతీయ – అంతర్జాతీయ దృక్పథం, మార్కెటింగ్ ఎత్తుగడలను సరైన విధానంలో అనుసరించేందుకు అస్కీ సహకారం తీసుకోనుంది. ఏపీఎండీసీ పునర్వ్యవస్థీకరణతో సంస్థ రూపురేఖలు మారతాయని, సంస్థాగత సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుందని వీసీ, ఎండీ వెంకటరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment