బాక్సైట్‌ కాదు.. లేటరైట్‌ | Gopalakrishna Dwivedi Comments On Bamadika Lands | Sakshi
Sakshi News home page

బాక్సైట్‌ కాదు.. లేటరైట్‌

Published Sun, Jul 11 2021 1:44 AM | Last Updated on Sun, Jul 11 2021 7:29 AM

Gopalakrishna Dwivedi Comments On Bamadika Lands - Sakshi

‘‘ఆ ప్రాంతంలో ఉన్నది బాక్సైట్‌ కాదు లేటరైట్‌’’ అని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 2010లో స్పష్టం చేసింది. అయినా అక్కడ బాక్సైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయంటూ ప్రచారం. ‘‘ఈ ప్రభుత్వం కొత్తగా ఎవరికీ లేటరైట్‌ మైనింగ్‌ లీజులు ఇవ్వలేదు. నాతవరం మండలంలోని భమిడిక గ్రామంలో ఒక్కచోట మాత్రం టీడీపీ ప్రభుత్వహయాంలో  హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే మైనింగ్‌ జరుగుతోంది.’’ అంటూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఇప్పటికే రెండుసార్లు మీడియాకు ఆధారాలతో సహా వివరించారు. అయినా ఈ ప్రభుత్వం లీజులిచ్చేస్తోంది అంటూ విమర్శలు... ఒక అబద్దాన్ని పదేపదే చెబితే నిజమైపోతుందనుకుంటూ ప్రతిపక్షం, ఒక వర్గం మీడియా చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం చూసి జనం విస్తుపోతున్నారు. ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ ద్వివేది శనివారం మరోమారు మీడియాకు వివరించి ఆధారాలన్నిటినీ చూపించారు.

సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం భమిడిక భూముల్లో లేటరైట్‌ ఖనిజం ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) 2010 లోనే స్పష్టం చేసిందని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అక్కడ బాక్సైట్‌ తవ్వకాలు జరుపుతున్నట్లు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. విజయవాడలోని ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్లుగా గనుల అక్రమ తవ్వకాలు, రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. జియోలాజికల్‌ సర్వే ఆధారంగా గనుల లీజులు ఇస్తారని, ఏ ఖనిజం ఎంత పరిమాణంలో ఉందనే అంశాన్ని సర్వే సంస్థ నిర్ధారిస్తుందని తెలిపారు.

విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలోని భమిడికలో సర్వే చేయని కొండ పోరంబోకు 121 హెక్టార్లలో లేటరైట్‌ ఉన్నట్లు జీఎస్‌ఐ 2010లో నివేదిక ఇచ్చిందని తెలిపారు. సరుగుడు పంచాయతీలోని సుందరకోట, అసనగిరి లీజుల్లోను కేవలం లేటరైట్‌ మాత్రమే ఉందని జీఎస్‌ఐ తేల్చిందని తెలిపారు. 2004లో ఈ ప్రాంతానికి సమీపంలోని మరో రెండు లీజుల విషయంలో ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ (ఐబీఎం) కూడా అక్కడ కేవలం లేటరైట్‌ మాత్రమే ఉందని రిపోర్టు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం లీజులున్న ప్రాంతంలో లేటరైట్‌ మాత్రమే ఉందని, బాక్సైట్‌ లేదని జీఎస్‌ఐ, ఐబిఎం డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమవుతోందన్నారు. 


ఆరు వారాల్లో తీర్పు అమలు చేయాలన్నారు
భమిడిక లీజుకు అప్పటి ప్రభుత్వం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ) 2010 అక్టోబరు 12న ఇచ్చిందని తెలిపారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2014 నవంబరు 17న అక్కడ తవ్వకాలు జరిపేందుకు ఆనుమతులు ఇచ్చిందన్నారు. 2014 డిసెంబర్‌ 4న ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ) మైనింగ్‌కు అవసరమైన సరంజామా పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిందన్నారు. జీఎస్‌ఐ, ఐబీఎం, పర్యావరణ మంత్రిత్వ శాఖ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అక్కడ బాక్సైట్‌ ఉన్నట్లు చెప్పలేదన్నారు. ఆలాంటప్పుడు ఇక్కడ బాక్సైట్‌ తవ్వకాలు జరుగుతున్నట్లు, బాక్సైట్‌ ఎత్తుకెళుతున్నట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో ఆ ప్రాంతంలో ఆరు లీజులుండగా, అందులో ఈ ఒక్క లీజుకు మాత్రమే.. అది కూడా 2018 ఆగస్టు 18న హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం వల్ల అనుమతి ఇచ్చామని తెలిపారు. లీజుదారుడు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు అన్నీ తీసుకున్న తర్వాత హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం 2021 ఫిబ్రవరి 5న లీజు ఇచ్చామన్నారు. ఆరు వారాల్లోగా హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని అప్పట్లో ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. 

ఐదు లీజుల్లో తవ్వకాలు బంద్‌
ఆరు లీజుల్లో ఒకదాని కాల పరిమితి ముగియగా, అక్రమ తవ్వకాలు చేస్తున్నారనే ఫిర్యాదులతో నోటీసులు జారీ చేసి రెండింటిని మూసి వేయించినట్లు తెలిపారు. శింగం భవాని, లోవరాజు పేరు మీద ఉన్న ఈ రెండు లీజుల్లో 2.3 లక్షల టన్నుల లేటరైట్‌ను అక్రమంగా తవ్వినట్లు తనిఖీల్లో బయపడిందని తెలిపారు. వారికి సుమారు రూ.19 కోట్లు జరిమానా విధించి తవ్వకాలు నిలిపి వేయించామన్నారు. మిగిలిన మరో రెండు లీజులకు సరైన రోడ్డు సౌకర్యం లేక తవ్వకాలు జరగడం లేదన్నారు. మొత్తం 6 లీజులకు 5 చోట్ల తవ్వకాలు జరగడం లేదని తెలిపారు. విశాఖలో బాక్సైట్‌ తవ్వకాలు జరపాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏ కోశానా లేదని స్పష్టం చేశారు. అయోమయం ఉండకూడదనే అన్ని ఆధారాలు చూపిస్తున్నామని తెలిపారు.  

ఆరు వారాల్లోగా లీజు కేటాయించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement