టేకు చెట్ల నరికివేతలో రెవెన్యూ ప్రమేయం
► నిందితులను కటకటాల వెనక్కి పంపుతాం
► ఎస్పీ విశాల్‌గున్నీ
నెల్లూరు(క్రైమ్) : శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయ భూముల్లో టేకు చెట్ల అక్రమ నరికివేత కేసు వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉందని దర్యాప్తులో తేలిందని ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నకిలీ పత్రాలు సృష్టించి అక్రమార్కులకు కొందరు రెవెన్యూ అధికారులు సహకరించారని, ఈ విషయమై కలెక్టర్‌తో మాట్లాడామన్నారు. అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిని వదిలే ప్రసక్తే లేదని, అరెస్ట్‌చేసి తీరుతామని స్పష్టం చేశారు. అయితే టేకు కలపను అక్రమంగా నరికివేసిన ఘటనలో పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తూ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తోన్నారని పత్రికల్లో కథనాలు రావడం దారుణమన్నారు.
తాము ఎవరికీ కొమ్ముకాయడం లేదన్నారు. ఆలయ ఈఓ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. ఇప్పటికే నిందితుల ఆస్తులు, బ్యాంకు అకౌంట్‌లు, కార్యాలయాలు, వైన్‌షాపులపై చర్యలు తీసుకొన్నామన్నారు. కేసు పూర్వాపరాలను లోతుగా పరిశీలిస్తున్నామన్నారు. నిందితులు అక్రమంగా తరలించిన టేకు విలువ రూ.8.5 లక్షలని తెలిపారు.
అపోహలు వీడండి
కేసు విషయంలో అపోహలు వీడాలని మీడియా సిబ్బందికి ఎస్పీ సూచించారు. కేసులో అన్ని నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్‌లు పెట్టామన్నారు. ఎవరికైనా ఎలాంటి సందేహాలున్నా నేరుగా తనతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చన్నారు. కేసు దర్యాప్తులో ఉన్న దృష్ట్యా కొన్ని విషయాలు వెల్లడించలేక పోతున్నామన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. సమావేశంలో నెల్లూరు రూరల్, నగర, ఎస్‌బీ డీఎస్పీలు డాక్టర్ కె.తిరుమలేశ్వర్‌రెడ్డి, జి.వెంకటరాముడు, ఎన్.కోటారెడ్డి, ఎస్‌బీ, నెల్లూరు రూరల్ ఇన్‌స్పెక్టర్‌లు సి.మాణిక్యరావు, సీహెచ్ దుర్గాప్రసాద్, ఎస్‌బీ ఎస్‌ఐ బి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.