సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తరచూ తుపాకులు ‘దొరుకుతున్నాయి’. అక్రమ ఆయుధాలు వినియోగిస్తున్న, రవాణా చేస్తున్న, కలిగి ఉన్న వారితో పాటు లైసెన్స్ ఉన్న ఆయుధాలను దుర్వినియోగం చేసిన వారిని పట్టుకోవడం నాణేనికి ఒక వైపైతే... చెత్త కుప్పలు, చెట్ల పొదల్లో అక్రమాయుధాలు, తూటాలు లభిస్తుండటం మరో వైపైంది.
తాజాగా శుక్రవారం అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న పబ్లిక్ గార్డెన్స్‌లో లభించిన రెండు తపంచాలు, ఓ కంట్రీమేడ్ రివాల్వర్ తీవ్ర కలకలం సృష్టించాయి. గతంలో రెండు సందర్భాల్లో ఇలా ఆయుధాలు, బుల్లెట్లు బయటపడ్డాయి. ఆ కేసులు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. తాజా ఉదంతంతో సహా మొత్తం మూడూ శుక్రవారాల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం.
మొదటగా గాంధీ ఆస్పత్రి సమీపంలో...
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో 2013 ఫిబ్రవరి 15న (శుక్రవారం) ఆయుధాలు, తూటాలు లభించాయి. చిలకలగూడ ఠాణా పరిధిలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఇవి దొరికాయి. ఈ ప్రాంతాల మధ్య కేవలం కిలోమీటరు దూరమే ఉండటంతో ఒకరి పనిగానే అనుమానించారు. సదరు తుపాకులు, తూటాలు దాదాపు 40 ఏళ్ల క్రితం నాటివిగా అంచనా వేశారు.
పద్మారావునగర్‌లో ఆ రోజు ఉదయం 6.30 గంటలకు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టు కార్మికులు చెత్తను డబ్బాలో వేసేందుకు వెళ్లారు. అందులో ప్లాస్టిక్ గోనెసంచిలో కట్టిన రెండు తుపాకులు (రైఫిల్స్ మాదిరివి) కనిపించాయి. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన సిబ్బంది వెంటనే చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కలకలం కొనసాగుతుండగానే... మరో అరగంటకు షాబాద్‌గూడ నుంచి మరో సమాచారం వచ్చింది. రామచంద్రయ్య అనే వ్యక్తి చెత్త పడేసేందుకు తన ఇంటి సమీపంలోని డబ్బా వద్దకు వెళ్లగా... అందులో తూటాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తుపాకులు, తూటాలు సైతం అమెరికాలో తయారైనవిగా వెల్లడైంది.
రెమింగ్‌టన్ కంపెనీకి పాయింట్ 410 ఎంఎం, 0.38 ఆర్మీడ్, 3.57 రేంజర్ క్యాలిబర్లతో కూడిన తూటాలు మొత్తం వంద వరకు, మరికొన్ని ఖాళీ క్యాట్రిడ్జ్‌లు (కాల్చేయగా మిగిలినవి) ఉన్నట్లు గుర్తించారు. కొన్నింటిని పాన్‌ల్లో వినియోగించే ఖాళీ జర్దా డబ్బాలో, మరికొన్ని ప్రముఖ మిఠాయి దుకాణం కర్నూలు బ్రాంచ్‌కు చెందిన డబ్బాలో ఉంచి చెత్తడబ్బాలో పడేశారు.
మూడేళ్ల క్రితం రైల్వేస్టేషన్ వద్ద...
హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి) సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్‌లో 2019 డిసెంబర్ 20న (శుక్రవారం) రెండు రివాల్వర్లు దొరికాయి. ఆ రోజు రాత్రి మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. దీంతో కాంప్లెక్స్ నిర్వాహకులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనాస్ధలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి రివాల్వర్లు కాదని, తపంచాలని పోలీసులు నిర్ధారించారు. తపంచాలు వదిలిపెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను సైతం పరిశీలించారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులే సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం చేసి ఉంటారని, వాళ్లే ఇక్కడ వదిలిపెట్టి వెళ్లినట్టుగా భావించి ఆ కోణంలోనూ ఆరా తీశారు. అక్రమ రవాణా ముఠాలు, దోపిడీ దొంగలు, రౌడీ షీటర్లు, మావోయిస్టులు, మాజీ నక్సలైట్లు.. వీళ్లల్లో ఎవరైనా తీసుకువచి్చ, సులభ్ కాంప్లెక్స్‌లో వీటిని మరిచిపోయారని అంచనా వేశారు.
ఇలాంటి కేసుల్లో దర్యాప్తు జటిలమే...
సాధారణంగా కంపెనీల్లో తయారయ్యే మారణాయుధాలకు కొన్ని సీరియల్ నెంబర్లు, బ్యాచ్ నెంబర్లు తదితరాలు ఉంటాయి. ఇవి ఎక్కడైనా లభిస్తే ఈ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు వెళ్లి బాధ్యలను గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే నాటు తుపాకులు, తపంచాలకు ఇలాంటి లేకపోవడంతో పాటు విదేశాల్లో తయారైన వాటికి ఇవి ఉన్నా ఫలితం ఉండట్లేదు. నగరానికి నాటు తుపాకులు, తపంచాలు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ల్లోని వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నాయి.
ఇలాంటివి లభించినప్పుడు వాటి రూపం, పిడి ఉన్న తీరుతెన్నుల్ని బట్టి బాలిస్టిక్ నిపుణులు సైతం ఏ ప్రాంతంలో తయారైందో మాత్రమే చెప్పలగరు. ఇంతకు మించి ముందుకు వెళ్లడానికి సీసీ కెమెరాలు వంటి వాటిపై ఆధారపడాల్సిందే. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో వాటిలోనూ సరైన ఆధారాలు లభించట్లేదు. ఫలితంగా ఈ అక్రమ ఆయుధాల కేసులు బాధ్యులు గుర్తించడం జరగకుండానే పెండింగ్‌లో ఉండి క్లోజ్ అయిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment