Teak Trees
-
ఆకు అస్థిపంజరమై.. ‘టేకు’ ఎర్రబారి
నిర్మల్‌జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా టేకు ఆకులు రాలి... చెట్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో పచ్చగా ఉండాల్సిన ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండుటాకుల్లా నేల రాలుతున్నాయి.ఒక్కసారిగా చెట్లు ఎండిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఎటుచూసినా టేకుచెట్లన్నీ మోడువారి కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో పచ్చగాఉండాల్సిన అడవులు...ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి. యూటెక్టోనా మాచెరాలిస్ తెగులుతోనే టేకు ఆకు అస్థిపంజరంగా మారడానికి యూటెక్టోనా మాచెరాలిస్ తెగులు కారణమని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. టేకుఆకుల్లో ఉన్నరసాలను చీడ పురుగులు పీల్చడంతో నిర్విర్యమైపోతుంది. సూర్యరశ్మిసమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరపకుండా అడ్డుకుంటాయి.అంతేకాకుండా టేకు ఆకులు ఎదగకుండా ఈ చీడపురుగులు సన్నని జాలీల వంటి వలయాలు ఏర్పరుస్తాయి. ఫలితంగా ఆకులన్నీ ఎండిపోయి చెట్టు మొత్తం ఎరుపు రంగులోకి మారుతుంది. కళ తప్పుతున్న అడవులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. వర్షాలు మొదలైన తర్వాత జూలై, ఆగస్టు మాసాల్లో అడవులన్నీ పచ్చదనంతో నిండిపోయాయి. కానీ పక్షం రోజులుగా అడవుల్లోని టేకుచెట్లు పూర్తిగా ఎర్రబారడంతో అడవులు కళ తప్పుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులను కలిపే సహ్యద్రి పర్వత పంక్తుల్లోని మహబూబ్ఘాట్స్లో దట్టమైన టేకు చెట్లు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మాత్రం ఈ టేకు చెట్లన్నీ ఎర్రబారి కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్లి చూస్తే చెట్టులోని ఆకులన్నీ అస్థిపంజరంలా మారి జల్లెడను తలపిస్తున్నాయి. వేగంగా వ్యాప్తి.. యూటెక్టోనా మాచెరాలిస్ అనే తెగులు కారణంగా టేకుచెట్ల ఆకులు ఎండిపోయినట్టుగా మారుతున్నాయి. ఈ తెగులు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక అంగుళం పొడవు ఉండే చిన్న చీడ పురుగులే ఇందుకు కారణం. ఇవి వెడల్పాటి టేకు ఆకులోని రసాన్ని మొత్తం పీల్చి పిప్పి చేస్తాయి. ఆకులు ఎదగకుండా వలయాలను నిర్మిస్తాయి. దీనివల్ల ఆకు క్రమంగా రంగు మారుతుంది. వీటిని టేకు స్కెలిటోనైజర్గా పిలుస్తారు. వాతావరణ పరిస్థితుల ద్వారా దానికదే అదుపులోకి వస్తుంది. – డాక్టర్ వెల్మల మధు, వృక్షశాస్త్ర నిపుణుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
ఏసీబీకి చిక్కిన సెక్షన్ ఆఫీసర్
శృంగవరపుకోట : విశాఖ జిల్లా అనంతగిరి రేంజ్లో అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శోభా సుబ్బారావును ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ అందించిన వివరాలిలాఉన్నాయి. అనంతగిరి మండలం టోకురు గ్రామ పంచాయతీ పరిధి జాకరవలస గ్రామానికి చెందిన నరాజి ప్రసాద్ తన ఇంట్లో ఫర్నీచర్ తయూరీ కోసం హుద్‌హుద్ సమయంలో కూలిన టేకుచెట్లను రైతుల నుంచి కొనుగోలు చేశాడు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి శోభా సుబ్బారావు నిబంధనలకు విరుద్ధంగా కలప నిల్వ చేయడం నేరమని ప్రసాద్‌ను బెదిరించారు. కేసు లేకుండా చూడాలంటే తనకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు ఇద్దరి మధ్య రూ. 11 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న ప్రసాద్ సెక్షన్ ఆఫీసర్‌కు రూ. 2 వేలు ఇచ్చాడు. మిగిలిన తొమ్మిది వేల రూపాయలకు ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎస్.కోట రైల్వేస్టేషన్ రోడ్డులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుబ్బారావు (అద్దెల్లు) ఇంటికి వెళ్లి ప్రసాద్ రూ. 9 వేలు సుబ్బారావుకు అందించాడు. సొమ్ము తీసుకుంటున్న సుబ్బారావును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని విచారించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అతడిని అనంతగిరి మండలంలో ముళియాగూడ జంక్షన్‌కు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ఈ విషయమై రేంజర్, గార్డులను కూడా విచారిస్తామన్నారు. -
వారు తప్పు చేశారు
► రెవెన్యూ సహకరించింది టేకు, గ్రావెల్ అమ్ముకున్నారు ► తహసీల్దార్ జనార్దన్‌పై వేటుకు రంగం సిద్ధం ► ఆర్ఐ, వీఆర్వో, అటవీ అధికారులకు షోకాజ్ నోటీసులు ► కానిస్టేబుల్‌పై దాడి కేసులోవేమిరెడ్డి ఆదినాయణరెడ్డి అరెస్ట్ సాక్షిప్రతినిధి, నెల్లూరు: టేకు చెట్లు నరికివేత.. గ్రావెల్ అక్రమ తవ్వకాలకు సహకరించిన రెవెన్యూ అధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. నెల్లూరు రూరల్ తహసీల్దార్‌గా పనిచేసిన జనార్దన్‌ను సస్పెండ్‌చేసి క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ జానకి ప్రకటించారు. అదేవిధంగా ఆర్ఐ, వీఆర్వోలతో పాటు అటవీ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే మంగళవారం కానిస్టేబుల్ రమేష్‌బాబుపై దాడిచేసిన కేసులో వేమిరెడ్డి ఆదినారాయణరెడ్డిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవేదగిరి నరసింహస్వామి ఆలయ భూములను లీజుకు తీసుకున్న వేమిరెడ్డి హరిశివారెడ్డి అందులో ఉన్న విలువైన టేకుచెట్లు, మామిడి, వేప, కొబ్బరి చెట్లను కొట్టేశారు. అదేవిధంగా మాన్యం భూముల్లో రూ.70 లక్షలు విలువచేసే గ్రావెల్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వుకుని సొమ్ముచేసుకున్నారు. అందుకు అప్పటి తహసీల్దార్ జనార్దన్ టీడీపీ నేత వేమిరెడ్డి హరిశివారెడ్డికి పూర్తి సహకారం అందించినట్లు అధికారల విచారణలో తేలింది. టేకు చెట్లు, గ్రావెల్ మాయం విషయంలో ప్రధాన నిందితుడైన వేమిరెడ్డి హరిశివారెడ్డిని అరెస్టు చేయకుండా పథకం ప్రకారం జాగ్రత్తపడ్డారు. ముందస్తుగా కోర్టులో లొంగిపోయేలా పోలీసు అధికారులు కొందరు చర్యలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. హరిశివారెడ్డి కోర్టులో లొంగిపోయేందుకు వాహనంలో వచ్చిన సమయంలో సోదరుడు వేమిరెడ్డి ఆదినారాయణరెడ్డి అక్కడే ఉన్న కానిస్టేబుల్ రమేష్‌బాబును కారుతో ఢీకొట్టినట్లు కేసునమోదు చేశారు. ఆ కేసులో ఆదినారాయణరెడ్డిని బుధవారం అరెస్టు చేశారు. హరిశివారెడ్డిని కొద్దిరోజుల తర్వాతబెయిల్పై బయటకు తీసుకొచ్చి కేసును వాయిదాలు వేయించుకుంటూ తప్పించే విధంగా టీడీపీ నేతలు మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలిసింది. వణికిపోతున్న అధికారులు టేకుచెట్ల నరికివేత వ్యవహారంపై బుధవారం కలెక్టర్ జానకి రెవెన్యూ, అటవీ, మైనింగ్, దేవాదాయశాఖ అధికారులతో సమావేశమయ్యారు. చెట్ల నరికివేత, మైనింగ్ తవ్వకాల్లో అధికారులు ఎటువంటి నిబంధనలు పాటిస్తారు? ఆలయ మాన్యం భూమిలో ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం మొత్తంపై రెవెన్యూ, అటవీశాఖ అధికారులు తయారుచేసిన నివేదికను కలెక్టర్ జానకికి అందజేసినట్లు సమాచారం. ఈ వ్యహారంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికారులు వణికిపోతున్నారు. ఏ అధికారిని కదిలించినా ‘వామ్మో.. ఆ విషయం మాత్రం నన్ను అడగొద్దు ఫ్లీజ్’ అంటూ చెప్పి వెళ్లిపోతున్నారు. మొత్తంగా టేకుచెట్ల నరికివేత వ్యహారం అధికారుల గుండల్లో వణుకుపుట్టిస్తోంది. -
టేకు చెట్ల నరికివేతలో రెవెన్యూ ప్రమేయం
► నిందితులను కటకటాల వెనక్కి పంపుతాం ► ఎస్పీ విశాల్‌గున్నీ నెల్లూరు(క్రైమ్) : శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయ భూముల్లో టేకు చెట్ల అక్రమ నరికివేత కేసు వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉందని దర్యాప్తులో తేలిందని ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నకిలీ పత్రాలు సృష్టించి అక్రమార్కులకు కొందరు రెవెన్యూ అధికారులు సహకరించారని, ఈ విషయమై కలెక్టర్‌తో మాట్లాడామన్నారు. అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిని వదిలే ప్రసక్తే లేదని, అరెస్ట్‌చేసి తీరుతామని స్పష్టం చేశారు. అయితే టేకు కలపను అక్రమంగా నరికివేసిన ఘటనలో పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తూ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తోన్నారని పత్రికల్లో కథనాలు రావడం దారుణమన్నారు. తాము ఎవరికీ కొమ్ముకాయడం లేదన్నారు. ఆలయ ఈఓ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. ఇప్పటికే నిందితుల ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు, కార్యాలయాలు, వైన్‌షాపులపై చర్యలు తీసుకొన్నామన్నారు. కేసు పూర్వాపరాలను లోతుగా పరిశీలిస్తున్నామన్నారు. నిందితులు అక్రమంగా తరలించిన టేకు విలువ రూ.8.5 లక్షలని తెలిపారు. అపోహలు వీడండి కేసు విషయంలో అపోహలు వీడాలని మీడియా సిబ్బందికి ఎస్పీ సూచించారు. కేసులో అన్ని నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు పెట్టామన్నారు. ఎవరికైనా ఎలాంటి సందేహాలున్నా నేరుగా తనతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చన్నారు. కేసు దర్యాప్తులో ఉన్న దృష్ట్యా కొన్ని విషయాలు వెల్లడించలేక పోతున్నామన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. సమావేశంలో నెల్లూరు రూరల్, నగర, ఎస్బీ డీఎస్పీలు డాక్టర్ కె.తిరుమలేశ్వర్‌రెడ్డి, జి.వెంకటరాముడు, ఎన్.కోటారెడ్డి, ఎస్బీ, నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్లు సి.మాణిక్యరావు, సీహెచ్ దుర్గాప్రసాద్, ఎస్బీ ఎస్ఐ బి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
రైతులు టేకు చెట్లు అమ్ముకోవచ్చు
ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చే రైతులు తమ భూముల్లో టేకుచెట్లు ఉంటే వాటిని అమ్ముకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధాని భూసేకరణ అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు వారికి ఉన్న పంట రుణాలకు వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పారు. స్టాంపు, రిజిస్ట్రేషన్, నాలా ఫీజులన్నీ వన్ టైం సెటిల్మెంట్ చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 22వేల మంది రైతులు ఉన్నారని, వారందరికీ కూడా ఇదే పద్ధతి అనుసరిస్తామని అన్నారు. మెట్ట భూములకు ఏడాదికి ఎకరాకు రూ. 30 వేల వంతున ప్రతి ఏడాది చెల్లిస్తామని, దీనిపై ఏటా మూడేసి వేల వంతున పెంచుకుంటూ పోతామని అన్నారు. పదేళ్ల పాటు ఇలా చెల్లిస్తామని చంద్రబాబు చెప్పారు. అలాగే జరీబు భూముల్లో అయితే ఎకరాకు ఏడాదికి రూ. 50 వేల వంతున ఇస్తామని, దీన్ని ప్రతియేటా 5వేల వంతున పెంచుకుంటూ పోతామని అన్నారు. రైతులు తమ భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన వెంటనే చట్టబద్ధమైన రసీదు ఇస్తామని తెలిపారు. తర్వాత ల్యాండ్ పూలింగ్ ఓనర్ షిప్స్ ఇస్తామని, దీని తర్వాత భూముల అభివృద్ధి మొదలుపెడతామని చెప్పారు. -
కలప తరలిపోతోంది..
* ప్రేక్షక పాత్రలో అధికారులు * మొబైల్ పార్టీ నిఘాతో పట్టివేత జన్నారం : కలప స్మగ్లర్ల కన్ను కవ్వాల్ అభయారణ్యంలోని టేకు చెట్లపై పడింది. ఈ ప్రాంతంలో లభించే టేకుకు భారీ డిమాండ్ ఉండడంతో వృక్షాలపై వేటు వేస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యంలోని పలు ప్రాంతాల నుంచి విలువైన టేకును తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. తాళ్లపేట్ రేంజ్లో నిత్యం కలప తరలిపోతున్నట్లు తెలుస్తోంది. స్వయంగా డీఎఫ్‌వో దామోదర్‌రెడ్డి రంగంలోకి దిగి మొబైల్ పార్టీ, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ద్వారా కలప స్వాధీనం చేసుకున్న సంఘటనలే అందుకు నిదర్శనం. ఉన్నతాధికారులు కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతుండగా.. కొందరు కింది స్థాయి అధికారుల సహకారంతో కలప అక్రమ రవాణా సాగిపోతోంది. డివిజన్లోని ఇందన్పల్లి రేంజ్ పరిధిలో కూడా ఇటీవల స్మగ్లింగ్ పెరిగింది. రేంజ్ పరిధిలోని కల్లెడ, ఇందన్పల్లి బీట్ల పరిధిలో ఇటీవల పట్టుబడిన సంఘటనలు చూస్తే స్మగ్లర్ల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కల్లెడ బీట్‌లోని ఎర్రగుంటలో 20 రోజుల క్రితం రెండు ఎడ్లబండ్లు పట్టుకోగా.. గొడవకు దారి తీసి పోలీసు కేసు వరకు వెళ్లింది. ఇటీవల రూ.25వేలు విలువైన పది టేకు దుంగలు పట్టుకున్నారు. ఇందన్పల్లి రేంజ్‌లోని పలు ప్రాంతాల్లో టేకు చెట్లను నరికి వేసి దుంగలను అమ్ముకుంటున్నారు. టేకు విలువ పెరగడంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఓ ఉన్నతాధికారి తన సొంతానికి టేకు కలపతో ఫర్నిచర్ చేయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పది రోజుల క్రితం రెండు టేకు దుంగలను సదరు అధికారి కింది స్థాయి అధికారులతో తెప్పించి ఫర్నిచర్ కోసం కోతకు ఇచ్చినట్లు తెలిసింది. కలప స్మగ్లింగ్ అరికట్టాల్సిన అధికారే ఇలాంటి పనిచేయడం చర్చనీయాంశంగా మారింది. కంచె చేను మేసిన చందంగా అధికారులు వ్యవహరిస్తే కలప అక్రమ రవాణాకు ఎలా అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కలప స్మగ్లింగ్‌ను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. స్మగ్లింగ్ తగ్గింది.. గతంతో పోలిస్తే ఇందన్పల్లి అడవుల్లో కలప స్మగ్లింగ్ తగ్గింది. ఒకట్రెండు సంఘటన తప్పా కలప రవాణా లేదు. ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేశాం. రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్నాం. స్మగ్లింగ్ నిరోధానికి చర్యలు చేపడుతున్నాం. - ప్రతాప్‌రెడ్డి, ఇందన్పల్లి రేంజ్ అధికారి